టెక్నాలజీ మ్యారేజేస్: భాగస్వామి హృదయ స్పందనను తెలిపే ఉంగరాలు, లాకెట్‌ల కథ ఏంటి?

పెళ్లి

ఫొటో సోర్స్, JIRI VEDRAL

ఫొటో క్యాప్షన్, యిరీ, ఒంద్రేల స్మార్ట్ ఉంగరాలు. ఒకరి హృదయ స్పందనను మరొకరు తెలుసుకోవటానికి ఇవి ఉపయోగపడతాయి.
    • రచయిత, అన్నే కాసిడీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చెకోస్లోవేకియాకి చెందిన యిరీ, ఒంద్రే వెద్రా తమ పెళ్లిరోజు నాడు సంప్రదాయ బంగారు బ్యాండ్లు కాకుండా స్మార్ట్ ఉంగరాలు మార్చుకున్నారు.

స్మార్ట్ ఉంగరాలు స్మార్ట్ చేతి గడియారాల్లాగా పని చేసే ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్. ఇవి వీటిని ధరించిన వారి గుండె కొట్టుకునే రేటుని వారికి చూపిస్తాయి. వీటితో మనం డబ్బును ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించవచ్చు కూడా.

ఈ తరహా ఎలక్ట్రానిక్ రంగం వేగంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వీటి అమ్మకాలు సంవత్సరానికి 21 శాతం పెరుగుతున్నాయి.

అయితే మార్కెట్ లో ఉన్న స్మార్ట్ రింగ్స్ అన్నిటికంటే యిరీ, ఒంద్రేలు మార్చుకున్న స్మార్ట్ ఉంగరాలు అత్యంత రొమాంటిక్ ఉంగరాలు. ఈ ఉంగరాలలో ఒకరి హృదయ స్పందనని మరొకరు వినే సౌలభ్యం ఉంది.

ప్రతి ఉంగరం కూడా బ్లూటూత్ ద్వారా ఆ ఉంగరం ధరించిన వారి స్మార్ట్ వాచ్‌లో ఉన్న ఒక యాప్ కి అనుసంధానించి ఉంటుంది. ఈ యాప్ ద్వారా ఇద్దరి ఉంగరాలు ఒకదానికి ఒకటి అనుసంధానించవచ్చు.

ఈ విధంగా యిరీ తన పెళ్లి ఉంగరాన్ని నొక్కినప్పుడు అది ఒంద్రే హృదయ స్పందనని గుర్తించి, ఆ పల్స్ ని ఒక కదులుతున్న ఎర్రని వరుసలో (లైన్) చూపిస్తుంది. ఇదే విధంగా ఒంద్రేకి కూడా యిరీ హృదయ స్పందనని తెలియచేస్తుంది.

వారిరువురి ఫోన్లు ఇంటర్నెట్ తో కనెక్ట్ అయి ఉన్నంతసేపు కూడా ఇలా ఒకరి హృదయ స్పందన ఇంకొకరికి ఎప్పటికప్పుడు తెలుస్తుంది. ఒకవేళ ఆఫ్‌లైన్‌లో ఉంటే, చివరిగా రికార్డయిన స్పందన చూపిస్తుంది.

“మాకెప్పుడూ బంగారం, వజ్రాల మీద ఆసక్తి లేదు” అని యిరీ అంటున్నారు.

“మేం మా పెళ్లికి ఏదైనా ప్రత్యేకంగా ఉండాలనుకున్నాం. ఈ ఉంగరాల ఆలోచన ఏదో కొత్తగా ఉందే అని మాకు అనిపించింది. అలాగే నచ్చింది కూడా. ఈ విషయంలో మేం కొత్త మార్గాన్ని నిర్మించామని అనుకుంటున్నాం” అని అన్నారు.

పెళ్లి

ఫొటో సోర్స్, JIRI VEDRA

ఫొటో క్యాప్షన్, ఒంద్రే, యిరీ వెద్రా పెళ్లి సాంప్రదాయ పద్దతిలోనే జరిగింది. అయితే ఈ పెళ్లిలో మామూలు ఉంగరాలకి బదులు వీరిద్దరూ స్మార్ట్ ఉంగరాలు మార్చుకున్నారు.

స్మార్ట్ రింగ్.. టచ్ లాకెట్

రీఛార్జ్ చేసుకునే సౌకర్యం ఉన్న ఈ ఉంగరం పేరు హెచ్.బి.రింగ్. చెకోస్లోవేకియాకి చెందిన ది టచ్ అనే సంస్థ తయారు చేసింది. 2016లోనే ఈ ఉంగరాన్ని లిమిటెడ్ సేల్ రూపంలో మార్కెట్లో తొలిసారిగా ప్రవేశపెట్టారు. స్మార్ట్ ఉంగరాల రంగంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆసక్తి కారణంగా ఈ స్మార్ట్ ఉంగరాల అమ్మకం బాగా పెరిగింది.

దీనితో పాటు ఇదే సంవత్సరం ఇంకొక ప్రోడక్ట్‌ని కూడా ప్రవేశపెట్టారు. దాని పేరు ది టచ్ లాకెట్. నెక్లెస్ మీద వేసుకునే ఈ లాకెట్ కూడా స్మార్ట్ ఉంగరానికి ఉన్న టెక్నాలజీ ఆధారంగానే పనిచేస్తుంది.

తమవారి హృదయ స్పందనని ఆస్వాదించాలి, అదే సమయంలో సంప్రదాయ ఉంగరాల మార్పిడిని కొనసాగించాలి అనుకునేవారు ఈ సంస్థ ప్రోడక్ట్స్‌ను వాడుతుంటారు.

ఈ మధ్య కాలంలో తమ పెళ్లిళ్లలో టెక్నాలజీ వాడుతున్న జంటలలో యిరీ, ఒంద్రే ల జంట ఒకటి. ఫొటోలు తీయడానికి డ్రోన్ల వాడకం దగ్గర నుంచి బడ్జెట్ మేనేజ్ చేయడం, అతిథుల సీటింగ్ ఏర్పాటు చేయడం లాంటి వివిధ పెళ్లి పనులకు ఉపయోగపడే అనేక డిజిటల్ టెక్నాలజీలు ఇపుడు అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా పెళ్లి అనే కార్యక్రమంలో టెక్నాలజీ పాత్ర బాగా పెరిగింది.

ఈ రోజులలో మనుషులు తమ జీవితంలోని అనేక పనులను స్మార్ట్ ఫోన్ల ద్వారా చేసుకోవడం కారణంగా ఈ పెళ్లి టెక్నాలజీ పాత్ర బాగా పెరుగుతున్నది అని జో బర్క్ తెలిపారు. యుకేకి చెందిన పెళ్లిళ్ల నిర్వహణ వెబ్‌సైట్‌ ప్రధాన సంపాదకులు జో.

“తమ పెళ్లి కార్యక్రమం మొత్తాన్ని స్మార్ట్ ఫోన్ ద్వారా మేనేజ్‌ చేయవచ్చని ఈ రోజులలో చాలామంది భావిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మీ పార్ట్‌నర్‌ను మీరు బహుశా ఫోన్ ద్వారానే కలవొచ్చు కూడా” అని జో అన్నారు.

యూకేలో మూడో వంతు జంటలు నేడు తమ పెళ్లి అతిథులని వాట్సాప్ ద్వారా ఆహ్వానిస్తున్నాయి. ఆలాగే తమ ఎంగేజ్మెంట్ ని 60 శాతం మంది సామాజిక మాధ్యమాల ద్వారా తెలియచేస్తున్నారు.

ఏఐ

ఫొటో సోర్స్, Getty Images

దూసుకొచ్చిన ఏఐ

కొంతమంది అయితే తమ పెళ్లినాటి ప్రతిజ్ఞలని, పెళ్లి రోజు ఉపన్యాసాలని రాయటానికి కృత్రిమ మేధ టెక్నాలజీని వాడుతున్నారు. అమెరికాకి చెందిన జాయ్ అనే పెళ్లిళ్ల నిర్వహణ వెబ్‌సైట్‌ వారు ఇవన్నీ చేయటానికి ఒక కృత్రిమ మేధ యాప్ ని కూడా తయారుచేశారు.

దీని పేరు “వెడ్డింగ్ రైటర్స్ బ్లాక్ అసిస్టెంట్”. ఇది చాట్ జీపీటీ ఆధారంగా పనిచేస్తుంది. ఈ చాట్ జీపీటీ అనే కృత్రిమ మేధా టెక్నాలజీని అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకి చెందిన ‘ఓపెన్ ఏఐ’ అనే టెక్నాలజీ సంస్థ అభివృద్ధి చేసింది.

పెళ్లినాట బాసలు చేయటంలో, పెళ్లి రోజు ఉపన్యాసాలు ఇవ్వటంలో ఉన్న రొమాన్స్ ని తొలగించడం తమ కృత్రిమ మేధ యాప్ ఉద్దేశం కాదని, తమ ఆలోచనలని, భావాలని పదాలలో పెట్టడంలో ఇబ్బంది పడేవారి జీవితాలని కాస్త సులభతరం చెయ్యటం తమ ఈ యాప్ ఉద్దేశమని విశాల్ జోషీ తెలిపారు. ఈయన జాయ్ సంస్థ సహ-వ్యవస్థాపకులు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి.

“మేమొక సర్వే చేశాం. ఆ సర్వేలో పాల్గొన్నవారిలో 89 శాతం మంది తమ పెళ్లినాటి ప్రతిజ్ఞలు, ఉపన్యాసాలు రాయటం మొదలుపెట్టడమే తమకి చాలా కష్టమైన పనని తెలిపారు” అని విశాల్ జోషీ తెలిపారు.

“ఈ కృత్రిమ మేధ యాప్ మనుషుల భావోద్వేగాలకి ప్రత్యామ్నాయం కాదు. అయితే ఇది చాలా మందికి సహాయకారిగా ఉంటున్నది,” అని చెప్పారు.

కరోనా మహమ్మారి టెక్నాలజీ ఆధారిత పెళ్లిళ్ల సంఖ్య పెరగటానికి కారణం అయ్యింది. పెళ్లి చేసుకుందాం అనుకున్న జంటలు తమ పెళ్లి వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేకుండా జూమ్ ద్వారా చేసుకోవడం, దాన్ని అతిథులకు ప్రత్యక్ష ప్రసారం చేయించారు.

కరోనా కాలంలో ప్రభుత్వాలు విధించిన పరిమితుల కారణంగా వర్చువల్ పెళ్లిళ్లు బాగా జరిగాయి అని జో బర్క్ తెలిపారు. “అయితే ప్రజలు లైవ్ స్ట్రీమ్ పెళ్లిళ్లు వద్దనుకుంటున్నారు. వారికి ఇదేదో కరోనా కాలంలో జరుగుతున్న పెళ్లి అని అనిపించటం ఇష్టం లేదు” అని జో తెలిపారు.

జంట

ఫొటో సోర్స్, Getty Images

'పెళ్లి ఖర్చు తగ్గుతోందిగా..'

రోజురోజుకీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఇబ్బంది పడుతున్న జంటలకి ఈ టెక్నాలజీ వాడకం పెళ్లి ఖర్చులని తగ్గిస్తోంది. ఉదాహరణకి శుభలేఖలు పోస్ట్ చెయ్యటం కన్నా ఈ-శుభలేఖలు వాట్సాప్ లాంటి వాటి ద్వారా పంపించటం. ఇది పర్యావరణానికి కూడా మంచిదే.

“ఇది పెళ్లి ఖర్చు తగ్గించటం, అలాగే పర్యావరణ సృహకి సంబంధించిన విషయం. క్రమేణా పర్యావరణం గురించి ఆలోచిస్తున్న జంటల సంఖ్య పెరుగుతున్నది” అని లండన్ కి చెందిన పెళ్లిళ్ల నిర్వాహకులు రోహిత్ పాబ్లా తెలిపారు.

తమ పెళ్లి రోజు తమ సామాజిక మాధ్యమాలని తమ పెళ్లితో నింపేయడం కూడా ఈ రోజు సాధారణమైపోయింది. చాలా మంది జంటలు తమ పెళ్లి రోజు, తరువాత జరిగే రిసెప్షన్ నాటి వీడియోలని తమ టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో పోస్ట్ చేస్తున్నారు.

వీటిల్లో ఈ మధ్య పెరుగుతున్న ట్రెండ్ ఏమిటంటే రిసెప్షన్ నాడు “జిఫ్ (జిఐఎఫ్) బూత్” లని అద్దెకు తీసుకోవడం. ఈ జిఫ్ బూత్ లు రిసెప్షన్ నాడు ఆ రిసెప్షన్ ఫొటోలు తీసి, వాటినుంది జిఫ్ లు చేస్తారు. ఆ తరువాత ఆ జంట తమ ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే ఈ జిఫ్ లు తమ ఫోన్లకి వచ్చేస్తాయి.

సంప్రదాయాలనూ మరవడం లేదు..

“కొన్ని జంటలు అయితే తమ పెళ్లి, రిసెప్షన్ ఫొటోలను సామాజిక మాధ్యమలలో అనేక మంది షేర్ చేయాలి అని కోరుకుంటాయి. ఒకరకంగా చెప్పాలంటే వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్ జంట కావాలన్నది వాళ్ళ కోరిక,” అని రోహిత్ పాబ్లా తెలిపారు.

అయితే ఈ జంటలకి అంతగా టెక్నాలజీతో పరిచయం లేని అతిధులని, అలాగే పెళ్లి సంప్రదాయబద్ధంగా జరగాలి అని కోరుకునే అతిధుల మనోభావాలని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

తాను పని చేసిన అనేక జంటలు ఇదే కారణంగా తమ పెళ్లిలో టెక్నాలజీతో పాటు సంప్రదాయ తంతులని పాటించే ప్రక్రియ తప్పక ఉండేటట్టు చూసుకుంటారు అని దక్షిణాసియాలో పెళ్లిళ్ల నిర్వహణలో నిపుణులు అయిన మిసెస్ పాబ్లా తెలిపారు.

ఉదాహరణకి సంప్రదాయ భారతదేశ పెళ్లిళ్లలో కుటుంబసభ్యులకి, వయసులో పెద్దవారైన అతిథులకి ప్రత్యక్షంగా వెళ్ళి శుభలేఖ అందించడం ఆనవాయితీ.

“అందుకే ఈ జంటలు కొన్ని శుభలేఖలు అచ్చేయించి వాటిని తల్లిదండ్రులకు, తాత అమ్మమ్మ/నాయనమ్మలకు అందజేస్తారు,” అని మిసెస్ పాబ్లా తెలిపారు.

“తమ వయస్కులైన తమ మిత్రులకేమో డిజిటల్ శుభలేఖ పంపుతారు.”

పెళ్లి టెక్నాలజీతో ప్రతి పనిని “మరింత సులభంగా, మరింత ఆసక్తికరంగా” చెయ్యవచ్చు అని విశాల్ జోషీ తెలిపారు. అదే సమయంలో “పెళ్లి ద్వారా కుటుంబాన్ని, స్నేహితులని ఒకచోటకి ఆత్మీయంగా చేర్చడం అనే ఆకర్షణ, రొమాన్స్” లని కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)