డయానా ఇంటర్వ్యూ: బీబీసీ జవాబులు చెప్పాల్సిన ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయన్న టోరీ ఎంపీ

బోస్నియాలో డయానా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డయానా ఇంటర్వ్యూను సంపాదించిన తీరు పై బీబీసీ క్షమాపణ చెప్పింది
    • రచయిత, ఎల్లా విల్స్, ఫ్రాన్సెస్కా గిల్లెట్
    • హోదా, బీబీసీ న్యూస్

వేల్స్ యువరాణి డయానా బీబీసీ పనోరమాకు ఇచ్చిన ఇంటర్వ్యూపై వచ్చిన వివాదం గురించి విచారణ ముగిసింది. కానీ, బీబీసీ సమాధానం ఇవ్వవలసిన ప్రశ్నలు ఇంకా మిగిలి ఉన్నాయని ఒక సీనియర్ టోరీ పార్లమెంట్ సభ్యుడు అన్నారు.

1995లో డయానా ఇంటర్వ్యూ సంపాదించేందుకు బీబీసీ ప్రతినిధి మార్టిన్ బషీర్ తప్పుడు మార్గాలు అవలంబించారని ఆ నివేదిక వెల్లడించింది.

బషీర్ 2016లో బీబీసీలో తిరిగి కరెస్పాండెంట్ గా చేరి, రిలీజియన్ ఎడిటర్‌‌గా ఎలా పదోన్నతి సంపాదించారో తెలుసుకోవాలని ఉందని బీబీసీ సంస్థను పరిశీలించే కమిటీ చైర్మన్ జూలియన్ నైట్ ప్రశ్నించారు.

బుధవారం ప్రైవేటు కమిటీ సమావేశం జరగడానికి ముందు ఆయన బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవికి లేఖ రాశారు.

బషీర్ అబద్ధం చెప్పినట్లు తెలిసిన తర్వాత యూఎస్ న్యూస్ నుంచి, కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను చాట్ నెట్ వర్క్ నుంచి 2013లో ఆయనను ఉద్యోగంలోంచి తొలగించిన తర్వాత కూడా బీబీసీ ఆయనను తిరిగి 2016లో కరెస్పాండెంట్‌గా చేర్చుకుని, రిలీజియన్ ఎడిటర్‌‌‌గా పదోన్నతి ఇవ్వడానికి కారణాలేంటని ఆయన బీబీసీ-4 కార్యక్రమంలో ప్రశ్నించారు.

"ఆయన ఉద్యోగంలో భాగంగా నిర్వహించిన విధులు నాకు తెలియాలి. ఆయన ప్రసారాల్లో కూడా పెద్దగా కనిపించలేదు" అని హౌస్ ఆఫ్ కామన్స్ డిజిటల్, కల్చర్, మీడియా అండ్ స్పోర్ట్ కమిటీ చైర్మన్ నైట్ అన్నారు.

బషీర్ పోస్టును చాలా పోటీ తర్వాత నింపినట్లు చెబుతూ ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవడాన్ని బీబీసీ సమర్ధించుకుంది. ఎటువంటి చెల్లింపులు లేకుండానే బషీర్ బీబీసీ విధుల నుంచి మే నెలలో వైదొలిగారు.

నకిలీ బ్యాంకు పత్రాలు సృష్టించినట్లు సూచనలందించిన మ్యాట్ వీస్లర్ లాంటి వారికి పరిహారం ఇచ్చేందుకు బీబీసీ విశాల దృక్పథంతో ఉండాలని నైట్ అన్నారు.

సంస్థలో ఎడిటోరియల్ విధానాలను పటిష్ఠ పరచకుండా కొత్త ఎడిటోరియల్ బోర్డును నియమించాలని పిలుపునిచ్చిన మాజీ బీబీసీ చైర్మన్ లార్డ్ హాల్ ప్రతిపాదనను కూడా ప్రశ్నించారు.

"ఇదంతా భారీ జీతాలు తీసుకుంటున్న వ్యక్తులు కబుర్లు చెప్పుకునే దుకాణంలా ఉందేమో అని అనిపిస్తోంది" అని అన్నారు.

"బషీర్ నమ్మశక్యం కాని అబద్ధాలు చెప్పే వ్యక్తి. 1995లో జరిగిన ఇంటర్వ్యూ గురించి సమాధానాలు చెబుతూ సంస్థ తమ అత్యున్నత ప్రమాణాల నుంచి పడిపోయింది" అని మాజీ సీనియర్ న్యాయమూర్తి లార్డ్ డైసన్ చేసిన స్వతంత్ర విచారణ నివేదిక పేర్కొంది.

బీబీసీ చేసిన ఇంటర్వ్యూ తమ తల్లితండ్రుల మధ్య సంబంధాన్ని మరింత దారుణంగా చేయడానికి ఆజ్యం పోసిందని బీబీసీ వైఫల్యాల గురించి మాట్లాడుతూ డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జ్ అన్నారు.

ఈ ఇంటర్వ్యూ వలన కలిగిన వేదన గురించి డ్యూక్ ఆఫ్ సస్సెక్స్ కూడా మాట్లాడారు.

ప్రిన్సెస్ డయానా కేవలం బషీర్ వల్ల కాదు, బీబీసీలోని పెద్దల వల్ల విఫలమయ్యారన్న ప్రిన్స్ విలియమ్స్
ఫొటో క్యాప్షన్, ప్రిన్సెస్ డయానా కేవలం బషీర్ వల్ల కాదు, బీబీసీలోని పెద్దల వల్ల విఫలమయ్యారన్న ప్రిన్స్ విలియమ్స్

డయానా ఇచ్చిన ఇంటర్వ్యూ 1995లో ప్రసారమైంది.

గతంలో రాజకుటుంబానికి చెందిన వారెవరూ రాజ కుటుంబం గురించి, ఇతర కుటుంబ సభ్యుల గురించి అంత బహిరంగంగా మాట్లాడిన సందర్భాలు ఎప్పుడూ లేవు.

ఈ ఇంటర్వ్యూ తర్వాత కొన్ని రోజులకు ప్రిన్స్‌ ఛార్లెస్‌, ప్రిన్సెస్‌ డయానాలు విడాకులు తీసుకోవాలని సూచిస్తూ బ్రిటన్‌ రాణి వారిద్దరికీ లేఖ రాశారు.

డయానా 1997లో ప్యారిస్‌లోని పాంట్‌ డి ఐ అల్మా టన్నెల్ దగ్గర జరిగిన కారు ప్రమాదంలో మరణించారు.

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలన్నిటినీ తీసుకోవాలని ఈ విచారణ నివేదికకు స్పందిస్తూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు.

బీబీసీ నిర్వహణలో సంస్కరణలు అవసరమని మంత్రులు సూచించారు.

వచ్చే సంవత్సరం మధ్యలో సంస్థ రాయల్ చార్టర్‌ను సమీక్షిస్తామని చెప్పారు. ఇది బీబీసీ నిర్వహణ గురించి ఈ సంస్థ బ్రిటిష్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం.

ఈ చార్టర్ సమీక్ష బీబీసీ సంస్థకు హెల్త్ చెక్ లాంటిదని, బీబీసీ నిర్వహణను మెరుగుపరిచే పనిని ప్రస్తుతం ఉన్న బోర్డుకు అప్పగిస్తారని న్యూస్ నైట్ నికోలస్ వైట్ చెప్పారు.

బీబీసీ నిర్వహణలో 1990ల నుంచి చాలా ప్రాథమిక మార్పులు చేసినట్లు బీబీసీ చెప్పింది.

బీబీసీ పై నమ్మకాన్ని తిరిగి పొందేందుకు కొన్ని చర్యలను చేపట్టాలని బీబీసీ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కారోలిన్ థాంసన్ పిలుపునిచ్చారు.

ఎడిటోరియల్ బోర్డులో మార్పులకు బదులుగా కొత్త నాన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులొకరు ఉండాలని సూచించారు. ఆ వ్యక్తి వార్తలు, ఎడిటోరియల్ వ్యవహారాలు చూసుకోవడంతో పాటు పారదర్శకతకు ప్రతినిధిగా ఉండాలని అన్నారు. ఎవరైనా విజిల్ బ్లో చేయాలని అనుకున్నప్పుడు అందుబాటులో ఉండాలని ఆమె అన్నారు.

మార్టిన్ బషీర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డయానా...

చార్లెస్‌కు కెమిలా పార్కర్‌తో సంబంధం ఉన్నట్లు చెప్పారు (ఆమె ఇప్పుడు చార్లెస్ భార్య, డచెస్‌ ఆఫ్ కార్నివల్). వీరి సంబంధం తన విలువను తగ్గిస్తోందని చెప్పారు. తాము ముగ్గురం వివాహ బంధంలో ఉన్నామని చెప్పారు.

డయానా ఇంటర్వ్యూను సంపాదించడానికి బషీర్ అబద్దాలు చెప్పారని డయానా సోదరుడు ఎర్ల్‌ స్పెన్సర్ ఆరోపించారు. కొన్ని నకిలీ బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను చూపించారని, వాటిని చూపించి, తనను నమ్మించి, ప్రిన్సెస్‌ డయానా ఇంటర్వ్యూ సంపాదించేందుకు ప్రయత్నించారన్నారు.

దాంతో గత సంవత్సరం బీబీసీ స్వతంత్ర విచారణకు ఆదేశించింది.

ఈ విచారణలో ఏమి తేలింది?

బషీర్ నకిలీ పత్రాలను సృష్టించారు. డయానా సోదరుడు ఎర్ల్ స్పెన్సర్ నమ్మకాన్ని చూరగొని, ఇంటర్వ్యూ సంపాదించేందుకు ఆమెపై నిఘా ఉన్నట్లు సూచించే విధంగా నకిలీ పత్రాలను రూపొందించారు.

ఈ వార్త పై మీడియా ఆసక్తి పెరగగానే బీబీసీ బషీర్ ఇంటర్వ్యూ సంపాదించిన విషయాన్ని దాచిపెట్టింది.

ఈ అంశం పై 1996లో డైరెక్టర్ ఆఫ్ న్యూస్ టోనీ హాల్ నిర్వహించిన అంతర్గత విచారణ ప్రభావవంతంగా లేదు.

అయితే, ఈ ఇంటర్వ్యూ గురించి ఎటువంటి అభ్యంతరాలూ లేవని, బషీర్ తనకు నకిలీ పత్రాలు చూపించలేదని డయానా చెప్పారు.

ఆమె ఇచ్చిన ఆధారాలను బీబీసీ పరిగణనలోకి తీసుకుని, ఆమె ఇంటర్వ్యూను నకిలీ పత్రాలు ప్రభావితం చేయలేదని తీర్మానించింది.

కానీ, డయానాను ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ప్రభావితం చేయడానికి ఆ పత్రాలను ఎర్ల్ స్పెన్సర్ కు చూపించి ఉంటారని డైసన్ విచారణ తెలిపింది.

మార్టిన్ బషీర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మార్టిన్ బషీర్

మార్టిన్ బషీర్ ఏమంటున్నారు?

"1995లో బీబీసీ పనోరమా ఇంటర్వ్యూ ద్వారా ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ డయానాకు హాని తలపెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. అలా చేశామని నేను భావించట్లేదు" అని మార్టిన్ బషీర్ అన్నారు.

బషీర్ సండే టైమ్స్‌తో మాట్లాడుతూ "ఆమె కుమారులు డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జ్, డ్యూక్ ఆఫ్ ససెక్స్‌లకు హృదయపూర్వక క్షమాపణలు తెలుపుకుంటున్నానని" చెప్పారు.

అయితే, ఆమె మానసిక రుగ్మతకు ఆజ్యం పోశారంటూ ప్రిన్స్ విలియం చేసిన ఆరోపణలను బషీర్ ఖండించారు.

వారిద్దరూ చాలా సన్నిహితులని, ఆమెను తాను ఎంతో ఇష్టపడ్డానని తెలిపారు.

1990ల ప్రారంభంలో కూడా అనేక రకాల కథలు, రహస్యంగా రికార్డ్ చేసిన ఫోన్ సంభాషణలు చలామణిలో ఉన్నాయని, అవేవీ తాను సృష్టించినవి కావని బషీర్ అన్నారు.

ఆ ఇంటర్వ్యూ గురించి ప్రిన్సెస్ డయానా ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తపరచలేదని, ఆ కార్యక్రమం తరువాత కూడా వారిద్దరి మధ్య స్నేహం కొనసాగిందని ఆయన చెప్పారు.

"ఇంటర్వ్యూ వ్యవహారం మొత్తం ఆమె కోరుకున్నట్లుగానే జరిగింది. ప్యాలస్‌లో చెప్పడం దగ్గర నుంచి ప్రసారం కావడం వరకూ, ఇంటర్వ్యూలోని అంశాలతో సహా ఆమె చెప్పిన ప్రకారమే జరిగింది.

ఈ వ్యవహారంలో తప్పంతా నామీదే తోసేయడం న్యాయం కాదు. కానీ, నేను చేసిన కొన్ని తప్పులకు పశ్చాత్తాపం చెందుతున్నానని తెలిపేందుకు ప్రజలు నాకు అవకాశం ఇస్తారని భావిస్తున్నాను" అని బషీర్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)