అక్బర్ X మహారాణా ప్రతాప్: ఇది హిందూ, ముస్లింల మధ్య పోరాటమా?

అక్బర్ vs మహారాణా ప్రతాప్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, హర్బంస్ ముఖియా
    • హోదా, చరిత్రకారుడు

మహారాణా ప్రతాప్ గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, చరిత్రకారులు ఆయన్ను ఏ కోణంలో చూస్తున్నారు?

మహారాణా ప్రతాప్‌కు చరిత్రకారులు అన్యాయం చేశారని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల వ్యాఖ్యానించారు. ‘‘అక్బర్‌ను గొప్ప చక్రవర్తిగా చెబుతారు. కానీ, మహారాణా ప్రతాప్ గొప్పవాడని ఎవరూ ఎందుకు చెప్పరు?’’ అని ఆయన అన్నారు. మహారాణా ప్రతాప్‌ను ‘‘నేషనల్ హీరో’’గా ఆయన కొనియాడారు.

చరిత్రను తిరగరాయాలనే తన సంకల్పాన్ని ఇలాంటి వ్యాఖ్యలతో కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటిస్తోందా? అక్బర్‌ను కేవలం విదేశీ చక్రవర్తిగానే చూడాలా? ఆయన కంటే మహారాణా ప్రతాప్ గొప్పవారా? హల్దీఘాటీ యుద్ధంలో అక్బర్‌ను ఆయన ఓడించారా? అక్బర్-మహారాణా ప్రతాప్‌ల మధ్య పోరాటం హిందూ-ముస్లింల మధ్య పోరాటంగా చూడాలా? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం చరిత్రకారుడు హర్బంస్ ముఖియాతో బీబీసీ ప్రతినిధి రజనీశ్ కుమార్ మాట్లాడారు.

మధ్యయుగంనాటి చరిత్రపై పరిశోధన చేపట్టిన ప్రముఖ చరిత్రకారుల్లో ముఖియా ఒకరు. ప్రస్తుతం దిల్లీలోని జవహర్‌లాల్ యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు.

బీబీసీ ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలు ఆయన మాటల్లోనే చూద్దాం:

‘‘వర్తమానాన్ని నియంత్రించేవారే గతాన్ని కూడా నియంత్రించగలరు’’అని 1984లో జార్జి ఆర్వెల్ తన నవలలో రాసుకొచ్చారు.

అంటే అధికారం మీ చేతుల్లో ఉంటే చరిత్రను మీకు నచ్చినట్లుగా రాసుకోవచ్చు. ఆయన కేవలం నవలలోనే ఆ వ్యాఖ్యలు చేయొచ్చు. కానీ, ప్రస్తుతం అవి నేటి పరిస్థితులకు చక్కగా సరిపోతున్నాయి.

హర్బంస్ ముఖియా
ఫొటో క్యాప్షన్, హర్బంస్ ముఖియా

చరిత్రను వక్రీకరిస్తున్నారు

నేడు తాము చూడాలనుకునే కోణంలో చరిత్రను చూపించే అవకాశం వారికి వచ్చింది. ప్రస్తుతం ఇది రాజస్థాన్‌కే పరిమితమై ఉండొచ్చు. కానీ, భవిష్యత్‌లో దేశంలోని ఇతర ప్రాంతాలకూ ఇది విస్తరించొచ్చు. చరిత్రను నేడు ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నారు.

చరిత్రలోని వాస్తవాలతో వారికి సంబంధం లేదు. అబద్ధాలు చెప్పడంతో వారి రాజకీయ లక్ష్యాలు నెరవేరితే, ఆ అబద్ధాలనే వారు నిజాలుగా ప్రచారం చేస్తారు. చరిత్రను పరిశీలిస్తే, హల్దీఘాటీ దగ్గర మహారాణా ప్రతాప్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన తన గుర్రంపై వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. హల్దీఘాటీ యుద్ధంలో అక్బర్ చేతిలో ఆయన ఓడిపోయారనేది నిజం.

నేను హల్దీఘాటీకి వెళ్లాను కూడా. ప్రముఖ యుద్ధాలు చోటుచేసుకున్న ప్రాంతాలను చూడాలని నాకు చాలా ఆసక్తి. అది కాస్త చిన్న యుద్ధ భూమి. మూడు నుంచి నాలుగు ఫుట్‌బాల్ మైదానాల విస్తీర్ణంలో ఉంటుంది. అక్కడకు లక్షలు లేదా వేల మంది సైనికులు వచ్చి పోరాడటం చాలా కష్టం.

అక్బర్ vs మహారాణా ప్రతాప్

ఫొటో సోర్స్, Getty Images

మహారాణా ప్రతాప్ ఎంత గొప్పవారు?

అంటే, ఆ యుద్ధమేమీ మరీ అంత పెద్ద పోరాటం కాదనే విషయాన్ని మనం గమనించాలి. అక్బర్ ముందు లొంగిపోని ఏకైక రాజ్‌పుత్‌ మహారాణా ప్రతాప్ అయ్యుండొచ్చు. అయితే, ఆ యుద్ధానికి చరిత్రలో అంత ప్రాముఖ్యం లేదు. 16, 17, 18వ శతాబ్దాల్లో అటు రాజ్‌పుత్‌లు, ఇటు ముస్లిం పాలకులు.. ఏ వైపు నుంచి చూసినా ఇదేమీ అంతపెద్ద యుద్ధం కాదు.

ప్రజల దృష్టిలో మహారాణా ఒక హీరో. ఎందుకంటే చివరివరకూ ఆయన అక్బర్ ఎదుట లొంగకుండా పోరాడారు. అందుకే ఆయనను హీరోగా చూస్తారు. ప్రతి హీరోనూ ఒక్కొక్కరు ఒక్కోలా గుర్తుపెట్టుకుంటారు.

అయితే, ఇక్కడ భారత్ గౌరవం కోసం విదేశీయులతో పోరాడిన ‘నేషనల్ హీరో’గా ఆయన్ను చెప్పడం తప్పు. ఎందుకంటే అప్పట్లో అసలు భారత్ ఒక దేశమనే భావనే లేదు.

ఇంగ్లిష్‌లో దేశాన్ని ‘‘కంట్రీ’’గా పిలుస్తారు. అయితే, అక్కడ గ్రామం కూడా ఒక కంట్రీనే. లండన్‌లో పెద్దపెద్ద ప్రముఖలు జీవించే ప్రాంతాలను కంట్రీ హౌస్‌లుగా పిలుస్తారు. ఇక్కడ కంట్రీ అంటే దేశం కాదు. ఇంగ్లిష్‌లో మాత్రమే కాదు. ఫ్రెంచ్‌లోనూ కంట్రీకి ఇలాంటి అర్థముంది.

అక్బర్ vs మహారాణా ప్రతాప్

ఫొటో సోర్స్, Getty Images

దేశమనే భావన ఎలా?

కంట్రీని గ్రామం అనుకుంటే, ఇక్కడ కూడా చాలా గ్రామాలున్నాయి. అందుకే చాలా మంది పట్నా నుంచి కోల్‌కతా వెళ్లినప్పుడు మేం ‘‘పరదేశ్’’కు వెళ్తున్నామని చెబుతారు. ఈ పరదేశ్‌ల గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. నిజానికి దేశం అంటే మీరు పుట్టిన ప్రాంతమనే అర్థముంది. ప్రస్తుతమున్న కంట్రీ అనే పదానికి అర్థం 18, 19వ శతాబ్దాల్లో పుట్టుకొచ్చింది. 16వ శతాబ్దంలో అసలు కంట్రీ అంటే దేశమనే అర్థమని ఎక్కడా లేదు. అలాంటప్పుడు ఇక్కడ దేశమనే పదం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది.

కంట్రీ అంటే దేశమనే భావన చాలాకాలం తర్వాత పుట్టింది. ఇప్పుడు మీరు 19వ శతాబ్దంలో పుట్టిన అర్థాన్ని 16వ శతాబ్దంలోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. అంటే అక్బర్ బలగాలు యుద్ధ విమానాల్లో హల్దీఘాటీకి వెళ్లాయని అనుకోవడమే. తాము చెప్పేదే నిజమని ఎవరైనా పట్టుబడితే, దాన్ని పిచ్చితనమే అనుకోవాలి.

అయితే, ఆ పిచ్చితనం నుంచి వారికి ప్రయోజనం దక్కుతోంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓటు బ్యాంకు రాజకీయాలకు రాజస్థాన్‌ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రైట్ వింగ్‌ సంస్థలు మాత్రమే చరిత్రను వక్రీకరిస్తున్నారని అనుకుంటే పొరపాటే. కమ్యూనిస్టులు కూడా సోవియట్ యూనియన్‌లో అదే చేశారు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

సోవియట్ రష్యా రాసిన చరిత్రలోనూ ఇలాంటి వక్రీకరణలు కనిపిస్తాయి. చరిత్రలో జాతీయవాదాన్ని వారు బలవంతంగా చొప్పించారు. ఇలాంటి వక్రీకరణలు ఎవరైనా చేయొచ్చు. మన దేశంలో ప్రస్తుతం రైట్ వింగ్ అదే చేస్తోంది. భారత స్వాతంత్ర పోరాట సమయంలోనే దీనికి పునాదులు పడ్డాయి.

అప్పట్లో హిందువులు, ముస్లింలు పేరుతో భిన్న వర్గాలు ఉండేవి. ఒక వర్గం మరొక వర్గానికి వ్యతిరేకంగా ప్రచారాలు, వ్యాఖ్యలు చేయడమనేది స్వాతంత్ర్య ఉద్యమంలో కనిపిస్తుంది. ఇవే నీడలు మన చరిత్రలోనూ కనిపిస్తాయి. అందుకే చరిత్రనూ హిందూ వర్సెస్ ముస్లిం జాడలు వెంటాడుతున్నాయి. మతం కోణంలో చాలా మంది చరిత్రను చూస్తుంటారు. కానీ, 1950ల కాలంలో దీనిలో కొత్త మార్పు మొదలైంది. అదే మార్క్సిస్టులు రాసిన చరిత్ర. ఇక్కడ మనకు తరగతుల మధ్య పోరాటం కనిపిస్తుంది.

అయితే, ఈ చరిత్రకారుల సంఖ్య అంత ఎక్కువేమీ ఉండేది కాదు. మొదట డీడీ కౌశంబీ, ఇర్ఫాన్ హబీబ్, ఆర్ఎస్ శర్మ, ఏఆర్ దేశాయ్ లాంటి చరిత్రకారులు ఈ చరిత్రను మలుపులు తిప్పారు. మతపరమైన విభేదాల దగ్గర వారు తరగతుల మధ్య విభేదాల గురించి రాయడం మొదలుపెట్టారు. అయితే, 1980ల నాటికి ఈ చరిత్ర కూడా మరుగునపడటం మొదలైంది. ఎందుకంటే మార్క్సిస్టుల చరిత్రలో చాలా లోటుపాట్లు ఉన్నాయి. మార్క్సిజం వివరించలేని చాలా కొత్త అంశాలు చరిత్ర నుంచి పుట్టుకొచ్చాయి.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

భావోద్వేగాలు, వ్యక్తుల మధ్య సంబంధాలు, పర్యావరణం, జెండర్ కోణాలు ఇలా చాలా అంశాలకు మార్క్సిజంలో వివరణ లేదు. దీంతో మళ్లీ చరిత్రను కొత్త కోణాల్లో చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, 1985 నాటికి పరిస్థితి పూర్తిగా మారింది. హిందూ-ముస్లిం విభేదాల చరిత్ర చాలా లోతుల్లోకి వెళ్లిపోయింది.

ఆనాటి చరిత్రకారుల్లో ఆర్‌సీ మజుందార్‌ను కాస్త ప్రముఖుడిగా చెప్పుకోవాలి. ఆ తర్వాత రాధాకృష్ణ ముఖర్జీ లాంటి వారు పూర్తి హిందూ కోణంలో చరిత్రను చూడటం మొదలుపెట్టారు. అయినప్పటికీ మజుందార్ కాస్త మంచి చరిత్రకారుడే. ఆయనతో వాదించడం చాలా బావుంటుంది. నేను అప్పట్లో కాస్త చిన్నవాడిని, అంతలా మాట్లాడలేకపోయేవాడిని. కానీ, ఆర్ఎస్ శర్మ, ఇర్ఫాన్ హబీబ్ చాలా గట్టిగా వాదించేవారు. నేడు అలా వాదించగలిగే చరిత్రకారులు మనకు కనిపించడం లేదు.

కానీ, ఇప్పుడు చరిత్రలో అంశాలు పూర్తిగా మారిపోయాయి. హిందూ వర్సెస్ ముస్లిం చరిత్రను మళ్లీ తిరగరాయాలని కొందరు భావిస్తున్నారు. మళ్లీ వెనక్కి వెళ్లాలని వారు చూస్తున్నారు. నిజానికి జేమ్స్ మిల్ భారత చరిత్రను మూడు భాగాలుగా విభజించారు. అదే హిందూ కాలం, ముస్లింల కాలం, బ్రిటిషర్ల కాలం.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

హిందూ-ముస్లింల చరిత్ర..

అయితే, జేమ్స్ మిల్ కోణాన్ని భారత్‌లో కొందరు చరిత్రకారులు ఎప్పుడో పక్కనపెట్టేశారు. ఎందుకంటే ఇక్కడ హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు కనిపించడం లేదు. ఉదాహరణకు మహారాణా ప్రతాప్‌ను తీసుకోండి. ఆయన సైన్యానికి ఆయనే నాయకుడు కావచ్చు. మరి ఆయన తర్వాత స్థానంలో ఉన్నదెవరు? ఆయన కమాండర్ హకీం కాన్. ఆయన ఓ ముస్లిం.

ఇప్పుడు అక్బర్ వైపు నుంచి చూడండి. అక్బర్ పక్కనుండే మాన్ సింగ్ ఒక హిందువు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు హిందూ వర్సెస్ ముస్లిం అని ఎలా విభజిస్తారు? ఎందుకంటే అప్పట్లో అలాంటి విభేదాలు లేవు. మహారాణా ప్రతాప్‌కు నమ్మిన బంటు ఒక ముస్లిం. అదే సమయంలో ఆయన పోరాటం చేస్తున్నది హిందువైన రాజా మాన్ సింగ్‌తో. ఇక్కడ హిందూ వర్సెస్ ముస్లిం కోణాన్ని ఎలా తీసుకువస్తారు? నిజానికి అలాంటిదేమీ అప్పుడు లేదు.

మహారాణా ప్రతాప్ హీరో అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎందుకంటే ఎన్నో జానపదాలు, కథల్లో ఆయన గురించి ప్రస్తావన కనిపిస్తుంది. కానీ, ఇక్కడ హిందూ జాతీయవాద రాజు విదేశీయుడితో పోరాడుతున్నారనే కోణాన్ని తీసుకురావడం పూర్తిగా అసంబద్ధం. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవానికి వారు చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది. అప్పుడే చరిత్రను వక్రీకరించాల్సి ఉంటుంది. హల్దీఘాటీలో మహారాణా గెలిచారని చెప్పుకోవాలి. ఆ చరిత్రను చదివే పిల్లలు ఏమంటారు.. అవుననే అంటారు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

వాస్తవాలను గమనించండి

చాలాసార్లు ప్రజలకు వక్రీకరించిన చరిత్రను చెబుతుంటారు. ప్రజలకు అబద్ధాలు చెబుతూ వారిలో గర్వాన్ని పెంపొందించాలని చూస్తారు. ఇక్కడ ప్రజలు కూడా తమ కులం, తమ మతం గురించిన చరిత్రను తెలుసుకోవడానికి చాలా ఆసక్తిని చూపిస్తారు.

చరిత్రను పరిశీలిస్తే, భయమన్నదే లేకుండా పోరాడిన యోధులు చాలా మందే కనిపిస్తారు. మధ్యయుగ చరిత్రను తీసుకుంటే రాజ్‌పుత్‌లు 300 ఏళ్లపాటు మొఘల్ చక్రవర్తులతో పోరాడారు. దానికి ముందు దిల్లీ సుల్తానులతోనూ పోరాడారు. అక్కడ ఎవరిపైనా ఎవరూ పూర్తి విజయం సాధించలేదు. ఆ తర్వాత వచ్చిన మొఘల్ పాలకులు కొందరు రాజ్‌పుత్‌లను తమతో కలుపుకున్నారు.

ఔరంగజేబు రాజ్యంలోనూ మహారాజా జస్వంత్ సింగ్, మహారాజా జై సింగ్ కీలక పాత్ర పోషించారు. అప్పుడు కూడా హిందూ వర్సెస్ ముస్లిం అనే వాదన లేదు. మొఘల్ పాలకులు, రాజ్‌పుత్‌లు.. మొఘల్స్, సిక్కులు.. మొఘల్స్, మరాఠాలు ఇలా యుద్ధాలు జరిగేవి. అయితే, జేమ్స్ మిల్ చెప్పిన ఆ 550 ఏళ్ల ముస్లిం కాలంలో ఒక్క మత ఘర్షణ కూడా చోటుచేసుకోలేదు.

అక్బర్ vs మహారాణా ప్రతాప్

ఫొటో సోర్స్, Getty Images

సెక్యులర్ ప్రాంతాల్లోనే..

చరిత్రలో తొలి మతపరమైన అలర్లు అహ్మదాబాద్‌లో 1713-14ల మధ్య చోటుచేసుకున్నాయి. హోలీనాడు ఒక ఆవును వధించారనే ఆరోపణలు వల్ల అవి చెలరేగాయి. అయితే, 1707లోనే ఔరంగ జేబు చనిపోయారు. అంటే, ఆయన చనిపోయిన ఆరేళ్ల తర్వాతే ఆ అల్లర్లు చోటుచేసుకున్నాయి.

18వ శతాబ్దంలో మొత్తంగా ఇలాంటి ఐదు ఘర్షణలు మాత్రమే చోటుచేసుకున్నాయి. దీనికి మునుపటి మధ్యయుగ కాలంలో అయితే, మతపరమైన అల్లర్లు ఒక్కటీ లేవనీ చెప్పుకోవచ్చు. కానీ, నేడు సెక్యులర్ దేశంలో చాలా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.

నేను ఎందుకు ఈ విషయాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నానంటే ఆనాడు వాస్తవంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. 18వ శతాబ్దంలోనే మొఘల్ సామ్రాజ్యం పతనం కావడం మొదలైంది. దీంతో ప్రజలు కొత్త గుర్తింపుల కోసం చూడటం మొదలుపెట్టారు. ముస్లింలంతా కరడుగట్టిన ముస్లింలా మారాలని షా హజీబుల్లా లాంటివారు అప్పట్లోనే పిలుపునిచ్చారు. ఎందుకంటే తమ మతాన్ని పరిశుద్ధం చేయాల్సిన అవసరమొచ్చిందని హజీబుల్లా భావించారు. 18వ శతాబ్దంలో మొదలైన ఈ కొత్త ఐడెంటిటీలు 19వ శతాబ్దంలో మరింత బలపడ్డాయి.

ఆదిత్యనాథ్

ఫొటో సోర్స్, Getty Images

రాజకీయాల్లోనూ..

అయితే, ముఖ్యంగా 20వ శతాబ్దంలో భారత స్వాతంత్ర్య ఉద్యమం బలపడినప్పుడు ప్రజలు మతాలకు అతీతంగా ఆలోచించడం మొదలుపెట్టారు. అప్పటివరకు మొఘల్ చక్రవర్తులతో జాట్‌లు, సిక్కులు, రాజ్‌పుత్‌లు, మరాఠాల పోరాటాలను కేవలం రాజకీయ, సైనిక పోరాటాలుగానే చెప్పుకోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్పడానికి కాస్త వింతగా అనిపించొచ్చు. కమ్యూనలిజం అనేది మాత్రం ప్రజాస్వామ్యంలో ఒక కోణం. ఎందుకంటే ఇదివరకటి సాధారణ ప్రజలకు రాజకీయాలతో సంబంధం లేదు. కానీ, ప్రజాస్వామ్యంలో ప్రజలు నేరుగా రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు.

అప్పటివరకు పాలకవర్గం ఒకటి ఉండేది. అన్నీ వారే చూసుకునేవారు. కానీ, ప్రజలు జోక్యం చేసుకోవాల్సి వచ్చినప్పుడు, ఇక్కడ భిన్నరకాల మార్గాలు కనిపించాయి. ప్రజల్లో హిందువులు వర్సెస్ ముస్లింలు, బెంగాలీ వర్సెస్ మరాఠీ, పేదలు వర్సెస్ ధనికులు, హిందీ వర్సెస్ తమిళ్.. లాంటివి చాలా వచ్చాయి. వీటన్నింటిలో ప్రధానమైనది హిందూ వర్సెస్ ముస్లిం. ఇక్కడ హిందు-ముస్లింలను కాంగ్రెస్ సోదరులుగా భావిస్తే.. ముస్లిం లీగ్ మాత్రం హిందువులను శత్రువులుగా చూసేది. అయితే, దేశం ప్రజాస్వామ్యం వైపుగా అడుగులు వేసినప్పుడు ఈ ఐడెంటిటీలన్నీ మరింత బలపడ్డాయి.

ఈ ఐడెంటిటీల ఆధారంగా ప్రజలను పార్టీలు సమీకరించడం మొదలుపెట్టాయి. అలా 20వ శతాబ్దంలో మొదలైన హిందూ-ముస్లిం కోణం నేడు మరింత బలపడింది. నేడు ఇది ప్రజాస్వామ్యంలోనూ భాగమైంది. అయితే, కొంత కాలానికి ఇలాంటి విభేదాలన్నీ తొలగిపోతాయని దేశ తొలి ప్రధాన మంత్రి నెహ్రూ భావించారు. కానీ, దీనికి భిన్నంగా పరిస్థితులు మారాయి.

అక్బర్ vs మహారాణా ప్రతాప్

ఫొటో సోర్స్, Getty Images

ఓటు బ్యాంకు రాజకీయాలు

దేశంలోని తొలి సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని పార్టీలు మతాలు, కులాలు, ప్రాంతాల ఆధారంగానే ఓట్లు అడిగాయి. మన సమాజం విద్య, ఆర్థిక అంశాల్లో కాస్త వెనుకబడినది కాబట్టి, ప్రజలకు ప్రజాస్వామ్యంలో కాస్త అనుభవం వస్తే అంతా మెరుగుపడుతుందని నెహ్రూ భావించారు. భవిష్యత్‌లో కులం, మతం, ప్రాంతం అన్ని విభేదాలు తొలగిపోతాయని ఆయన అనుకున్నారు.

అయితే, ఆ తర్వాత కాలంలో అహిర్, జాట్, గుజ్జర్, రాజ్‌పుత్ లాంటి భావాలు మరింత బలపడ్డాయి. కులం పేరుతో ఓటు బ్యాంకులను సృష్టించుకోవడం పార్టీలు మొదలుపెట్టాయి. ఆ తర్వాత కాలంలో ములాయం, లాలూ ప్రసాద్‌ల ఎం-వై (ముస్లిం-యాదవ్) ఫార్ములాలు కూడా వచ్చాయి. ఈ సమీకరణాలు ఓట్లు కూడా కురిపించాయి.

మహారాణా ప్రతాప్‌ను గొప్పగా చూపించడం కూడా ఇలాంటి ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగమే. ఆయన ఒక రాజు. తుది శ్వాస వరకూ పోరాడారు. ఇంతవరకు ఆయన గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. దీనికి మించి ఇక్కడ ప్రాముఖ్యం లేదు. అక్బర్ సామ్రాజ్యంలో మేవాడ్ చాలా చిన్న రాజ్యం. ఆ తర్వాత కాలంలో మహారాణా ప్రతాప్ కుమారుడు జహంగీర్ ఆస్థానంలో పనిచేశారు. ఇవన్నీ చరిత్రలో నిజాలు. దీని ప్రకారం, మహారాణా ప్రతాప్‌కు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి? మేవాడ్‌ను కైవసం చేసుకోవడానికి అక్బర్‌కు అంత కష్టపడాల్సిన అవసరం కూడా రాలేదు. రాణా ప్రతాప్ పోరాడుతున్నప్పుడు మిగతా రాజ్‌పుత్ అలానే మౌన ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు.

అక్బర్ vs మహారాణా ప్రతాప్

ఫొటో సోర్స్, TWITTER

అక్బర్ సామ్రాజ్యం చాలా పెద్దది..

అక్బర్ సామ్రాజ్యం చాలా పెద్దది. అంతేకాదు ఆయన కొత్త పాలనా విధానాన్ని తీసుకొచ్చారు. మునుపటి తరాలతో పోలిస్తే ఆయన రాజ్యం చాలా భిన్నమైనది. ఎర్రకోట పైనుంచే ప్రధాన మంత్రి ఎందుకు ఏటా ప్రసంగిస్తున్నారు? ఎందుకు స్వాతంత్ర్య వేడుకలు ఎర్రకోటపై జరుపుతారు? ఎందుకు ఎర్రకోట అంత ముఖ్యమైనది. సుభాష్ చంద్రబోస్ కూడా ఎర్రకోటపై జెండా ఎగురవేస్తామని అన్నారు. ఎందుకు దానికంత ప్రాధాన్యం? ఎందుకంటే అక్బర్ స్థాపించిన రాజ్యం సంస్కృతి, చరిత్రలకు అది ప్రతీక.

ఏ మతాన్ని అవమానించినా దేవుడిని అవమానించినట్లే అని ఒకసారి అక్బర్ చెప్పారు. అక్బర్ రాజ్యంలో పాలన ఎలా ఉండేదో దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఎర్రకోట పైనుంచే ప్రసంగిస్తుంటారు. ప్రధాన మంత్రి కాకముందు చత్తీస్‌గఢ్‌లో ఎర్రకోటను తలపించే కట్టడం నుంచి మోదీ ప్రసంగమిచ్చారని గుర్తుపెట్టుకోవాలి.

ఇది గొప్పతనం గురించి చెప్పుకోవడం కాదు. చరిత్రలో ఎలాంటి గొప్పతనాల గురించి ఎప్పుడూ పోటీ లేదు. చరిత్రకారులకు ఇలాంటి పోటీల గురించి ఎప్పుడూ పట్టింపు ఉండదు. ఎవరైనా గొప్ప రాజు అంటే ఎందుకు గొప్పవాడో ఆలోచించాలి. ఒకవేళ గొప్పవాడు కాదంటే ఎందుకు గొప్పవాడు కాదో చూడాలి.

వీడియో క్యాప్షన్, ఐదు వేల ఏళ్ల కింద నిర్మించిన డ్రైనేజీ కాల్వలే కాపాడాయంటున్న నిపుణులు

కొందరు శాసనకర్తలు వచ్చి మహారాణా ప్రతాప్ హల్దీఘాటీ యుద్ధంలో గెలిచారని ఎప్పుడు చెబుతున్నారో చూడండి. పైగా కొందరు ప్రొఫెసర్లు దీనికి అవునని తలూపుతున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది?

రాజస్థాన్‌లో రాజ్‌పుత్‌ల జనాభా అంత ఎక్కువేమీ ఉండదు. కానీ, అందరు రాజస్థానీలపైనా రాజ్‌పుతానా అంటే గర్వకారణమనే భావన రద్దుతున్నారు. మన దేశంలో రాజకీయాలు ఎంతలా వెళ్లూనుకున్నాయంటే ప్రతిదాన్ని మనం ఓట్ల కోణంలోనే చూస్తున్నాం.

రాణి పద్మిని విషయంలోనూ ఇలానే జరిగింది. నిజానికి పద్మినీ కథకు జీవం పోసింది మాలిక్ మహమ్మద్ జాయసీ.

చరిత్రలో పద్మినీకి ఆస్తిత్వమే లేదు. జోధాబాయి కూడా అంతే. చరిత్రలో జోధాబాయికి కూడా అస్తిత్వం లేదు. జహంగీర్‌కు జోధ్‌పుర్ నుంచి ఒక భార్య ఉండేవారు. ఆమెనే జోధాబాయి అని పిలిచేవారు. అక్బర్ భార్య జోధాబాయి పూర్తిగా ఒక కాల్పనిక మనిషి. ‘‘జోధా అక్బర్’’ సినిమా తీసిన వ్యక్తి చాలా మంది చరిత్రకారులను చాలా ప్రశ్నలు అడిగారు. కానీ, ఆ సినిమాలో చూపించిన మహిళ నిజంగా ఉందని ఎవరూ ఏ చరిత్రకారుడూ చెప్పలేదు.

వీడియో క్యాప్షన్, మణిపుర్‌లో ఘర్షణలకు కారణాలేమిటి?

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)