పాకిస్తాన్: ఇమ్రాన్‌ఖాన్‌‌ను ఎందుకు అరెస్ట్ చేశారు... ఆయన మీద ఉన్న కేసులేంటి?

పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌

ఫొటో సోర్స్, ARIF ALI

పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ అరెస్ట్ అయ్యారు.

ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల భద్రతా బలగాలు మంగళవారం ఆయనను అరెస్టు చేశాయి.

ఇమ్రాన్‌ఖాన్ అరెస్టును పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ న్యాయవాది ఫైజల్ చౌదరీ ధ్రువీకరించారు.

‘‘ఇస్లామాబాద్ హైకోర్టును రేంజర్లు ఆక్రమించారు. లాయర్లను హింసించారు. వారు ఇమ్రాన్ ఖాన్ కారును చుట్టుముట్టారు’’ అని పాకిస్తాన్ ఉపాధ్యక్షుడు ఫవాద్ చౌధరీ ఒక ట్వీట్ చేశారు.

కోర్టు ఆవరణ నుంచి ఇమ్రాన్ ఖాన్‌ను అపహరించారని పీటీఐకి చెందిన అజర్ మశ్వానీ ఆరోపించారు.

ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ నేపథ్యంలో నిరసనలు చేయాలంటూ తమ కార్యకర్తలకు పీటీఐ పిలుపునిచ్చింది.

పీటీఐ నాయకుడు మసరత్ చీమా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

‘‘వారు ఖాన్ సాహెబ్‌ను హింసిస్తున్నారు. ఆయనను చంపుతున్నారు. వాళ్లు, ఖాన్ సాహెబ్‌ను ఏమి చేశారో మాకు తెలియట్లేదు’’ అని వీడియోలో వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌‌‌ను ఎలా అరెస్టు చేశారంటే..

ఎన్‌ఏబీ అదుపులో ఇమ్రాన్ ఖాన్

అల్ కాదిర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసినట్లు ఇస్లామాబాద్ పోలీసులు తెలిపారని బీబీసీ ప్రతినిధి షుమాయిలా జాఫ్రీ చెప్పారు.

కోర్టు బయట భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో కోర్టు బయట గుమిగూడారు. ఇస్లామాబాద్ పోలీసులు చెప్పినదాని ప్రకారం, 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అక్కడ పరిస్థితి అదుపులో ఉంది.

మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అదుపులోకి తీసుకుని నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌ఏబీ)కి అప్పగించారని పాకిస్తాన్ మీడియాలో వార్తలు వచ్చాయి.

పాకిస్తాన్‌లో అవినీతి కేసులను ఎన్‌ఏబీ దర్యాప్తు చేస్తుంది. ఇమ్రాన్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయనను ఎన్‌ఏబీ కార్యాలయానికి తీసుకెళ్లినట్లు పాక్ మీడియా పేర్కొంది.

తనపై ఉన్న ఇతర కేసుల్లో బెయిల్ పొందడానికి మంగళవారం ఇమ్రాన్‌ఖాన్ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఆవరణలోనే మరో కేసు విషయంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు చేరుకోవడాని కంటే ముందే, ఎన్‌ఏబీ బృందం అక్కడ ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

ఇమ్రాన్ ఖాన్

పోలీసులకు హైకోర్టు సమన్లు

ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్ట్ తర్వాత పోలీసులకు ఇస్లామాబాద్ హైకోర్టు సమన్లు జారీ చేసింది.

పాకిస్తాన్ హోం శాఖ కార్యదర్శి, ఇస్లామాబాద్ ఐజీ, అదనపు అటార్నీ జనరల్‌లను కోర్టుకు హాజరు కావాల్సిందిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అమీర్ ఫరూఖ్ ఆదేశించారు.

బీబీసీ ప్రతినిధి షహజాద్ మలిక్ ప్రకారం ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, కోర్టు ఆవరణలో జరిగిన విధ్వంసానికి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఇస్లామాబాద్ హైకోర్టు ప్రాంగణం నుంచి ఇమ్రాన్ ఖాన్‌ను బయటకు వెళ్లనివ్వరాదని లాయర్లు వాదించచగా చీఫ్ జస్టిస్ కల్పించుకున్నారు. ఇంతకు ఇమ్రాన్‌ఖాన్‌ను ఏ కేసులో అరెస్ట్ చేశారో ముందుగా తేల్చాలని అమీర్ ఫరూఖ్ వ్యాఖ్యానించారు.

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, EPA

అల్ కాదిర్ ట్రస్ట్ కేసు

అల్ కాదిర్ యూనివర్సిటీ ప్రాజెక్ట్ కోసం 2019 డిసెంబర్ 26న అల్ కాదీర్ ట్రస్ట్‌ను రిజిస్టర్ చేశారు.

ఈ ట్రస్ట్‌కు ట్రస్టీలుగా ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీ ఉన్నారు.

బహ్రియా టౌన్‌కు సంబంధించి తన క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న కొన్ని రోజులకే ఇమ్రాన్ ఖాన్ ఈ ట్రస్ట్‌ను రిజిస్టర్ చేశారు.

యూనివర్సిటీ కోసం బహ్రియా టౌన్ ప్రాజెక్ట్ విరాళం ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి.

బహ్రియా టౌన్ సీఐఓ మలిక్ రియాజ్, ఆయన కుటుంబీకులకు ప్రయోజనం చేకూర్చారని ఇమ్రాన్‌ఖాన్‌పై ఆరోపణలు వచ్చాయి.

అల్ కాదిర్ ట్రస్టుకు అందిన విరాళాలపై ఎన్‌ఏబీ దర్యాప్తు చేస్తోంది.

ఈ కేసులోనే ఇప్పుడు ఇమ్రాన్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఇమ్రాన్ ఖాన్‌పై ఇతర కేసులు కూడా నడుస్తున్నాయి.

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, GOVERNMENT OF PAKISTAN

తోశఖానా కేసు

2022 అక్టోబర్‌లో పాకిస్తాన్ ఎన్నికల సంఘం ఇమ్రాన్ ఖాన్‌పై అనర్హత వేటు వేసింది. తోషాఖానా కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ వచ్చే అయిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత విధించింది.

ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్నప్పుడు తోశఖానా నుంచి తీసుకున్న బహుమతుల గురించి అధికారులకు సరైన సమాచారం ఇవ్వలేదని ఎన్నికల సంఘం పేర్కొంది.

తనపై వచ్చిన ఆ ఆరోపణలు తప్పు అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

ప్రధాని పదవిలో ఉన్నప్పుడు తోశఖానాలోని ఖరీదైన బహుమతులను తన ప్రయోజనాల కోసం అమ్ముకున్నారని ఇమ్రాన్ ఖాన్‌పై ఆరోపణలు వచ్చాయి.

ఎన్నికల సంఘానికి ఇచ్చిన డిక్లరేషన్‌లో ఇమ్రాన్‌ఖాన్ తన ఆస్తుల వివరాలను ఇవ్వలేదు.

ప్రధానిగా ఉన్నప్పుడు వచ్చిన విలువైన గడియారాలు, ఇతర బహుమతులను ఇమ్రాన్ ఖాన్ విక్రయించారని, క్రిమినల్ చట్టాల ప్రకారం ఈ కేసులో ఆయనకు శిక్ష విధించాలంటూ జిల్లా కోర్టులో ఎన్నికల సంఘం ఫిర్యాదు నమోదు చేసింది. 1974లో పాకిస్తాన్‌లో తోషాఖానాను ఏర్పాటు చేశారు. విదేశీ పర్యటనల్లో పాకిస్తాన్ దేశాధ్యక్షుడు, ప్రధానమంత్రి, మంత్రులు, బ్యూరోక్రాట్లకు లభించిన విలువైన బహుమతులను ఈ తోశఖానాలో భద్రపరుస్తారు. ఇది ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది.

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, SHAHZAIB AKBER/EPA-EFE/REX/SHUTTERSTOCK

మహిళా జడ్జిని అవమానించిన కేసు

ఇమ్రాన్‌ఖాన్‌పై ఒక మహిళా జడ్జిని అవమానించిన కేసు కూడా ఉంది.

2022 ఆగస్టులో ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు షాబాజ్ దేశద్రోహం కేసులో అరెస్టయ్యారు. షాబాజ్‌ను వేధిస్తున్నారంటూ ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు చేశారు.

దీని తర్వాత ఒక రాజకీయ ర్యాలీలో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, తన సన్నిహితుడిని అరెస్ట్ చేయడంపై ఇస్లామాబాద్ పోలీసు అధికారితో పాటు ఒక మహిళా జడ్జిని దూషించారు.

షాబాజ్‌తో దురుసుగా ప్రవర్తించినందుకు పోలీసు ఉన్నతాధికారితోపాటు మహిళా జడ్జి, ఎన్నికల సంఘంపై కేసులు పెడతానని బెదిరించారు.

ఇస్లామాబాద్ పోలీసుల విజ్ఞప్తి మేరకు షాబాజ్ గిల్‌కు రెండు రోజుల పోలీసు రిమాండ్ విధించిన అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి జేబా చౌధరీ పట్ల ఇమ్రాన్ ఖాన్ అవమానకరంగా మాట్లాడారు.

"సిగ్గుపడండి. ఇస్లామాబాద్ ఐజీని మేం వదలిపెట్టం. మీ పై కేసు పెడతాం. మెజిస్ట్రేట్ సాహిబా జేబా మీరు కూడా సిద్ధంగా ఉండండి. మీపై కూడా మేం చర్య తీసుకుంటాం’’ అని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో మహిళా న్యాయమూర్తిని అవమానించారనే ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్‌పై కేసు నమోదైంది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)