కూతురి హత్య కేసులో న్యాయం కోసం ఓ తండ్రి 26 ఏళ్ల పోరాటం, చివరకెలా ముగిసిందంటే...

ఫొటో సోర్స్, PERSONAL FILE
కొలంబియన్ యువతి నాన్సీ మెస్ట్రేను దాదాపు 30 ఏళ్ల క్రితం చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న జైమ్ సాడేను బ్రెజిల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అలగోస్ రాష్ట్రంలోని ఒక తీర ప్రాంత మున్సిపాలిటీలో సాడేను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
సాడేను కొలంబియాకు అప్పగించేందుకు బ్రెజిల్ సుప్రీంకోర్టు (సుప్రీమో ట్రిబ్యునల్ ఫెడరల్-ఎస్‌టీఎఫ్) అంగీకరించింది..
నాన్సిని అత్యాచారం చేసి, హత్య చేసిన నేరానికి 1996లో విధించిన 27 ఏళ్ల జైలు శిక్షను కొలంబియాకు వచ్చాక సాడే అనుభవించనున్నారు.
తన కూతుర్ని అత్యాచారం, హత్య చేసి పారిపోయిన వ్యక్తి కోసం నాన్సీ మెస్ట్రే తండ్రి మార్టిన్ 26 ఏళ్ల పాటు వెతికారు.
ఆ తర్వాత బ్రెజిల్‌లోని బెలో హారిజాంటేలో అతడు ఉంటున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత అక్కడే 2020లో ఇంటర్‌పోల్ అతన్ని అరెస్ట్ చేసింది.
అత్యాచారం, హత్య చేసి పారిపోయిన నిందితుడు తప్పుడు పేరుతో బ్రెజిల్‌లో సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. అదే దేశానికి చెందిన ఒక మహిళను వివాహమాడారు. వారికి ఇద్దరు పిల్లలు.
ఆయన్ను అరెస్ట్ చేసిన తర్వాత కొలంబియాకు అప్పగించేందుకు మొదట నిరాకరించిన బ్రెజిల్ అత్యున్నత న్యాయస్థానం ఎస్‌టీఎఫ్, తర్వాత ఒప్పుకుంది.
అసలేమైంది?
నాన్సి అనే అమ్మాయి మెస్ట్రే దంపతుల చిన్నకూతురు. దౌత్యాధికారి కావాలనుకున్న నాన్సి ఉన్నత విద్య అభ్యసించేందుకు కొలంబియా నుంచి అమెరికా వెళ్లాలనుకున్నారు.
కూతురిని వదిలిపెట్టి ఒక్కక్షణం ఉండలేనని ఆమె తండ్రి అంటుండేవారు. అలాగని, తన కూతురి ఆశయాలకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు.
ఆ కలను సాకారం చేసుకునేందుకు ఆమెకు కావాల్సిన సాయమంతా చేసేవారు.
‘‘ఆమె చాలా చురుకైన అమ్మాయి. తెలివైనది. ఆమె ఎప్పుడూ చదువుతూనే ఉంటుంది. ఇంటర్నేషనల్ లా, డిప్లొమసీని ఆమె చదవాలనుకుంది.’’ అని మే 2022న బీబీసీతో అన్నారు మెస్ట్రే.
కానీ, ఈ కలలన్ని చెల్లాచెదురయ్యాయి. 1994 జనవరి 1న తెల్లవారుజామున 18 ఏళ్ల ఆయన కూతురు హత్యకు గురైంది.
ఆ రోజు నాన్సి, ఆమె తండ్రి, తల్లి, సోదరుడు ఇంట్లో న్యూఇయర్ వేడుకలు జరుపుకున్నారు.
న్యూఇయర్ సెలబ్రేషన్లను తన బాయ్‌ఫ్రెండ్ జైమ్ సాడేతో జరుపుకోవాలనుకుంది నాన్సి. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.
మూడు గంటల కల్లా తిరిగి ఇంటికి వచ్చేయాలని తండ్రి మెస్ట్రే తన కూతురికి చెప్పారు. ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని జైమ్ సాడేకి కూడా చెప్పారు.
ఉదయం ఆరు గంటలకు లేచి చూస్తే ఇంకా నాన్సి ఇంటికి రాలేదు. తనకేదో తేడాగా అనిపించింది. ఇళ్లంతా నాన్సి కోసం వెతికారు. ఆమె గది ఖాళీగా కనిపించింది.
వీధిలోకి వెళ్లి చూశారు. ఎవరైనా యువ జంట అక్కడికి వచ్చిందా అని నైట్‌క్లబ్స్‌కి వెళ్లి ఎంక్వైరీ చేశారు. కానీ, ఆయనకి వారి ఆచూకీ దొరకలేదు.
ఆయన ఆందోళన మరింత పెరిగింది. తన కూతురి గురించి వెతుకుతూనే ఉన్నారు. మరోవైపు ఆమె సురక్షితంగా ఉండాలని మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు.
చివరికి జైమ్ సాడే తల్లిదండ్రులు ఉండే ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో జైమ్ సాడే తల్లి అక్కడున్న గచ్చును శుభ్రం చేస్తున్నారు.
‘‘ అప్పటికి ఇంకా చీకటిగానే ఉంది. నేను నా కూతురు రక్తం తో తడిచిన ప్రాంతంలోకి వెళ్తున్నానని అనుకోలేదు. మీ కూతురికి ప్రమాదం జరిగింది. కరీబియన్ క్లినిక్‌లో ఉందని ఆమె చెప్పారు’’ అని మెస్ట్రే తెలిపారు.
మెస్ట్రే ఆస్పత్రికి వెళ్తే, అక్కడ జైమ్ తండ్రి కనిపించారు. ‘‘మీ కూతురు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం ఆపరేషన్ రూమ్‌లో ఉంది’’ అని ఆయనకు జైమ్ తండ్రి చెప్పారు.
ఎమర్జెన్సీ రూమ్‌లో కోమాలో ఉన్న నాన్సిని డాక్టర్లు బతికించేందుకు ప్రయత్నిస్తున్నారు.
నాన్సిని జైమ్, ఆయన తండ్రి, వారి ఇంట్లో నివసించే ఒక మహిళ ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. నగ్నంగా ఉన్న నాన్సిని ఒక షీటులో చుట్టి ఆస్పత్రికి తీసుకొచ్చారు.
‘‘అసలేం జరిగిందో అర్థం చేసుకునేందుకు నాకు కాస్త సమయం పట్టింది. వారు నా కూతుర్ని అత్యాచారం చేసి, వేధించి, ట్రక్క్‌లో ఆస్పత్రికి తీసుకొచ్చి పడేశారు’’ అని మెస్ట్రే చెప్పారు.
ఆస్పత్రిలో ఎనిమిది రోజుల పాటు తీవ్రంగా ప్రయత్నించినా, నాన్సి మాత్రం కోలుకోలేదు.
ఆమె ప్రాణాలపై ఆశలు వదులుకోవాలని డాక్టర్లు చెప్పారు. ‘‘నేను, నాన్సి తల్లి, మా కొడుకు కలిసి నాన్సిని ఉంచిన హాస్పిటల్ రూమ్‌లోకి వెళ్లాం. చిన్నప్పుడు ఆమె వినేందుకు ఇష్టపడే పాటలను వినిపించాం. ప్రార్థన చేశాం. ఆమె గుండె కొట్టుకోవడం ఆగిపోయింది’’ అని మెస్ట్రే చెప్పారు.

తప్పించుకున్న ప్రధాన నిందితుడు
నాన్సి తల్లిదండ్రులు ఆస్పత్రిలో బాధపడుతోన్న సమయంలో, జనవరి 1న నాన్సికి ఏం జరిగిందని పోలీసులు విచారిస్తున్నప్పుడు, ఈ నేరానికి ప్రధాన నిందితుడైన జైమ్ సాడే కొలంబియా నుంచి పారిపోయారు.
హత్య జరిగిన తర్వాత పారిపోయిన జైమ్ సాడే, మళ్లీ ఆ దేశంలో కనిపించలేదని 2022లో బీబీసీతో అన్నారు మెస్ట్రే.
నాన్సి ఆత్యహత్య చేసుకున్న విషయాన్ని పోలీసులు కొట్టివేశారు. ఆమె తలకి బుల్లెట్ తగలడం వల్ల చనిపోయినట్లు గుర్తించారు.
గన్ పౌడర్ ఆనవాళ్లను ఆమె ఎడమ చేతిపై గుర్తించారు. దీన్ని బట్టి ఆమె హత్య జరిగే సమయంలో తనకు తాను రక్షించుకునేందుకు ప్రయత్నించిందని కొలంబియన్ అధికారులు చెప్పారు.
నాన్సి కుడి చేతి వాటం కలిగిన అమ్మాయి. ఎడమ చేతితో గన్ పట్టుకుని తనకు తాను కుడివైపు కాల్చుకోవడం అసాధ్యమని పోలీసులు చెప్పారు.
విచారణలో నాన్సి అత్యాచారానికి గురయ్యారని తెలిసింది. ఆమె శరీరమంతా గాయాలున్నాయి. చేతి వేళ్లు కూడా విరిగిపోయి కనిపించాయి. వీటన్నింటిని బట్టి చూస్తే ఆమె తనకు తాను రక్షించుకునేందుకు చాలా ప్రయత్నించినట్లు అర్థమైంది.
ఆ తర్వాత రెండేళ్లకు 1996లో అత్యాచారం, హత్య కేసులో జైమ్ సాడేకు కొలంబియన్ కోర్టు 27 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
నాన్సిని అత్యాచారం చేసి, తలపై కాల్చిన తర్వాత, జైమ్ తన తండ్రి సాయం కోరారు. షీటులో నాన్సి నగ్న శరీరాన్ని చుట్టి, ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చారు. తన కొడుకు తప్పించుకునేంత వరకు జైమ్ తండ్రి క్లినిక్‌లోనే ఉన్నారు.
అప్పటి నుంచి జైమ్ సాడే కోసం వెతుకులాట మొదలైంది. అతన్ని పట్టుకునేందుకు మెస్ట్రే తన జీవితమంతా వెచ్చించారు.
‘‘కాస్త సమయం పడుతుందని నాకు తెలుసు. కానీ, నా కూతుర్ని చంపిన వ్యక్తిని పట్టుకుంటాననే నమ్మకం నాకు ఉండేది’’ అని మెస్ట్రే చెప్పారు.

ఫొటో సోర్స్, PERSONAL FILE
విచారణ ఎలా జరిగింది?
జైమ్ సాడేపై కేసు నమోదైన తర్వాత,కొలంబియా అధికారులను తరచూ కలిసేవారు మెస్ట్రే.
నాన్సి హత్య తర్వాత, వారి జీవితం తలకిందులైంది. మెస్ట్రే, ఆయన భార్య విడిపోయారు. ఒకానొక కొడుకు అమెరికా వెళ్లిపోయారు.
ప్రొఫెసర్, ఆర్కిటెక్ అయిన మెస్ట్రే తన సమయమంతా జైమ్‌ను వెతికేందుకే పెట్టుకున్నారు. ఇంటెలిజెన్స్ సర్వీస్ కోర్సులు చేశారు. నేవల్ అధికారిగా తాను నేర్చుకున్న పరిజ్ఞానమంతా జైమ్‌ను వెతికేందుకు ఉపయోగించారు.
‘‘ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలతో నాలుగు కల్పిత పాత్రలను సృష్టించాను. జైమ్ బంధువులతో సోషల్ నెట్‌వర్క్స్‌పై సంబంధాలు పెంచుకోవడం ప్రారంభించాను. వారి నమ్మకాన్ని సంపాదించాను. జైమ్ ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు ప్రయత్నించాను’’ అని బీబీసీతో చెప్పారు.
ఈ వివరాలన్నింటన్ని కొలంబియన్ పోలీసులకు, ఇంటర్‌పోల్‌కి ఇచ్చేవారు. జైమ్ కోసం జరిపిన ఈ 26 ఏళ్ల వెతుకులాటలో, ఈ కేసును విచారించే అధికారులు చాలా మందే మారారు.
‘‘అధికారి మారిన ప్రతిసారి, నేను అన్ని డాక్యుమెంట్లను తీసుకుని వారి వద్దకు వెళ్లి, ప్రతీది వారికి వివరించాను’’ అని చెప్పారు.
తప్పుడు ప్రొఫైల్స్‌తో జైమ్ బంధువులతో మాట్లాడిన సమయంలో, కొలంబియా శాంట మార్టాలో కాకుండా బ్రెజిల్ సిటీ బెలో హారిజాంటేలో అతను ఉన్నట్లు మెస్ట్రే గుర్తించారు.
ఈ సమాచారంతో బ్రెజిల్ ఫెడరల్ పోలీసు, ఇంటర్‌పోల్‌లు కలిసి ఆ వ్యక్తి ఎక్కడున్నారో కనుగొన్నారు.

జైలు శిక్ష
నిందితుణ్ని అనుసరిస్తూ అధికారులు కాఫీ షాపు వరకు వెళ్లారు. ఆయన తాగిన కాఫీ కప్పును సేకరించారు. నాన్సి హత్య జరిగిన సమయంలో కొలంబియన్ అధికారులు సేకరించిన ఆధారాలతో ఈ ఫింగర్‌ప్రింట్స్‌ను మ్యాచ్ చేసి చూశారు. అవి అతనివేనని గుర్తించారు.
వెంటనే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత, జైమ్‌ను తమ దేశానికి అప్పగించాలని కొలంబియన్ ప్రభుత్వం అభ్యర్థన పెట్టుకుంది. కొలంబియాలో జైమ్‌కి 27 ఏళ్ల శిక్ష పడి ఉంది.
ఇంటర్‌పోల్ డైరెక్టర్ తనను పిలిచి, జైమ్‌ను అరెస్ట్ చేసినట్లు చెప్పగానే, నేలపై కూలిపోయి దేవునికి కృతజ్ఞత చెప్పుకున్నారు మెస్ట్రే. ‘‘దేవుడా! 27 ఏళ్లకు న్యాయం దక్కిందా’’ అని తాను అనుకున్నట్లు మెస్ట్రే చెప్పారు.
‘‘అమెరికాలో ఉన్న నా కొడుకుకి, స్పెయిన్‌లో ఉంటోన్న ఆమె తల్లికి ఫోన్ చేశాను. వారికి విషయం చెప్పాను. ఆ సమయంలో మేమెంత ఏడ్చామో మాకే తెలియదు’’ అని గుర్తు చేసుకున్నారాయన.
అయితే, జైమ్ అరెస్ట్ అయినా, అతన్ని కొలంబియాకి రప్పించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, PERSONAL FILE
అప్పగింతకు తొలుత నిరాకరణ
2020 సెప్టెంబర్ 28న మెస్ట్రేకి న్యాయవాది నుంచి కాల్ వచ్చింది.
జైమ్‌ను అప్పగించకూడదని ఎస్‌టీఎఫ్ నిర్ణయించిందని తెలిపారు. ఎందుకంటే, హత్య కేసులో 20 ఏళ్ల లోపు అతన్ని నిందితుడిగా గుర్తిస్తే అప్పగించేందుకు బ్రెజిల్ చట్టాలు ఒప్పుకుంటాయి. కానీ నాన్సి హత్య తర్వాత 26 ఏళ్లకు ఆయన్ని గుర్తించడంతో, అప్పగింతకు బ్రెజిల్ మొదట నిరాకరించింది.
అయితే, ఎస్‌టీఎఫ్ నిర్ణయం మెజార్టీ ప్రకారం రాలేదు. నిర్ణయం టై అయింది.
అయితే, నేరం జరిగిన 20 ఏళ్ల తర్వాత దొరికితే బ్రెజిల్ అప్పగింత చట్టం నుంచి తప్పించుకోవచ్చు. కానీ, ఒకవేళ ఒక నేరం చేసిన తర్వాత మరొక నేరం చేస్తే ఆ మినహాయింపు పనిచేయదు.
జైమ్ విషయంలో ఇదే జరిగింది. కొలంబియా నుంచి పారిపోయేందుకు తప్పుడు డాక్యుమెంట్లు, ధ్రువీకరణ పత్రాలు సృష్టించినట్లు తేలింది.

ఫొటో సోర్స్, PERSONAL FILE
తుది తీర్పులో ఏం చెప్పారు?
అయితే, కొలంబియా ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లకపోవడంతో ఎస్‌టీఎఫ్ నిర్ణయమే అమలైంది. అయితే మెస్ట్రే మాత్రం తన ఆశను వదులుకోలేదు. చివరి ప్రత్యామ్నాయాన్ని సూచించే ఒక సంస్థను ఆశ్రయించారు.
ఎస్‌టీఎఫ్ నిర్ణయాన్ని సమీక్షించాలని కోరుతూ మెస్ట్రే మరో పిటిషన్‌ను దాఖలు చేశారు.
యువతి తండ్రికి ఎస్‌టీఎఫ్ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరే హక్కు ఉందని, అప్పగింతను నిరాకరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించేందుకు అనుకూలంగా ఓటు వేసే హక్కు ఆయనకు ఉందని ఎస్‌టీఎఫ్ మంత్రి అలెక్సాండ్రే డే మోరేస్ గత మార్చిలో చెప్పారు.
ఏప్రిల్ 18న చిట్టచివరికి అప్పగించేందుకు ఎస్‌టీఎఫ్ ఒప్పుకుంది. కూతురు హత్య కేసులో ఆఖరికి తనకు న్యాయం దక్కిందని మెస్ట్రే అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అరికొంబన్: ఈ కిల్లర్ ఎలిఫెంట్ చేసిన పనికి తీసుకెళ్లి టైగర్ రిజర్వ్‌లో వదిలేశారు
- ఒసామా బిన్ లాడెన్‌ను చంపడానికి బరాక్ ఒబామా బృందం ఎలా వ్యూహం పన్నింది? 'ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకంలో వివరించిన అమెరికా మాజీ అధ్యక్షుడు
- ఆంధ్రప్రదేశ్: అమరావతి ప్రాంతంలో ఆర్-5 జోన్ వివాదం ఏంటి, పేదలకు ఇళ్ల స్థలాలపై అభ్యంతరాలు ఎందుకు?
- జైశంకర్: భారత్ తరఫున బలమైన గొంతుకా, లేక దూకుడుతో వచ్చిన పాపులారిటీనా?
- దేవుని దగ్గరకు తీసుకెళ్తామంటూ వందల మంది ప్రాణాలు తీసిన ముగ్గురి కథ
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














