కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించాక నిరుద్యోగం పెరిగిందా? తగ్గిందా?

వీడియో క్యాప్షన్, కొత్త ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం ఇచ్చిన హామీ మూడేళ్లలో ఏ మేరకు నెరవేరిందా?

జమ్మూ-కశ్మీర్‌లో ఆర్టికల్ 370, 35Aలను తొలగించి మూడేళ్లు పూర్తవుతోంది.

ఆ సందర్భంగా, కొన్ని నెలల పాటు లోయలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

నిరవధిక కర్ఫ్యూ విధించారు.

కశ్మీర్‌కు సంబంధించినంత వరకు, భారత రాజకీయాల్లో దీన్నో పెద్ద మలుపుగా భావించారు.

ఆర్టికల్ 370ని తొలగించడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ప్రభుత్వం చెప్పింది.

కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.

బీబీసీ ప్రతినిధి కీర్తి దుబే అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.

27 ఏళ్ల ఆకిబ్ డార్... తమ ప్రాంతంలో మాథమెటిక్స్‌లో పీహెచ్‌డీ చేసిన ఏకైక యువకుడు. అయినప్పటికీ, ఇప్పటికీ ఆకిబ్‌కు ప్రభుత్వ ఉద్యోగం దొరకలేదు. ప్రైవేటు ఉద్యోగం కూడా దొరకలేదు.

దాంతో గత నెల రోజులుగా ఆయన తన ఊళ్లోనే ఓ ఫుడ్ ట్రక్ నడిపిస్తున్నారు. అందులో చాయ్ అమ్ముతున్నారు.

కశ్మీర్‌లో ప్రైవేట్ సెక్టార్ పూర్తిగానే లేదని చెప్పొచ్చు. కాబట్టి యువతకు ఆర్గనైజ్డ్ సెక్టార్‌లో ఉద్యోగం కావాలంటే గవర్నమెంట్ జాబ్స్ ఒక్కటే ఆధారం. 2020లో జేకే ఎస్ఎస్బీ... 8 వేల క్లాస్ ఫోర్ ఉద్యోగాలు ప్రకటించింది. వాటికి 5 లక్షల మంది అప్లై చేసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లే. అప్లికేషన్లు భారీ సంఖ్యలో రావడంతో గ్రాడ్యుయేట్లను, పోస్ట్ గ్రాడ్యుయేట్లను ఓవర్ క్వాలిఫైడ్‌గా ప్రకటిస్తూ కాంపిటిషన్‌లోంచి తొలగించారు. అంతే కాదు, డిగ్రీలున్నప్పటికీ ఉద్యోగాలు దొరక్కపోవడంతో తమ మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని కూడా చాలా మంది చెప్పారు.

2019లో జమ్మూ-కశ్మీర్‌లో నిరుద్యోగం పెరిగింది. 2017-18తో పోలిస్తే అది చాలా ఎక్కువ. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ - CMIE అనే థింక్ ట్యాంక్ ప్రతి నెలా నిరుద్యోగం డేటా విడుదల చేస్తుంది. బీబీసీ ఈ డేటా సగటును తీసుకొని, పెరుగుతున్న నిరుద్యోగం రేటును అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది.

దాని ప్రకారం 2017 సంవత్సరంలో నిరుద్యోగం 14.8 శాతంగా నమోదు కాగా... 2018లో అది 12.7 శాతంగా ఉండింది. 2019లో 20.6 శాతానికి పెరిగింది. 2020లో 16.9 శాతం, 2021లో కూడా 16.9 శాతంగా నమోదైంది.

CMIE డేటా ప్రకారం ఈ ఏడాది జులైలో నిరుద్యోగంలో జమ్మూ-కశ్మీర్ రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ నిరుద్యోగం రేటు 20 శాతం దాటిపోయింది. ఇది జాతీయ సగటుకన్నా దాదాపు మూడు రెట్లు ఎక్కువ.

ప్రభుత్వ గణాంకాల శాఖ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే విడుదల చేస్తూ ఉంటుంది. దాని తాజా డేటా ప్రకారం, 2022 జనవరి-మార్చి మధ్య జమ్మూ-కశ్మీర్‌లో 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసు యువతలో 35.8 శాతం నిరుద్యోగులే.

2022 వరకు 25 వేల మందికి ఉపాధి కల్పిస్తామని 2021లో హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ ఏడాది జూన్‌లో పార్లమెంటులో ఒక ప్రశ్నకు జవాబిస్తూ, లోయలో 2019 నుంచి ఇప్పటి వరకు దాదాపు 30 వేల మందికి ఉపాధి కల్పించామని హోంశాఖ తెలిపింది.

చాలా కాలంగా ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఎగ్జామ్ రద్దు కావడం కూడా చాలా పెద్ద సమస్యగా మారింది. ఇటీవల రాష్ట్రంలో సబ్-ఇన్‌స్పెక్టర్ పరీక్షలు జరిగాయి. కానీ ఫలితాలు వెలువడ్డ తర్వాత, అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో దాన్ని రద్దు చేశారు.

అనేక ఏళ్ల పాటు శ్రమించి ఎలాగోలా ఫైనాన్స్ అకౌంట్ అసిస్టెంట్ పరీక్ష పాస్ అయ్యారు బిస్మా. కానీ ఇప్పుడు అవకతవకలు జరిగాయనే ఆరోపణల మధ్య సెలక్షన్ ప్రక్రియపై దర్యాప్తు మొదలైంది.

నిరుద్యోగం ఊబిలో చిక్కుకున్నది ఒక్క యువత మాత్రమే కాదు. చాలా మంది వ్యాపారులు కూడా ఇప్పుడు దివాలా అంచుల్లో ఉన్నారు. కొన్నేళ్ల కిందటి వరకూ వాళ్ల వ్యాపారం చాలా బాగా నడుస్తూ ఉండేది. అలాంటి వారిలో ఒకరు ఇనాయత్ అలీ. 2013లో ఆయన ఉద్యోగం వదిలేసి వ్యాపారం మొదలుపెట్టారు. ఒక సిమెంట్ ఫ్యాక్టరీని తెరచి 15 మందికి ఉపాధి కల్పించారు. కానీ 2019 తర్వాత ఆయన బిజినెస్ క్రమంగా దెబ్బతింటూ వచ్చింది. బ్యాంకు రుణాల ఈఎంఐలు చెల్లించేందుకు ఆయన ఇంట్లో ఉన్న నగలన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది.

అయితే, ఈ ఏడాది కశ్మీర్ ఆర్థికవ్యవస్థకు టూరిజం కాస్త ఊరటనిచ్చింది. ఈసారి కశ్మీర్‌లో పర్యటక రంగం గడచిన అనేక సంవత్సరాల రికార్డును బ్రేక్ చేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఈ ఏడాది జులై వరకు కోటి మందికి పైగా టూరిస్టులు కశ్మీర్ వచ్చారు.

టూరిజం అసంఘటిత రంగం కిందకు వచ్చినప్పటికీ, దీని ద్వారా పెద్ద సంఖ్యలో జనాలకు ఉపాధి దొరికింది. టూరిస్టులు బాగా రావడంతో చాలా మందికి మళ్లీ ఈ రంగంలో ఉద్యోగం దొరికింది.

ఉపాధికి సంబంధించినంత వరకు జమ్మూ పరిస్థితి కూడా కశ్మీర్‌కు భిన్నంగా ఏమీ లేదు.

గత కొంత కాలంగా కశ్మీర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ప్రపోజల్స్‌కు సంబంధించిన వార్తలు వినబడుతున్నాయి. గల్ఫ్ దేశాల నుంచి ఒక డెలిగేషన్ కశ్మీర్‌లో పర్యటించింది. పెట్టుబడులు పెడతామనే హామీని కూడా ఇచ్చింది. కానీ ఇప్పటికీ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ఇన్వెస్ట్‌మెంట్ ఏదీ జరగలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)