కరోనావైరస్: భారత విమానయాన రంగాన్ని కోవిడ్-19 ఇలా కుప్పకూల్చింది

విమానం
    • రచయిత, నిధి రాయ్
    • హోదా, బిజినెస్ రిపోర్టర్, బీబీసీ న్యూస్ ముంబయి

ప్రపంచ విమానయాన రంగంలో 2037లో 820 కోట్ల మంది ప్రయాణికులు ఉంటారని.. భారీ స్థాయిలో విమాన ప్రయాణికుల పెరుగదల కోసం ఈ రంగం సన్నద్ధమవుతోందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) జోస్యం చెప్పి ఎంతో కాలం కాలేదు.

కానీ.. ఇతర రంగాలకు జరిగినట్లే విమానయాన రంగానికి కూడా కరోనావైరస్ మహమ్మారి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

మహమ్మారి విజృంభణ కారణంగా ప్రపంచ దేశాలు సరిహద్దులు మూసేశాయి. లాక్‌డౌన్లు విధించి విమానాలను నిలిపివేశాయి.

విమాన ప్రయాణం 98 శాతం పతనమైందని ఐఏటీఏ నివేదించింది. ప్రపంచ వ్యాప్తంగా విమానయాన సంస్థలు 2020లో 8,400 కోట్ల డాలర్ల నష్టం చవిచూస్తాయని అంచనా వేసింది. విమానయాన రంగంలో 3.20 కోట్ల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయనీ చెప్పింది.

ఈ పరిస్థితుల్లో భారత విమానయాన రంగం భవిష్యత్తు కూడా క్లిష్టంగా ఉండటం ఆశ్చర్యం కలిగించదు.

ఈ ఆర్థిక సంవత్సరంలో భారత విమానయాన రంగం కుప్పకూలుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. దాదాపు 24,000 నుంచి 25,000 కోట్ల రూపాయల ఆదాయ నష్టం వాటిల్లుతుందని చెప్పింది.

విమానయానం

ఫొటో సోర్స్, Getty Images

‘‘విమానయాన సంస్థలకు సుమారు రూ. 17,000 కోట్లు నష్టం వాటిల్లుతుంది. విమానాశ్రయాల్లోని రిటైలర్లకు రూ. 1,700 – 1,800 కోట్ల నష్టం వస్తుంది. విమానాశ్రయ నిర్వాహకులు రూ. 5,000 నుంచి రూ. 5,500 కోట్ల వరకూ నష్టం చవిచూసే అవకాశం ఉంది’’ అని క్రిసిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వైజరీకి చెందిన ట్రాన్స్‌పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ విభాగం డైరెక్టర్ జగన్నారాయణ్ పద్మనాభన్ ఒక ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు.

అలాగే.. విమానయాన కన్సల్టింగ్ సంస్థ సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ (సీఏపీఏ) ఇండియా కూడా.. భారత విమానయాన పరిశ్రమ ఈ ఏడాది ఏప్రిల్ – జూన్ నెలల్లో 300 కోట్ల నుంచి 360 కోట్ల డాలర్ల వరకూ (సుమారు రూ.22 వేల కోట్లు) నష్టపోతుందని చెప్పింది.

మే 25వ తేదీ నుంచి విమానయాన సంస్థలు పరిమిత కార్యకలాపాలను పునఃప్రారంభించిన నేపథ్యంలో కొంత వెసులుబాటు లభిస్తుందని విమానయాన కంపెనీలు ఆశిస్తున్నాయి.

సాటి భారతీయ విమానయాన సంస్థలకన్నా మెరుగైన స్థితిలో ఉన్న ఇండిగో.. గత ఏడాది జనవరి – మార్చి నెలల్లో రూ. 596 కోట్ల ఆదాయం లభిస్తే.. ఈ ఏడాది జనవరి – మార్చి నెలల్లో రూ. 871 కోట్ల నష్టం వాటిల్లినట్లు చెప్పింది.

‘‘ప్రస్తుత పరిస్థితి నుంచి కోలుకుని కోవిడ్ ముందు నాటి స్థాయికి తిరిగిరావటానికి 18 నుంచి 24 నెలల సమయం పట్టవచ్చు’’ అని ఇండిగో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆదిత్య పాండే బీబీసీతో పేర్కొన్నారు. వైమానిక రంగం కోలుకోవటమనేది ఇతర దేశాలు తమ అంతర్జాతీయ ఆపరేషన్లను ఎలా పునరుద్ధరిస్తాయనే దానిమీద ఆధారపడి ఉంటుందని చెప్పారు.

విమానయానం

ఫొటో సోర్స్, Getty Images

‘‘విమానాల్లో భద్రత గురించి తమకు నమ్మకం ఏర్పడిన వెంటనే తమ కుటుంబాలు, స్నేహితులను కలవటం కోసం ప్రయాణం చేయటానికి జనం ఆత్రతుగా ఎదురుచూస్తున్నారు. వ్యాపార సమావేశాలు ఇంకా ఆన్‌లైన్‌లో జరగవచ్చునని మనందరికీ అర్థమైంది. కాబట్టి పరిస్థితి అదుపులోకి వచ్చే వరకూ దానిని అలాగే కొనసాగిస్తారు’’ అని ఆదిత్య పాండే ఉద్ఘాటించారు.

‘‘విమానాల్లో భద్రత విషయంలో వినియోగదారులకు విశ్వాసం కుదిరితేనే కోలుకోవటం మొదలవుతుంది’’ అని ఎయిర్ఏసియా ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ భాస్కరన్ కూడా అభిప్రాయపడ్డారు.

ఆన్‌లైన్ వార్తల పోర్టల్ బిజినెస్ ఆఫ్ ట్రావెల్ ట్రేడ్ (బాట్) కూడా ఒక వినియోగదారుల సర్వే నిర్వహించింది. జాతీయస్థాయి లాక్‌డౌన్ ముగిసిన తర్వాత రాబోయే 3 – 6 నెలల్లో ప్రయాణాలను పునఃప్రారంభించటానికి 66 శాతం మంది భారతీయులు సంసిద్ధంగా ఉన్నట్లు ఆ సర్వే చెప్తోంది.

ఉన్నత స్థాయి సంపన్నులు (హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ - హెచ్ఎన్ఐ) వైరస్ సమస్యలను ఎదుర్కోకుండా ఉండటం కోసం మరింత అనుకూలమైన విమానయానం కోరుకోవటంతో.. చార్టర్ విమానాలకు డిమాండ్ పెరిగింది.

విమానయానం

ఫొటో సోర్స్, Getty Images

అధిక ఇంధన ధరలతో ఆందోళన

వినియోగదారుల విశ్వాసం సంగతి పక్కనపెడితే.. విమాన ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) – ధరల విషయం మరో పెద్ద ఆందోళనగా ఉంది. విమానయాన సంస్థల వ్యయంలో దాదాపు 40 శాతం ఈ ఇంధనం కోసమే ఖర్చవుతుంది. ఈ ఇంధనం ధరలు పెరుగుతుండటం విమానయాన సంస్థల కష్టాలను మరింతగా పెంచుతోంది.

దేశ రాజధాని దిల్లీలో ఏటీఎఫ్ ధరలను నెల రోజుల్లో రెండోసారి జూన్ 16న పెంచారు. లీటరుకు రూ. 5,494.50 పెంచటంతో ధర రూ. 39,069.87కు పెరిగింది. ఇది 16.3 శాతం పెంపు.

అంతకుముందు జూన్ 1న ఏటీఎఫ్ ధరను లీటరుకు రూ. 11,030.62 పెంచటంతో అది రూ. 33,575.37కు పెరిగింది. అది 56.5 శాతం పెరుగుదల అని ఇండియన్ ఆయిల్ కంపెనీ వెబ్‌సైట్ సమాచారం చెప్తోంది.

ఇదిగాక.. కేంద్ర ప్రభుత్వం ఏటీఎఫ్ మీద 14 శాతం ఎక్సైజ్ సుంకం వసూలు చేస్తుంది. ఆపైన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 30 శాతం వరకూ వ్యాట్ విధిస్తున్నాయి. ఇది ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటుంది. ఉదాహరణకు మహారాష్ట్ర, దిల్లీలు 25 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నాయి.

కర్ణాటక 28 శాతం, తమిళనాడు 29 శాతం వ్యాట్ విధిస్తుంటే.. ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌లు మాత్రం 5 శాతం వ్యాట్ విధిస్తున్నాయి. మొత్తంమీద.. విమానయాన సంస్థలు ఏటీఎఫ్ మొత్తం ధరలో 25 శాతం వ్యాట్ చెల్లిస్తున్నాయి.

ఇప్పటికే భారీ అప్పులతో, ప్రయాణికులు లేకపోవటం, తిరుగుతున్నసర్వీసులకూ తక్కువ చార్జీలే ఉండటం, రెండు నెలల పాటు అసలు ఆదాయం లేకపోవటం వల్ల తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న విమానయాన సంస్థలను ఈ ధరల పెంపులు మరింతగా దెబ్బతీస్తాయని నిపుణులు చెప్తున్నారు.

విమాన ప్రయాణం

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE

టికెట్ ధరలపై ప్రభుత్వ పరిమితులు

ప్రయాణికులు చెల్లించే చార్జీలపై పరిమితులు విధించటం విమానయాన సంస్థలకు మరో పెద్ద ఆటంకంగా ఉంది. భారత విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ).. దేశీయ విమానాలకు చార్జీల పరిమితులను మే 21వ తేదీన ప్రకటించినపుడు.. అటు కంపెనీలు, ఇటు ప్రయాణికులు ఇరువురికీ దోహదపడాలన్నది ఆలోచన.

విమాన చార్జీలు భారీ స్థాయిలో ఉంటాయని భావించటంతో.. వాటిని అదుపులో ఉంచాలని ప్రభుత్వం విమానయాన సంస్థలను కోరింది. ‘‘ఈ పరిమితుల విధింపు తాత్కాలికమేనని.. అది అడ్డు తొలగిపోతుందని నేను ఆశిస్తున్నా. ఇది శాశ్వత చర్యగా ఉండాలని నేను భావించటం లేదు’’ అని సీఏపీఏ వెబినార్‌లో భాస్కరన్ పేర్కొన్నారు.

ప్రస్తుతానికే సరకు విమానాలే...

ప్రస్తుతం విమానయాన సంస్థలన్నీ ఇతర ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తున్నాయి.

సరకు రవాణా కార్యకలాపాలు మొదలయ్యాయి. స్పైస్‌జెట్, విస్తారా, ఇండిగో వంటి కంపెనీలు ఆ దిశగా పనిచేస్తున్నాయి.

లాక్‌డౌన్‌లో సరకు రవాణా ఆపరేషన్ల ప్రాధాన్యతను ఇండిగో గుర్తించింది. దానిద్వారా మరింత ఆదాయం పొందటానికి ప్రయత్నిస్తుంది.

‘‘మేం 100కు పైగా సరకు రవాణా విమానాలు నడిపాం. దీనివల్ల ఒక బలమైన ఆదాయ మార్గం లభించింది. సరకు రావాణా కోసం ప్రత్యేకంగా 10 విమానాలను కేటాయించాం’’ అని ఇండిగో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆదిత్య పాండే బీబీసీకి చెప్పారు.

ఇదే తరహాలో స్పైస్‌జెట్ కూడా తన బొంబార్డియర్ క్యూ400 పాసింజర్ విమానాలు మూడింటిని సరకు రవాణాకు అనుగుణంగా మార్చినట్లు చెప్పింది.

విమానయానం

ఫొటో సోర్స్, PRAKASH SINGH/GETTY IMAGES

మున్ముందు పరిస్థితి ఏమిటి?

కనీసం ఈ ఏడాది చివరి వరకూ విమానయాన రంగం పరిస్థితి గడ్డుగానే ఉంటుందని రేటింగ్ సంస్థ కేర్ రేటింగ్స్ పేర్కొంది. విమానయాన సంస్థలకు సాయం చేయటానికి ప్రభుత్వం ఇంధనం మీద రాష్ట్రాలు వసూలు చేసే వ్యాట్‌ ఒకే విధంగా ఉండేలా క్రమబద్ధీకరించవచ్చునని కేర్ రేటింగ్స్ పేర్కొంది.

కోవిడ్-19 మహమ్మారి కొనసాగినంత కాలం ఎయిర్‌పోర్ట్ నావిగేషన్ సర్వీసెస్ (ఏఎన్ఎస్) చార్జీలను ప్రభుత్వం 100 శాతం మినహాయింపు ఇవ్వవచ్చునని అభిప్రాయపడింది.

ఏఎన్ఎస్ చార్జీలంటే విమానయాన సంస్థ విమానాశ్రయానికి చెల్లించే చార్జీలు. ఇవి ఒక్కో విమానాశ్రయంలో ఒక్కో రకంగా ఉంటాయి. విమానం పరిమాణాన్ని బట్టి ఈ చార్జీలు ఉంటాయి. సాధారణంగా విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో వీటి వాటా 7-8 శాతంగా ఉంటుంది.

ప్రస్తుతం విమాన సర్వీసులు పరిమితంగా ప్రారంభమయ్యాయి. రాబోయే నెలల్లో ఇంకా పెరుగుతాయని భావిస్తున్నారు. అయితే.. ఇప్పటికైతే భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా విమానయాన సంస్థలన్నీ రికార్డు స్థాయి నష్టాలు చవిచూస్తున్నాయి. దీనివల్ల ఇప్పుడు జరిగేది.. అనేక ఉద్యోగాలు పోవటం, జీవనోపాధులు దెబ్బతినటం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)