భారతీయ స్మారకాల చరిత్రను చెబుతున్న యాప్స్

వాండర్ యాప్

ఫొటో సోర్స్, RUSHATI MUKHERJEE

    • రచయిత, రుషాతి ముఖర్జీ
    • హోదా, కోల్‌కతా

కోల్‌కతాకు చెందిన శీతల్ గనేరివాల్ తాను నివసించే నగర చరిత్ర, సంస్కృతులను తెలుసుకోవడానికి ఇష్టపడతారు.

ఒక ఆడియో యాప్ ఓపెన్ చేసి తన చుట్టూ ఉన్న ప్రదేశాల వివరాలు, వాటి వెనుక కథలను వింటారామె.

31 ఏళ్ల శీతల్ ప్రస్తుతం వాండర్(Wnder) యాప్ వాడుతున్నారు. హెరిటేజ్ వాక్స్ కంపెనీ తీసుకొచ్చిన ఈ ఆడియో యాప్ సహాయంతో ఆమె పశ్చిమబెంగాల్‌లోని తన స్వస్థలంలోని కొన్ని పురాతన స్మారకాలు, ప్రాంతాల గురించి తెలుసుకుంటున్నారు.

చరిత్రపై ఆసక్తి ఉన్న అనేక మంది భారతీయులలో శీతల్ కూడా ఒకరు. ఇలాంటివారిలో కొందరు తమ దేశ చరిత్రను తెలుసుకోవడానికి, దానికి సంబంధించిన అవగాహనను మరింత పెంచుకోవడానికి ఆడియో యాప్స్ వాడుతున్నారు.

వాండర్, ఆగ్‌ట్రావెలర్(AugTraveller), హాప్ఆన్ఇండియా(HopOnIndia), స్టోరీట్రయల్స్(storytrails) వంటి యాప్‌లు ఆయా ప్రదేశాల చరిత్ర చెప్పడంతో పాటు మల్టీమీడియా పర్యటన అనుభూతినీ అందిస్తాయి.

కోల్‌కతాకు చెందిన పురావస్తు శాస్త్రవేత్త తథాగత నియోగి, భాషా మానవ శాస్త్రవేత్త చెల్సియా మెక్‌గిల్‌ల ఆలోచనల నుంచి పుట్టిందే ఈ వాండర్ యాప్. ఇది కోల్‌కతాలోని 5 క్యురేటెడ్ హెరిటేజ్ వాక్‌లు అందిస్తుంది.

ప్రత్యేకమైన వాయిస్ ఓవర్లతో ఆయా ప్రాంతాల చరిత్రకు సంబంధించిన రికార్డింగ్‌లు ఇందులో అందుబాటులో ఉంటాయి.

మే నుంచి ఈ యాప్‌లో పర్యటకులు 360 డిగ్రీల ఫొటోలతో ఆగ్మెంటెడ్ రియాలిటీ టూర్‌లు కూడా చేయడానికి వీలుంటుంది.

శ్రీజీతా సహా

ఫొటో సోర్స్, RUSHATI MUKHERJEE

డీటూర్ అనే అమెరికా కేంద్రంగా పనిచేసే ఓ యాప్ స్ఫూర్తితో ఈ వాండర్ యాప్ రూపొందించారు. కానీ, ఇప్పుడు డీటూర్ యాప్ అందుబాటులో లేదని నియోగి చెప్పారు.

భారత్‌లో అలాంటి యాప్ తయారు చేయాలని 2017లో అనుకున్నాం. నిధుల సమీకరణ వంటివన్నీ పూర్తయి ఆరేళ్ల తరువాత ఇప్పుడు ఈ యాప్ అందుబాటులోకి తేగలిగామని నియోగి చెప్పారు.

మరోవైపు ఆగ్‌ట్రావెలర్ యాప్ భారత్‌లోని వారసత్వ ప్రదేశాల వర్చువల్ మల్టీమీడియా పర్యటనలను అందిస్తుంది. ఆడియో నేరేషన్, 360 డిగ్రీల ఫొటోలు, పర్యాటకులతో సంభాషించగల ఆగ్మెంటెడ్ రియాలిటీ ఆధారిత మోడల్స్ ఇందులో ఉంటాయి.

హోప్‌ఆన్ఇండియా దేశంలోని 14 నగరాలకు చెందిన 116 పర్యటక ప్రాంతాల ప్రత్యక్ష ప్రసారం అందిస్తుంది. ఇందులో ఉన్న మ్యాప్స్ సహాయంతో పర్యటనలు చేయొచ్చు. అలాగే వర్చువల్ టూర్, ఆడియో నెరేషన్ ఇందులో కూడా ఉన్నాయి.

దేశంలోని వేర్వేరు పర్యటక ప్రాంతాల చరిత్రను చెప్పడమే ఈ యాప్‌ల ఉద్దేశమని వీటిని తయారుచేసినవారు చెప్తున్నారు.

‘దిల్లీలోని హుమయూన్ సమాధి వద్ద లోపలి భాగాలు చూడడానికి చాలామంది అక్కడి మెట్లు ఎక్కలేరు. కానీ, మా యాప్‌లోని అనుభవాలు వారికి అక్కడేముందో అర్థం చేసుకోవడానికి సాయపడతాయి’ ఆగ్‌ట్రావెలర్ వ్యవస్థాపకుడు పంకజ్ ముంచాందా చెప్పారు.

పర్యటక ప్రదేశాలకు వెళ్లి అక్కడ చేసే ఖర్చు తగ్గించడం అవసరమని, అందుకే వాండర్ యాప్‌లో ఏడాది పాటు వాక్స్ కోసం రూ. 199 చార్జ్ చేస్తున్నామని నియోగి చెప్పారు. అయితే, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎలాంటి ఖర్చు లేదు.

భారత్‌లాంటి చోట్ల ఇలాంటి యాప్‌ల నిర్వహణ కష్టమని, వినియోగదారుల సంఖ్య తక్కువగా ఉందని నిర్వాహకులు చెప్తున్నారు.

‘ఇందులో పొందుపరిచిన చరిత్ర కథలపై ఎక్కువ మంది ఆసక్తి చూపలేదు. పైగా వీటిని మార్కెట్ చేయడానికి మాకు బడ్జెట్ లేదు’ అని హాప్ఆన్ఇండియా సహ వ్యవస్థాపకురాలు షాలినీ బన్సల్ చెప్పారు.

ఆడియో యాప్

ఫొటో సోర్స్, RUSHATI MUKHERJEE

మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలతో ఈ యాప్‌లు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఆయా మ్యూజియంలు డిజిటలైజ్ కావడంలో, వాకింగ్ టూర్‌లు నిర్వహించడంలో ఇవి సహాయపడుతున్నాయి.

వాండర్, హాప్‌ఆన్‌ యాప్‌లు మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు వాటి సందర్శకుల అనుభవాలను డిజిటలైజ్ చేయడంలో ఉపయోగపడే సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్లాట్‌ఫామ్స్ ఏర్పాటు చేశాయి.

దిల్లీలోని నేషనల్ మ్యూజియం, ముంబయి, బెంగళూరులలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్‌లో హాప్‌ఆన్ అందించే అనుభూతిని పొందొచ్చు.

ఆగ్‌ట్రావెలర్ కూడా దేశంలోని వారసత్వ ప్రదేశాల పర్యటనలను తన సొంత ప్లాట్‌ఫాం నుంచి అందించేందుకు ప్రభుత్వ విభాగాలతో ఒప్పందాలు చేసుకుంది.

కాగా తమ యాప్‌లలో అందించే చారిత్రక సమాచారంలో పొరపాట్లు లేకుండా డొమైన్ ఎక్స్‌పర్ట్స్‌ను నియమించుకుంటున్నారు వీరు.

‘బ్రిటిష్ లైబ్రరీ, వార్తాపత్రికల ఆర్కైవ్స్, ఈస్ట్ ఇండియా కంపెనీ పత్రాలు, కొన్నిచోట్ల స్థానికుల నుంచి తెలుసుకున్న సమాచారం అందిస్తుంటాం’ అని నియోగి చెప్పారు.

కాగా ఈ యాప్‌లు తాము నివసించే నగరాలను సరికొత్తగా అన్వేషించడంతో సహాయపడుతున్నాయని వీటిని వాడుతున్న శ్రీజీత సాహా వంటివారు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)