జెమినీ 'సర్కస్' శంకరన్: నెహ్రూ, మార్టిన్ లూథర్ కింగ్, వాలెంటీనా తెరిష్కోవా వంటి ప్రముఖులు ఆయన వీరాభిమానులు

ఫొటో సోర్స్, GEMINI SHANKARAN'S ALBUM
- రచయిత, శరణ్య హృషికేశ్
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
భారత సర్కస్ ఇండస్ట్రీలో ఎంవీ శంకరన్ ఒక దిగ్గజం. 98 ఏళ్ల వయస్సులో ఆయన ఏప్రిల్ 23, ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
దేశ విదేశాల్లో ఆయన జెమినీ శంకరన్‌గా సుప్రసిద్ధులు. 1951లో ఒక భాగస్వామితో కలిసి ‘‘జెమినీ సర్కస్’’ పేరిట సర్కస్ కంపెనీని స్థాపించారు. అప్పటినుంచి జెమినీ శంకరన్‌గా పేరు పొందారు.
భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సర్కస్‌లలో జెమినీ సర్కస్ ఒకటి. ఈ సర్కస్‌లో ప్రదర్శించే విన్యాసాలను చూడటానికి దేశం నలుమూలల నుంచి ప్రజలు వచ్చేవారు. దశాబ్దాల పాటు దీనికి ప్రజాదరణ లభించింది.
దేశంలోని చాలా ప్రాంతాల్లో జెమినీ సర్కస్ టిక్కెట్‌కు చాలా డిమాండ్ ఉండేది.
విదేశాల్లో కూడా ఈ సర్కస్‌కు డిమాండ్ ఏర్పడింది. 1960లలో భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ, యూఎస్‌ఎస్‌ఆర్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ ఫెస్టివల్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు శంకరన్ టీమ్‌ను పంపించారు.
ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు యూఎస్‌ఎస్‌ఆర్‌కు బయల్దేరేముందు నెహ్రూ నివాసంలో శంకరన్ బృందానికి అధికారిక స్వాగత సత్కారాలు లభించాయి.
ఈ బృందం మాస్కోకు చేరుకున్నప్పుడు వారికి వాలెంటీనా తెరిష్కోవా స్వాగతం పలికారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళ వాలెంటీనా తెరిష్కోవా.
సోవియట్ యూనియన్, జాంబియా వంటి దేశాల్లో తమ ప్రదర్శనలకు లభించిన ప్రశంసలు, చప్పట్ల గురించి ఎన్నో సంవత్సరాల తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా శంకరన్ పదే పదే గుర్తు చేసుకున్నారు.
శంకరన్ సర్కస్ ప్రదర్శనలకు భారత ప్రధాని నెహ్రూ నుంచి జాంబియా తొలి అధ్యక్షుడు కెన్నెత్ కౌండా వరకు అభిమానులు అయ్యారు.
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌తో పాటు ఇతర ప్రపంచ నాయకులు శంకరన్‌తో ఫొటోలు దిగారు. వాటిని ఆయన ఆల్బమ్‌లలో భద్రపరుచుకున్నారు.

ఫొటో సోర్స్, SAJI JAMES
శంకరన్ తన జీవిత కాలంలో సర్కస్ పరిశ్రమ ఎత్తు పల్లాలను చూశారు.
కేరళలోని కన్నూర్ జిల్లాలో 1924లో శంకరన్ జన్మించారు. తొమ్మిది లేదా పదేళ్ల వయస్సున్నప్పుడు కిట్టున్ని అనే వ్యక్తి ఇచ్చిన సర్కస్ ప్రదర్శనకు శంకరన్ ఆకర్షితుడు అయ్యారు.
సర్కస్‌లో టిక్కెట్లు అమ్మడం నుంచి చేయబోయే ప్రదర్శనల గురించి వివరించడం, విన్యాసాలు ప్రదర్శించడం ఇలా పనులన్నింటినీ కిట్టున్ని తానొక్కడే చేశారు.
ప్రదర్శన ముగిసిన తర్వాత కిట్టున్ని చూడటానికి వెనుబడిన పిల్లల సమూహంలో శంకరన్ కూడా ఉన్నారని జర్నలిస్ట్ తాహా మదాయి చెప్పారు.
జెమినీ శంకరన్‌పై మలయాళంలో రాసిన ‘‘మలక్కం మరియున్నా జీవితం’’ అనే పుస్తకానికి తాహా మదాయి సహరచయిత కూడా.
తలస్సేరికి చెందిన కీలెరి కున్హికన్నన్ లెక్కలేనంత మందికి సర్కస్ కళాకారులుగా శిక్షణ ఇచ్చారు. కున్హికన్నన్ దగ్గర శిక్షణ పొందేందుకు తన తండ్రి నుంచి శంకరన్ అనుమతి పొందారు.

ఫొటో సోర్స్, GEMINI SHANKARAN'S ALBUM
కానీ, ఆయన వెంటనే సర్కస్‌లో చేరలేదు. తొలుత కిరాణా దుకాణాన్ని నడిపించారు. తర్వాత దాన్ని మూసేసి ఆర్మీలో చేరారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కలకత్తాలో వైర్‌లెస్ ఆపరేటర్‌గా ఆయన నియమితులు అయ్యారు.
యుద్ధం తర్వాత కేరళకు తిరిగొచ్చారు. అప్పటికే కున్హికన్నన్ చనిపోవడంతో మరో టీచర్ దగ్గర సర్కర్ ట్రైనింగ్‌ను ప్రారంభించారు. 1948లో కలకత్తాలోని ఒక సర్కస్ కంపెనీలో ట్రాపెజ్ ఆర్టిస్ట్‌గా చేరారు.
మూడేళ్ల తర్వాత ఒక భాగస్వామితో కలసి ‘విజయ’ అని పిలిచే ఒక చిన్న సర్కస్ కంపెనీని కొనుగోలు చేశారు. అప్పటికి ఆ సర్కస్ దగ్గర ఒక ఏనుగు, రెండు సింహాలు మాత్రమే ఉన్నాయి. దాని పేరును జెమినీగా మారుస్తూ 1951 ఆగస్టు 15న గుజరాత్‌లో తొలి ‘జెమినీ సర్కస్’ ప్రదర్శన ఇచ్చారు.
కొద్దికాలంలోనే జెమినీ సర్కస్ ఒక అద్భుతంగా పేరు తెచ్చుకుంది. వందలాది కళాకారులు, పలు జంతువులతో కూడిన తమ సర్కస్ బృందం ప్రదర్శనలు ఇవ్వడం కోసం ప్రత్యేక రైళ్లలో ప్రయాణించిందని అనేక ఇంటర్వ్యూల్లో శంకరన్ చెప్పారు.
అమెరికాలోని ప్రముఖ ‘‘రింగ్‌లింగ్ బ్రదర్స్ సర్కస్’’ నుంచి శంకరన్ స్ఫూర్తి పొందారని మదాయి చెప్పారు.
‘‘ అంతర్జాతీయ సర్కస్ కంపెనీలు నెలకొల్పిన అత్యున్నత ప్రమాణాలను చేరుకోవాలని ఆయన కలగన్నారు. ఆ కాలంలో ఎన్నో పరిమితులు ఉన్నప్పటికీ, తన సర్కస్ ప్రదర్శనల్లో ఎన్నో ఆవిష్కరణలు, ఆధునిక విధానాలను ప్రవేశపెట్టారు’’ అని మదాయి తెలిపారు.
జెమినీ, జుంబో కళాకారులు ఇచ్చే ప్రదర్శనలు చూడటానికి భారత ప్రధానితో సహా పలువురు అగ్ర రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు తరలి వచ్చేవారు. 1977లో జుంబో సర్కస్‌ను శంకరన్ ఏర్పాటు చేశారు.
1970లో వచ్చిన హిందీ క్లాసిక్ సినిమా ‘‘మేరా నామ్ జోకర్’’తో పాటు 1989లో వచ్చిన తమిళ హిట్ సినిమా ‘‘అపూర్వ సోదరులు’’ను జెమినీ సర్కస్ కంపెనీలోనే చిత్రీకరించారు.

ఫొటో సోర్స్, SAJI JAMES
మొదటిసారి కలిసినప్పుడు శంకరన్ వినయాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని మదాయి అన్నారు.
‘‘మేం ఒక పుస్తక విడుదల కార్యక్రమంలో తొలిసారి కలుసుకున్నాం. అప్పుడు ఆయనే వచ్చి తనను తాను పరిచయం చేసుకున్నారు. చాలా ప్రజాదరణ పొందిన కళాకారునిగా ఆయన గుర్తింపు ఉంది. కానీ తన గురించి తక్కువగా మాట్లాడి, సర్కస్ పరిశ్రమతో పాటు ఇతర కళాకారుల గురించి ఆయన ఎక్కువగా మాట్లాడారు’’ అని మదాయి గుర్తు చేసుకున్నారు.
శంకరన్ తన గురించి ఎక్కువగా మాట్లాడకపోవడం వల్ల అతనికి సంబంధించిన వివరాలు పొందుపరచడం తనకు చాలా కష్టంగా మారిందంటూ మదాయి అన్నారు.
‘‘ఆయన క్లుప్తంగా, చాలా తక్కువగా మాట్లాడతారు. ఆయన నుంచి వివరాలు రాబట్టడానికి నేను అనేక సెషన్లలో చాలా ప్రశ్నలు అడగాల్సి వచ్చింది’’ అని మదాయి నవ్వుతూ చెప్పారు.
సర్కస్ విన్యాసాల్లాగే తన మీద వచ్చే పుస్తకం కూడా ఆసక్తికరంగా ఉండాలని శంకరన్ భావించారు.
శంకరన్ కుమారులు ప్రస్తుతం జెమినీ, జుంబో సర్కస్ కంపెనీలను చూస్తున్నారు. భారత సర్కస్ భవిష్యత్ గురించి వారు ఆందోళనతో పాటు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
‘‘ఆయనకు సర్కస్, ఆక్సీజన్ లాంటిది. దాన్ని జీవనోపాధిగా ఆయన చూడలేదు. జీవించడానికి ఒక కారణంగా చూశారు’’ అని మదాయి అన్నారు.
ఆయన మరణంతో భారత అద్భుతమైన సర్కస్ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం ముగిసింది.
ఇవి కూడా చదవండి:
- కెంటన్ పాట్స్: పెర్ల్ హార్బర్ దాడిలో మృతదేహాలను సేకరించిన వ్యక్తి... ఇప్పుడెలా మరణించారంటే
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- కేశవానంద భారతి: ఈ ఆధ్యాత్మిక గురువును ‘రాజ్యాంగ రక్షకుడు’ అని ఎందుకన్నారంటే
- ఐపీఎల్: DRS అంటే 'ధోనీ రివ్యూ సిస్టమ్'.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















