గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ దివాలా తీయడానికి కారణాలేంటి... ఇతర విమానయాన సంస్థలపై ఈ ప్రభావం ఎలా ఉంటుంది?

 గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అర్చన శుక్లా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ కౌంటర్లు ఖాళీ అయిపోయాయి. కస్టమర్ కేర్‌కు వచ్చే ఫోన్ కాల్స్ ఆగడం లేదు.

భారత్‌లో బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌గా పేరు తెచ్చుకున్న గో ఫస్ట్ సంస్థ దివాలాకు దరఖాస్తు చేసుకుంది. మే 2, 3, 4 తేదీల్లో అన్ని విమానాలను రద్దుచేసింది. దివాలా తీయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.

విమానాలు క్యాన్సిల్ కావడం వల్ల ఇబ్బందిపడ్డ ప్రయాణికులకు డబ్బు పూర్తిగా వాపస్ ఇస్తామని ఎయిర్‌లైన్స్ చెబుతోంది. కాగా, 34 ప్రదేశాల నుంచి గో ఫస్ట్ విమానాలు బుక్ చేసుకున్నవారు ఆఖరి నిమిషంలో ఇలా జరగడంపై మండిపడుతున్నారు.

2019లో జెట్ ఎయిర్‌వేస్ కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే చిక్కుకుంది. అప్పట్లో దేశంలోని అతిపెద్ద విమాన సంస్థల్లో అదీ ఒకటి. అకస్మాత్తుగా విమాన సేవలు నిలిపివేసింది. ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.

2019లో గో ఫస్ట్.. సంస్థను విస్తరించే దిశలో ఐపీఓ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తూ ఉంది. కానీ, నాలుగేళ్లల్లో దివాలా అంచుకు చేరింది.

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ మే 4న దివాలా కోసం గో ఫస్ట్ పెట్టుకున్న దరఖాస్తును విచారించనుంది.

అయితే, గో ఫస్ట్ దివాలా పిటిషన్ జెట్ ఎయిర్‌వేస్ కంటే భిన్నంగా ఉంది. ఆర్థిక అవకతవకల వలన దివాలా తీసినట్టు చెప్పలేదు. కానీ, ఇంజిన్ సమస్యల కారణంగా కంపెనీ ఆదాయాలు దెబ్బతిన్నాయని పిటిషన్‌లో పేర్కొంది. కంపెనీ రుణాలను సకాలంలో చెల్లించిందని కూడా తెలిపింది.

గో ఫస్ట్ విమాన సౌకర్యాలను నిలిపివేయడానికి కారణం, అమెరికాకు చెందిన ఇంజిన్ తయారీ సంస్థ 'ప్రాట్ అండ్ విట్నీ' అందించిన ఇంజిన్ల వైఫల్యమని తెలిపింది. దీనివల్ల సంస్థ తీవ్ర నగదు కొరతను ఎదుర్కొంటోందని వెల్లడించింది.

ఈ సమస్యలతో 25 విమానాలను నిలిపివేయాల్సి వచ్చిందని గో ఫస్ట్ తెలిపింది. వీటిల్లో సగం ఏ-320 నియో విమానాలు. వీటి నడపడం వలన కంపెనీ రూ.10,800 కోట్ల నష్టాన్ని చవిచూసిందని వివరించింది.

 గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఇంజిన్లు అందుబాటు లేకపోవడం వలన నష్టం

ఇంజిన్ల వైఫల్యం కారణంగా తమ సంస్థ మూతబడే స్థితి వచ్చినప్పటికీ, కొంతవరకు పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించామని, ఆ దిశలో ప్రాట్ అండ్ విట్నీ సంస్థ 2023 ఏప్రిల్ 27 నాటికి కనీసం పది వర్కింగ్ ఇంజన్లు పంపించాల్సి ఉండగా, అవి కూడా అందలేదని గో ఫస్ట్ ఆరోపించింది.

అయితే, దీనికి సంబంధించి 2023 మార్చిలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని, "ఈ విషయం ఇప్పుడు కోర్టులో ఉంది" కాబట్టి దీనిపై వ్యాఖ్యానించలేమని ప్రాట్ అండ్ విట్నీ చెప్పింది.

గో ఫస్ట్ సంస్థకు చెందిన విమానాల్లో 90 శాతం ఇంజిన్లు ప్రాట్ అండ్ విట్నీ తయారుచేసినవే. ఇవన్నీ ఏ320 నియో విమానాలు. స్పేర్ పార్ట్స్ అందుబాటులో లేకపోవడం, తయారీదారు నుంచి రెట్రో ఫిటింగ్ ఇంజిన్ల సరఫరాలో జాప్యం కారణంగా 2020 నుంచి పలు విమానాలు నిలిపివేసింది. మెల్ల మెల్లగా విమాన సేవలు రద్దు చేయడం ప్రారంభించింది. దాంతో కంపెనీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతింది.

భారత్‌లో గో ఫస్ట్ అయిదవ అతిపెద్ద విమానయాన సంస్థ.

దేశంలో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, పెరుగుతున్న పోటీ, అప్పులు, నానాటికీ పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల కారణంగా పలు విమానయాన సంస్థలు తమ సేవలను పూర్తిగా నిలిపివేసే పరిస్థితికి వస్తున్నాయి.

జెట్ ఎయిర్‌వేస్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, దక్కన్ ఎయిర్, పారామౌంట్ ఎయిర్‌వేస్, మోడిలఫ్ట్, సహారా ఎయిర్‌లైన్స్, ఎండీఎల్ఆర్ వంటి సంస్థలు ఇదే కోవలో ఈ రంగం నుంచి తప్పుకున్నాయి.

జెట్ ఎయిర్‌వేస్‌కు మళ్లీ సర్వీసులు ప్రారంభించేందుకు అనుమతి లభించినప్పటికీ, దివాలాకు సంబంధించిన సుదీర్ఘ ప్రక్రియ కారణంగా ఇప్పటివరకు తన కార్యకలాపాలను ప్రారంభించలేకపోయింది.

విమానయానం

ఫొటో సోర్స్, Getty Images

గో ఫస్ట్ ఆర్థిక స్థితి ఎలా క్షీణించింది ?

విమానాలకు సంబంధించిన పరికరాలు అందుబాటులో లేకపోవడం వలన సేవలు నిలిపివేయడం ఇదే తొలిసారి అని ఏవియేషన్ కన్సల్టెన్సీ సంస్థ 'మార్టిన్ కన్సల్టింగ్' వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ మార్టిన్ అన్నారు.

ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్ల వైఫల్యానికి ముందు, 2020 వరకు గో ఫస్ట్ స్థిరంగా, లాభాలతో నడిచిందని ఆ సంస్థ చెబుతోంది. కరోనా మహమ్మారి ప్రభావం కంపెనీపై పడిందని, ఆర్థిక పరిస్థితి దిగజారిందని దివాలా పిటిషన్‌లో తెలిపింది.

ఈ కారణాలతో బకాయిలు చెల్లించలేకపోవడంతో గో ఫస్ట్ లీజుకు తీసుకున్న విమానాలను కూడా తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది.

ఇంధన కంపెనీలు గో ఫస్ట్ సంస్థను క్యాష్ అండ్ క్యారీ కేటగిరీలో ఉంచాయి. అంటే, ప్రతిరోజు విమానాలకు కావాల్సిన ఇంధననికి సొమ్ము చెల్లించడం కూడా కంపెనీకి సమస్యగా మారింది.

అయితే, ప్రమోటర్ కంపెనీ 'వాడియా గ్రూప్' గో ఫస్ట్ సంస్థలో దాదాపు 6500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. ఇది కాకుండా, ప్రభుత్వం నుంచి అత్యవసర క్రెడిట్ లైన్ (ప్రభుత్వ నిబంధనల ప్రకారం, రూ. 1500 కోట్ల క్రెడిట్ సౌకర్యం) సౌకర్యం కూడా ఉంది.

అయినప్పటికీ, సంస్థ విమాన సేవలు నిలిచిపోయాయి కాబట్టి, దివాలా ప్రక్రియ కోసం దరఖాస్తు చేయాల్సి వచ్చింది.

గో ఫస్ట్, ఇంకా ఈ రంగం నంచి బయటకు వచ్చేయలేదని, కంపెనీని పునరుద్ధరించే ప్రణాళికపై కసరత్తు చేస్తోందని మీడియాలో రిపోర్టులు వచ్చాయి.

గో ఫస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌశిక్ ఖోనా వార్తా సంస్థ రాయిటర్స్‌తో మాట్లాడుతూ, ఎయిర్‌లైన్స్‌ను విక్రయించడానికి కాకుండా, పునరుద్ధరించడమే లక్ష్యంగా దివాలా దరఖాస్తు పెట్టుకున్నట్టు చెప్పారు.

స్పైస్‌జెట్

ఫొటో సోర్స్, Getty Images

విమానయాన రంగంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?

గో ఫస్ట్ పతనం దేశంలోని విమానయాన రంగంలో తీవ్రమైన పోటీ ఉందన్న విషయాన్ని సూచిస్తోందని నిపుణులు అంటున్నారు.

కరోనా సమయంలో ఎయిర్‌లైన్ సంస్థలకు కొంత నష్టం ఎదురయినప్పటికీ, తరువాత పుంజుకున్నాయి. 2023 మొదటి మూడు నెలల్లో 3.75 కోట్లకు పైగా జనం విమానాల్లో ప్రయాణించారు. కిందటి ఏడాదితో పోల్చుకుంటే 51.7 శాతం వృద్ధి కనిపిస్తోంది.

సీఏపీఏ ఇండియా ఎయిర్‌లైన్ ట్రాఫిక్ ఔట్‌లుక్ ప్రకారం, దేశంలో ఏటా 13.7 కోట్ల ప్రజలు విమాన ప్రయాణాలు చేస్తారు. ఈ సంఖ్య 2030 నాటికి 35 కోట్లకు చేరుకోగలదు.

గో ఫస్ట్ మూతబడితే ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్ వంటి కంపెనీలకు మార్కెట్లో వాటా పెంచుకునే అవకాశం ఉంటుంది.

స్టాక్ మార్కెట్లలో లిస్టయిన ఏవియేషన్ షేర్లలో మంగళవారం పెరుగుదల కనిపించింది. 2022 నవంబర్‌లో గో ఫస్ట్ మార్కెట్ వాటా 10.5 శాతం కాగా, 2023 మార్చికి దాదాపు ఏడు శాతానికి తగ్గిపోయింది.

గో ఫస్ట్ విమానాలు తిరిగే మార్గాల్లో రాబోయే 3-4 నెలల్లో విమాన ఛార్జీలు బాగా పెరిగే అవకాశం ఉంది. మిగతా విమానయాన సంస్థలు టిక్కెట్ ధరలను 50 నుంచి 60 శాతం పెంచుతాయని మార్క్ మార్టిన్ విశ్లేషించారు.

"డిమాండ్‌కు తగ్గ సప్లయి లేదు. గో ఫస్ట్ మూతబడితే, 50కి పైగా విమానాలు నిలిచిపోతాయి. ఇతర విమానయాన సంస్థలు కూడా చిక్కుల్లోనే ఉన్నాయి. డిమాండ్ భారీగా ఉంది. ప్రస్తుతం ఉన్న సంస్థలకు దానిని అందుకోగల సామర్థ్యం కూడా లేదు" అని ఆయన అన్నారు.

ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ సిరియమ్ డేటా ప్రకారం, 2023 మేలో గో ఫస్ట్ 6,225 విమానాలను నడపాల్సి ఉంది. అంటే 11 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించాల్సి ఉంది. కానీ, ఇంతలోనే విపత్తు వచ్చిపడింది.

ఎయిర్ ఇండియా

ఫొటో సోర్స్, Getty Images

ఇతర విమానయాన సంస్థలు కూడా కష్టాల బాటలో..

ఇంజిన్లు, విమానాల సరఫరా సమస్య అన్ని విమానయాన సంస్థలుకూ ఉందని నిపుణులు అంటున్నారు.

ప్రాట్ అండ్ విట్నీ నుంచి ఇంజిన్ సరఫరాలో లోపం కారణంగా గో ఫస్ట్ మాత్రమే కాదు, మరొక లో బడ్జెట్ సంస్థ 'ఇండిగో' కూడా చిక్కులో పడింది. ఈ రెండు ఎయిర్‌లైన్స్‌లో సుమారు 60 విమానాలు విడిభాగాల కొరత కారణంగా ఎగరలేని పరిస్థితిలో ఉన్నాయి.

ఇండిగో దగ్గర 250కి పైగా విమానాలు ఉన్నాయి. వీటిలో చాలా విమనాలు పాత, మన్నికైన ఇంజిన్లతో నడుస్తున్నాయి. కాబట్టి ఇండిగో సంక్షోభంలో కూరుకుపోలేదు.

ఇవి కాకుండా, ప్రస్తుతం మరో 102 విమానాలు ఇతరత్రా కారణాల వల్ల సేవలు నిలిపివేశాయి.

కొత్త విమానాల సరఫరా నెమ్మదించడం, ఇంజన్ల సరఫరాలో ఇబ్బందుల కారణంగా రాబోయే కొన్ని నెలల్లో సంక్షోభం మరింత తీవ్రమవుతుందని ఏవియేషన్ అడ్వైజరీ అండ్ రిసెర్చ్ సంస్థకు చెందిన ఒక అధికారి చెప్పారు.

భారతదేశంలోని అగ్రగామి విమానసంస్థలో ఒకటైన స్పైస్‌జెట్ కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రతి త్రైమాసికంలో కంపెనీ భారీ నష్టాలను చవిచూస్తోంది.

గత ఏడాది, ఈ కంపెనీకి చెందిన కొన్ని విమానాలు పాతబడిపోవడంతో ఎగరే సామర్థ్యాన్ని కోల్పోయాయి. దీని కారణంగా ఎయిర్‌లైన్ నియంత్రణ సంస్థలు ఈ కంపెనీపై నిఘా ఉంచాయి.

2024 వచ్చేసరికి రెండు, మూడు విమానయాన సంస్థలు మాత్రమే ఆర్థికంగా స్థిరంగా ఉంటాయని, పోటీకి తట్టుకుని నిలబడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

దేశంలోని అతిపెద్ద సంస్థల్లో రెండవ, మూడవ స్థానల్లో ఉన్న ఎయిర్ ఇండియా, విస్తారా కూడా విలీనంపై కసరత్తు చేస్తున్నట్టు ప్రకటించాయి.

ఎయిర్ ఇండియా, మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఫిబ్రవరిలో బోయింగ్ ఇంక్, ఎయిర్‌బస్ సంస్థల నుంచి రికార్డ్ స్థాయిలో 470 విమానాలను కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)