అదృశ్యమైన మత్స్యకారుడు.. రెండు భారీ మొసళ్లను చంపితేగానీ ఏం జరిగిందో తెలియలేదు

ఫొటో సోర్స్, Getty Images
స్నేహితులతో చేపల వేటకు వెళ్లిన ఒక మత్స్యకారుడు కనిపించకుండా పోయాడు. స్నేహితుడికి అతని అరుపులు మాత్రమే వినిపించాయి కానీ మనిషి కనిపించలేదు. అనుమానం వచ్చి రెండు భారీ మొసళ్లను చంపిన తర్వాతే అతను ఏమయ్యాడో అందరికీ తెలిసింది.
చేపల వేటకు వెళ్లి కనిపించకుండా పోయిన ఆస్ట్రేలియాకు చెందిన మత్స్యకారుడి మృతదేహం మొసలి కడుపులో కనిపించింది.
మత్స్యకారుడు కెవిన్ డార్మొడి ఉత్తర క్వీన్స్‌ల్యాండ్‌లోని మొసళ్ల ఆవాస ప్రాంతమైన కెన్నడీస్ బెండ్ వద్ద శనివారం చివరి సారి కనిపించారు.
రెండు రోజులు గాలించిన పోలీసులు, ఆ ప్రాంతంలోని రెండు భారీ మొసళ్లను చంపి పరిశీలించగా మనిషి శరీర భాగాలు బయటపడ్డాయి.
మృతదేహాన్ని కనిపించకుండాపోయిన మత్స్యకారుడిదిగా ప్రాథమికంగా గుర్తించారు. మత్స్యకారుడి కోసం చేపట్టిన వెతుకులాట విషాదంతో ముగిసినట్టు పోలీసులు చెప్పారు.
డార్మొడి కేప్ యార్క్‌లో అందరికీ సుపరిచితులు. చాలా అనుభవమున్న మత్స్యకారుడు.
డార్మొడి కనిపించకుండా పోయిన ప్రాంతంలో సుమారు 4.1 మీటర్లు(13.4 అడుగులు), 2.8 మీటర్ల పొడవైన రెండు భారీ మొసళ్లను సోమవారం కాల్చి చంపారు.
అందులో ఒక మొసలి కడుపులో మనిషి శరీర భాగాలు కనిపించాయి. అయితే, ఈ రెండు మొసళ్లు కలిసే అతన్ని బలి తీసుకుని ఉంటాయని అక్కడి అటవీ అధికారులు తెలిపారు.
డార్మొడితో వెళ్లిన మరో మత్స్యకారుడు మొసళ్లు దాడి చేయడం చూడలేదు. అయితే, గట్టిగా అరుపులు వినిపించాయని ఆయన చెప్పారు.
''నేను అక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్లాను. కానీ అక్కడ ఆయన కనిపించలేదు. ఆయన దుస్తులు మాత్రం ఒడ్డున కనిపించాయి. '' అని కేప్ యార్క్ వీక్లీ మీడియా సంస్థకు డార్మొడి స్నేహితుడు జాన్ పీటి చెప్పారు.
మొసలి నీటి నుంచి బయటికొచ్చి డార్మొడిని లోపలికి లాక్కెళ్లే అవకాశం లేదని జాన్ చెబుతున్నారు.
''డార్మొడి అరుపులు నేను విన్నాను. మూడుసార్లు గట్టిగా కేకలు వేసినట్లు వినిపించింది. ఏం జరిగిందో చూద్దామని నేను అక్కడికి వెళ్లాను.'' అని చెప్పారు.
''మరునిమిషంలో నీళ్లలో అలికిడి కనిపించింది. వెంటనే అక్కడికి పరిగెత్తాను. చుట్టుపక్కల వెతికినా అతను కనిపించలేదు. అతని దుస్తులు మాత్రం ఒడ్డున కనిపించాయి'' అని జాన్ చెప్పినట్లు కేప్ యార్క్ వీక్లీ తెలిపింది.
మొసలి నీటి నుంచి బయటికి వచ్చి డార్మొడిని లాక్కెళ్లిందని అనుకోవడం లేదని, అక్కడ అందుకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లూ లేవని ఆయన చెప్పారు. మొసలి గుర్తులు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదని జాన్ తెలిపారు.
మొసలిని చూసి డార్మొడి కేకలు వేసి ఉంటారని, ఆ కంగారులో అదుపుతప్పి నీటిలో పడిపోయి ఉంటారని జాన్ తెలిపారు. అలాగే జరిగి ఉంటుందని అనుకుంటున్నానని ఆయన చెప్పారు.
ఆస్ట్రేలియా ఉత్తర ప్రాంతంలో మొసళ్లు ఉండడం సాధారణ విషయమే, కానీ మనుషులపై దాడి చేయడం చాలా అరుదు. డార్మొడిపై మొసళ్ల దాడి, 1985 తర్వాత క్వీన్స్‌ల్యాండ్‌లో జరిగిన 13వ దారుణ ఘటన.

క్వీన్స్‌లాండ్‌లో 30 వేల మొసళ్లు
2017లో పోర్ట్ డగ్లస్‌లో కనిపించకుండా పోయిన ఒక వృద్ధురాలు కూడా మొసలి దాడిలో చనిపోయినట్లు భావిస్తున్నారు.
క్వీన్స్‌ల్యాండ్‌లోని పోర్ట్ డగ్లస్ పట్టణానికి చెందిన అన్నె కామెరాన్ అనే 79 ఏళ్ల వృద్ధురాలు అదృశ్యమయ్యారు. ఆమె దుస్తులు, చేతి కర్ర నీటి ఒడ్డున కనిపించాయి.
కొద్దిరోజుల తర్వాత మనిషి శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. అవి కామెరూన్‌వి అయ్యి ఉండే అవకాశం ఉందని చెప్పారు. మొసలి దాడిలో ఆమె చనిపోయి ఉంటుందని భావిస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్ ఎడ్ లుకిన్ చెప్పారు.
ఏడాది తర్వాత అలాంటిదే మరో ఘటన నమోదైంది. డైన్‌ట్రీ నేషనల్ పార్క్‌లో మొసలి దాడిలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు.
1974లో వేటను నిషేధించిన తర్వాత క్వీన్స్‌ల్యాండ్‌లో మొసళ్ల సంఖ్య బాగా పెరిగింది. అప్పట్లో ఇక్కడ సుమారు ఐదు వేల మొసళ్లు ఉన్నట్లు అంచనా. ప్రస్తుతం ఆ సంఖ్య 30 వేలకు పెరిగింది.
ఈ నదిలో కిలోమీటర్‌కు సగటున 1.7 మొసళ్లు ఉండొచ్చని 2019లో ఒక నివేదిక తెలిపింది.
క్వీన్స్‌ల్యాండ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ప్రజా భద్రతకు ముప్పుగా మారిన సమస్యాత్మక మొసళ్లను అక్కడి నుంచి తరలించారు. కొన్నింటిని చంపేశారు. అది కూడా చాలా తక్కువ సందర్భాల్లో.
నదుల్లో మొసళ్ల సంచారం గురించి విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంతో మొసలి దాడి ఘటనలు అరుదుగా జరిగేవి. 2005 నుంచి సగటున 1 లేదా 2 మరణాలు నమోదయ్యాయి. 2018 నుంచి ఒక్క ఘటన కూడా జరగలేదు.
ఇవి కూడా చదవండి:
- అరికొంబన్: ఈ కిల్లర్ ఎలిఫెంట్ చేసిన పనికి తీసుకెళ్లి టైగర్ రిజర్వ్‌లో వదిలేశారు
- స్లీప్ పెరాలసిస్: నిద్రలో గుండెపై దెయ్యం కూర్చున్నట్లు ఎందుకు అనిపిస్తుంది?
- ‘ది కేరళ స్టోరీ’: ఇస్లాంలోకి మారిన అమ్మాయిల కథతో తీసిన ఈ సినిమాపై వివాదం ఎందుకు?
- జైశంకర్: భారత్ తరఫున బలమైన గొంతుకా, లేక దూకుడుతో వచ్చిన పాపులారిటీనా?
- చీకోటి ప్రవీణ్: థాయ్‌లాండ్‌లో అసలేం జరిగింది... గ్యాంబ్లర్స్ అరెస్టులపై అక్కడి పోలీసులు ఏం చెబుతున్నారు?
- వైరల్: శవాన్ని రేప్ చేయకుండా సమాధిపై ఇనుప తలుపు పెట్టారనే వార్తల్లో నిజమెంత? ఇది పాకిస్తాన్లోదా, హైదరాబాద్లోదా?
- ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏమిటి? ఆలస్యంగా తల్లి కావాలనుకునే అమ్మాయిలకు ఇది ఎలా ఉపయోగపడుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












