ఏడాదిలో 13,000 పశువులను ఢీకొట్టిన రైళ్లు.. ఈ ప్రమాదాలు ఆపాలంటే ఏం చేయాలి

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, అర్జున్ పర్మార్, అనంత్ జనానే, విజువల్ జర్నలిజం టీమ్
- హోదా, బీబీసీ న్యూస్
రైళ్ల ఆలస్యం, అపరిశుభ్రత లాంటి సమస్యలు వేధిస్తున్న రైల్వేను ఆధునికంగా తీర్చిదిద్దేందుకు వందే భారత్‌తోపాటు కొన్ని హైస్పీడ్ రైళ్లను వరుసగా పట్టాలెక్కిస్తున్నారు. వేర్వేరు సందర్భాల్లో ఈ కొత్త రైళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే ప్రారంభించారు.
ప్రభుత్వ ప్రణాళికలు కేవలం ఈ హైస్పీడ్ రైళ్లకు మాత్రమే పరిమితం కాదు. బుల్లెట్ రైళ్ల కోసం కూడా ప్రయత్నాలు మొదలయ్యాయి.
అయితే, ప్రస్తుతమున్న పట్టాలపై చాలా మంది రైల్వే నిపుణులు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.
ఆవులు, ఎద్దులు, గేదెలు ఇతర జంతువులను రైళ్లు ఢీకొడుతున్న ఘటనలు ఎప్పటికప్పుడే వార్తల్లో నిలుస్తున్నాయి.
భారత్‌లో ఆధునిక రైళ్లకు ప్రతీకగా నిలిచిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు ఇతర అనేక రైళ్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్తున్నాయి.
అయితే, పశువులు ఢీకొట్టడంతో ఈ రైళ్లు దెబ్బతింటున్న, రాకపోకలు ఆలస్యం అవుతున్న ఘటనలు ఎప్పటికప్పుడే చోటుచేసుకుంటున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
2022 సెప్టెంబరు 30న గాంధీనగర్, ముంబయిల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
అయితే, అక్టోబరు 6న ముంబయి నుంచి గాంధీనగర్‌కు వెళ్తూ మధ్యలో అహ్మదాబాద్‌లోని వత్వా, మణీనగర్ ర్వేల్వే స్టేషన్ల మధ్య కొన్ని గేదెలను ఈ రైలు ఢీకొట్టింది.
మరుసటి రోజు అంటే అక్టోబరు 7న, అదే వందే భారత్ రైలు గుజరాత్‌లోని ఆణంద్ దగ్గర ఒక ఆవును ఢీకొట్టింది.
ఆ తర్వాత అక్టోబరు 29న గుజరాత్‌లోని అతుల్ స్టేషన్‌కు సమీపంలో ఓ ఆవును ఢీకొట్టడంతో 15 నిమిషాలపాటు ఆ రైలు స్టేషన్‌కు చేరుకోవడం ఆలస్యమైంది.
ఇలా ఇప్పటివరకు ఎన్ని రైళ్లు పశువులను ఢీకొట్టాయి? మరమ్మతుల వల్ల రైల్వేకు ఎంత నష్టం సంభవించింది? అనే ప్రశ్నను ప్రభుత్వానికి బీబీసీ అడిగింది.
దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ.. ఒక్క 2022లోనే ఇలాంటి 13,160 ఘటనలు జరిగినట్లు తెలిపింది. 2019లో వీటి సంఖ్య 10.609గా ఉండేది. అంటే ఇక్కడ 24 శాతం పెరుగుదల కనిపించింది.
మరోవైపు సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా తొమ్మిది జోన్ల నుంచి ఈ ప్రమాదాల సమాచారాన్ని బీబీసీ సేకరించింది.
దీంతో గత నాలుగేళ్లలో మొత్తంగా 49,000 ఇలాంటి ఘటనలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. వీటిలో ఉత్తర మధ్య రైల్వే విభాగం అత్యధికంగా 2022లో 4500 ప్రమాదాలు జరిగినట్లు తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
రైల్వేకు నష్టం ఎంత?
పశువులను రైళ్లు ఢీకొట్టకుండా చూసేందుకు తీసుకుంటున్న చర్యలపై పార్లమెంటులో 2021 డిసెంబరులో అడిగిన ఓ ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు.
పశువులు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో కంచెలు వేయడం, గోడలు కట్టడం, పరిసరాల్లో చెత్తబుట్టలు తొలగించడం, పట్టాలకు పక్కనే చెట్లు పెంచడం లాంటి చర్యలు తీసుకొంటున్నట్లు ఆయన వివరించారు.
అయితే, ఈ ఘటనల వల్ల రైల్వేకు పెద్దగా ఎలాంటి నష్టమూ సంభవించడంలేదని రైల్వే మంత్రి ఆనాడు చెప్పారు.
అయితే, బీబీసీ సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు స్పందనగా ఉత్తర, దక్షిణ-మధ్య రైల్వే విభాగాలు 2022లో 1.3 కోట్లు (157,000 డాలర్లు) రైళ్లు, పట్టాల మరమ్మతుల కోసం ఖర్చుపెట్టినట్లు వెల్లడించాయి.
ఇక్కడ ఉత్తర విభాగం 1.28 కోట్లు, దక్షిణ-మధ్య రైల్వే 2 లక్షలు ఖర్చుపెట్టినట్లు తెలిపాయి.
2019లో దక్షిణ మధ్య రైల్వే రూ.2.4 లక్షలను ఈ మరమ్మతుల కోసం ఖర్చుపెట్టింది.

ఫొటో సోర్స్, Getty Images
రైల్వే చట్టం -1989 ప్రకారం, ఉద్దేశ పూర్వకంగా లేదా నిర్లక్ష్యంగా ప్రయాణికులకు ముప్పు కలిగించినందుకు ఆ పశువుల యజమానులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఈ చట్టం కింద నేరం నిరూపణ అయితే, ఆ పశువుల యజమానికి ఏడాది జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించొచ్చు.
2019 నుంచి 2022 మధ్య ఇలాంటి 191 కేసులను నమోదుచేసినట్లు సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు సమాధానంగా పశ్చిమ రైల్వే విభాగం వెల్లడించింది.

పశువులు రాకుండా కంచె వేయొచ్చా?
తొలగించేందుకు వీలుగా ఏర్పాటుచేసిన వందే భారత్ ముందు భాగాలు పశువులు ఢీకొట్టేటప్పుడు ఎక్కువగా దెబ్బతింటున్నాయి. ఫైబర్ రీఇన్‌ఫోర్స్డ్ ప్లాస్టిక్‌తో ఈ నోస్‌లను తయారుచేస్తుంటారు. వీటిని సిబ్బంది తేలిగ్గానే మార్చేస్తుంటారు.
కానీ, ఇలాంటి ఘటనలతో రైల్వే ఆపరేషన్లకు ఆటంకం కలుగుతుంది. అందుకే పశువులు రాకుండా కంచెలు ఏర్పాటుచేయాలని రైల్వే నిపుణులు సూచిస్తున్నారు.
అయితే, ఇలాంటి సమస్యలు ఇటీవల కాలంలోనే ఎక్కువగా పెరిగాయని రైల్వేలో ఉన్నతాధికారిగా పనిచేసిన రాకేశ్ చెప్రా అన్నారు. ‘‘ఇదివరకు రైళ్లు ఇంత వేగంతో వెళ్లేవి కాదు. కానీ, ఇప్పుడు అలా కాదు. వేగం పెరగడంతో పశువులను ఢీకొడుతున్న ఘటనలు కూడా ఎక్కువయ్యాయి. వీటి వల్ల రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిళ్లే అవకాశం ఉంటుంది’’అని ఆయన చెప్పారు.

‘‘మొత్తం రైల్వే పట్టాలకు కంచె వేయడం చాలా కష్టం. ఈ విషయం రైల్వేకు కూడా తెలుసు. ఇలాంటి సమస్యకు పరిష్కారాల కోసం కొత్తగా ఆలోచించాల్సి ఉంటుంది’’అని రాకేశ్ అన్నారు.
2022లో వరుసగా వందే భారత్ రైళ్లు పశువులను ఢీకొట్టడంతో మహారాష్ట్రలోని రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ ఆయా గ్రామ సర్పంచ్‌లకు నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టింది.
‘‘పశువులు-రైళ్ల ఢీ ఘటనలు అడ్డుకోవడానికి మనం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్న ప్రాంతాలను మనం ముందుగా గుర్తించాలి. అక్కడ ఆవులు-గేదెల కారిడార్లు ఏర్పాటుచేయాలి. కంచె కూడా వేయొచ్చు. కానీ, దీనికి ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది’’అని మాజీ ప్రభుత్వ అధికారి అరుణేంద్ర కుమార్ అన్నారు.
ముంబయి-అహ్మదాబాద్ మార్గంలో..
రైల్వే పట్టాలకు చుట్టుపక్కల కంచె వేయడం అనేది ఖర్చుతో కూడుకున్న పని. కానీ, దీని వల్ల చాలావరకు సమస్య పరిష్కారం అవుతుంది.
మరోవైపు పశ్చిమ రైల్వే విభాగం ఇప్పటికే ‘‘మెటల్ బీమ్ ఫెన్సింగ్’’ను వేసే పనులు మొదలుపెట్టింది. రూ.245 కోట్ల వ్యవయంతో 622 కి.మీ. మేర ముంబయి-అహ్మదాబాద్ మార్గంలో దీన్ని ఏర్పాటుచేస్తున్నారు.
ముఖ్యంగా పశువులు ఢీకొడుతున్న ఘటనలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ ఫెన్సింగ్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు పశ్చిమ రైల్వే విభాగం అధికార ప్రతినిధి సుమిత్ ఠాకుర్ అన్నారు.
‘‘ఈ మార్గాల్లో హైస్పీడ్ సేవలను రైల్వే అందిస్తోంది. ఇదివరకు ఇక్కడ గంటకు 130 కి.మీ. వేగంతో రైళ్లు పరుగులు తీశాయి. ఇప్పుడు ఇది 150కి.మీ.కి పెరిగింది. దీన్ని 160 కి.మీ. పెంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇక్కడ ప్రయాణికులతోపాటు పశువుల ప్రాణాలను, ఆస్తులను కాపాడేందుకు చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకే వేగంగా ఫెన్సింగ్ వేయాలని నిర్ణయం తీసుకున్నాం’’అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్: వీధుల్లోకి లక్షల మంది ఎందుకు వస్తున్నారు... వారి ఆగ్రహానికి కారణం ఏంటి?
- గవర్నర్ పోస్టును రద్దు చేయాలా? వారి పనితీరుపై విమర్శలెందుకు?
- గోరుముద్ద, మన ఊరు-మన బడి పథకాలు ఉన్నా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పిల్లలు ఎందుకు బడి మానేస్తున్నారు?
- కేరళ క్రైస్తవులు అంత్యక్రియల్లో ఫొటోలు ఎందుకు తీయించుకుంటారు?
- రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు కారణమైన పూర్ణేశ్ మోదీ ఎవరు? ఆయనకు నరేంద్ర మోదీకి సంబంధం ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















