ప్రధాని మోదీ కార్యాలయం సీనియర్ అధికారినంటూ జెడ్- ప్లస్ భద్రతను వాడుకున్న వ్యక్తి అరెస్ట్

ఫొటో సోర్స్, KIRAN J PATEL/TWITTER
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అధికారినని చెప్పుకుంటూ తిరుగుతున్న కిరణ్ పటేల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
గుజరాత్‌కు చెందిన కిరణ్ పటేల్ మార్చి 2న కశ్మీర్ లోయలో పర్యటించినప్పుడు భద్రతా అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటిఐ) వార్తా సంస్థ తెలిపింది. మరుసటి రోజు ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.ఆయనపై మోసం, ఇంపర్సనేషన్, ఫోర్జరీ అభియోగాలను పోలీసులు నమోదు చేశారు.
ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనాలతో పాటు, ఇతర సదుపాయాలను వాడుకునేందుకు పటేల్ ప్రయత్నించారని పోలీసులు పేర్కొన్నారు.గురువారం పటేల్‌ను కోర్టులో హాజరుపరచగా అరెస్టు విషయం వెలుగులోకి వచ్చింది.
అంతేకాదు ఆయనకు వెరిఫైడ్ ట్విట్టర్ ఖాతా సైతం ఉంది. ఆయన ఫాలోవర్లలో బీజేపీ కూడా ఉంది. కశ్మీర్‌లో అధికారిక పర్యటన చేసినట్లు ఉన్న ఫోటోలు పటేల్ తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ పేజీల్లో పోస్టు చేశారు.
శ్రీనగర్‌లో ఆయన రెండు సార్లు అధికారులతో సమావేశం కూడా నిర్వహించారని చెబుతున్నారు.
పీటీఐ కథనం ప్రకారం, ఒక పర్యటనలో దక్షిణ కశ్మీర్‌లోని యాపిల్ తోటల కోసం కొనుగోలుదారులను గుర్తించాలని ప్రభుత్వం తనను కోరిందని పటేల్ పేర్కొన్నారు.
మరొక పర్యటనలో ఆయన ప్రముఖ స్కీయింగ్ గమ్యస్థానమైన గుల్మార్గ్‌కు వెళ్లారు. ఆ ప్రాంతంలో హోటల్ సౌకర్యాలను మెరుగుపరచాలని ప్రభుత్వం తనకు సూచించిందని చెప్పారు.
ఆ పర్యటనల్లో పటేల్‌కు అత్యున్నత స్థాయి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించారని, ఆయన బుల్లెట్‌ప్రూఫ్ కారులో ప్రయాణించారని చెబుతున్నారు. అంతేకాదు ఆయన పర్యటనల సమయంలో అధికారికంగా ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేశారని తెలుస్తోంది.
రెండోసారి ఆయన కశ్మీర్ పర్యటనకు వెళ్లినప్పుడు ఇంటలిజెన్స్ అధికారులు అలర్ట్ చేయడంతో శ్రీనగర్‌లోని హోటల్‌లో పోలీసులు పటేల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
పటేల్ వద్ద నకిలీ గుర్తింపు కార్డులను భద్రతా అధికారులు గుర్తించారని, కోర్టులో పోలీసులు సమర్పించిన నివేదికల ద్వారా వెల్లడైంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








