ప్రిన్స్ ఫిలిప్‌ను ఈ తెగ ప్రజలు దేవుడిగా భావిస్తారు

REUTERS

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, టెస్సా వాంగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రిన్స్ ఫిలిప్ మృతికి బ్రిటన్‌తో పాటూ ఆ దేశానికి చాలాదూరంగా పసిఫిక్ దీవులలో ఒక గిరిజన తెగ ప్రజలు కూడా శోకసముద్రంలో మునిగిపోయారు.

దక్షిణ పసిఫిక్ ప్రాంతంలోని టన్నాలో వనువాటు ద్వీపంలోని రెండు గ్రామాల ప్రజలు డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరాను దైవంగా భావిస్తారు.

సోమవారం ప్రిన్స్ ఫిలిప్‌కు నివాళులు అర్పించేందుకు ఆ ప్రాంతపు గిరిజనులంతా ఒక చోటుకి వచ్చారు.

"టన్నా దీవులలోని ప్రజలకు, ఆంగ్లేయులకు ఉన్న బంధం చాలా బలమైనది. మేము మా సంతాప సందేశాలను రాయల్ కుటుంబానికి, బ్రిటిష్ ప్రజలకు పంపిస్తున్నాం" అని గిరిజన నాయకుడు చియెఫ్ యపా రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు.

"ఈ గిరిజనులు ప్రిన్స్ ఫిలిప్‌ను తమ కొండ ప్రాంతాల్లో పూజించే శక్తివంతమైన దేవుడిగా భావిస్తారు" అని ఆంత్రపాలజిస్ట్ క్రిక్ హఫ్మాన్ తెలిపారు.

హఫ్మాన్ 1970ల నుంచి ఈ జాతులపై అధ్యయనం చేస్తున్నారు.

పిన్స్ ఫిలిప్ స్మృత్యర్థం వారంతా సమావేశమై కర్మకాండలకు సంబంధించిన నృత్యం చేస్తూ ఊరేగింపు నిర్వహిస్తారని, మగవాళ్లందరూ కావా చెట్టు నుంచి తీసిన కావా పానీయం సేవిస్తారని, ఇదొక ముఖ్యమైన సమావేశమని వనువాటుకు చెందిన జర్నలిస్ట్ డాన్ మెక్‌గ్యారీ తెలిపారు.

అక్కడ ఉన్న పెద్ద మర్రిచెట్టు దగ్గర ప్రజలు గుమికూడి ప్రిన్స్ ఫిలిప్‌ను గుర్తు చేసుకున్నారని మెక్‌గ్యారీ తెలిపారు.

సంతాప సభకు కావా వేర్లు సిద్ధం చేస్తున్న వనువాటు ప్రజలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, సంతాప సభకు కావా వేర్లు సిద్ధం చేస్తున్న వనువాటు ప్రజలు

‘ఒక కథానాయకుడి ప్రయాణం’

ఒక అర్ధ శతాబ్దం పాటూ ప్రిన్స్ ఫిలిప్ విశ్వాసం యాకెల్ మరియు యాహ్నానెన్ గ్రామాలలో కొనసాగింది.

ఒకప్పుడు ఈ విశ్వాసానికి వేల సంఖ్యలో అనుచరులు ఉండేవారు. క్రమంగా వారి సంఖ్య తగ్గుతూ వచ్చిందిగానీ ఇప్పటికీ వందల్లో దీన్ని అనుసరించేవాళ్లు ఉన్నారు.

ఈ గ్రామాల్లో ప్రజలు సాదాసీదా జీవనం కొనసాగిస్తారు. డబ్బు, మొబైల్ ఫోన్‌ల వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అరుదుగా వినియోగిస్తారు.

ఆ ప్రాంతంలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌ వాళ్ల నివాసానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ వాళ్లింకా పాత పద్ధతుల్లోనే జీవిస్తున్నారని మెక్‌గ్యారీ తెలిపారు.

ప్రపంచ మూలాలు టన్నాలోనే ఉన్నాయని, శాంతిని ప్రోత్సహించడమే వారి లక్ష్యమని ఇక్కడి గిరిజనులంతా విశ్వసిస్తారు.

ఇక్కడే ప్రిన్స్ ఫిలిప్ వారి జీవితాల్లోకి వచ్చారు. కాలక్రమేణ ప్రిన్స్ ఫిలిప్ తమ తెగలోని మనిషేనని వాళ్లు నమ్మడం మొదలుపెట్టారు.

ఆయన దైవాంశసంభూతుడని, భవిష్యవాణిని అనుసరించి "శక్తివంతమైన భాగస్వామిని వెతుక్కునే మార్గంలో ఈ దీవులను విడిచిపెట్టి వెళ్లారని వాళ్ల నమ్మకం" అని హఫ్మాన్ తెలిపారు.

"రాణి సహాయంతో బ్రిటన్‌ను పరిపాలిస్తూ శాంతిని, తమ సంస్కృతి గొప్పదనాన్ని ఇంగ్లండ్‌లోనూ, ఇతర ప్రాంతాల్లోనూ వ్యాపింపజేయడమే ప్రిన్స్ ఫిలిప్ లక్ష్యమని వారు విశ్వసిస్తారు. ఈ పనిలో ఆయన విజయం సాధించిన తరువాత టన్నా తిరిగి వచ్చేస్తారని నమ్మకం. కానీ, బ్రిటన్ ప్రజల అత్యాశ, ఈర్ష్యాద్వేషాలు ఆయన విజయానికి సంకెళ్లుగా మారాయని వారి విశ్వాసం" అని హఫ్మాన్ వివరించారు.

"టన్నా సంస్కృతిని అఖండ సామ్రాజ్యంలో విస్తరింపజేయడానికి వచ్చిన అవతార పురుషుడిగా ప్రిన్స్ ఫిలిప్‌ను వారు భావిస్తారు. ఇది ఒక కథానాయకుడి ప్రయాణం. ఒక అన్వేషణకై బయలుదేరి రాణిని, సామ్రాజ్యాన్ని గెలుచుకున్న వీరాధివీరుని గాథ" అని మెక్‌గ్యారీ తెలిపారు.

ఈ విశ్వాసం ఎలా, ఎప్పుడు మొదలైందో ఎవరికీ స్పష్టంగా తెలీదు. ఈ నమ్మకం గురించి పలు సిద్ధాంతాలు వ్యాప్తిలో ఉన్నాయి.

హఫ్మాన్ ప్రకారం.. వనువాటు బ్రిటన్, ఫ్రాన్స్ సంయుక్త పాలన కింద ఉన్నప్పుడు బహుశా వారు క్వీన్‌తో పాటుగా ఉన్న ప్రిన్స్ ఫిలిప్ చిత్రాలు చూసి ఉంటారు. అప్పుడు ఇలాంటి కథలు అల్లి ఉంటారు.

"బ్రిటన్ వలస పాలనను వ్యతిరేకించే దిశలో అక్కడ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి తమ తెగలోని వారేనని, రాణికి మద్దతుగా ఉంటూ సామ్రాజ్యాన్ని పాలిస్తున్నారని కలుపుకునే ప్రయత్నం చేసి ఉండవచ్చు" అని మెక్‌గ్యారీ అభిప్రాయపడ్దారు.

1970లకే ప్రిన్స్ ఫిలిప్ విశ్వాసం ఆ గిరిజనుల్లో నాటుకొని ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు.

1974లో రాణి దంపతులు వనువాటును సందర్శించి, ఈ గిరిజన తెగల వేడుకల్లో పాల్గొని, వారితోపాటూ కావా పానీయం సేవించినప్పుడు ఆ విశ్వాసం మరింత బలపడిందని వారు అంటున్నారు.

వనువాటు తెగ ప్రజలు అడవి మధ్యలో వారి సంప్రదాయ గృహాల్లో నివసిస్తారు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఈ తెగ ప్రజలు అడవి మధ్యలో సంప్రదాయ గృహాల్లో నివసిస్తారు

ఈ నమ్మకాలపై ప్రిన్స్ ఫిలిప్ స్పందన ఏమిటి?

బహిరంగంగా, పిన్స్ ఫిలిప్ వారి నమ్మకాలను అంగీకరించినట్లు తెలుస్తోంది. వారికి ఉత్తరాలు రాస్తూ, ఫొటోలు పంపేవారని, ప్రతిగా వారంతా డ్యూక్‌కు కానుకలు పంపేవారని సమాచారం.

2007లో అనేక మంది వనువాటు గిరిజనులు డ్యూక్‌ను నేరుగా కలిశారు. ఛానల్ 4 టెలివిజన్‌లో వచ్చే మీట్ ది నేటివ్స్ ప్రోగ్రాం కోసం వీరు యూకే వెళ్లారు. ఐదుగురు గిరిజన నాయకులు డ్యూక్‌ను విండ్సర్ ప్యాలస్‌లో కలుసుకున్నారు. డ్యూక్‌కు కానుకలు సమర్పించి, టన్నా ఎప్పుడు తిరిగి వస్తారని అడిగారు.

"సమయం వచ్చినప్పుడు వస్తానని" వారిని సంతోషపెట్టడానికి ప్రిన్స్ ఫిలిప్ చెప్పినట్లు ఆ తరువాత ఒక గిరిజన నాయకుడు తెలిపారు.

ప్రిన్స్ ఫిలిప్ వారి పట్ల ప్రేమతో, ఆదరణతో ఉండేవారని హఫ్మాన్ తెలిపారు.

2018లో ప్రిన్స్ ఛార్లెస్ కూడా వనువాటు వెళ్లి వారితో కలిసి కావా పానీయం సేవించి తన తండ్రికి వారితో ఉన్న బంధాన్ని కొనసాగించారు.

ఇప్పుడూ ప్రిన్స్ ఫిలిప్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు?

డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా మరణంతో వనువాటు ఆదివాసుల సంస్కృతిలో భాగమైన ప్రిన్స్ ఫిలిప్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది పెద్ద ప్రశ్నగా నిలిచింది.

దీనిపై చర్చలు జరుగుతున్నాయి.

వనువాటు సంస్కృతి గురించి తెలిసినవారంతా ప్రిన్స్ ఫిలిప్ కుమారుడు ప్రిన్స్ ఛార్లెస్ ఆయన స్థానాన్ని భర్తీ చేస్తారని అంటున్నారు.

అయితే, ప్రిన్స్ ఫిలిప్ తన నిజ రూపంలోగానీ, ఆత్మగా ఆధ్యాత్మిక రూపంలోగానీ ఎప్పటికైనా టన్నా తిరిగి వస్తారన్నది వారి విశ్వాసం.

విండ్సర్ ప్యాలెస్‌లో శాశ్వతనిద్రలోకి చేరుకున్న ప్రిన్స్ ఫిలిప్ ఆత్మ పసిఫిక్ సముద్ర తరంగాలు దాటుకుంటూ తన సొంతభూమికి తిరుగు ప్రయాణమైందని వాళ్లు నమ్ముతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)