నైజీరియాలో తెలుగువారు: ‘పని కోసం వచ్చి చిక్కుకుపోయాం, 9 నెలలుగా జీతాలు లేవు... మమ్మల్ని ఆదుకోండి'

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
‘ఉపాధి కోసం వచ్చాం. మొదట్లో బాగానే జీతాలు ఇచ్చారు. కొంత తిని, కొంత ఇంటికి పంపించాం. ఇప్పటికి 9 నెలలుగా జీతాలు లేవు. ఎలా ఉండాలో అర్థంకావడం లేదు. ఖర్చులకు చేతిలో పైసా లేదు. మందులు కూడా లేవు. కనీసం మమ్మల్ని తిరిగి భారతదేశానికి పంపించినా చాలు. చేతులెత్తి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం’ అంటూ పైలా రామచంద్రరావు తన ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలానికి చెందిన రామచంద్రరావు ఏడాదిన్నర కిందట నైజీరియా వెళ్లారు.
కెమీ టెక్ పేరుతో నైజీరియాలో రిఫైనరీ నడుపుతున్న గుజరాతీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.
ఆయనతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన 25 మంది అక్కడే పనిచేస్తున్నారు.
మరో 100 మంది వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన భారతీయులు ఉన్నారు.
9 నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడం లేదని రామచంద్రరావు తన ఆవేదనను వీడియో రూపంలో పోస్ట్ చేశారు.
ఆయనతో పాటుగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరికొందరు కార్మికులూ వీడియోలలో తమ ఆవేదన వ్యక్తంచేశారు.
విషయం ఇప్పటికే అధికారుల దృష్టికి వెళ్లిందని, తగిన చర్యల కోసం ప్రయత్నిస్తున్నట్టు ఏపీ ఎన్ఆర్టీ చెబుతోంది.

ఆరు నెలలు బాగానే ఉంది
బరోడాకి చెందిన కెమీ టెక్ కంపెనీ నైజీరియా లోగస్ ప్రాంతంలో డంగోట్ ఆయిల్ రిఫైనరీ నిర్వహిస్తోంది.
అక్కడ పనిచేసేందుకు కార్మికులు అవసరమంటూ ప్రకటన రావడంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు దరఖాస్తు చేసుకున్నారు.
వారిలో కొందరిని ఎంపిక చేసి 2022 ప్రారంభంలో నైజీరియా తరలించారు.
వీసా, రవాణా ఖర్చులన్నీ కంపెనీ భరించడంతో కొన్ని నెలల పాటు జీతం నుంచి కట్ చేస్తామని చెప్పినట్టు కార్మికులు చెబుతున్నారు.
కటింగ్స్ అన్నీ పోగా నెలకు 1350 యూఏఈ దిర్హామ్స్ ఇస్తున్నట్టు పైలా రామచంద్రరావు బీబీసీకి తెలిపారు.
అంటే భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 30 వేలు ఉంటుంది.
"మేం వెళ్లినప్పుడు మొదటి ఆర్నెల్లు అంతా బాగుంది. మాకు రూమ్స్ ఇచ్చారు. భోజనం మెస్‌లో పెట్టేవారు. అన్నీ పోను 1350 దిర్హామ్స్ చొప్పున వచ్చేది.
కానీ 9 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు అడిగినా స్పందించడం లేదు. నాలుగు నెలలుగా పనులు కూడా లేవు. మమ్మల్ని పంపించేయమంటే పంపించడం లేదు. ఇప్పుడు మెస్‌కి కూడా బకాయి పెట్టడంతో ఫుడ్ కూడా ఆపేస్తామని అంటున్నారు. మాకు చాలా ఆందోళనగా ఉంది" అంటూ బీబీసీతో చెప్పారు.
తమను ఆదుకోవాలని ఇండియన్ ఎంబసీ అధికారులను కోరారు.

కేసులు పెడతామని బెదిరిస్తున్నారు..
ఉద్యోగం పేరుతో తమను తీసుకొచ్చి, ఇప్పుడు జీతాలు ఇవ్వకుండా వేధించడమే కాకుండా కేసులు పెడతామని బెదిరిస్తున్నారంటూ బాధితులు చెబుతున్నారు.
"పెండింగ్ జీతాల కోసం కంపెనీ వారిని అడిగినా స్పందన లేదు. మాకు ఏం చేయాలో తెలియడం లేదు. గట్టిగా అడిగితే కేసులు పెడతామని అంటున్నారు. మాకు ఇక్కడ బయటకు వెళ్లే అవకాశం కూడా లేదు. ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేసినా స్పందించలేదు. వంద మందికి పైగా కార్మికులం చిక్కుకున్నాం. మమ్మల్ని కాపాడాలని కోరుతున్నాం" అంటూ యూపీకి చెందిన రతన్ సింగ్ వాపోయారు.
అధికారుల దృష్టికి తీసుకెళ్లాం...
నైజీరియాలోని కెమీ టెక్ కంపెనీలో కార్మికుల ఆందోళనపై ప్రవాస భారతీయ సంస్థలు కొన్ని స్పందించాయి. వారి సమస్యను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెబుతున్నారు.
కాగా, దీనిపై గల్ఫ్ ఎన్ఆర్ఐల ప్రతినిధి వాసుదేవరావు బీబీసీతో మాట్లాడారు.
"కార్మికులకు న్యాయం చేయాలి. వారి సమస్యను ఏపీ ఎన్ఆర్టీ దృష్టికి తీసుకెళ్లాం. భారతీయ అధికారులు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు సెటిల్ చేసి, వారిని తిరిగి స్వదేశాలకు చేర్చాలని కోరుతున్నాం. కార్మికుల జీతాలు, ఇతర అంశాలు సెటిల్ చేసి వారిని సురక్షితంగా సొంత దేశానికి చేర్చే ప్రయత్నం జరుగుతుందని ఆశిస్తున్నాం" అంటూ ఆయన బీబీసీతో అన్నారు.
వివిధ దేశాల్లోని అనేక పరిశ్రమల వద్ద ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాగానే భారతీయ అధికారులు సకాలంలో స్పందించారని, ఇప్పుడు కూడా నైజీరియాలో ఏర్పడిన సమస్యలను అధిగమించేందుకు కార్మికులకు అండగా ఉంటారని భావిస్తున్నట్టు వాసుదేవరావు తెలిపారు.

కంపెనీ స్పందన
నైజీరియాలోని కెమీ టెక్ కంపెనీ ప్రాంగణంలో కార్మికులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
తమకు బకాయిలు చెల్లించాలని, స్వదేశం పంపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
వారిని అణిచివేసే ప్రయత్నం జరుగుతుందనే ఆందోళన కార్మికుల మాటల్లో వినిపిస్తోంది. ఈ సమస్య మీద కంపెనీ ప్రతినిధుల స్పందన కోసం బీబీసీ ప్రయత్నించింది.
కెమీ టెక్ డీజీఎం నిర్మల్ సింగ్‌తో పాటు హెచ్ ఆర్ అధికారి జుబేర్‌ను సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. ఈ సంస్థ హెచ్ఆర్ విభాగం ఉద్యోగి ఒకరు బీబీసీతో మాట్లాడారు.
మా దృష్టికి వచ్చింది, పరిశీలిస్తాం
నైజీరియాలో ఉపాధి కోసం వెళ్లిన కొందరు కార్మికులు వేతనాల సమస్యతో ఉన్నారనే అంశం తమ దృష్టికి వచ్చిందని ఏపీ ఎన్ఆర్టీ చెబుతోంది.
ఏపీ ఎన్ఆర్టీ సీఈవో పి.హేమలత రాణి ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ అదికారులతో మాట్లాడి నైజీరియాలో ఉన్న భారత కార్మికుల సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని బీబీసీకి తెలిపింది.
ఇప్పటికే సుడాన్‌లో చిక్కుకున్న వారిలో 98 మంది ఆంధ్రప్రదేశ్ వాసులను సురక్షితంగా ఇంటికి చేర్చామని , నైజీరియా కార్మికుల అంశం కూడా పరిష్కారం అవుతుందని ఏపీ ఎన్ఆర్టీ ప్రతినిధులు చెబుతున్నారు.
ఇండియాకు వెళ్లమన్నా వెళ్లడం లేదు: కెమీటెక్ ప్రతినిధి
డంగోట్ ఆయిల్ రిఫైనరీ కెమీటెక్‌కు కాంట్రాక్ట్ ఇచ్చింది. కెమీటెక్‌లో భారతీయ కార్మికులు పనిచేస్తున్నారు. 2022 జూన్ నుంచి కంపెనీ తీవ్ర నష్టాలు ఎదుర్కొంది. నష్టాల తరువాత సంస్థ 600 మంది కార్మికులను సెటిల్మెంట్ చేసి భారత్‌కు పంపించేసింది.
"ప్రస్తుతం నైజీరియాలో ఉన్న కార్మికులకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ జీతాలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అయితే, వారంతా 2022 నవంబర్ నుంచి సమ్మె చేస్తున్నారు. నిధులు రాగానే మొత్తం చెల్లింపులు చేస్తామని, భారత్‌కు తిరిగి వెళ్లాలని కంపెనీ వారికి సూచించినా వారు మాత్రం ఇక్కడే ఉంటూ సమ్మె చేస్తున్నారు. భారత్ వెళ్లేందుకు వారు నిరాకరించడంతో వారికి భోజన ఏర్పాట్లన్నీ సంస్థే చూసుకుంటోంది. ప్రస్తుతం పెండింగ్ ఉన్న మూడు నెలల జీతం ఇస్తాం భారత్ వెళ్లాలని సూచించినా వారు అక్రమంగా అనేక డిమాండ్లు చేస్తున్నారు. ఇంకా వివరాలు కావాలంటే మీరు ఎంబసీతో మాట్లాడొచ్చు" అని కెమీ టెక్ సంస్థకు హెచ్ఆర్ విభాగానికి చెందిన ఒక ఉద్యోగి చెప్పారు.
‘‘కోవిడ్-19 కాలంలో వేర్వేరు దేశాలలో మా రిఫైనరీలు ఆగిపోయాయి. మూసేసినప్పటికీ మానవతా దృక్పథంతో మేం వారికి జీతాలిచ్చాం. అన్ని రిఫైనరీలు పనిచేస్తూ కాంట్రాక్టులు సకాలంలో పూర్తిచేయగలిగితేనే లాభాలు వస్తాయి. ఉద్యోగులు పనిలేకుండా కూర్చున్నప్పటికీ ఏడాది కాలం జీతాలిచ్చాం. మా నష్టాలకు ఇది కూడా బలమైన కారణమే. మార్చ్, ఏప్రిల్ నెలలలో భారత్ వెళ్లడానికి సిద్ధమైన 14 మంది కార్మికులను పంపించాం. నిధులు రాగానే వారికి పూర్తి సెటిల్‌మెంట్ చేస్తామని చెప్పాం. సమ్మెలో ఉన్న మిగతా ఉద్యోగులతో పాటే వారికీ పూర్తి సెటిల్‌మెంట్ చేస్తాం’’ అని కెమీ టెక్ సంస్థ హెచ్ ఆర్ ఉద్యోగి బీబీసీతో చెప్పారు.
ఈ వర్కింగ్ సైట్‌లో 3 వేల మంది ఉద్యోగులు ఉండగా వారిలో ప్రస్తుతం 200 మందే సైట్‌లో ఉన్నారని.. వారితో కలిపి మొత్తం 220 మందికి ఇంకా ఎఫ్ఎన్ఎఫ్(పూర్తి, తుది చెల్లింపులు) బకాయి ఉన్నామని ఆ ఉద్యోగి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ దివాలా తీయడానికి కారణాలేంటి... ఇతర విమానయాన సంస్థలపై ఈ ప్రభావం ఎలా ఉంటుంది?
- ఆంధ్రప్రదేశ్: చిత్తూరు చింతపండు ఎందుకు తగ్గిపోతోంది... చింత చెట్లు ఏమైపోతున్నాయి?
- సూర్య, చంద్ర గ్రహణాలు కాకుండా వేరే గ్రహణాలు కూడా ఉంటాయా, ఎలా ఏర్పడతాయి?
- ప్రపంచ బ్యాంకును పర్సనల్ లోన్ అడగొచ్చా, ఆ బ్యాంకు ఎలా పని చేస్తుంది?
- ఏపీ-తెలంగాణ వర్షాలు: ఈసారి ఎండాకాలం లేదా అని ఎందుకు చర్చ జరుగుతోంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














