ఓరల్ సెక్స్‌తో గొంతు క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా?

Oral Sex

ఫొటో సోర్స్, WIKIMEDIA COMMONS

    • రచయిత, మెహెన్నా హిషమ్
    • హోదా, బీబీసీ కోసం

గత రెండు దశాబ్దాల్లో ప్రపంచ వ్యాప్తంగా గొంతు క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో ఈ వ్యాధిని వేగంగా విస్తరిస్తున్న ప్రమాదకర వ్యాధుల జాబితాలో చేర్చారు.

ముఖ్యంగా గొంతు క్యాన్సర్‌లో ఒక రకమైన ‘‘ఆరోఫరంజియల్ క్యాన్సర్’’ కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇది గొంతు వెనుక భాగంలోనుండే టాన్సిల్స్‌పై ప్రభావం చూపిస్తుంది.

ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణం హ్యూమన్ పపిలోమా వైరస్ (హెచ్‌పీవీ). చాలా గర్భాశయ క్యాన్సర్ కేసులకూ ఇదే వైరస్ కారణం అవుతోంది. అయితే, అమెరికా, బ్రిటన్ లాంటి పశ్చిమ దేశాల్లో గర్భాశయ క్యాన్సర్ కంటే ఆరోఫరంజియల్ క్యాన్సర్ కేసులే ఎక్కువగా వస్తున్నాయి.

ఒక్క స్పెయిన్‌లోనే ఏటా 8,000 కొత్త ఆరోఫరంజియల్ క్యాన్సర్ కేసులు వస్తున్నాయి. మధ్య, దక్షిణ అమెరికాతోపాటు చాలా దేశాల్లోనూ ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది.

Oral Sex

ఫొటో సోర్స్, Getty Images

లైంగిక చర్యలతో...

హెచ్‌పీవీ ప్రధానంగా లైంగిక చర్యలతో సంక్రమిస్తుంది. ఆరోఫరంజియల్ క్యాన్సర్‌కు ప్రధాన ముప్పు ఎక్కువ మందితో సెక్స్‌లో పాల్గొనడం. ఇక్కడ ఓరల్ సెక్స్.. వైరస్ వ్యాప్తిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.

తమ జీవితంలో ఆరుగురు కంటే ఎక్కువ మందితో ఓరల్ సెక్స్‌ చేస్తే ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు 8.5 రెట్లు ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.

బ్రిటన్‌లో క్యాన్సరేతర కారణాలతో టాన్సిల్స్‌ను తొలగించుకునే ‘‘టాన్సిలెక్టమీ’’ ఆపరేషన్ చేయించుకున్న దాదాపు వెయ్య మంది డేటాను మేం విశ్లేషించాం. దీంతో వారిలో 80 శాతం మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ఓరల్ సెక్స్‌లో పాల్గొన్నట్లు తెలిసింది.

అయితే, ఆ తర్వాత వారిలో కొంతమందికి ఆరోఫరంజియల్ క్యాన్సర్‌ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది.

ఇక్కడ క్యాన్సర్ రావడంలో చాలా అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. సాధారణంగా చాలా మందికి సెక్స్ ద్వారా హెచ్‌పీవీ సోకుతుంది. అయితే, దీని నుంచి చాలా మంది సాధారణంగానే పూర్తిగా కోలుకుంటారు.

కానీ, కొంత మందికి మాత్రం ఆ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడటం చాలా కష్టం అవుతుంది. దీనికి కారణం వారి రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండటమే కావచ్చు.

అలాంటి రోగుల్లో వైరస్ క్రమంగా తమ సంఖ్యను పెంచుకుంటూ పోతుంది. ఆ తర్వాత డీఎన్‌ఏలో మార్పులు వస్తాయి, ఆ మార్పులే క్యాన్సర్‌గా మారొచ్చు.

టీకా

ఫొటో సోర్స్, Getty Images

టీకా ఉంది...

గర్భాశయ క్యాన్సర్‌ను అడ్డుకోవడమే లక్ష్యంగా చాలా ప్రాంతాల్లో అమ్మాయిలకు హెచ్‌పీవీ వ్యాక్సీన్లు ఇస్తున్నారు. వీటి వల్ల నోటి ద్వారా కూడా హెచ్‌పీవీ సోకుకుండా రక్షణ లభిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

అమ్మాయిల్లో వ్యాక్సీన్ రేటు 85 శాతం కంటే ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అబ్బాయిలల్లోనూ హెచ్‌పీవీ నుంచి ‘‘హెర్డ్ ఇమ్యూనిటీ’’ కనిపిస్తోంది. రానున్న సంవత్సరాల్లో ఇది మరింత పెరిగితే, ఆరోఫరంజియల్ క్యాన్సర్ కేసులు తగ్గే అవకాశముంది.

అయితే, ఇవన్నీ జనాభా మొత్తంగా చెబుతున్న అంచనాలు. క్యాన్సర్ వచ్చే అవకాశం వ్యక్తిని బట్టీ మారుతూ ఉంటుంది. వ్యాక్సీన్లు తక్కువగా తీసుకున్న ప్రాంతాల్లో ఎక్కువ లైంగిక సంబంధాలను కలిగి ఉంటే హెచ్‌పీవీ సోకే ముప్పు కూడా ఎక్కువగా ఉండొచ్చు.

ఇక్కడ హెచ్‌పీవీ వ్యాక్సీన్ తీసుకునే అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎలాంటి హెర్డ్ ఇమ్యూనిటీ ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు అమెరికాను తీసుకోండి. ఇక్కడ 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 54.3 శాతం మంది మాత్రమే మూడు డోసుల హెచ్‌పీవీ వ్యాక్సీన్ తీసుకున్నారు.

క్యాన్సర్

ఫొటో సోర్స్, Getty Images

అబ్బాయిలు కూడా టీకా తీసుకోవాలి

ఇప్పటికే బ్రిటన్, ఆస్ట్రేలియాతోపాటు కొన్ని దేశాల్లో అమ్మాయిలోపాటు అబ్బాయిలకు కూడా హెచ్‌పీవీ వ్యాక్సీన్లు ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు.

అయితే, ఇక్కడ అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరికీ టీకాలు ఇచ్చే విధానం తీసుకొచ్చినంత మాత్రాన, కవరేజీ పెరగదు. ఎందుకంటే భద్రతాపరమైన కారణాలను చూపిస్తూ చాలా మంది టీకాలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు.

కొన్ని ప్రాంతాల్లో మహిళల జననాంగంలోకి పురుషాంగాన్ని చొప్పించే పెనిట్రేటివ్ సెక్స్‌కు బదులుగా ఓరల్ సెక్స్ చేయాలని ప్రోత్సహిస్తుంటారు. ఇలా చేస్తే లైంగిక సాంక్రమిక వ్యాధుల ముప్పు తక్కువగా ఉంటుందని చెబుతారు. ఓరల్ సెక్స్ వల్ల కలిగే ముప్పులపై అవగాహన లేకపోవడం వల్లే అలా చెబుతుంటారు.

(రచయిత బ్రిటన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ అండ్ జీనోమిక్ సైన్సెస్‌లో ప్రొఫెసర్)

వీడియో క్యాప్షన్, "నేను నా కొత్త చను మొనలుగా టాటూస్ చూసిన ఆ క్షణంలో...”

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)