హనీ ట్రాప్: రా, డీఆర్‌డీవో‌కు చెందిన పెద్ద పెద్ద అధికారులు ఈ ఉచ్చులో ఎలా చిక్కుకుంటున్నారు?

ప్రదీప్ కురుల్కర్
ఫొటో క్యాప్షన్, డీఆర్‌డీవో శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్
    • రచయిత, నితిన్ శ్రీవాస్తవ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)కు చెందిన ఒక శాస్త్రవేత్తను మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసినట్లు మే 5న వార్తలు వచ్చాయి.

ఆయన పాకిస్తాన్‌ కోసం రహస్యంగా పనిచేసినట్లుగా ఏటీఎస్ ఆరోపణలు చేసింది.

‘‘ఇది హనీట్రాప్ వ్యవహారం. పుణేలో పనిచేసిన ప్రదీప్ కురుల్కర్ అనే సీనియర్ శాస్త్రవేత్త ఒక పాకిస్తానీ ఏజెంట్‌ను వాట్సాప్, వీడియో కాల్స్‌లో సంప్రదించారు’’ అని ఏటీఎస్ తెలిపింది.

ఈ కేసులో దర్యాప్తు జరుగుతోంది. కానీ, దీనికంటే ముందు ‘‘హనీట్రాప్’’ వ్యవహారానికి సంబంధించిన కొన్ని కీలక ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి.

హనీట్రాప్ కేసులు బయటపడటం ఇదే తొలిసారి కానందున దీనిగురించి తెలుసుకోవడం మరింత కీలకం.

కొన్ని నెలల క్రితం, అంటే 2022 నవంబర్‌లో దిల్లీ పోలీసులు ఒక డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న అతను హనీట్రాప్ బారిన పడి ఉండొచ్చని భద్రతా సంస్థల హెచ్చరించడంతో దిల్లీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

పాకిస్తాన్‌లో ఎవరికో ఆ డ్రైవర్ రహస్య సమాచారాన్ని అందిస్తున్నారని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అనుమానించాయి.

హనీ ట్రాప్

ఫొటో సోర్స్, BIBLIOTHÈQUE NATIONALE DE FRANCE

ఫొటో క్యాప్షన్, మాటా హారి

హనీ ట్రాప్ అంటే?

బహుశా, గూఢచర్య చరిత్రలో ఇప్పటివరకు ‘‘మాటా హారి’’ అనే మహిళ చేసిన ట్రాప్‌ను అత్యంత ప్రముఖమైన ‘‘హనీ ట్రాప్’’గా చెబుతుంటారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఆమె పేరు బాగా పాపులర్ అయింది.

‘చార్మింగ్’ డ్యాన్స్ మాస్టర్‌గా పేరు తెచ్చుకున్న నెదర్లాండ్స్‌కు చెందిన మార్గరెట్ మెక్‌లియోడ్‌ను ఫ్రెంచ్ పోలీసులు కాల్చి చంపారు.

ఫ్రెంచ్-బ్రిటన్ అధికారులతో సన్నిహితంగా మెదులుతూ రహస్యంగా వారి సమాచారాన్ని జర్మన్ సైన్యానికి చేరవేశారనే ఆరోపణలతో ఫ్రెంచ్ సైన్యం ఆమెను చంపేసింది.

పాలో కోయెలో రచించిన ‘ద స్పై’ అనే నవలలో మాతా హరి ఒక ప్రధాన పాత్ర.

‘‘మాటా హరి తొలుత పారిస్‌కు చేరుకున్నప్పుడు ఆమె దగ్గర డబ్బు లేదు. కానీ, త్వరలోనే ఆమె ప్యారిస్ సమాజంలో అత్యంత ఆకర్షణీయమైన, నాగరిక మహిళల్లో ఒకరిగా మారారు’’ అని ద స్పై నవలలో పాలో కోయెలో రాశారు.

నిజానికి, మాతా హరిపై వచ్చిన హనీట్రాప్ ఆరోపణలు పూర్తిగా రుజువు కానప్పటికీ ఫ్రాన్స్ సర్కారు ఆమెకు శిక్ష విధించింది.

అనేక సంఖ్యలోని రహస్య పత్రాలు శత్రువులకు చేరడంలో ఆమె పాత్ర ఉందని అనుమానించిన ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ శిక్షను విధించింది.

ఒక వ్యక్తితో రొమాంటిక్ లేదా సెక్సువల్ సంబంధాలు పెట్టుకోవడం ద్వారా తమకు అవసరమైన సమాచారాన్ని రాబట్టాన్ని ‘‘హనీ ట్రాప్’’ అంటారు.

గత 20 ఏళ్లలో భారత్‌తో సహా అనేక దేశాల్లో హనీ ట్రాప్ కేసులు నమోదయ్యాయి.

కేంబ్రిడ్జ్ డిక్షనరీ ప్రకారం, హనీ ట్రాప్ అనేది ప్రజలను ప్రలోభ పెట్టి మోసం చేసే చర్య. గూఢచర్యం కోసం హనీ ట్రాప్‌ను ఉపయోగిస్తారు.

బి. రామన్

ఫొటో సోర్స్, LANCER PUBLISHERS

ఫొటో క్యాప్షన్, ‘‘ద కౌ బాయ్స్ ఆఫ్ రా: డౌన్ మెమొరీ లేన్’’ అనే పుస్తకాన్ని బి. రామన్ రాశారు

గూఢచర్యానికి 'హనీ ట్రాప్'

హనీ ట్రాప్‌కు సంబంధించిన ఒక ప్రముఖ కథను బీ. రామన్ తన పుస్తకం ‘‘ద కౌ బాయ్స్ ఆఫ్ రా: డౌన్ మెమొరీ లేన్‌’’ లో ప్రస్తావించారు.

దీని ప్రకారం, మాస్కోలో పనిచేస్తోన్న యువ భారతీయ దౌత్యవేత్త ఒక రష్యన్ నర్తకితో ప్రేమలో పడ్డారు.

కేజీబీ అనే రష్యా గూఢచార సంస్థ, ఆ డ్యాన్సర్ ద్వారా భారతీయ దౌత్యవేత్త నుంచి సమాచారాన్ని సేకరించాలనుకుంది.

దీన్ని పసిగట్టిన భారతీయ దౌత్యవేత్త, జరిగిన విషయాన్నంతా దిల్లీకి వచ్చి ప్రధాని నెహ్రూకు చెప్పారు.

భారతీయ దౌత్యవేత్తను జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించి క్షమించి వదిలేశారు.

కానీ, అప్పటి నుంచి భారతీయ విదేశాంగ శాఖ అధికారులందరికీ ఒక హెచ్చరిక జారీ చేశారు. ఇతర దేశాలలో పనిచేసే దౌత్యవేత్తలంతా ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఉండాలని సూచించారు. ఇప్పటికీ ఈ సూచన అమల్లో ఉంది.

బ్రిటిష్ చరిత్రకారుడు రిచర్డ్ డెకన్ తన పుస్తకం 'స్పైక్లోపీడియా'లో ఇలా రాశారు.

"ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో రష్యా గూఢచార సంస్థ కేజీబీ, మోజ్నో అనే పేరుతో ఉన్న మహిళను హనీట్రాప్‌గా ఉపయోగించింది. ఆమె ద్వారా విదేశీ అధికారులను సంప్రదించి, వారితో రహస్య సంబంధాలు ఏర్పరచుకొని, రహస్య పత్రాలను పొందేందుకు ప్రయత్నించింది.

2009-2010ల మధ్య విదేశీ గూఢచారుల విషయంలో అమెరికా, బ్రిటన్‌లలో నిరసనలు జరిగాయి.

మాధురీ గుప్తా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాధురీ గుప్తా

భారత్‌లో 'హనీ ట్రాప్'

1980వ దశకంలో భారత్‌లో హనీట్రాప్ వ్యవహారం పతాక శీర్షికల్లో నిలిచింది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)కు చెందిన ఒక అధికారి కేవీ ఉన్నికృష్ణన్‌, అమెరికా గూఢచార సంస్థ సీఐఏ చేతిలో హనీట్రాప్‌కు గురయ్యారనే ఆరోపణలు వచ్చాయి.

అప్పట్లో వచ్చిన వార్తల ప్రకారం, పాన్ యామ్ ఎయిర్‌వేస్‌కు చెందిన మహిళా ఎయిర్‌హోస్టెస్ ఇక్కడ గూఢచారిగా పనిచేశారు.

చెన్నైలోని ‘రా’ బ్రాంచ్‌లో కేవీ ఉన్నికృష్ణన్ పనిచేసేవారు. ఎల్టీటీఈ కార్యకలాపాలపై ఆయన దృష్టి సారించేవారు.

1987లో భారత్, శ్రీలంక మధ్య శాంతి-ఒప్పందం జరగడానికి కొంతకాలం ముందు ఉన్నికృష్ణన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సింగపూర్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాలు, దౌత్యవ్యవహారాల ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న కేపీ బాజ్‌పాయ్ దీని గురించి మాట్లాడారు.

"ఉపగ్రహాల ద్వారా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సులు వాడటం కంటే ముందు మనుషుల ద్వారానే గూఢచర్యం జరిగేది. ఎందుకంటే విదేశాల్లో చాలా తక్కువ మంది పనిచేసేవారు. అలా పనిచేసేవారి వివరాలను విదేశాలు రాబడతాయి’’ అని అన్నారు.

ఇటీవల దశాబ్దాల్లో జరిగిన వాటి గురించి మాట్లాడితే, పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో పనిచేసే భారత విదేశాంగ శాఖ ప్రెస్ ఇన్ఫర్మేషన్ కార్యదర్శి మాధురీ గుప్తా కేసు చాలా ప్రాముఖ్యమైనది.

పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘ఐఎస్‌ఐ’కి మాధురీ గుప్తా సున్నితమైన సమాచారాన్ని పంపిచారనే ఆరోపణలతో 2010లో దిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఆమెను అరెస్ట్ చేసింది.

2018‌లో ఒక దిగువ కోర్టు ఆమెకు మూడేళ్ల శిక్ష విధించింది. వెంటనే ఆమెను బెయిల్‌పై విడుదల చేసింది.

‘‘రక్షణ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారుల పోస్టింగ్‌లు, వారి కుటుంబ సభ్యుల వివరాలను మాధురీ గుప్తా, పాకిస్తాన్ ఏజెన్సీకి చేరవేశారు’’ అని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

అయితే, 2021లో 64 ఏళ్ల మాధురీ గుప్తా మరణించారు. తర్వాత ఆమె కేసు కూడా ముగిసింది.

భారత్‌లో పెరుగుతున్న హనీ ట్రాప్ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం పునరుద్ఘాటించింది.

ఉదాహరణకు, 2019‌లో రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ అప్పటి రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ ఇలా అన్నారు.

‘‘పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఏజెన్సీ, భారత సైన్యానికి చెందిన అధికారులను 'హనీ ట్రాప్' చేసే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు.

ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత భారత సైన్యం తన సిబ్బందికి ఒక సూచన చేసింది. ఫేస్‌బుక్, టిక్‌టాక్, ట్రూకాలర్, ఇన్‌స్టాగ్రామ్‌తో సహా 89 యాప్‌లను మొబైల్ ఫోన్ల నుంచి తొలగించాలంటూ సిబ్బందికి సూచించింది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)