బిలావల్ భుట్టో జర్దారీ: ‘కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు’

బిలావల్ భుట్టో
ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ
    • రచయిత, వినీత్ ఖరే
    • హోదా, బీబీసీ ప్రతినిధి, గోవా నుంచి

చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత భారత్‌పైనే ఉందని బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అన్నారు.

షాంఘై సహకార సదస్సు (ఎస్‌సీవో) ప్రారంభానికి ముందు బిలావల్ భుట్టోతో బీబీసీ మాట్లాడింది.

ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కశ్మీర్ అంశంలో పాకిస్తాన్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని అన్నారు.

సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు రావాలని బిలావల్ తీసుకున్న నిర్ణయం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే గత సమావేశాల్లో పాకిస్తాన్ నేతలు వర్చువల్‌గా పాల్గొన్నారు. కానీ, ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు బిలావల్ నేరుగా భారత్‌కు వచ్చారు.

గత 12 ఏళ్లలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఒకరు భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

దీంతో ఆయన ప్రతీ మాట, ఆయన ప్రతీ కదలికను మీడియా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.

భారత విదేశాంగ మంత్రి జై శంకర్, పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోతో కరచాలనం చేయలేదంటూ మీడియాలో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి.

సదస్సు ముగిసిన అనంతరం, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఒక సానుభూతిపరుడు అని, తీవ్రవాదానికి ప్రతినిధి అని భారత విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు.

బిలావల్ భుట్టో

ఫొటో సోర్స్, @BBHUTTOZARDARI

‘మేం సహాయం కోరట్లేదు, వారు ఇవ్వట్లేదు’

ప్రస్తుతం పాకిస్తాన్‌లో తీవ్ర రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఈ పరిస్థితుల్లో పొరుగుదేశానికి భారత్ ఏదైనా సహాయం చేయగలదా?

ఈ ప్రశ్న ఎందుకు తలెత్తిందంటే ఇటీవల భారత్, సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నఅఫ్ఘానిస్తాన్‌తో పాటు భూకంపం బారిన పడిన తుర్కియేలకు సహాయం చేసింది.

అలాగే పాకిస్తాన్‌కు కూడా భారత్ సహాయం అందిస్తుందా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

ఈ ప్రశ్న అడిగినప్పుడు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి నవ్వుతూ, ‘‘మేం సహాయం కోరట్లేదు, వారు సహాయం అందించడం లేదు’’ అని అన్నారు.

బీబీసీ ప్రతినిధి వినీత్ ఖరేతో బిలావల్ భుట్టో

కశ్మీర్ అంశం

తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపేంతవరకు పాకిస్తాన్‌తో చర్చలు జరుపలేమని భారత్ అంటోంది.

అయితే, 2019 ఆగస్టు 5న భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పున:సమీక్ష చేసేంతవరకు ఇరు దేశాల మధ్య సరైన చర్చలు జరుగలేవని బీబీసీతో మాట్లాడుతూ భుట్టో అన్నారు.

భారత ప్రభుత్వం 2019 ఆగస్టు 5న, కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసి, దాన్నొక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత పాకిస్తాన్, భారత్‌తో దౌత్య సంబంధాలను తగ్గించుకుంది.

గోవాలో బిలావల్ భుట్టో మాట్లాడుతూ, ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే బాధ్యత భారత్‌పైనే ఉంది. 2019 ఆగస్టు 5న భారత్ తీసుకున్న చర్యలను పాకిస్తాన్ చాలా తీవ్రమైనవిగా భావిస్తుంది. వాటిని సమీక్షించేంత వరకు ఇరు దేశాల మధ్య అర్థవంతమైన చర్చలు జరగడం చాలా కష్టం’’ అని అన్నారు.

ఎస్‌సీవో సదస్సులో పాల్గొనడంతో పాటు భారత్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారా? అని భుట్టోని ప్రశ్నించగా ఆయన ఇలా బదులిచ్చారు.

‘‘ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చా. ద్వైపాక్షిక చర్చల గురించి భారత్‌తో మాట్లాడలేదు’’ అని ఆయన అన్నారు.

భారత్‌కు రావడం పట్ల తనపై వస్తోన్న విమర్శల గురించి అడిగినప్పుడు, కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన అన్నారు.

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ శుక్రవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ‘‘ఆర్టికల్ 370 అనేది ఇప్పుడు ఒక చరిత్ర’’ అని వ్యాఖ్యానించారు.

బిలావల్ భుట్టో

ఫొటో సోర్స్, Getty Images

తీవ్రవాదం గురించి...

ఎస్‌సీవో సదస్సు అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జై. శంకర్ మాట్లాడారు.

భారత్‌ను తీవ్రవాద బాధిత దేశంగా ఆయన అభివర్ణించారు. తీవ్రవాద బాధితులు, తీవ్రవాదానికి పాల్పడే దేశంతో ఆ అంశం గురించి మాట్లాడరు అని అన్నారు.

బీబీసీ ఇంటర్వ్యూలో బిలావల్ భుట్టో మాట్లాడుతూ, ‘‘తీవ్రవాదానికి పాకిస్తాన్ బాధిత దేశంగా మారింది. ఎస్‌సీవోలోని అన్ని సభ్యదేశాల కంటే కూడా తీవ్రవాదం వల్ల ఎక్కువ ప్రాణాలు కోల్పోయింది పాకిస్తానే’’ అని వ్యాఖ్యానించారు.

తన తల్లి బెనజీర్ భుట్టో హత్య గురించి ప్రస్తావించకుండా, ‘‘తీవ్రవాదానికి స్వయంగా నేనే ఒక బాధితుడిని. వ్యక్తిగతంగా ఆ బాధను నేను అర్థం చేసుకున్నాను.

నిజంగా తీవ్రవాద సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోవాలంటే ప్రతీకారాలుపక్కన పెట్టి చర్చలు జరపాలి. తీవ్రవాదంపై భారత ఆందోళనలకు పరిష్కారం లభించాలని మేం కూడా కోరుకుంటున్నాం. పాకిస్తాన్‌కు కూడా ఈ విషయంలో కొన్ని ఆందోళనలు ఉన్నాయి’’ అని ఆయన అన్నారు.

ఎస్‌సీఓ సదస్సు

ఫొటో సోర్స్, @SANDHUTARANJITS

వర్చువల్‌గా కాకుండా నేరుగా ఎందుకు హాజరైనట్లు?

భుట్టో, భారత పర్యటనను పాకిస్తాన్‌లోని చాలా మంది ప్రశంసిచారు. అలాగే విమర్శించిన వారు కూడా ఉన్నారు.

ఎస్‌సీవో రక్షణ మంత్రుల సమావేశానికి పాకిస్తాన్ వర్చువల్‌గా హాజరైనప్పుడు బిలావల్ భుట్టో మాత్రం ఎందుకు భారత్‌కు వెళ్లారని కొంతమంది ప్రశ్నలు లేవనెత్తారు. కావాలంటే గోవాలో జరిగిన ఈ సమావేశంలో భుట్టో వర్చువల్‌గా పాల్గొనవచ్చని అభిప్రాయపడ్డారు.

భారత్‌కు వెళ్లి కశ్మీర్‌పై పాకిస్తాన్ సంప్రదాయ వైఖరిని బిలావల్ భుట్టో బలహీనపరిచారని కొందరు పాకిస్తానీయులు అంటున్నారు.

అయితే, బీబీసీ ఇంటర్వ్యూలో బిలావల్ భుట్టో మాట్లాడుతూ, తన పర్యటన సరైన సందేశాన్ని పంపిస్తుందని అన్నారు. ఎస్‌సీవో పట్ల పాకిస్తాన్ నిబద్ధతను చాటేందుకే నేరుగా ఈ సమావేశానికి వచ్చినట్లు ఆయన తెలిపారు.

గోవాలో జరిగిన ఎస్‌సీవో సదస్సుకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి రావడంపై భారత విదేశాంగ మంత్రి జై. శంకర్ స్పందిస్తూ, ‘‘పాకిస్తాన్ ఎస్‌సీవోలో సభ్య దేశమైనందున ఆయన ఇక్కడికి వచ్చారు. అంతకుమించి ఏం లేదు. అంతకంటే ప్రాధాన్యం లేదు’’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)