దురదృష్టవంతురాలని కన్న బిడ్డను చంపి, కాల్వలో పడేసిన తల్లితండ్రులు

కూతుర్ని చంపిన తల్లిదండ్రులు

ఫొటో సోర్స్, SACHIN PITHWA

    • రచయిత, బీబీసీ గుజరాతి
    • హోదా, న్యూదిల్లీ, సురేంద్రనగర్

గుజరాత్‌లోని సురేంద్రనగర్‌, చుడా తాలూకా, కోర్దా గ్రామంలో ఏడాదిన్నర పాపను కన్న తల్లితండ్రులే చంపేశారని పోలీసులు చెప్పారు.

పాప తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేసి, తదుపరి విచారణ చేపట్టారు.

దురదృష్టకరమైనదిగా భావించి, ఏడాదిన్నర వయసులోనే తమ పాపను తల్లిదండ్రులే చంపుకున్నారని పోలీసులు తెలిపారు.

మూఢనమ్మకాలతో తల్లిదండ్రులు ఈ పని చేశారని వారి కుటుంబం చెబుతోంది.

తొలుత పాపను చంపిన విషయాన్ని కప్పిపుచ్చేందుకు ఈ ఇద్దరు ప్రయత్నించారు.

ఆ తర్వాత తమ కూతుర్ని తామే చంపుకున్నట్లు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు.

కూతుర్ని చంపిన తల్లిదండ్రులు
ఫొటో క్యాప్షన్, కూతుర్ని చంపిన తల్లిదండ్రులు

కూతురి వల్ల జీవితంలో అశుభాలు జరుగుతున్నాయని భావించిన తండ్రి

ఈ పాప తల్లిదండ్రులకు ఐదుగురు కూతుర్లు. అందరూ కూతుర్లే కావడం కూడా ఆ తల్లిదండ్రులను బాధిస్తుందని సురేంద్ర నగర్‌లోని బీబీసీ గుజరాతి ప్రతినిధి సచిన్ పిట్వా చెప్పారు.

పోలీసు స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు మేరకు, చుడా తాలూకాలోని కోర్దా గ్రామంలో నివసించే మన్సుఖ్‌భాయ్ జోగరాజియా దంపతులకు ఐదుగురు కూతుర్లు.

మన్సుఖ్‌భాయ్, ఆయన భార్య ప్రకాశ్‌బెహన్‌ తన ఏడాదిన్నర పాప రుహిని వెంట పెట్టుకుని బైక్‌పై ఖడ్గుండా గ్రామానికి వెళ్తున్నారు.

ఆ సమయంలో హైవేకి సమీపంలో ఒక హోటల్ వద్ద బైకు అదుపు తప్పి కిందకి పడిపోయింది.

ఆ రోడ్డు ప్రమాదంలో మన్సుఖ్‌భాయ్, ఆయన భార్యకు గాయాలయ్యాయి. కానీ, వారి కూతురికి మాత్రం చిన్న గాయం కూడా కాలేదు.

అందుకే తమ కూతుర్ని అశుభంగా భావించారు. తమ కూతురి వల్ల బైక్‌కి ప్రమాదం జరిగిందని వారు భావిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

ఈ ప్రమాదం తర్వాత మన్సుఖ్‌భాయ్ కోపంతో కూతుర్ని గొంతు కోసి చంపేశారు. ఈ హత్య తర్వాత, రుహి మృతదేహాన్ని తల్లి ప్రకాశ్‌బెహన్ జాతీయ రహదారిపై ఉన్న షాపర్ గ్రామ సమీపంలో ఉన్న కాలువలో పడేశారు.

మృతదేహాన్ని కాలువలో పడేసి వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు.

‘మూఢనమ్మకంతోనే ఇలా చేశారు’

ఈ సంఘటన విని కుటుంబ సభ్యులు తీవ్ర షాక్‌కి గురయ్యారు.

మూఢనమ్మకంతోనే వీరు ఈ పని చేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

మన్సుఖ్‌భాయ్, ప్రకాశ్‌బెహన్ తమ కూతురి రుహిని ఖడ్గుండా గ్రామంలో ఉన్న తమ ఇంటికి తీసుకెళ్లేవారని కుటుంబ సభ్యులు తెలిపారు.

గుజరాత్‌లో కొన్ని ప్రాంతాల్లో ఇంకా మూఢనమ్మకాలు ఉన్నాయి.

‘‘మూఢనమ్మకంతోనే ఇలా జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయగలం? ఇలా చేయమని ఎవరైనా అంటారా? చేయకూడదు’’ అని మున్సుఖ్‌భాయ్ కుటుంబ సభ్యుడు త్రికంభాయ్‌ బీబీసీ ప్రతినిధితో అన్నారు.

వారు ఖడ్గుండాకు చేరుకోకముందే ఈ విషయం తెలిసిందని పాప మామ విక్రంభాయ్ అన్నారు.

ఈ సంఘటనను చూసిన తర్వాత, మూఢనమ్మకాల్లో కూరుకుపోకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని గ్రామ పెద్దలు, సభ్యులు చెప్పారు.

‘‘మనం ఆధునిక కాలంలో ఉన్నాం. ప్రజలు ఇలా చేయకూడదు. మూఢనమ్మకాల్లో మునిగిపోకుండా చూసుకోవాలి’’ అని స్థానిక నేత శేలాభాయ్ సరవయ్య బీబీసీ ప్రతినిధికి చెప్పారు.

మూఢనమ్మకాల్లో మునిగిపోయిన వారు, వాటి నుంచి బయటపడేందుకు వైద్యులకు చూపించుకుంటే మంచిదని సూచించారు.

గుజరాత్‌లో ఈ తరహా సంఘటనలు చాలా తక్కువగానే జరుగుతున్నాయని హేతువాదులన్నారు.

కానీ, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా సమాజంలో అవగాహన కల్పించాలని నొక్కి చెప్పారు.

‘‘గుజరాత్‌లో ఇలాంటి మూఢనమ్మకాల ఘటనలు పెరుగుతున్నాయి. వీటి వల్ల మనం సిగ్గుతో తలవంచుకోవాలి. మనం ఏ శతాబ్దంలోకి వెళ్తున్నాం?’’ అంటూ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోన్న విజ్ఞాన్ జాతా అధ్యక్షుడు జయంత్ పాండ్యా బీబీసీ గుజరాతికి చెప్పారు.

విచ్యలో ఒక జంట తమకు తాముగా ఆత్మత్యాగం చేసుకున్నారు. వారి నమ్మకం ప్రకారం, అలా చనిపోతే మోక్షం పొందుతారని భావించారు.

ఈ విధంగా ఆలోచించిన జంట తమ పిల్లల్ని వదిలేసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇలాంటి షాకింగ్ ఘటనలు ఇటీవల బాగా పెరుగుతున్నాయని జయంత్ పాండ్యా తెలిపారు.

రాపార్‌లో మూఢనమ్మకాలతో ఏడెనిమిది మంది వ్యక్తులు తమ చేతుల్ని మరుగుతోన్న నూనెలో పెట్టి కాల్చుకున్న కేసు కూడా నమోదైనట్లు చెప్పారు.

కూతుర్ని చంపిన తల్లిదండ్రులు

ఫొటో సోర్స్, SACHIN PITHWA

ఫొటో క్యాప్షన్, ఏడాదిన్నర పాపను చంపిన ఆరోపణలపై తల్లిదండ్రులను విచారిస్తోన్న పోలీసులు

పోలీసులు ఏం చెప్పారు?

సైలా-చోటిలా జాతీయ రహదారిపై షాపర్ గ్రామ సమీపంలోని ఒక కాలువ నుంచి అనుమానస్పదంగా ఉన్న ఏడాదిన్నర పాప మృతదేహం దొరికింది.

చోటిలా పోలీసులు జరిపిన విచారణలో పాప తల్లిదండ్రులే ఈ బాలికను చంపి, శరీరాన్ని ఇక్కడ పడేశారని తెలిసింది.

పాపను హత్య చేసి చంపినట్లు ఫోరెన్సిక్ విచారణలో తేలింది.

తొలుత ఈ మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన పోలీసులు, ఆ తర్వాత గంటల వ్యవధిలోనే తల్లిదండ్రులే ఈ హత్యను చేసినట్లు కనుగొన్నారు.

‘‘పాప తల్లిదండ్రులు మన్సుఖ్‌భాయ్ , ప్రకాశ్‌బెహన్‌‌లు వారి కూతుర్ని దురదృష్టవంతురాలిగా భావించారు.

ఈ కోపంతోనే పాపను ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లి గొంతు కోసి చంపేశారు’’ అని సురేంద్రనగర్ బీబీసీ గుజరాతి ప్రతినిధి సచిన్ పిట్వాకి లింబాడి పోలీసు స్టేషన్ అధికారి ముంధ్వా చెప్పారు.

తాను చాలా కోపానికి గురయ్యానని, తన కూతుర్ని దురదృష్టవంతురాలిగా భావించినట్లు మున్సుఖ్‌భాయ్ ఒప్పుకున్నారు.

పాప వల్లే తమ జీవితాల్లో ఇలా జరుగుతుందని అనుకున్నట్లు చెప్పారు.

అందుకే గొంతు కోసి చంపేసినట్లు తెలిపారు. ఈ హత్యను ఒప్పుకుంటూ పోలీసుల ముందే కన్నీళ్లు పెట్టుకున్నాడు మున్సుఖ్‌భాయ్.

‘‘ఈ పాప వయసు ఏడాదిన్నర. పాప తల్లిదండ్రులపై మేం కేసు నమోదు చేశాం. తదుపరి విచారణ చేపడతాం’’ అని పోలీసు అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)