గర్భధారణలో ఆ 14 రోజుల రహస్యం ఏంటి? అది తెలిస్తే కృత్రిమ మానవుల్ని సృష్టించడం సాధ్యమవుతుందా?

గర్భం ధరించాక ఆ 14 రోజుల్లో ఏం జరుగుతుంది?

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వెరోనికా స్మింక్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ 1978లో పుట్టినప్పుడే, ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు ఒక ఒప్పందానికి వచ్చారు. కృత్రిమ మానవ పిండాలను 14 రోజులకు మించి బయట పెంచకూడదని వారు నిర్ణయించారు.

మానవ పిండాలపై పరిశోధనల విషయంలో నైతిక పరిమితులు విధించేందుకే వారు ఆ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని దేశాలు ఈ 14 రోజుల నిబంధనలను చట్టాల్లో కూడా చేర్చాయి.

అయితే, 14 రోజులే ఎందుకు?

గర్భంలో రెండో వారం తర్వాత సంక్లిష్టమైన దశలు మొదలవుతాయి. మన పుట్టుకలో దీన్ని ప్రాథమిక దశగా అంటే ‘‘గ్యాస్ట్రులేషన్’’గా పిలుస్తున్నారు. మన శరీరంలోని అన్ని అవయవాలకు అవసరమైన కణజాలం రూపుదిద్దుకోవడం అన్నది ఈ దశలోనే మొదలవుతుంది.

శారీరక రూపు రేఖలను నిర్దేశించడంలో ఈ దశ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ దశ తర్వాత పిండం విడిపోయి కవలలుగా ఏర్పడే అవకాశం ఉండదు.

మూడు, నాలుగు వారాల గర్భ సమయం మనం రూపుదిద్దుకోవడంలో కీలకంగా మారుతుంది. కణాల సమూహం ఒక అద్భుతంలా మనిషిగా రూపుదిద్దుకునే అత్యంత ముఖ్యమైన దశ ఇది. గర్భధారణలో దీన్ని అత్యంత సున్నితమైన, సంక్లిష్టమైన దశగా భావిస్తారు.

నిజానికి, గర్భస్రావం అయ్యే ప్రమాదం ఈ దలోనే చాలా ఎక్కువ. మరోవైపు పుట్టుకతోనే వచ్చే చాలా జబ్బులకూ ఈ దశలో చోటుచేసుకునే మార్పులే కారణం.

ఈ దశ గురించి ప్రముఖ బ్రిటిష్ శాస్త్రవేత్త లూయిస్ వోల్పెర్ట్ మాట్లాడుతూ, ‘‘మీ జీవితంలో అత్యంత కీలకమైన దశ జననం లేదా పెళ్లి లేదా మరణం కాదు, గ్యాస్ట్రులేషన్’’అని చెప్పారు.

Gastrulation

ఫొటో సోర్స్, Getty Images

వీడని చిక్కుముళ్ళు...

14 నుంచి 28 రోజుల మధ్య ఈ దశ కీలకమైనదని భావిస్తున్నప్పటికీ దీనికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలు చిక్కు ముళ్ళలానే మిగిలిపోతున్నాయి. ఎందుకంటే ఈ దశపై తమ ల్యాబ్‌లో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టేందుకు వీలుపడటం లేదు.

ఇన్‌ విట్రో పద్ధతిలో భద్రపరిచిన పిండాల్లో మొదటి రెండు వారాల్లో ఏం జరుగుతోందో సవివరంగా చెప్పే సాంకేతికతలు మనకు అందుబాటులోకి వచ్చాయి.

అదే సమయంలో 28 రోజుల తర్వాత ఏం జరుగుతుందో కూడా పరిశోధకులు కనిపెట్టగలిగారు. సహజంగా లేదా కృత్రిమంగా గర్భస్రావమైన పిండాలపై పరిశోధన చేపట్టి ఆ వివరాలను పరిశోధకులు తెలుసుకోగలిగారు. కానీ, ఈ రెండింటి మధ్య ఉన్న కాలం మాత్రం వీడని చిక్కుముడిలా మిగిలిపోయింది.

నెల కంటే తక్కువ వయసున్న సజీవ పిండాలపై పరిశోధన చేపట్టడం చాలా కష్టమని, ఎందుకంటే ఈ పిండాలు దాదాపుగా పరిశోధకులకు అందుబాటులో ఉండవని స్పానిష్ పరిశోధకుల బృందం యూజీన్‌లో సభ్యులైన ఫెలిసిటాజ్ అజిపిరోజ్ చెప్పారు.

దీంతో పిండాల గ్యాస్ట్రులేషన్ దశపై పరిశోధన అనేది మర్మంగానే మిగిలిపోయింది. రెండు వారాల వయసున్న పిండంలోని కణజాలం ఈ దశలోనే మూడు పొరలుగా ఏర్పడుతుంది. వీటిలోనే మన శరీరం రూపుదిద్దుకోవడంలో ప్రధాన పాత్ర పోషించే మూలకణాలు కూడా ఉంటాయి. వీటి నుంచే గుండె, నాడీ వ్యవస్థ, గోర్లు, జుట్టు లాంటివి ఏర్పడతాయి.

14 రోజుల నియమంతో పిండంలో ఆ తర్వాత ఏం జరుగుతుందో నిశితంగా పరిశీలించేందుకు శాస్త్రవేత్తలకు వీలు చిక్కడం లేదు.

గర్భం ధరించాక ఆ 14 రోజుల్లో ఏం జరుగుతుంది?

ఫొటో సోర్స్, AMADEI AND HANDFORD/UNIVERSITY OF CAMBRIDGE

కొంతకాలం ముందువరకూ, ఎక్కువ కాలం జీవించేలా మానవ పిండాన్ని అభివృద్ధి చేయడానికి అనువైన సాంకేతికతలు కూడా అందుబాటులో ఉండేవి కాదు. కానీ, కొత్తకొత్త సాంకేతికతలు, ముఖ్యంగా మూలకణాలపై పరిశోధనలతో ఎక్కువ కాలం జీవించే పిండాల అభివృద్ధికి మార్గం సుగమమైంది.

దీంతో 14 రోజుల నిబంధనను సడలించాల్సిన సమయం ఆసన్నమైందని మే 2021లో అంతర్జాతీయ పరిశోధకులు బృందం పిలుపునిచ్చింది.

కొన్ని ప్రత్యేక పరిస్థితిల్లో పిండాన్ని గర్భానికి వెలుపల రెండు వారాల కంటే ఎక్కువ రోజులు జీవించేందుకు అనుమతించొచ్చని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ స్టెమ్ సెల్ రీసెర్చ్ (ఐఎస్ఎస్‌సీఆర్) నిపుణులు చెబుతున్నారు.

అసలు దీనికి అనుమతించాలా వద్దా? అనే విషయంపై లోతైన చర్చలు అవసరమని సంస్థ వివరిస్తోంది.

అయితే, 14 రోజుల పరిమితిని సడలించడానికి ఇది సరైన సమయంకాదని కేంబ్రిడ్జి యూనివర్సిటీ బయాలజిస్టు క్యాథీ నియాకాన్ చెప్పారు.

‘‘ఇలా డిమాండ్ చేయడం బాధ్యతారాహిత్యం. చాలాచోట్ల దీన్ని చట్టవ్యతిరేకమైన చర్యగా పరిగణిస్తారు’’అని క్యాథీ అన్నారు.

అయితే, గ్యాస్ట్రులేషన్ ప్రక్రియను అర్థం చేసుకోగలిగితే, ప్రతి నాలుగు గర్భాల్లో ఒకదాంట్లో ఎందుకు ఏదోఒకరమైన లోపం ఉంటుందో కనిపెట్టొచ్చని ఐఎస్ఎస్‌సీఆర్ పరిశోధకులకు నేతృత్వం వహిస్తున్న ఫ్రాన్సిస్ క్రీక్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన రాబిన్ లోవెల్ బ్యాడ్జ్ చెప్పారు.

‘‘తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకుంటే, గర్భస్రావాలను, అంగ వైకల్యాలను మనం మొదట్లోనే అడ్డుకోవచ్చు’’అని ఆయన అన్నారు.

గ్యాస్ట్రులేషన్

ఫొటో సోర్స్, Getty Images

జంతువుల్లో ఎలా?

ఇప్పటివరకు జంతువుల పిండాలపై పరిశోధనల ద్వారా మాత్రమే గ్యాస్ట్రులేషన్‌పై కొంతవరకూ పరిశోధకులు ఒక అవగాహన ఏర్పరుచుకోగలిగారు.

2019లో స్పానిష్ శాస్త్రవేత్త జువాన్ కార్లోస్ ఇజ్పిసా ఒక చైనా ల్యాబ్‌లో వివాదాస్పద ప్రయోగాన్ని నిర్వహించారు. 132 కోతుల పిండాల్లోకి మానవ మూల కణాలను ఆయన ఎక్కించారు.

వీటిలో మూడు హైబ్రిడ్ పిండాలు 19 రోజులపాటు ల్యాబ్‌లో పెరిగాయని సైంటిఫిక్ జర్నల్ సెల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో పేర్కొన్నారు.

భవిష్యత్‌లో మానవ అవయవాలను జంతువుల్లో పెంచడం సాధ్యం అవుతుందా? అనే లక్ష్యంతో ఆ పరిశోధన కొనసాగించినట్లు కార్లోజ్ బృందం ఆ పరిశోధన పత్రంలో పేర్కొంది. అయితే, 14 రోజుల నిబంధనను ఈ బృందం పట్టించుకోలేదు.

అలానే, ఆగస్టు 2022లో ఇజ్రాయెల్, బ్రిటన్‌కు చెందిన రెండు పరిశోధకుల బృందాలు కూడా కృత్రిమ ఎలుక పిండాల ద్వారా పూర్తి గ్యాస్ట్రులేషన్ ప్రక్రియలపై అధ్యయనం చేయగలిగాయి.

ఈ రెండు ప్రక్రియల్లోనూ పిండాలు ఎనిమిది రోజులపాటు మనుగడ సాగించాయి. ఎలుకల గర్భధారణలో మూడో వంతు సమయం ఇది. కొట్టుకుంటున్న గుండె, మెదడులోని కొన్ని బాగాలు రూపుదిద్దుకోవడాన్ని వీరు గమనించారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో షాంఘై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్‌కు చెందిన చైనా శాస్త్రవేత్తలు మరో మైలురాయిని అధిగమించారు. వీరు కోతుల మూలకణాల నుంచి కృత్రిమ పిండాలను అభివృద్ధి చేశారు. 18 రోజులపాటు సజీవంగా ఉన్న ఈ పిండాల ద్వారా గ్యాస్ట్రులేషన్ ప్రక్రియలపై కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Gastrulation

ఫొటో సోర్స్, JUAN CARLOS IZPISUA BELMONTE

గత మూడేళ్లలో గ్యాస్ట్రులేషన్‌పై అధ్యయనాల్లో భాగంగా కొందరు పరిశోధకులు కొత్త మార్గాలను కూడా ఎంచుకున్నారు.

వీటిలో సూడోఎంబ్రియోస్ లేదా ఎంబ్రియోయిడ్స్ కూడా ఒకటి. మూలకణాల నుంచి అభివృద్ధిచేసిన పిండాలివీ. అయితే, ఇక్కడ అండం లేదా వీర్య కణాలు అవసరం లేదు. మూలకణాల నుంచి అభివృద్ధి చేసిన ఈ పిండాలు కొంతవరకు సాధారణ పిండాలను పోలి ఉంటాయి.

2020లో మూలకణాల నుంచి సూడోఎంబ్రియోస్‌ను అభివృద్ధి చేయడంలో బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన స్పానియార్డ్ అల్ఫోన్సో మార్టినేజ్ బృందం విజయం సాధించింది. ఈ పిండాల్లో 18 నుంచి 21 ఏళ్ల మధ్య సాధారణ పిండాల్లో కనిపించే లక్షణాలను గుర్తించారు. గ్రాస్ట్రులేషన్ దశలో పిండాలను పోలి ఉండటంతో ఈ కృత్రిమ పిండాలకు ‘గ్యాస్ట్రులాయిడ్స్’అనే పేరు పెట్టారు.

అయితే, ఈ గ్యాస్ట్రులాయిడ్స్‌కు పూర్తి పిండంగా ఎదిగే సామర్థ్యం లేదు. ఎందుకంటే వీటిలో మెదడు కణాలతోపాటు గర్భాశయంలో పెరిగేందుకు అవసరమైన కణజాలం కూడా లేదు. కొన్ని రోజులే ఇవి మనుగడ సాగించినప్పటికీ, ఇవి కొన్ని కొత్త విషయాలను తెలియజేశాయి.

‘‘మానవ అభివృద్ధి క్రమంలో కీలకమైన దశ గురించి కొన్ని అంశాలు తెలుసుకోవడానికి మా పరిశోధన సహకరిస్తుంది’’అని మార్టినేజ్ అప్పట్లో చెప్పారు. ఈ అధ్యయనం సైంటిఫిక్ జర్నల్ నేచర్‌లో ప్రచురితమైంది.

గ్యాస్ట్రులేషన్

ఫొటో సోర్స్, SALK INSTITUTE

ఒక అడుగు ముందుకు..

ఆ తర్వాత కూడా కృత్రిమ పిండాలను సృష్టించేందుకు కొన్ని కొత్త మార్గాలను పరిశోధకులు ఎంచుకున్నారు. వీటిలో కొన్ని పరిశోధనలు గ్యాస్ట్రులేషన్‌పై అధ్యయనానికి తోడ్పడ్డాయి కూడా.

2021లో ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీకి చెందిన జోస్ పోలో నేతృత్వంలోని బృందం మూల కణాల నుంచి ఒక కృత్రిమ పిండాన్ని అభివృద్ధి చేసేంది. దీనిలో చర్మం నుంచి సేకరించిన మూలకణాలను ఉపయోగించారు.

అయితే, మానవ పిండాలతో పోలిస్తే ఇలాంటి సూడోఎంబ్రియోస్‌ ఎంత భిన్నమైనవి? ఈ పరిశోధనలు మనల్ని ఎంతవరకూ తీసుకెళ్తాయి? అనే అంశాలపై చర్చలు కూడా జరిగాయి.

వీడియో క్యాప్షన్, గర్భ నిరోధక పద్ధతులు పాటించినా గర్భం వస్తుందా?

అయితే, ఇప్పటివరకూ గ్రాస్ట్రులేషన్ దశను కృత్రిమ పిండాలు దాటుకొని ముందుకు రానప్పటికీ, 14 రోజుల పరిమితిని ఎత్తివేస్తే ఏదోఒకరోజు ఆ దశను జాగ్రత్తగా గమనించే అవకాశం వస్తుందని అజిపిరోజ్ అన్నారు.

ఇప్పటివరకు సృష్టించిన మనుషుల, జంతువుల కృత్రిమ పిండాలు నిజమైన పిండాలకు చాలా దూరంలో ఉన్నాయని, పైగా ఇవి కొన్ని రోజులకు మించి మనుగడ సాగించలేదని ఆయన అన్నారు. అయితే, ఈ పరిశోధనల్లో చాలా పురోగతి కనిపిస్తోందని ఆయన చెప్పారు.

‘‘ప్రతి పరిశోధనా కొత్త తలుపులను తెరుస్తోంది. రేపు నేరుగా మనం మానవ పిండంపైనే పరిశోధనలు చేయొచ్చేమో’’అని ఆయన అన్నారు.

నేడు దీనికి చాలా దూరంలో ఉన్నప్పటికీ, అన్ని అనుమతులు లభిస్తే, గ్యాస్ట్రులేషన్ దశను పూర్తిగా అర్థం చేసుకోవడంతోపాటు దీని వెనుక మర్మాలను కూడా గుట్టువిప్పొచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

నేడు సైన్స్-ఫిక్షన్‌కు మాత్రమే పరిమితమైన ఈ దశను ఒకరోజు మనం అధిగమించొచ్చని ఆయన అన్నారు.

‘‘మనం కృత్రిమ మానవులను సృష్టించగలమా? లేదా కృత్రిమ అవయవాలు? ఇక్కడ ప్రతి పరిశోధనా అదే దిశలో వెళ్తోంది’’అని ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌‌తో ఐవీఎఫ్ పద్ధతిలో మెరుగైన సంతానోత్పత్తి

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)