డీఎంఐటీ టెస్ట్: పెళ్లికి ముందే పెళ్లి కొడుకు తెలివితేటలను కొలిచే ఈ పరీక్ష ఏంటి, శాస్త్రీయత ఎంత?

పెళ్లి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, తేజల్ ప్రజాపతి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వివాహానికి ముందుగా పెళ్లి కొడుకు జాతకాన్ని అడిగి తీసుకోవడం గురించి వినే ఉంటారు. మరి వేలిముద్రలు అడిగే సంప్రదాయం గురించి మీకు తెలుసా?

ఆశ్చర్యంగా అనిపిస్తోందా? గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఇలానే కొందరు పెళ్లికొడుకు వేలిముద్రలను అడుగుతున్నారు. వీటిని పరీక్షించేందుకు ఒక కొత్త టెస్టును కూడా చేస్తున్నారు. దీనిపేరు డీఎంఐటీ. రాజ్‌కోట్‌ యువ పాటీదార్ సమాజ్ దీన్ని నిర్వహిస్తోంది.

అసలు పెళ్లి కొడుకు వేలిముద్రలను వివాహానికి ముందు ఎందుకు తీసుకుంటున్నారు? ఏమిటీ ఆ టెస్టు? దానిలో ఏం తెలుస్తుంది?

పెళ్లి

ఫొటో సోర్స్, AFP

ఏమిటీ టెస్టు?

డీఎంఐటీ అంటే డెర్మటోగ్లిఫిక్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్. ఇది ఒక వేలిముద్రల పరీక్ష. దీన్ని బ్రెయిన్‌వండర్స్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. వేలిముద్రల సాయంలో ఆ వ్యక్తి తెలివితేటలను అంచనా వేయొచ్చని సంస్థ చెబుతోంది.

2016లో ముంబయిలోని కొన్ని పాఠశాలల్లో ఈ టెక్నాలజీని ఉపయోగించినట్లు వార్తలు వచ్చాయి. ‘‘విద్యార్థులకు భవిష్యత్‌లో ఎలాంటి సబ్జెక్టులంటే ఇష్టం ఉంటుంది? మున్ముందు వారు ఏం కావాలని అనుకుంటున్నారు?’’ లాంటి అంచనాలకు దీన్ని ఉపయోగించినట్లు ఆ కథనాల్లో పేర్కొన్నారు.

ఆ తర్వాత కొన్ని కంపెనీలు కూడా ఉద్యోగులను ఎంపిక చేసుకునేటప్పుడు ఈ టెక్నాలజీని ఉపయోగించినట్లు కథనాలు ప్రచురితమయ్యాయి.

అయితే, ఇలాంటి పరీక్షలకు దూరంగా ఉండాలని ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ అప్పట్లో విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూచించింది. డీఎంఐటీ వెనుక ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేదా రుజువులు లేవని పేర్కొంది.

పెళ్లి

ఫొటో సోర్స్, INDIAN PSYCHIATRIC SOCIETY

ఈ టెస్టులపై ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ మాజీ అధ్యక్షులు డాక్టర్ మృగేశ్ వైష్ణవ్ బీబీసీతో మాట్లాడారు. ‘‘గతంలో కొన్ని ప్రైవేటు స్కూళ్లలో ఇలాంటి పరీక్షలు నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. సదరు విద్యార్థి వ్యక్తిత్వం, కెరియర్‌లపై అంచనాలకు వీటిని ఉపయోగించేవారు’’అని ఆయన అన్నారు.

‘‘ఇలాంటి పరీక్షలు అశాస్త్రీయమైనవి. వీటి ఫలితాలకు ఎలాంటి ఆధారాలూ లేవు’’అని ఆయన చెప్పారు. ఇలాంటి పరీక్షలకు దూరంగా ఉండాలని 2019లోనే ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఒక ప్రకటన విడుదల చేసింది.

‘‘సదరు వ్యక్తి మేధోసామర్థ్యాన్ని లేదా మెదడు పనితీరును డీఎంఐటీ అంచనా వేయలేదు’’అని ఆ ప్రకటనలో ప్రధానంగా ప్రస్తావించారు.

అయితే, ఆసియా పసిఫిక్ జర్నల్ ఆఫ్ మల్టీడిసిప్లైనరీ రీసెర్చ్ పరిశోధన పత్రంలో ‘‘ఒక వ్యక్తి వేలిముద్రలకు, అతడి మేధస్సుకు మధ్య సంబంధం ఉండొచ్చు’’ అని పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, మైనర్లను పెళ్లి చేసుకున్నారంటూ వేల మంది భర్తల అరెస్ట్

ఈ పరీక్షను ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు?

ప్రస్తుతం ఈ పరీక్షలను నిర్వహిస్తున్న రాజ్‌కోట్ యువ పాటీదార్ సంస్థ అధ్యక్షుడు వినోద్‌భాయ్ దేశాయ్ బీబీసీతో మాట్లాడారు.

‘‘వేలిముద్రలకు మెదడులోని భాగాలతో సంబంధముంటుందని ప్రముఖ డెర్మటోగ్లిఫిక్స్ నిపుణుడు డాక్టర్ హెరాల్డ్ క్యూమిన్స్ ప్రతిపాదించారు. ఆయన సిద్ధాంతాల ఆధారంగానే డీఎంఐటీ పనిచేస్తుంది’’అని ఆయన చెప్పారు.

‘‘ఇటీవల మేం 21 జంటలకు సామూహిక వివాహాలు జరిపించాం. ఇవి ఇతర సామూహిక వివాహాల కంటే భిన్నమైనవి’’అని ఆయన చెప్పారు.

‘‘సాధారణంగా పెళ్లికి ముందు జాతకం అడుగుతారు. మేం జాతకానికి బదులు డీఎంఐటీ పరీక్షలు చేయించాం’’అని ఆయన వివరించారు.

‘‘కేవలం పాటీదార్లకే కాదు.. రాష్ట్రంలో అందరికీ ఈ పరీక్షను అందుబాటులో ఉంచుతున్నాం’’అని ఆయన చెప్పారు.

తన భార్య కూడా డీఎంఐటీ పరీక్ష ఫలితాలను చూసిన తర్వాతే తనను పెళ్లి చేసుకుందని ఆయన తెలిపారు.

వీడియో క్యాప్షన్, క్షమాబిందు: తనను తాను పెళ్లి చేసుకున్న ఈ అమ్మాయి సెక్స్ గురించి ఏమన్నారంటే...

నిపుణులు ఏం అంటున్నారు?

అయితే, ఇలాంటి పరీక్షలు కేవలం పబ్లిసిటీ కోసమే నిర్వహిస్తుంటారని సైకియాట్రిస్టు డాక్టర్ హిమాన్షు చౌహాన్ చెప్పారు. దీని వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనమూ ఉండబోదని అన్నారు.

‘‘ఈ పరీక్షకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు’’అంటూ డాక్టర్ చౌహాన్‌ చేసిన వ్యాఖ్యలతో కౌన్సెలింగ్ నిపుణుడు డాక్టర్ యోగేశ్ పటేల్ కూడా ఏకీభవించారు.

‘‘ఒక వ్యక్తి మేధస్సును వేలిముద్రలతో ఎలా అంచనా వేయగలం?’’అని పటేల్ ప్రశ్నించారు.

‘‘సాధారణంగా పిల్లలకు ఎలాంటి సబ్జెక్టులంటే ఇష్టం ఉంటుందనే సరదా అంచనాల కోసం ఆ టెస్టును నిర్వహిస్తుంటారు. కానీ, దాని ఫలితాలపై ఆధారపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు’’అని డాక్టర్ చౌహాన్ అన్నారు.

‘‘ఈ టెస్టుకు పెళ్లికి ఎలాంటి సంబంధమూ లేదు. నిజానికి పెళ్లికి ముందు జెనెటిక్, రక్త పరీక్షలు చేయించి, ఏదైనా వ్యాధుల ముప్పు ఉందేమోనని తెలుసుకోవడం మంచిది’’అని డాక్టర్ చౌహాన్ సూచించారు.

వీడియో క్యాప్షన్, బిర్యానీ అమ్ముతూ ఐదుగురు కూతుర్లను సాకుతున్న ఓ తల్లి

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)