టిప్పు సుల్తాన్: బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి దడ పుట్టించిన మైసూరు మహారాజా

టిప్పు సుల్తాన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సర్ఫరాజ్ అహ్మద్
    • హోదా, చరిత్ర పరిశోధకుడు

‘‘ఈస్ట్ ఇండియా కంపెనీ ఉనికికే ప్రమాదంగా మారాడు మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్.’’

- ప్రముఖ చర్రితకారుడు బి.షేక్ అలీ అన్న మాటలివి. చరిత్రలోని కొన్ని ఘటనలు, డాక్యుమెంట్స్ పరిశీలించాక ఆయన ఇలా అన్నారు.

వ్యాపారంలో బ్రిటిష్ ఇండియా, ఇతర అంతర్జాతీయ మార్కెట్ల వైపు టిప్పు సుల్తాన్ దృష్టి సారించారు.

విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ తయారీ వస్తువులనే వాడాలని కాలికట్‌లోని ఫౌజ్‌దార్‌కు టిప్పు సుల్తాన్ ఆదేశాలు జారీ చేశారు.

‘‘ఇంగ్లిష్ వాళ్లతో వ్యాపారం చేయొద్దని ప్రజలకు చెప్పండి. వాళ్ల నుంచి ఏమీ కొనకూడదు. అప్పుడు ఆంగ్లేయులకు ఇక్కడ పని ఉండదు’’ అని తన ఆదేశాల్లో టిప్పు సుల్తాన్ రాశారు.

లాల్ బాగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లాల్‌బాగ్ వ్యవసాయ పరిశోధన కేంద్రం

వ్యవసాయ ఉత్పత్తుల కోసం కంపెనీ

తన రాజ్యంలోని వ్యవసాయ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా అమ్మడం కోసం ఒక కంపెనీని ఆయన ప్రారంభించారు. అంతర్జాతీయ మార్కెట్ల గురించి ప్రజల్లో అవగాహన కూడా కల్పించారు.

నేడు ఖతార్, బహ్రెయిన్, ఇరాఖ్, ఇరాన్, తుర్కియే వంటి దేశాలు ఉన్న ప్రాంతాల్లోనూ టిప్పు సుల్తాన్ మైసూర్ రాజ్యానికి చెందిన వాణిజ్య కేంద్రాలు ప్రారంభించారు.

మైసూరు రాజ్యంలోని ఏజెంట్లు రైతుల నుంచి ఉత్పత్తులను సేకరించేవారు. వాటిని పడవల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేసేవారు. ఇలా అంతర్జాతీయ మార్కెట్‌కు తమ ఉత్పత్తులు చేరడం వల్ల రైతులకు లాభాలు బాగా వచ్చేవి.

మైసూరు సిల్క్

ఫొటో సోర్స్, Twitter/Ministry of Tourism Government of India

ఫొటో క్యాప్షన్, మైసూరు సిల్క్

సిల్క్ సిటీగా మైసూర్

విదేశీ పంటలను మైసూరులో పండించడం మీద కూడా పరిశోధనలు ప్రారంభించారు. ఇందుకోసం ‘‘లాల్‌బాఘ్’’ అనే వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని స్థాపించారు. ముందు అక్కడ పంటలు పెంచి, ఆ తరువాత విత్తనాలను రైతులకు పంచుతారు.

టిప్పు సుల్తాన్ వివిధ దేశాల నుంచి పట్టుపురుగులను తెప్పించి మైసూరులో పెంచడం ప్రారంభించారు . ఆ తరువాత అదొక పెద్ద పరిశ్రమగా మారింది. నేడు మైసూరు సిల్క్ సిటీగా మారడానికి కారణం అదే.

శ్రీరంగపట్నం వద్ద చిన్నపట్నం, పలహళ్లీ వద్ద రెండు చక్కెర కర్మాగారాలను స్థాపించారు

ఇక్కడ ఉత్పత్తి చేసే చక్కెరను విదేశాలకు ఎగుమతి చేసేవారు.

1803 వరకు అంతర్జాతీయ మార్కెట్లో మైసూరు చక్కెరకు మంచి ఆదరణ ఉండేది.

టిప్పు సుల్తాన్ ఇచ్చిన ఆదేశాలను చూస్తే... పురుషులు, స్త్రీలు, పిల్లల సంఖ్యను లెక్కించే వారని తెలుస్తోంది. వారికి ఆదాయం ఎలా వస్తుందో తెలుసుకునే వారు. ఎవరికైనా ఉపాధి లేకపోతే వారికి ఆర్థిక సాయం చేసి ఉపాధి చూపించేవారు. రైతులు ఎవరైనా వ్యవసాయం మానేస్తే వారికి ఎద్దులు ఇచ్చి పెట్టుబడికి ఆర్థిక సాయం చేసేవారని తెలుస్తోంది.

టిప్పు సుల్తాన్ మైసూరు రాజ్యంలో బ్యాంకును కూడా ప్రారంభించారు. వడ్డీ లేకుండా రైతులకు రుణాలు ఇచ్చేవారు. రైతులకు అవసరమైన పరికరాలు, మేకలు లాంటి వాటిని కూడా సరఫరా చేసేవారు.

టిప్పు సుల్తాన్

ఫొటో సోర్స్, Getty Images

100 మీటర్లు దాటాక పేలే రాకెట్లు

మైసూరు సైన్యాన్ని ఆధునికీకరించడంలో హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. టిప్పు సుల్తాన్ స్వయంగా కొన్ని ఆయుధాలను కనిపెట్టారు.

1787లో మైసూరులో తయారైన తుపాకులను తన ప్రతినిధుల ద్వారా ఫ్రాన్స్‌కు పంపించారు. తన రాజ్యంలో 10 ఫ్యాక్టరీలు ఉన్నాయని, వాటిలో వేల తుపాకులు తయారుచేస్తున్నట్లు చెప్పాలని వారిని ఆదేశించారు.

‘‘1786లో టిప్పు సుల్తాన్ రాజ్యంలోని తుపాకులను పాండిచ్చేరి (పుదుచ్చేరి) గవర్నర్ చూశారు. యూరోపియన్ తుపాకుల కంటే అవి బాగా ఉన్నట్లు ఆయన అన్నారు. 1788లో వాటిని చూసిన ఫ్రాన్స్ రాజు కూడా అదే మాట అన్నారు’’ అని ఇర్ఫాన్ హబీబ్ రాశారు.

టిప్పు సుల్తాన్ తయారు చేసిన రాకెట్ టెక్నాలజీ నాటికి చాలా మెరుగైనది. 100 మీటర్ల కంటే దూరంలో ఉండే లక్ష్యాలను చేధించగల ఆయుధాలు అంతకుముందు ఎక్కడా లేవు.

‘‘రాకెట్లను పేల్చేందుకు 200 మంది సైనికులు ఉండేవారు. వారిని కుషున్ బ్రిగేడ్ అనేవారు. 100 మీటర్ల దూరం ప్రయాణించిన తరువాత రాకెట్ పేలేది. మైసూరును స్వాధీనం చేసుకున్నాక 600 రాకెట్ లాంచర్లు, 700 రాకెట్లు బ్రిటిష్ వాళ్లకు లభించాయి’’ అని డాక్టర్ శివ్ గజ్రానీ రాశారు.

బ్రిటిషర్లతో యుద్దం

ఫొటో సోర్స్, ULLSTEIN BILD DTL.

సైనికులకు స్వయంగా చికిత్స

సైనికుల ఆరోగ్య సంరక్షణకు టిప్పు సుల్తాన్ ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆయనే స్వయంగా చాలా సార్లు సైనికులకు చికిత్స చేసినట్లుగా కూడా కొన్ని ఉత్తరాల్లో ఉంది.

1786 మే 24న రాసిన లేఖలో దౌలత్ ఖాన్‌ అనే అధికారికి కిడ్నీల సమస్య కోసం మందులు పంపించినట్లు టిప్పు రాశారు.

1785 సెప్టెంబరు 12న రాసిన లేఖలో కుక్క కరిచిన కిషన్ రావు అనే అధికారికి చికిత్స చేసినట్లు ఉంది.

జామియా అల్ ఉముర్ అనే యూనివర్సిటీని టిప్పు స్థాపించారు. యూరోపియన్ డాక్టర్లు అందులో పని చేసేవారు.

1786 డిసెంబరు 28న రాసిన లేఖలో- ‘‘బారోమీటర్ల గురించి యూరప్‌లో ఒక పుస్తకం వచ్చింది. వాతావరణం ఆధారంగా బారోమీటర్‌లోని పాదరసం కదులుతుంది. అలాంటప్పుడు రోగులు చేతులు పెడితే అది కదులుతుంది కదా. ఆ పుస్తకాన్ని పర్షియన్‌లోకి అనువదించి పంపండి’’ అని ఉంది.

ఆ తరువాత కొన్ని బారోమీటర్లను కూడా ఆయన తెప్పించారు.

ఇలా టిప్పు సుల్తాన్ పాలనలోని మైసూర్ రాజ్యం రోజురోజుకు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగేది. అంతర్జాతీయ రాజకీయాలను టిప్పు నిశితంగా పరిశీలిస్తూ ఉండేవారు. సైన్యాన్ని నవీకరిస్తూ ఉండేవారు. అంతర్జాతీయ వాణిజ్యం ద్వారా రైతుల్లో విశ్వాసం పెంచారు. ఇలా మైసూరు రాజ్యం ఈస్ట్ ఇండియా కంపెనీ కంటే ఒక అడుగు ముందే ఉండేది.

అందుకే టిప్పు సుల్తాన్ మరణం తరువాత భారత్ తమది అయినట్లు బ్రిటిష్ పాలకులు ప్రకటించారు.

(నోట్: మధ్యకాలం నాటి డెక్కన్ చరిత్రలో సర్ఫరాజ్ అహ్మద్ నిపుణుడు. ఘాజిఉద్దీన్ రీసెర్చ్ సెంటర్‌ సభ్యుడు.)

ఇవి కూడా చూడండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)