కింగ్ చార్లెస్ పట్టాభిషేకం: ఖర్చయ్యే ప్రజాధనం ఎంత? ఈ డబ్బు తిరిగి వస్తుందా?

కింగ్ చార్లెస్

ఫొటో సోర్స్, PA Media

    • రచయిత, తారా వెల్ష్, ఆరేలియా ఫోస్టెర్
    • హోదా, బీబీసీ న్యూస్

లండన్‌లో మే 6న కింగ్ చార్లెస్ పట్టాభిషేకం జరగబోతోంది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు వీక్షించబోతున్నారు.

దీని కోసం ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే, ఇంత ఖర్చు పెట్టి మరీ ఇప్పుడు ఎందుకు పట్టాభిషేకం చేస్తున్నారు అని చాలా మంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

బ్రిటన్‌లో ధరాభారం వల్ల ప్రజలు సతమతమవుతున్న తరుణంలో ఇంత ప్రజాధనాన్ని ఎందుకు ఖర్చు పెడుతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే, పట్టాభిషేకంపై పెట్టే డబ్బు తిరిగి వస్తుందని కొన్ని వ్యాపార సంస్థలు చెబుతున్నాయి.

కింగ్ చార్లెస్

ఫొటో సోర్స్, POOL

ఇది బ్రిటన్ ప్రభుత్వ కార్యక్రమం. దీని కోసం బ్రిటన్ ప్రభుత్వంతోపాటు బకింగ్హమ్ ప్యాలెస్ నిధులు సమకూరుస్తోంది.

ఆర్థిక సంక్షోభం నడుమ ఈ కార్యక్రమాన్ని మరీ అంత ఆర్భాటంగా నిర్వహించకపోవచ్చని మొదట అంచనాలు వచ్చాయి. అయితే, దీని కోసం 50 మిలియన్ల పౌండ్ల (రూ.515.35 కోట్లు) నుంచి 100 మిలియన్ల పౌండ్లు (రూ.1,030.70 కోట్లు) వరకూ ఖర్చు పెడుతున్నారని కొన్ని సంస్థలు చెబుతున్నాయి. ఈ అంచనాలను ప్రభుత్వం ధ్రువీకరించలేదు.

తాజాగా యూగవ్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 52 శాతం మంది లండన్ వాసులు పట్టాభిషేకానికి పన్ను చెల్లింపుదారుల డబ్బును ఉపయోగించకూడదన్నారు.

లెన్
ఫొటో క్యాప్షన్, ఈ కార్యక్రమంపై ఎంత ఖర్చు పెడుతున్నారో ప్రభుత్వం ముందుగా వెల్లడిస్తుందని తాను అనుకోవడం లేదని లెన్ అనే వ్యాపారి చెప్పారు.

పశ్చిమ లండన్‌లోని ఒక ప్రాంతంలో బీబీసీ కూడా ప్రజాభిప్రాయాలను సేకరించింది. ఇక్కడ మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ విషయంపై హేస్‌లోని ‘‘కరోనేషన్ రోడ్’’లో కెరల్‌తోపాటు మరికొందరు మాతో మాట్లాడారు.

‘‘తినడానికి మాకు తిండి సరిగ్గా దొరకడం లేదు. చలికి గజగజ వణుకుతున్నాం. కానీ, వారు డబ్బును విపరీతంగా ఖర్చుచేస్తున్నారు’’ అని కెరల్ చెప్పారు.

‘‘చాలా ఎక్కువ డబ్బును వారు వృథా చేస్తున్నారు. ఇంత డబ్బు వారు ఖర్చు పెట్టుండాల్సింది కాదు’’ అని ఆమె అన్నారు.

కార్ల విడిభాగాలను విక్రయించే లెన్ కాస్త భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

‘‘దీని వల్ల మన ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందా? అయితే, తప్పకుండా చేయాల్సిందే’’ అని లెన్ అన్నారు. సెలవును వేడుకగా చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

ఈ కార్యక్రమంపై ఎంత ఖర్చు పెడుతున్నారో ప్రభుత్వం ముందుగా వెల్లడిస్తుందని తాను అనుకోవడంలేదని ఆయన అన్నారు.

ఆయన చెబుతున్నది నిజమే. ప్రభుత్వం దీనిపై ఎంత ఖర్చు పెడుతోందో ఇప్పటివరకు వెల్లడించలేదు.

దీనిపై డిజిటల్, కల్చర్, మీడియా, స్పోర్ట్స్ (డీసీఎంఎస్) విభాగం స్పందిస్తూ- ‘‘కార్యక్రమం పూర్తయ్యేవరకూ ఎంత ఖర్చు అవుతుందో తాము స్పష్టంగా చెప్పలేం’’ అని వివరించింది.

లండన్

ఆర్థిక వ్యవస్థకు మంచిదా?

‘‘ఖర్చుపెట్టే డబ్బే మళ్లీ డబ్బును తీసుకొస్తుంది’’ అని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

మొత్తంగా చూసుకుంటే పట్టాభిషేకం ఒక శుభవార్త లాంటిదేనని లండన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎల్‌సీసీఐ) చెబుతోంది.

పట్టాభిషేకాన్ని చూసేందుకు పెద్దయెత్తున ప్రజలు రాజధానికి రావడంతో ఆతిథ్య రంగం సహా వ్యాపారులకు మేలు జరుగుతుందని ఎల్‌సీసీఐలోని పాలసీ విభాగం చీఫ్ జేమ్స్ వాట్కిన్స్ అన్నారు.

‘‘కోవిడ్-19 వ్యాప్తి, రైల్వే సిబ్బంది సమ్మెలతో గాడి తప్పిన వ్యాపారాలకు ఈ పట్టాభిషేకంతో మళ్లీ ఊపు వస్తుంది’’ అని ఆయన నమ్ముతున్నారు.

‘‘ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తున్న ఒక కార్యక్రమానికి లండన్ వేదిక అవుతోంది. ఇది వ్యాపారులకు, వారిపై ఆధారపడే ఉద్యోగులకు మేలు చేస్తుంది’’ అని ఆయన వివరించారు.

బ్యాంకులకు ఒక రోజు అదనంగా సెలవు రావడంతో, ఎక్కువ మంది తమ హోటళ్లలో విడిది చేస్తారని ఆతిథ్య రంగం ప్రతినిధులు భావిస్తున్నారు.

బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు ఇలా కలిపి మొత్తంగా పట్టాభిషేకంతో 350 మిలియన్ పౌండ్లు (రూ.3,610 కోట్ల) వరకూ వ్యాపారం జరగొచ్చని అంచనాలు ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, బ్రిటన్ రాణి ఎలిజబెత్ II మరణ వార్తను బీబీసీ న్యూస్ ఎలా చెప్పిందంటే..

కొందరు వ్యాపారుల్లో కలవరం

ఒక రోజు అదనపు సెలవు కొంత మంది వ్యాపారులను కలవరపెడుతోంది.

నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఓఎన్ఎస్) సమాచారం ప్రకారం, 2022 జూన్‌లో నాలుగు రోజుల వీకెండ్ హాలిడేతో కొన్ని వ్యాపార సంస్థలు నష్టాలను చవిచూశాయి.

లండన్‌లోని కంపెనీలతో కలిసి పనిచేస్తున్న బిజినెస్ కన్సల్టెంట్ అబే ఘఫూర్ మాట్లాడుతూ- మే నెలలో ఎక్కువ రోజులు సెలవులు రావడంతో ఉత్పాదకత తగ్గొచ్చన్నారు.

అయితే పట్టాభిషేకంతో పర్యటకం, రీటెయిల్ రంగాల్లో వ్యాపారం చాలా పెరిగిందని ఆమె అన్నారు.

‘‘మొత్తంగా చెప్పాలంటే ఇది మంచిదే. ఎందుకంటే బ్రిటన్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 20 శాతం లండన్ నుంచే వస్తుంది. కాబట్టి ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుంది’’ అని ఆమె చెప్పారు.

పట్టాభిషేకం ఆర్థికంగా ఎంత ప్రభావం చూపొచ్చని కచ్చితంగా అంచనా వేయడం చాలా కష్టమని ఏజే బెల్‌ సంస్థకు చెందిన ఇన్వెస్టిమెంట్ అనలిస్టు లైత్ ఖాలాఫ్ అన్నారు.

‘‘ఆర్థిక వ్యవస్థ అనేది చాలా పెద్దది. ధరలు, వ్యాపార వాతావరణం, వినియోగదారులు ఖర్చు పెట్టే తీరు.. ఇలా చాలా అంశాలు ఇక్కడ ప్రభావం చూపిస్తాయి’’ అని ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, క్వీన్ ఎలిజబెత్‌-2 పెళ్లి ఎలా జరిగిందంటే..

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)