సత్యపాల్ మలిక్: ‘అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికలకు ముందే అరెస్ట్ అవుతారు’

- రచయిత, సర్వప్రియ సాంగ్వాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘అసదుద్దీన్ ఓవైసీకి తెలియదు. ఆ సమయంలో నేను పుల్వామా దాడి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్ద ప్రస్తావించాను. మన వాళ్ల తప్పు వల్లే ఇది జరిగిందన్నాను. దీనిపై విచారణ చేయాలని నేను కోరాను. విచారణ చేస్తారని అనుకున్నాను. అందుకే ఆ సమయంలో నేను రాజీనామా చేయలేదు’’ అని బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మలిక్ చెప్పారు.
పుల్వామా దాడి బాధ్యత హోం మంత్రిత్వ శాఖదేనని ఆయన చెప్పారు.
ప్రతీది వారి ముందు ఉంచానని, హోం మంత్రి కనీసం ఏదైనా చేసి ఉండాల్సిందని అన్నారు.
దీనికి బాధ్యులైన వారందరూ కూడా రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ థాపర్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా సత్యపాల్ మలిక్ 2019లో జరిగిన పుల్వామా దాడి ఘటనపై పలు సెన్సేషనల్ కామెంట్లు చేశారు.
2019 పుల్వామా దాడికి కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యతని సత్యపాల్ నిందించారు.
ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి.
సత్యపాల్ మలిక్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘ఆయన అదే సమయంలో గవర్నర్ పదవి నుంచి తప్పుకోవాల్సింది. అప్పుడు గవర్నర్ సీట్లో ఏం మాట్లాడకుండా కూర్చుని, నాలుగున్నర ఏళ్ల తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు’’ అని ఏఐఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
ఒక టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హోం మంత్రి అమిత్ షా కూడా ఇదే విధంగా స్పందించారు.
‘‘మాతో తెగతెంపులు చేసుకున్నాకే ఇవన్ని ఎందుకు గుర్తొస్తాయి’’ అని జర్నలిస్ట్‌లు ఆయనను అడగాల్సిందని అమిత్ షా అన్నారు.
అయితే, సత్యపాల్ మలిక్ ఒక అవకాశవాదా? ఎవరైతే సంబంధాలు తెగిపోయిన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడతారో అలాంటోళ్లా?
దీనికి స్పందిస్తూ, ‘‘పుల్వామా ఏ రోజైతే జరిగిందో, నేను తొలి రోజే దీని గురించి చెప్పాను. నువ్వు నోరుమూసుకుని ఉండాలని నాకు చెప్పారు. వాళ్లు అదే మార్గంలో వెళ్తున్నారని నాకు తరువాత తెలిసింది. అది పాకిస్తాన్ దిశగా. ఆ సమయంలో వారిని వ్యతిరేకించడం చాలా ప్రమాదకరమైన పని. ఎందుకంటే వారిని దేశద్రోహులుగా ప్రకటించేందుకు ఇది ఒక కుట్ర. రైతుల ఆందోళన సమయంలో కూడా వీరు వారిని పట్టించుకోలేదు. అప్పుడు కూడా నేనే ఈ సమస్యను లేవనెత్తాను’’ అని బీబీసీతో సత్యపాల్ మలిక్ చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
కొత్త, పాత ప్రకటనకు మధ్య తేడా?
అవినీతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా ఎలాంటి దృష్టి లేదని కరణ్ థాపర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యపాల్ మలిక్ అన్నారు.
మేఘాలయ గవర్నర్‌గా చేసేటప్పుడు, ఆయన రాజస్తాన్‌లో ఒక ప్రసంగం ఇచ్చారు. ఆ ప్రసంగంలో కశ్మీర్‌లో తాను పదవిలో ఉన్నప్పుడు జరిగిన ఒక విషయాన్ని ప్రస్తావించారు.
కశ్మీర్‌లో తన వద్దకు రెండు ఫైల్స్ వచ్చాయని ఆయన చెప్పారు. ఒక ప్రాజెక్ట్ ఆర్ఎస్ఎస్‌తో సంబంధం ఉన్నది కాగా, మరో ప్రాజెక్ట్ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీకి చెందినది.
ఈ ప్రాజెక్ట్‌లలో స్కామ్ ఉందని ఆ విభాగాల కార్యదర్శులు తనకు చెప్పారని సత్యపాల్ మలిక్ చెప్పారు. ఆ తర్వాత తాను ఈ ప్రాజెక్ట్‌లను రద్దు చేసినట్లు తెలిపారు.
ఈ విషయం గురించి తాను ప్రధానికి తెలిపినట్లు అప్పటి ప్రసంగంలో సత్యపాల్ మలిక్ చెప్పారు. ఆ సమయంలో ప్రధాన మంత్రి.. ‘అవినీతి విషయంలో అసలు రాజీపడాల్సిన పనిలేదు’ అని అన్నట్లు ప్రసంగంలో చెప్పారు.
కానీ, ప్రస్తుత ప్రకటనకు, అప్పటి ప్రసంగంలోని ప్రకటనకు మధ్య వైరుధ్యం ఉంది కదా?
ఈ ప్రశ్నపై సత్యపాల్ మలిక్ స్పందించారు.
‘‘అవును, ఆయనకి అవినీతి గురించి పట్టింపు లేదు. అవినీతి గురించి ఫిర్యాదు చేసిన తర్వాతనే నన్ను గోవా నుంచి తొలగించారు. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారిపై చర్యలు తీసుకోకుండా, నన్ను బదిలీ చేశారు. కశ్మీర్‌లో ప్రాజెక్ట్‌లను రద్దు చేసిన తర్వాతనే నేనెళ్లి ఆయన్ను కలిశాను. నేను ప్రాజెక్ట్‌లను రద్దు చేశాను. కావాలంటే నన్ను తొలగించండి అన్నాను. అప్పుడు లేదు, లేదు, అవినీతి విషయంలో రాజీ పడొద్దు అన్నారు’’ అని మలిక్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారు’
దేశంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు మీకు ఎవరైనా కనిపిస్తున్నారా?
ఒకరు కాదు, చాలా మందే ఉన్నారు. నీతీశ్ కుమార్ లాగా.
కానీ, నితీష్ కుమార్ బిహార్‌లో చాలా కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో మీరు బిహార్ గవర్నర్‌గా ఉన్నప్పుడు, రాష్ట్ర విద్యావ్యవస్థ భ్రష్టుపట్టిందన్నారు. కానీ నితీష్ కుమార్‌కి ఇప్పుడెలా క్లీన్ ఇమేజ్ ఇస్తున్నారు?
ఆయన నవ్వి, ‘ఇతరులతో పోలిస్తే ఆయన కాస్త మెరుగు’ అన్నారు
అరవింద్ కేజ్రీవాల్ కూడా తాను లేవనెత్తిన ప్రశ్నలను తన సమస్యగా మార్చుకుంటున్నారని అన్నారు. కానీ, అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇతరులతో పోలిస్తే మంచివాడని చెప్పారు.
ఆయన ప్రభుత్వంపై కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కదా?
దీనికి బదులిస్తూ, ‘‘100 శాతం ఎన్నికలకు ముందే వారు అరెస్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను.’’ అని అన్నారు.
అంటే, అరవింద్ కేజ్రీవాల్ నరేంద్ర మోదీకి సరైన పోటీ కాగలడా?
‘‘నరేంద్ర మోదీకి వ్యతిరేకం, పోటీ అంటూ నేనెవర్ని చెప్పడం లేదు. మోదీకి ప్రజలే వ్యతిరేకులు కావాలి. ప్రజలు వర్సెస్ మోదీ ఎన్నికలుగా ఇవి ఉండాలి’’ అని సత్యపాల్ మలిక్ అన్నారు.

ఫొటో సోర్స్, @RAHULGANDHI
విపక్షాలు ఏకం కాగలవా?
సత్యపాల్ మలిక్ రాజకీయ జీవితం చాలా పెద్దది.
చౌధరి చరణ్ సింగ్ పార్టీ భారతీయ క్రాంతి దళ్ నుంచి 1974లో ఎమ్మెల్యే టికెట్ పొందారు.
1980లో రాజ్యసభ ఎంపీ అయ్యారు. ఆ తర్వాత 1984లో కాంగ్రెస్‌లో చేరారు. 1986లో మరోసారి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు.
బోఫోర్స్ స్కామ్ వెలుగులోకి వచ్చిన తర్వాత, ఎంపీ పదవీ కాలం ముగియకముందే ఆయన కాంగ్రెస్‌ను వీడారు.
జనతా దళ్ టిక్కెట్‌పై 1989లో లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు.
ఆ తర్వాత సమాజ్‌వాద్ పార్టీలో కూడా పనిచేశారు. 2004లో బీజేపీలో చేరారు.
2012లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యారు.
2017లో బిహార్ గవర్నర్ అయ్యారు. ఆ తర్వాత, జమ్మూకశ్మీర్, గోవాల గవర్నర్‌గా పనిచేశారు. 2022 అక్టోబర్‌లో మేఘాలయ గవర్నర్ పదవి నుంచి ఆయన పదవీ విరమణ పొందారు.

ఫొటో సోర్స్, SATYAPAL.MALIK.35/FB
సత్యపాల్ మలిక్ కొత్తగా రాజకీయ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారా?
దీనికి బదులిస్తూ.. తాను ఏ పార్టీలో చేరనని, ఏ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు.
విపక్షాలను ఐక్యం చేసే బాధ్యతలు నిర్వర్తిస్తారా? ఎందుకంటే ఉత్తర ప్రదేశ్‌లో ఎస్పీ, కాంగ్రెస్‌లు ఏకం కావాలనుకుంటున్నారు. దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిపేలా ప్రయత్నిస్తున్నారు కదా.
‘‘మా అనుభవం నుంచి వారికి సలహా ఇచ్చాం. నేను వీపీ సింగ్‌తో ఉన్నప్పుడు, ఆ సమయంలో ఐక్యత అనేది సాధ్యమయ్యేది కాదు. అప్పుడు మేం ఒక ఫార్ములా ఇచ్చేవాళ్లం. ‘ వన్ వర్సెస్ వన్’. ఈ ఫార్ములా ద్వారా ఎవరు నాయకుడు, ఎవరు కాదు అనే విషయాలపై అసలు ఇబ్బందులు వచ్చేవే కావు. దీన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించే వారు. దాదాపు అన్ని పార్టీలు సమ్మతించేవి’’ అని చెప్పారు.
నరేంద్ర మోదీకి వచ్చిన పాపులారిటీకి కారణమేంటని సత్యపాల్ మలిక్ నమ్ముతారు?
‘‘పాపులారిటీ అనేది సృష్టించింది. ఆయన పాపులారిటీ హిందూ-ముస్లిం అంశం నుంచి వచ్చింది . నేనిప్పటి వరకు చూస్తున్న దాని ప్రకారం, 2024 ఎన్నికల్లో ఇది పనిచేయదు. ప్రజలకు ఈ గేమ్ అర్థమైంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వల్ల ప్రజలు బాధపడుతున్నారు. నెలలో నేను కూడా 8-10 సమావేశాలు నిర్వహిస్తా. ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘జైలుకి వెళ్లాల్సి వస్తే, వెళ్తాను’
76 ఏళ్ల సత్యపాల్ మలిక్ దిల్లీలో అద్దె ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఆయనకు సెక్యూరిటీగా ఒక గార్డును నియమించారు. ది వైర్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత, ఆయనను ప్రశ్నించేందుకు సీబీఐ ఆయన ఇంటికి వెళ్లింది.
చర్యలు తీసుకుంటారేమోనని లేదా జైలుకి వెళ్లాల్సి వస్తుందేమోనని సత్యపాల్ మలిక్‌కి భయం లేదా?
‘‘నేను అంతకుముందు చాలా సార్లు జైలుకు వెళ్లాను. నా నిబద్ధత నుంచే నాకు నమ్మకం వచ్చింది. నేను సరైన దారిలో ఉండటం వల్లే నాకు ఈ ధైర్యం. నేను సరైన ప్రశ్నలనే సంధిస్తున్నాను. ఒకవేళ దీనిపై నేను జైలుకి వెళ్లాల్సి వస్తే, వెళ్తాను’’ అని సత్యపాల్ మలిక్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- తంజావూరు పెరియా కోవిల్: వెయ్యేళ్లనాటి ఈ దేవాలయం గోపురం నీడ నేలపై పడదా?
- వినేశ్ ఫోగాట్: ‘లైంగిక వేధింపుల ఆరోపణల తరువాత నా లైఫ్ ప్రమాదంలో పడినట్లు భయమేస్తోంది’
- సచిన్ తెందూల్కర్ వారసుడు కావడం అర్జున్ తెందూల్కర్‌కు వరమా, శాపమా?
- అరికొంబన్: ఈ కిల్లర్ ఎలిఫెంట్ చేసిన పనికి తీసుకెళ్లి టైగర్ రిజర్వ్‌లో వదిలేశారు
- జైశంకర్: భారత్ తరఫున బలమైన గొంతుకా, లేక దూకుడుతో వచ్చిన పాపులారిటీనా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















