పాకిస్తాన్: ఉచిత ఆహారం కోసం క్యూ కడుతున్న ప్రజలు... రాజకీయ కలహాలే ఆ దేశాన్ని చిందరవందర చేస్తున్నాయా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, కరోలీన్ డేవిస్,
- హోదా, బీబీసీ న్యూస్, ఇస్లామాబాద్
పాకిస్తాన్ ఆర్థికవ్యవస్థ సంక్షోభంలో ఉంది. పోయిన ఏడాది వరదల వల్ల కలిగిన నష్టం నుంచి పూర్తిగా కోలుకోలేదు.
ప్రజలు రకరకాల రాజకీయ సమూహాలుగా చీలి పోయి ఉన్నారు. తీవ్రవాదుల దాడులు పెరిగిపోతున్నాయి. ధరలు అమాంతం పెరిగిపోయాయి. మూడు పూటలా తినడమే చాలా మందికి కష్టమై పోతోంది.
ఒకవైపు ఆర్థికసమస్యలతో ప్రజలు బాధపడుతుంటే మరొకవైపు అధికారం కోసం రాజకీయ పార్టీలు ఘర్షణలకు దిగడం మొదలుపెట్టాయి.
‘‘పాకిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితులు మరొక తీవ్రమైన సంక్షోభానికి దారితీస్తాయి. ఇప్పుడున్న రాజకీయ సంక్షోభం తాత్కాలికమేనని, ఆ తరువాత మళ్లీ తాము గాడిలో పడతామని చెప్పుకునే అవకాశం కూడా ఇక పాకిస్తాన్‌కు లేదు’’ అని విల్సన్ సెంటర్‌కు చెందిన సౌత్ ఏసియా ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ మైఖేల్ కుగల్‌మన్ అన్నారు.
పాకిస్తాన్ విదేశీ మారకపు నిల్వలు చాలా కనిష్టానికి పడిపోయాయి. 1.1 బిలియన్ డాలర్ల కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్)తో జరిగిన చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు చేపడుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ తీరు వల్ల రాజకీయ సంక్షోభం తలెత్తిందని బీబీసీతో మాట్లాడిన విశ్లేషకులు అంటున్నారు.
పోలీసులు, భద్రతాదళాలను లక్ష్యంగా మిలిటెంట్లు దాడులు చేస్తున్నారు. 2023లో ఇప్పటి వరకు 436 తీవ్రవాద దాడులు జరిగినట్లు పాకిస్తాన్ తెలిపింది. తాము ఎంత మందిని చంపాం, ఎన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం అనే సమాచారాన్ని మిలిటెంట్ గ్రూపులు తరచూ విడుదల చేస్తూ ఉన్నాయి.
‘‘పాకిస్తాన్‌లో రాజకీయ అనిశ్చితి వల్ల వ్యవస్థలు కూలిపోతున్నాయి. ఇలా జరిగితే రాజకీయపార్టీలకు కానీ ప్రజలకు కానీ మంచిది కాదు’’ అని రాజకీయ విశ్లేషకురాలు మెహ్మల్ సర్ఫరాజ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయ సంక్షోభం దేనికి?
2022 ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధానమంత్రి పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్‌ను తొలగించడంతో రాజకీయ సంక్షోభం మొదలైందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆ తరువాత ఇమ్రాన్ ఖాన్ వరుసగా ర్యాలీలు చేపట్టారు. లాంగ్ మార్చ్ పేరుతో వీధుల్లో తన బలాన్ని చూపించేందుకు ప్రయత్నించారు. కోర్టుల్లో ఆయన మీద కేసుల సంఖ్య పెరుగుతోంది.
టెర్రరిజం, అవినీతి, కోర్టు ధిక్కరణ వంటి 100కు పైగా కేసులు ఇమ్రాన్ ఖాన్ మీద ఉన్నట్లు ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) చెబుతోంది. అయితే ఈ కేసులన్నీ ప్రభుత్వ ‘అరాచకానికి’ నిదర్శనమని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు.
కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి సైతం వెళ్లారు. ప్రభుత్వం మీద ఇమ్రాన్ ఖాన్ కేసులు వేశారు.
పీటీఐ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీని రద్దు చేశారు ఇమ్రాన్ ఖాన్. తద్వారా దేశవ్యాప్తంగా ఎన్నికలు వచ్చేలా ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించారు. కానీ అలా జరగలేదు. దాంతో ఇమ్రాన్ ఖాన్ సుప్రీం కోర్టుకు వెళ్లారు.
ఈ పరిణామాలతో న్యాయవ్యవస్త కూడా చీలి పోయింది. కొందరు న్యాయమూర్తులు ఇమ్రాన్ ఖాన్‌కు అనుకూలంగా పని చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపించింది. ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య ఈ అంతరం రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందనే భయాలను రేకిత్తించింది.
‘‘ప్రభుత్వంతో సర్దుబాటు చేసుకునేందుకు నిజాయితీగా ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నించడం లేదు. ప్రభుత్వాన్ని కుదురుగా ఉంచాలని ఆయన అనుకోవడం లేదు. ఇమ్రాన్ ఖాన్ వ్యవహరిస్తున్న తీరు భవిష్యత్తులో ఆయనకే చేటు చేయొచ్చు’’ అని పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెజిస్లేటివ్ డెవలప్మెంట్ అంట్ ట్రాన్స్‌పరెన్సీ అధ్యక్షుడు అహ్మద్ బిలాల్ అన్నారు.
ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య సంప్రదింపులు జరిపి రాజీ కుదిర్చే వర్గాలే లేకుండా పోయాయని సర్ఫరాజ్ వంటి వారు భావిస్తున్నారు.
పాకిస్తాన్‌లో సైన్యం కనుసన్నలలో ప్రభుత్వాలు నడుస్తాయనే పేరు ఉంది. గతంలో ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర కూడా వాటికి ఉంది. తెరవెనుక సైన్యం రాజకీయాలు చేస్తూ ఉంటుంది. 2018లో సైన్యం మద్దతుతోనే ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా గెలిచినట్లు చాలా మంది భావిస్తున్నారు. అయితే ప్రతిపక్షంలోకి వచ్చాక సైన్యం మీద ఇమ్రాన్ ఖాన్ విమర్శలు పెంచారు.
అందువల్ల సైన్యం ఆయన విషయంలో సంతోషంగా ఉన్నట్లు కనిపించడం లేదు.
‘‘ఇమ్రాన్ ఖాన్ రాజకీయాల్లో ఉండాలని సైన్యంలోని టాప్ లీడర్లు కోరుకోవడం లేదు. కానీ దిగువ, మధ్య స్థాయిలో ఉండే వాళ్లు ఇంకా ఇమ్రాన్ ఖాన్‌కు అనుకూలంగా ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ వల్ల ప్రజలు చీలి పోయారు, సైన్యం కూడా చీలి పోయింది’’ అని మైఖేల్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
తరువాత ఏంటి?
ఈ ఏడాది పాకిస్తాన్‌లో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉంది. నిధుల కొరత, భద్రతా కారణాలను చూపుతూ వాటిని వాయిదా వేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ కారణాలతో అనేక ప్రావిన్సుల ఎన్నికలను వాయిదా వేశారు.
‘‘అలా జరగడం చాలా దురదృష్టకరం. పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థను అది కోలుకోలేని విధంగా దెబ్బతీయొచ్చు’’ అని అహ్మద్ బిలాల్ అన్నారు.
ఎన్నికల మీద ప్రభుత్వం, పీటీఐ మధ్య చర్చలు నడిచాయి. ప్రావిన్సులు, కేంద్రంలో ఒకేసారి ఎన్నికలు జరపాలని రెండు వర్గాలు నిర్ణయించాయి. కానీ ఎప్పుడూ అనే దాని మీద మాత్రం ఏకాభిప్రాయం లేదు.
తేదీల మీద ఏకాభిప్రాయం కుదిరినా చేయాల్సింది చాలా ఉందని సర్ఫరాజ్ అన్నారు.
‘‘రాజకీయ పార్టీలు తమ హద్దులను తెలుసుకుని వాటిని దాటకుండా ఉంటేనే సంక్షోభాలు ఏర్పడకుండా ఉంటాయి. ఎన్నికలను పారదర్శకంగా జరపడంలో రాజకీయ పార్టీలు కలిసికట్టుగా ఉండాలి. లేదంటే ఫలితాల విషయంలో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. అది దేశాన్ని మరింత విభజిస్తుంది.
రాజకీయ నాయకులు ప్రత్యర్థులే కానీ వ్యక్తిగతంగా ఒకరికొకరు శత్రువులు కారు. కాబట్టి వ్యవస్థ కుప్పకూలి పోకముందే దేశాన్ని ముందుకు నడిపించడం కోసం చర్చలు ప్రారంభించాలి’’ అని సర్ఫరాజ్ సూచించారు.
ఇవి కూడా చూడండి:
- నైజీరియాలో తెలుగువారు: ‘పని కోసం వచ్చి చిక్కుకుపోయాం, 9 నెలలుగా జీతాలు లేవు... మమ్మల్ని ఆదుకోండి'
- తెలంగాణలో అకాల వర్షాలు: 'పంటను నా బిడ్డ లెక్క చూసుకున్న...'
- బజరంగ్ దళ్‌ను పీవీ నరసింహారావు ప్రభుత్వం ఎందుకు నిషేధించింది? దీని చరిత్ర ఏమిటి?
- తంజావూరు పెరియ కోవిల్: వెయ్యేళ్లనాటి ఈ దేవాలయం గోపురం నీడ నేలపై పడదా?
- స్పాంటేనియస్ సెక్స్ బాగుంటుందా... ప్లాన్ చేసుకుని చేసే శృంగారం మరింత బాగుంటుందా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








