ఇమ్రాన్ ఖాన్‌‌ అరెస్టుపై పాకిస్తాన్ ఆర్మీ వైఖరి ఏమిటి? ఆయనకు ఎవరి మద్దతు ఉంది?

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల భద్రతా బలగాలు అరెస్టు చేశాయి.

ఇమ్రాన్‌ అరెస్ట్‌పై చాలా కాలంగా చర్చ సాగుతోంది.

ఇమ్రాన్ అరెస్టుకు కారణాలు, పాకిస్తాన్‌లో రాజకీయ పరిస్థితులు, ఇమ్రాన్ పట్ల సైన్యం వైఖరి, ఇతర అంశాలపై బీబీసీ హిందీ ప్రతినిధి ప్రేరణ అడిగిన ప్రశ్నలకు బీబీసీ ఉర్దూ ఎడిటర్ ఆసిఫ్ ఫరూఖీ సమాధానాలు ఇచ్చారు.

ఇమ్రాన్ మద్దతుదారులు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఇమ్రాన్ అరెస్టుకు నిరసనగా ఆయన మద్దతుదారులు నిరసన చేశారు.

అకస్మాత్తుగా ఇమ్రాన్ అరెస్టుకు దారితీసిన పరిస్థితులేంటి?

సమాధానం: ఇది అకస్మాత్తుగా జరిగింది కాదు. బ్యాక్‌గ్రౌండ్లో చాలానే జరిగింది.

నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) అనేది పాకిస్తాన్‌లో అవినీతి నిర్మూలనకు బాధ్యత వహించే సంస్థ.

అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు, ఆయన భార్యకు నోటీసులు పంపారు. ఇందులో ఆయన్ను హాజరుకావాలని కోరడంతోపాటు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా అడిగారు.

దానికి ఇమ్రాన్ సమాధానం చెప్పకపోవడం అరెస్టుకు దారితీసింది.

ఈ కేసు ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న కాలానికి సంబంధించినది.

ఆధ్యాత్మికత, సూఫీవాదంపై పని చేయడానికి పంజాబ్ (పాకిస్తాన్)లో ఒక విశ్వవిద్యాలయాన్ని నిర్మించడానికి ఇమ్రాన్ అనుమతి ఇచ్చారు.

ఆ యూనివర్సిటీని నిర్మించేందుకు పంజాబ్ ప్రభుత్వం కొంత స్థలాన్ని కొనుగోలు చేసింది.

ఆ భూమి కొనుగోలులో ఇమ్రాన్‌ ఖాన్‌, ఆయన భార్య అవినీతికి పాల్పడ్డారని నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో అభిప్రాయపడింది.

భూమిని అక్రమంగా కొనడం వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. దీని ఆధారంగానే కొన్ని నెలల క్రితం ఇమ్రాన్ ఖాన్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయి.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, KHALID CHAUDHARY

ఎన్ఏబీ ఎవరి చేతుల్లో ఉంది? అది ఎలా పని చేస్తుంది?

సమాధానం: నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) గత కొన్నేళ్లుగా వివాదాస్పద సంస్థగా మారింది.

దీనిని పర్వేజ్ ముషారఫ్ హయాంలో ఏర్పాటుచేశారు. ప్రతిపక్ష నేతల నోరు మూయించేందుకు ఆయన ఎన్ఏబీని చాలా వరకు ఉపయోగించుకున్నారు.

ఈ సంస్థకు చాలా అధికారాలున్నాయి. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో ఎవరినైనా అరెస్టు చేసి, 60 రోజుల పాటు రిమాండ్‌లో ఉంచగలదు.

ఇమ్రాన్‌ ఖాన్‌ హయాంలో పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ నేతలు కూడా ఎన్ఏబీ కస్టడీలో ఉన్నారు. ఇందులో నవాజ్ షరీఫ్, మరియం నవాజ్ కూడా ఉన్నారు.

ఎన్ఏబీ సంస్థకు విస్తృత అధికారాలు ఉన్నాయని, దాని సాయంతో ప్రతిపక్ష నాయకులపై చర్యలు తీసుకుంటున్నారని ఇమ్రాన్ ఖాన్ తర్వాత వచ్చిన ప్రభుత్వం భావించింది. దీంతో ఎన్ఏబీ అధికారాలను తగ్గించారు.

నేటి నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ)కి ఏడాది క్రితం ఉన్నదాని కంటే చాలా తక్కువ అధికారాలే ఉన్నాయి. గత ప్రభుత్వాలు తమ రాజకీయ అజెండా కోసం ఈ సంస్థను ఉపయోగించుకున్నాయి.

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

ఇమ్రాన్ ఖాన్‌కు ఉన్న న్యాయపరమైన మార్గాలేమిటి?

సమాధానం: ఇది చట్టపరమైన అంశం కంటే ఎక్కువగా రాజకీయ అంశం. చట్టపరంగా వారు ఉపశమనం పొందుతున్నారు. ఆపై కొత్త కేసులు నమోదు చేస్తున్నారు.

నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో చట్టాలు నిరుడు ఉన్నంత ప్రభావవంతంగా లేవు.

అప్పుడు కష్టపడి బెయిల్ తెచ్చుకునేవారు. రెండేళ్లుగా బెయిల్ దొరక్కపోయేది.

ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ లభించడం సులభం.

పాకిస్తాన్‌లో రాజకీయ నాయకులపై అవినీతి కేసులను చట్టపరంగానే కాకుండా రాజకీయ కోణంలోనూ చూడాలి.

అప్పుడే విషయం ఎక్కడి వరకు వెళుతుందో అంచనా వేయవచ్చు.

ఇమ్రాన్ ఖాన్ విషయంలో కూడా న్యాయపరమైన చర్చకు పెద్దగా ప్రాధాన్యం లేదు. నిజానికి రాజకీయ పరిస్థితులు మొత్తం వ్యవహారాన్ని ప్రభావితం చేస్తున్నాయి.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

సైన్యం, న్యాయవ్యవస్థ వైఖరి ఏమిటి?

సమాధానం: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి ఆయనకు కోర్టు నుంచి చాలా మద్దతు లభించడం మనం చూశాం.

తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీకి, ఇమ్రాన్ ఖాన్‌కు అనుకూలంగా కోర్టులో నిర్ణయాలు వెల్లడిస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ ప్రత్యర్థులు ఆరోపించడం ప్రారంభించారు.

ఇంతకుముందు కూడా ఇమ్రాన్‌ను అరెస్టు చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆయనకు కోర్టు నుంచి ఉపశమనం లభించింది.

కోర్టు ముందు హాజరుపరిచే వరకు ఆయనపై అరెస్ట్ వారెంట్‌లను కోర్టులు సస్పెండ్ చేశాయి.

కోర్టుకు హాజరైనప్పుడల్లా ఆయనకు బెయిల్‌ వచ్చింది.

రాజకీయ వ్యవహారాల్లో ఆర్మీ జోక్యాన్ని తగ్గిస్తామని ఏడాది క్రితం పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది.

ఏడాదిన్నర కాలంగా ఆర్మీ రాజకీయాలకు చాలా దూరంగా ఉందని నిపుణులు భావిస్తున్నారు.

అయితే పాకిస్తాన్ అధికార కారిడార్‌లో దీని వల్ల ఏర్పడిన శూన్యతను కోర్టులు భర్తీ చేశాయి.

ఇమ్రాన్‌ ఖాన్‌కు కోర్టు చాలా ఊరట ఇస్తుండటంతో ఇమ్రాన్ ప్రజల ముందు నిలదొక్కుకుంటున్నట్లే కనిపిస్తోంది.

సైన్యంలో తనకు మద్దతిచ్చే వ్యక్తులు ఉన్నారని, కోర్టు నుంచి తనకు మద్దతు లభిస్తోందని ఇమ్రాన్‌ చెప్పారు.

ఇమ్రాన్‌ పాకిస్తాన్‌లో అసాధారణమైన మద్దతు పొందారు, దానిని బాగా ఉపయోగిస్తున్నారు కూడా.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, EPA

ఈ అరెస్టు రాజకీయంగా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఈ ఏడాది పాకిస్తాన్‌లో ఎన్నికలు జరుగుతాయా?

సమాధానం: ఈ అరెస్టు ఫలితం ఎలా ఉంటుందంటే ఇమ్రాన్‌‌ను ఎంత కాలం రిమాండ్‌లో ఉంచుతారనే దానిపై ఆధారపడి ఉంటుంది.

ఇమ్రాన్‌ నెల రోజుల్లో బెయిల్‌పై బయటకు వస్తే ఆయన రాజకీయ జీవితం మరింత బలపడుతుంది.

ఎన్నికలు ముగిసే వరకు ఇమ్రాన్‌ రిమాండ్‌లోనే ఉంటే తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌ విఫలమైనట్లే.

పాకిస్తాన్‌లో తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ వ్యక్తి పార్టీ. ఇమ్రాన్‌ రోడ్డుపైకి వస్తే ప్రజలు రోడ్డుపైకి వస్తారు. ఇమ్రాన్ స్వయంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లకపోతే పీటీఐకి కష్టమే.

దీనికి రెండు కారణాలు ఉన్నాయి. అభ్యర్థులకు టికెట్లు ఇచ్చే విషయంలో పార్టీ చాలా సమస్యలను ఎదుర్కొంటుంది. రెండోది ఇమ్రాన్ విజ్ఞప్తి ప్రజలకు చేరనపుడు పార్టీ నష్టపోయే అవకాశం ఉంది.

స్టాక్ మార్కెట్

ఫొటో సోర్స్, Getty Images

భయపడుతున్న స్టాక్ మార్కెట్ బ్రోకర్లు

ఇమ్రాన్ అరెస్ట్ పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపింది. మంగళవారం స్టాక్ మార్కెట్ సూచీ 400 పాయింట్లకు పైగా పతనమయింది.

స్టాక్ మార్కెట్ నిపుణుడి అభిప్రాయం ప్రకారం దేశంలోని రాజకీయ-ఆర్థిక పరిస్థితుల కారణంగా స్టాక్ మార్కెట్ ఇప్పటికే ఒత్తిడిలో ఉందన్నారు.

ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్టు కారణంగా అది మరింత పడిపోయిందని తెలిపారు.

మార్కెట్‌లో గందరగోళ పరిస్థితి ఏర్పడి గంట వ్యవధిలోనే షేర్లను విక్రయించేందుకు పోటీ పడ్డారు.

ఇమ్రాన్ అరెస్టుతో దేశంలో రాజకీయ అస్థిరత పెరుగుతుందని, దాని ప్రభావం స్టాక్ మార్కెట్‌పై పడుతుందని స్టాక్ మార్కెట్ బ్రోకర్లు భయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)