ఆనంద్ మహీంద్రా - రాజమౌళి: సింధు నాగరికతపై సినిమాను పాకిస్తాన్ ఎలా అడ్డుకుందంటే....

సింధులోయ నాగరికత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సింధులోయ నాగరికత

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు కొన్ని ఫొటోలు బాగా నచ్చాయి. ఎంతగా అంటే...వీటి ఆధారంగా ఒక సినిమా తీస్తే బాగుంటుంది అనేంతగా .

అదే మాట రాజమౌళిని కూడా మహీంద్రా అడిగేశారు. కానీ పాకిస్తాన్ అందుకు ఒప్పుకోవడం లేదని రాజమౌళి బదులిచ్చారు.

ఏం జరిగింది?

సింధు నాగరికతకు సంబంధించిన ఊహించి గీసిన చిత్రాలను ‘‘దేశీ థగ్’’ అనే ఒక ట్విటర్ ఖాతా ఏప్రిల్ 11న ట్వీట్ చేసింది. అవి ఆనంద్ మహీంద్రాకు బాగా నచ్చాయి.

‘‘ఈ అద్భుతమైన చిత్రాలు చరిత్రకు ప్రాణం పోస్తున్నాయి. ఈ పురాతన నాగరికత గురించి ప్రపంచానికి తెలిసేలా ఒక సినిమా తీస్తే బాగుంటుందేమో చూడండి’’ అంటూ రాజమౌళిని ట్యాగ్ చేస్తూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

ఆనంద్ మహీంద్రా ఇచ్చిన సలహా మీద రాజమౌళి స్పందించారు. ఇంతకు ముందే తనకు ఆ ఆలోచన వచ్చిందని ఆయన అన్నారు. కానీ పాకిస్తాన్ సహకరించకపోవడం వల్ల కుదరలేదని చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

‘‘ధోలవీరలో మగధీర సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు శిలాజంగా మారిన ఒక పురాతన చెట్టును చూశాను. సింధూ నాగరికత ఉత్థాన పతనాల గురించి ఆ చెట్టు చెప్పిన కథను సినిమాగా తీయాలనే ఆలోచన వచ్చింది.

కొద్ది సంవత్సరాల తరువాత పాకిస్తాన్‌కు వెళ్లాను. మొహెంజో దారోను చూసేందుకు చాలా ప్రయత్నించా. కానీ బాధాకరం ఏంటంటే అనుమతులు లభించలేదు’’ అంటూ ఆనంద్ మహీంద్రాకు రాజమౌళి బదులిచ్చారు.

2018లో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు రాజమౌళి ఆ దేశం వెళ్లారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

సింధులోయ నాగరికత ప్రత్యేకత ఏంటి?

ప్రపంచంలోని పురాతన నాగరికతల్లో సింధులోయ నాగరికత ఒకటి. సుమారు 5,000 ఏళ్ల కిందట సింధు నది చుట్టుపక్కల అది మొదలైంది. క్రీ.పూ.2,500-1,700 మధ్య సింధులోయ నాగరికత విలసిల్లిందని చరిత్రకారులు చెబుతున్నారు.

భారత ఉపఖండంలో పట్టణ సంస్కృతి సింధులోయ నాగరికతతోనే మొదలైనట్లు ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు.

నేటి అఫ్గానిస్తాన్ నుంచి గుజరాత్‌లోని అరేబియా సముద్రం వరకు సింధులోయ నాగరికత విస్తరించింది.

ఆ నాగరికతకు సంబంధించి ప్రాంతాలు కొన్ని పాకిస్తాన్‌లోనూ మరికొన్ని భారత్‌లోనూ ఉన్నాయి.

హరప్పా: ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది. పంజాబ్‌లోని రావి నది తీరంలో ఉండే ఈ నగరాన్ని రుగ్వేదంలో హరియుపియగా పేర్కొన్నారు.

మొహెంజో దారో : పాకిస్తాన్‌లోని సింద్ ప్రావిన్స్‌లోగల లర్కానా జిల్లాలో సింధు నది కుడివైపు తీరంలో ఈ నగరం ఉంది. మొహెంజో దారో అంటే ‘‘శవాల దిబ్బ’’ అని అర్థం.

లోథాల్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ జిల్లాలో ఈ ప్రాంతం ఉంది. సబర్మతి నది తీరంలో ఇది బయటపడింది.

కాలిబంగన్: అంటే నల్లని గాజులు అని అర్థం. రాజస్థాన్‌లోని హనుమాన్‌గర్ జిల్లాలో ఒకనాటి సరస్వతి (ఘగ్గర్) నది తీరాన ఈ పట్టణం ఉంది.

ధోలవీర: గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఇది ఉంది.

సింధులోయ నాగరికత

ఫొటో సోర్స్, Getty Images

వ్యవసాయం కోసం స్థిరనివాసాలు

సింధు నది పరివాహక ప్రాంతంలో చాలా సారవంతమైన భూములు ఉండేవి. అందువల్ల పంటలు పండించేందుకు నాటి తొలి తరం రైతులు ఆ నది చుట్టుపక్కల చిన్నచిన్న గ్రామాలు ఏర్పాటు చేసుకుని స్థిరపడి ఉంటారని భావిస్తున్నారు. ఆ తరువాత ఆ గ్రామాలు కాస్త హరప్ప, మొహెంజో దారో వంటి పెద్ద నగరాలుగా మారాయి.

గోదుమ, బార్లీ, ఆవాలు, వరి, నువ్వులు వంటి వాటిని పండించారనేందుకు ఆధారాలు లభించాయి. పత్తికి సంబంధించిన జాడలు కూడా కనిపించాయి.

కుక్క, పిల్లి, కోడి, ఒంటె, బర్రె, ఎద్దు వంటి వాటిని సింధులోయ ప్రజలు మచ్చిక చేసుకున్నారు. దంతాలు విరివిగా కనిపించినందున ఏనుగులు కూడా వారికి తెలిసే ఉంటాయని భావిస్తున్నారు.

సింధులోయలో వ్యాపారం:

సారవంతమైన నేలల్లో పంటలు సమృద్ధిగా పండేవి. దిగుబడి అధికంగా రావడం వల్ల అవసరాలకు మించి వ్యవసాయ ఉత్పత్తులు వచ్చేవి. వీటిని విక్రయించేందుకు మెసపటోమియా, ఈజిప్టు వంటి ప్రాంతాలతో సింధులోయ ప్రజలకు వాణిజ్య సంబంధాలు ఏర్పడ్డాయి.

సింధులోయలో ప్రధానంగా రెండు విధాలుగా వ్యాపారం జరిగేది.

గ్రామాలు-పట్టణాలు: గ్రామాల నుంచి ముడిసరకు పట్టణాలకు వచ్చేది. రకరకాల వస్తువులు, కళాకృతుల ఉత్పత్తికి ఈ ముడిసరకు ఉపయోగపడేది. సింధులోయ చుట్టుపక్కల అడవుల నుంచి అటవీ ఉత్పత్తులను కూడా సేకరించేవారు.

పట్టణాలు-ఇతర ప్రాంతాలు: పట్టణాల్లో తయారైన వస్తువులు, కళాకృతులతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను మెసపటోమియా వంటి ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. అక్కడి నుంచి కావాల్సినవి దిగుమతి చేసుకునే వారు.

నేటి ఉత్తర కర్ణాటకలోని గనుల నుంచి బంగారం దిగుమతి చేసుకుని ఉండొచ్చు. నేటి రాజస్థాన్, మహారాష్ట్రలతో పాటు ఇరాన్, మధ్యఆసియాల నుంచి కూడా లోహాలు, రాళ్లు వంటి వాటిని దిగుమతి చేసుకొని ఉండొచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు.

మెసపటోమియా, సింధులోయ ప్రజల మధ్య వాణిజ్యానికి సంబంధించిన ఆధారాలు చాలానే లభించాయి. వాటిలో ప్రధానమైనవి ముద్రికలు. ఉర్ వంటి మెసపటోమియా నగరాల్లో హరప్ప ప్రజలు ఉపయోగించే ముద్రికలు కనిపించాయి.

భాష: సింధులోయ ప్రజలు చిత్రలిపిని వాడేవారు. దాన్నే హరప్ప లిపి అని కూడా అంటారు. ఇంతవరకు ఈ భాషను అర్థం చేసుకోలేకపోయారు.

ఇండో-యూరోపియన్ భాషలకుగానీ, సుమేరియన్, హర్రియన్ వంటి వాటికిగానీ హరప్ప లిపి దగ్గరగా లేదని కొందరు చెబుతున్నారు. నేడు దక్షిణభారతదేశంలో మాట్లాడే తెలుగు, తమిళం వంటి ద్రావిడ భాషలతో దీనికి సంబంధం ఉందని భావిస్తున్నారు.

సింధులోయ నాగరికత

ఫొటో సోర్స్, Getty Images

ఆసక్తికర అంశాలు

సింధులోయ ప్రజలు సంతానానికి ప్రతీకగా అమ్మ దేవతతోపాటు పశుపతిని పూజించేవారని తెలుస్తోంది.

మెసపటోమియా మాదిరిగా సింధులోయలో దేవాలయాలు కనిపించలేదు. అందువల్ల వారి మతవిశ్వాసాల గురించి పెద్దగా తెలియడం లేదు.

పండిన పంటలను దాచుకునేందుకు ధాన్యగారాలు నిర్మించేవారు.

ధోలవీరలో నీటిని నిల్వ చేసేందుకు రిజర్వాయర్లు, చెరువులు వంటి వాటిని నిర్మించారు.

కోటలకు రక్షణగా గోడలు కట్టారు.

సింధులోయ ప్రజలకు సంబంధించి మరొక ముఖ్యమైన అంశం మురుగునీరు పారుదల వ్యవస్థ. మొహెంజో దారో లోని స్నానవాటిక కూడా నాటి ప్రజల ఇంజినీరింగ్ నైపుణ్యాలకు ప్రతీకగా నిలిచింది.

మొహెంజో దారోలో శిలను చెక్కిన ‘పూజారి’ బొమ్మ లభించింది. కాంస్యంతో పోత పోసిన బొమ్మలు ఎక్కువ సంఖ్యలో దొరికాయి.

పక్షులు, జంతువుల వంటి టెర్రా కోట్ బొమ్మలు లభించాయి. బంగారం, రాళ్లతో చేసిన నెక్‌లేసులు కనిపించాయి.

మొహెంజో దారో, పాకిస్తాన్

ఫొటో సోర్స్, SPL

ప్రధాన నగరాలు

హరప్ప, మొహెంజో దారో, ధోలవీర, లోథాల్, కాలిబంగన్, బనవాలి, రాఖీగర్హి, సర్‌కొటాడ, చాన్హుదారో, రూపార్ ఇలా 1,400కు పైగా నగరాలు, పట్టణాలు ఉన్నాయి.

అతిపెద్ద నగరాలు హరప్ప, మొహెంజో దారో. వీటిలో 80,000 మంది నివసించేవారని చరిత్రకారులు అంచనా వేశారు.

హరప్ప, మొహెంజో దారో అనే పేర్లను తరువాత కాలంలో పెట్టారు. సింధులోయ ప్రజలు ఆ నగరాలను ఏమని పిలిచేవారో తెలియదు.

ఎందుకంటే వారి భాషను ఇప్పటికీ ఎవరూ చదవలేకపోయారు.

హిమాలయాల్లో సముద్రమట్టానికి సుమారు 13,000 అడుగుల ఎత్తులో కైలాస పర్వతానికి సమీపంలో సింధు నది మొదలవుతుంది. దాదాపు 3,000 కిలోమీటర్ల ప్రయాణించి పాకిస్తాన్‌లోని కరాచీ వద్ద అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది.

ఎలా అంతమైంది?

సింధులోయ నాగరికత ఎలా అంతమైందనే విషయం కచ్చితంగా తెలియదు. దీని మీద అనేక అభిప్రాయాలున్నాయి. క్రీ.పూ. 2,000-1,900 మధ్య సింధులోయ నాగరికత క్షీణించడం మొదలైనట్లు చరిత్రకారులు భావిస్తున్నారు.

జనాభా పెరుగుదల

సింధులోయ నాగరికతకు చెందిన హరప్ప, మొహెంజో దారో వంటి నగరాల్లో జనాభా విపరీతంగా పెరిగిపోయింది.

నాడు ఒక్కో నగరంలో 25,000 నుంచి 40,000 వరకు ప్రజలు నివసించే వారు.

ప్రజల నివాసం కోసం భూమి సరిపోక ఇళ్లను ఒకదాని మీద మరొకటి కట్టేవారు.

నగరాల్లో మురుగు నీటి పారుదల కోసం ఏర్పాటు చేసిన కాలువలను శుభ్రం చేయడం తగ్గిపోయింది. దాంతో అవి మూసుకుపోయాయి.

వ్యాపార క్షీణత

సింధులోయ ప్రజలకు వాణిజ్యమనేది ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటిగా ఉండేది.

మిడిల్ ఈస్ట్‌లోని మరొక పురాతన నాగరికతకు చెందిన మెసపటోమియా ప్రజలతో సింధులోయ ప్రజలు ఎక్కువగా వ్యాపారం చేసేవారు.

మెసపటోమియాతో వ్యాపారం చేసే మార్గాలు, నెట్‌వర్క్స్ బాగా దెబ్బతిన్నాయి. ఈ ప్రభావం సింధులోయ నగరాల మీద బాగా ప్రభావం చూపింది.

వాణిజ్యం తగ్గిపోవడంతో తయారీదారులు, వ్యాపారులకు పని లేకుండా పోయింది. దాంతో ప్రజలు ఈ నగరాలను ఖాళీ చేసి వెళ్లిపోయారు.

సింధులోయ నాగరికత

ఫొటో సోర్స్, Getty Images

సింధు నది వరదలు

సింధులోయ నాగరికత అంతం కావడానికి ప్రధాన కారణం పర్యావరణ మార్పులని చాలా మంది చరిత్రకారులు భావిస్తున్నారు. ఎందుకంటే నాటి నగరాలన్నీ నదీ తీరాల్లోనే ఉండేవి.

సింధు నదికి వచ్చే వరదల వల్ల నగరాలు ధ్వంసమై ఉండొచ్చు. వరదల్లో పొలాలు సైతం మునిగిపోవడం, పంటలు దెబ్బతినడం జరుగుతుంది కాబట్టి వ్యవసాయం కూడా ఆగిపోయి ఉంటుంది.

సింధు నది కొంత కాలానికి తన ప్రవాహ దిశను మార్చుకొని ఉండొచ్చు.

సింధులోయలోని ఘగ్గర్ హక్రా నది ఎండిపోయిందని కూడా చెబుతారు. దాంతో ఆ నది తీరంలో ఉండే కాలిబంగన్, బనవాలి పట్టణాలను ప్రజలు ఖాళీ చేయాల్సి వచ్చింది.

లేదా వ్యాధులు ప్రబలి, తిండిలేక ఆకలితో చనిపోయి కూడా ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు.

దండయాత్రలు

సింధులోయ కాలం నాటి వ్యాపారులు విలువైన వస్తువులను ఇంట్లో పాతి పెట్టినట్లుగా ఆధారాలు లభించాయి. అంటే వారు దేనివల్లో భయపడి ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు.

దండయాత్రలు, యుద్ధాలు కూడా సింధులోయ నాగరికత అంతం కావడానికి కారణమని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు.

ఉత్తరం నుంచి వచ్చిన జాతులు సింధులోయ నగరాల మీద దండెత్తినట్లు వేదాల్లో ఒకటైన రుగ్వేదంలోని ప్రస్తావనల ద్వారా తెలుస్తోంది.

‘‘చుట్టూ ప్రాకారాలు ఉన్న నగరాల మీద యుద్ధ దేవుడైన ఇంద్రుడు దాడి చేశాడు’’ అని రుగ్వేదంలో ప్రస్తావించారు.

ఇలా ఉత్తరం నుంచి దండెత్తి వచ్చిన వారిని ఇండో-యూరోపియన్ జాతులకు చెందిన ఆర్యులుగా కొందరు చరిత్రకారులు చెబుతున్నారు.

గుర్రాలతో యుద్ధం చేసే ఆర్యులను సింధులోయ ప్రజలు సమర్థవంతంగా ఎదుర్కొనలేకపోయి ఉంటారని కొందరు భావించారు.

ఆ తరువాత ఆర్యులు వేద సంస్కృతికి పునాదులు వేశారని చెబుతారు.

కానీ ఆర్యులు భారత ఉపఖండంలోని వారే అని, బయటి నుంచి రాలేదని వాదించే వాళ్లు కూడా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)