ఐశ్వర్య తాటికొండ: టెక్సస్ కాల్పుల్లో చనిపోయిన హైదరాబాదీ, ఆమె ఫ్రెండ్‌కూ బుల్లెట్ గాయాలు

ఐశ్వర్య తాటికొండ

ఫొటో సోర్స్, FAMILY PHOTO VIA NAMASTEANDHRA.COM

ఫొటో క్యాప్షన్, అలెన్‌లోని మాల్‌లో జరిగిన కాల్పుల్లో మరణించిన ఐశ్వర్య తాటికొండ
    • రచయిత, బెర్నాడ్ డేబుస్మాన్ జూనియర్
    • హోదా, బీబీసీ న్యూస్, వాషింగ్టన్

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ సమీపంలోని ఒక షాపింగ్ మాల్‌లో శనివారం జరిగిన కాల్పులు ఘటనలో తెలుగమ్మాయి, హైదరాబాద్‌కు చెందిన ఐశ్వర్య తాటికొండ చనిపోయారు.

ఈ కాల్పుల ఘటనలో 8 మంది చనిపోయారు. ఇందులో పిల్లలు కూడా ఉన్నారు. మరో ఏడుగురు గాయాల పాలయ్యారు.

అక్కడే ఉన్న ఒక పోలీసు అధికారి వెంటనే స్పందించి కాల్పులు జరిపిన 33 ఏళ్ల వ్యక్తిని కాల్చి వేశారు.

రైట్ వింగ్ భావజాలానికి ప్రేరేపితుడై నిందితుడు ఈ ఘటనకు తెగబడ్డడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఐశ్వర్య

ఫొటో సోర్స్, Aishwarya Linkedin Profile

సరూర్‌నగర్ అమ్మాయి

ఈ ఘటనలో మరణించిన వారిలో ఒకరు 20 ఏళ్ల క్రిస్టియాన్ లాకోర్ కాగా, మరొకరు హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల ఐశ్వర్య తాటికొండగా గుర్తించారు.

డల్లాస్ శివారులోని మెక్‌కిన్నీలో నివసించే భారత సంతతి ఇంజనీర్ ఐశ్వర్య తాటికొండ, మాల్‌లో జరిగిన కాల్పుల ఘటనలో చనిపోయినట్లు స్థానిక వార్తా సంస్థ డబ్ల్యూఎఫ్‌ఏఏ ధ్రువీకరించింది.

ఐశ్వర్య, హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందినవారు.

ఆమె పైచదువుల నిమిత్తం అమెరికాకు వెళ్లిపోగా, ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు.

కాల్పులు జరిగిన సమయంలో అలెన్ మాల్‌లో ఐశ్వర్యతో పాటు ఆమె ఫ్రెండ్ కూడా ఉన్నారని, కాల్పుల్లో ఆమె ఫ్రెండ్‌ గాయపడినట్లు ఆమె కుటుంబ సభ్యుల తరఫున ఒక ప్రతినిధి చెప్పారు.

ఐశ్వర్య మృతదేహాన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.

ఐశ్వర్య లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం, ఆమె 2018లో భారత్‌లో సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందారు.

తర్వాత అమెరికాలోని ఈస్ట్రర్న్ మిషిగాన్ యూనివర్సిటీలో కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.

గత రెండేళ్లుగా డల్లాస్‌కు చెందిన ఒక సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

వీడియో క్యాప్షన్, టెక్సాస్ షూటింగ్: కాల్పులు శబ్ధం విని భయంతో పరుగులు పెడుతున్న ప్రజలు

‘‘భయాందోళన చెందాం’’

అలెన్ ప్రీమియం అవుట్‌లెట్స్ వద్ద జరిగిన కాల్పుల ఘటనతో భయాందోళన చెందినట్లు ఒక ప్రకటనలో అలెన్ మాల్ యాజమాన్యం పేర్కొన్నట్లు న్యూయార్క్ పోస్ట్‌ను ఉటంకింస్తూ వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

‘‘ఈ హేయమైన చర్య బారిన పడిన బాధితులు, వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం. కాల్పులు మొదలుకాగానే ధైర్యసాహసాలు ప్రదర్శించి నిందితుడిన కాల్చేసిన పోలీసు అధికారితో పాటు, వెంటనే స్పందించిన మిగతా వారందరికీ మేం కృతజ్ఞులం’’ అని అలెన్ మాల్ ప్రకటనలో పేర్కొంది.

అలెన్ పోలీసులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కాల్పుల ఘటన జరిగిన మాల్ వద్ద ఆదివారం కూడా అలెన్ పోలీసులు పహారా కాశారు

‘‘ఒంటరిగా వచ్చి కాల్పులు’’

అలెన్ మాల్‌లో కాల్పులకు తెగబడిన వ్యక్తి ఒంటరిగానే వచ్చాడని అలెన్ చీఫ్ ఆఫ్ పోలీస్ బ్రియాన్ ఈ హార్వీ చెప్పారు.

శనివారం రాత్రి విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘‘మాల్ వద్ద వేరే విధుల్లో ఉన్న ఒక పోలీసు అధికారికి కాల్పులు శబ్ధాలు వినిపించాయి. వెంటనే ఆయన మాల్‌లోకి వెళ్లారు. షూటర్‌ను కాల్చేశారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది’’ అని చెప్పారు.

టెక్సాస్ కాల్పులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అలెన్ మాల్ వద్ద ప్రజల నివాళులు

సోషల్ మీడియాలో వీడియోలు

కాల్పులకు తెగబడిన వ్యక్తి నేలపై పడి ఉన్న వీడియోను సోషల్ మీడియాలో యూజర్లు షేర్ చేశారు. ఆ వీడియోలో నిందితులు నల్ల రంగు దుస్తులు వేసుకొని కనిపిస్తున్నారు. ఆయన చేతిలో పెద్ద రైఫిల్ ఉన్నట్లు వీడియోలో కనబడుతోంది.

వందలాది మంది కస్టమర్లు భయంతో మాల్ బయటకు పరుగులు తీస్తున్నట్లు, మాల్ బయట ముగ్గురి మృతదేహాలు షీట్లలో చుట్టి కనబడినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

టెక్సాస్‌ జనాభాలో 0.9 శాతం భారతీయులే

యూఎస్ సెన్సస్ బ్యూరో ప్రకారం, 2020 నాటికి అమెరికాలో అత్యధిక భారత-అమెరికన్ జనాభా కలిగిన ప్రాంతాల్లో టెక్సాస్ రెండో స్థానంలో ఉంది. 2010లో టెక్సాస్‌లో 2,30,842 మంది భారత అమెరికర్లు ఉండేవారు. అంటే అక్కడి జనాభాలో ఇది 0.9 శాతం.

అమెరికాకు వచ్చిన భారతీయ విద్యార్థుల్లో సగం మంది న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్, ఇల్లినాయిస్, మసాచుసెట్స్, అరిజోనాల్లో ఉంటారని ఓపెన్ డోర్స్ సంస్థ డేటా తెలుపుతుంది.

2021 నాటికి టెక్సాస్‌లోని భారతీయ విద్యార్థుల సంఖ్య 19,382గా ఉంది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)