గాలి జనార్దన రెడ్డి: బళ్లారిలో పట్టు నిలుపుకుంటారా?

గాలి జనార్దన్ రెడ్డి

ఫొటో సోర్స్, GaliJanardhanReddy/FB

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బళ్లారి శివార్లలో ఆంధ్ర సరిహద్దులవైపు వెళుతూ ఉంటే ఖాళీగా తుమ్మలు మొలిచిన రైల్వే ట్రాక్ కనిపిస్తూ ఉంటుంది.

ఇక్కడ రైళ్లు తిరగకపోవడంతో ట్రాక్ పైనే పెద్ద పెద్ద తుమ్మ చెట్లు మొలిచాయి. అక్కడ పాములు తిరుగుతూ ఉంటాయి. దూరంగా అక్కడక్కడా చిన్న చిన్న ఇనుప ఖనిజం పోగులు కనిపిస్తాయి.

ఇవన్నీ ఒకప్పటి బళ్లారి ఇనుప ఖనిజపు గనుల ఆనవాళ్లు. దాదాపు 12-13 ఏళ్ల క్రితం ఇక్కడ మనిషి నిల్చునే పరిస్థితి కూడా ఉండేది కాదు. లారీలు, గూడ్సు రైళ్లు నిత్యం ఇనుప ఖనిజాన్ని తరలిస్తూ కనిపించేవి.

శివార్లలోనే కాదు, బళ్లారి పట్టణంలో కూడా పదేళ్ల క్రితం ఉన్న హడావిడి ఇప్పుడు లేదు. ఖనిజమే కాదు, గాలి జనార్ధన రెడ్డి కూడా అక్కడ లేరు. ఆయన గంగావతిలో ఉంటున్నారు.

బళ్లారిలో అడుగు పెట్టవద్దని సుప్రీం కోర్టు ఆదేశించడంతో ఆయన గంగావతిలో నివాసం ఉంటూ, అక్కడే పోటీ చేస్తున్నారు

ఆయన భార్య లక్ష్మీ అరుణ మాత్రం బళ్లారి నుంచి పోటీ చేస్తున్నారు. అదొక్కటే కాదు, బీజేపీ వాళ్లను చూసీ చూడనట్టు వదిలేయడంతో, సొంతంగా కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష అనే పార్టీ కూడా పెట్టుకున్నారు.

ఎన్నికల ప్రచారంలో గాలి జనార్దన్ రెడ్డి

ఫొటో సోర్స్, GaliJanardhanReddy/FB

బీజేపీ ఆయనను దూరం పెట్టింది. ఒకనాటి ఆత్మీయుడు శ్రీరాములు, సొంత సోదరుడు సోమశేఖర రెడ్డి వంటి వారు ఆ పార్టీలోనే ఉన్నారు. బళ్లారిలో జనార్ధన రెడ్డి అన్నపై జనార్ధన రెడ్డి భార్య పోటీలో ఉన్నారు.

ఇక జేడీఎస్ అనిల్ లాడ్, కాంగ్రెస్ నుంచి నారా భరత్ రెడ్డి కూడా అక్కడ బలమైన అభ్యర్థులే. బళ్లారి, గంగావతితో కలిపి మొత్తం 47 సీట్లలో గాలి పార్టీ ఫుట్‌బాల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు.

దాదాపు 8 ఏళ్ల ప్రవాసం తరువాత మళ్లీ సొంత పార్టీతో ముందుకు వచ్చారాయన. తనను అందరూ ఫుట్‌బాల్‌లా ఆడుకున్నారనీ, తాను కూడా అందర్నీ ఫుట్‌బాల్ ఆడుకుంటానంటూ బహిరంగంగానే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు గాలి.

అందుకోసం ఆయన చాలా ప్రయత్నం చేస్తున్నారు. తన అంగ, అర్థ బలాన్ని వాడుతున్నారు. ఆయన భార్య లక్ష్మీ అరుణ కన్నడ భాషలో ఆవేశపూరిత ప్రసంగాలు ఇవ్వడం కూడా అలవాటు చేసుకున్నారు.

ఒకవేళ పది పదిహేనేళ్ల క్రితం అయితే బళ్లారిలో గాలి అంత కష్టపడకుండానే ఎన్నికలు గెలిచేవారేమో. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన గాలి అలా వీచింది బళ్లారిలో.

గాలి జనార్దన్ రెడ్డి

ఫొటో సోర్స్, GaliJanardhanReddy/FB

‘‘ఒక రకంగా వాళ్లిక్కడ రాజ్యం చేశారు. ఒక్క ఉదాహరణ చెప్పాలంటే, జనార్ధన రెడ్డి ఇల్లు ఉండే కాలనీలో చుట్టుపక్కల ఉండే వందల ఇళ్లు ఖాళీ చేయించారు. భయం సృష్టించారు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఆయన ఏర్పాటు చేసిన బీజేపీ ప్రభుత్వమే ఉండేది. మంత్రి కూడా అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పట్లో అసలు లా అండ్ ఆర్డర్ పనిచేయలేదు’’ అంటూ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు బళ్లారి జిల్లా సీపీఎం కార్యదర్శి సత్యబాబు.

‘‘ఇల్లు అనే కాదు.. ఇనుప ఖనిజం విషయంలోనూ అంతే. అప్పటికే చట్టపరంగా మైనింగ్ చేసే వాళ్లను తరిమేశాడు. దాంతో ఈ చుట్టుపక్కల చిన్న తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. కేవలం రవాణా ఒక్కటే ఉపాధి కల్పించేది. ఇప్పుడు అదంతా పోయింది’’ అని అన్నారు సత్యంబాబు.

ఇలాంటి గతం కలిగి ఉన్న జనార్ధన రెడ్డి, ఆయన భార్య ఇప్పుడు ఎన్నికల కోసం తిరగని గుమ్మం లేదు. ఉదయాన్నే ఇంటి దగ్గర సామాన్యులతో మాట్లాడడం, సాయంత్రం వరకూ ప్రచారం చేసి, రాత్రికి వ్యూహాలు రచించడం, లింగాయత్ ఓట్ల కోసం బసవేశ్వర తత్త్వాలు మాట్లాడుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేయడం, ఇలా నిత్యం హడావుడిగానే ఉంటున్నారు.

వీడియో క్యాప్షన్, గాలి జనార్థన రెడ్డి కొత్త పార్టీ కర్ణాటక రాజకీయాల్ని శాసించగలదా?

కానీ ఎన్నికల్లో వారి ప్రభావం ఎంత ఉండబోతోంది అనేది చాలా క్లిష్టమైన ప్రశ్న. ఇప్పుడు బళ్లారి ఓటర్ల ముందు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనిల్ లాడ్, స్వయంగా గాలి అన్న సోమశేఖర రెడ్డి, గాలి భార్య లక్ష్మీ అరుణ, రాష్ట్రంలో బలంగా ఉన్న యువ కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్ రెడ్డి ఇలా నాలుగు ఆప్షన్లు ఉన్నాయి.

గాలి జనార్ధన రెడ్డి పార్టీలో తిరిగే చాలా మందికీ, గాలి సోమశేఖర రెడ్డి వెంట తిరిగే చాలా మందికీ, ఇద్దరూ సన్నిహితులే. వాళ్ల కోటరీలు చాలా పెద్దవి..

గాలి జనార్ధన రెడ్డి

ఫొటో సోర్స్, AFP

‘‘జనార్ధన రెడ్డికి గతంలో ఉన్నంత పట్టు ఇప్పుడు లేదు. వాళ్ల పవర్ లేదు. ఆయన బళ్లారి వచ్చి 12 ఏళ్లు అయింది. ఇక్కడ వారికి ఏం లేదు. ఆయన బావా మరదళ్లు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేయడం కూడా ఒక వ్యూహం. అధికార బీజేపీ వ్యతిరేక ఓటు చీలి కాంగ్రెస్‌కి పోకుండా వారు చేస్తోన్న రాజకీయ క్రీడ ఇది’’ అని బీబీసీతో అన్నారు బళ్లారి కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్ రెడ్డి. ప్రతిపక్షాల ఆరోపణలకు తగినట్టే గాలి జనార్థన రెడ్డి బీజేపీ అధినాయకత్వమైన మోదీ, అమిత్ షా వంటి వారిపై ఎక్కడా ఘాటు విమర్శలు చేయడంలేదు.

ఇక్కడే మరో విషయం చెప్పాలి. గాలి జనార్ధన రెడ్డి కేసు విచారణ ప్రస్తుతం జరగడం లేదు. దానికి చాలా కారణాలు ఉండవచ్చు. గాలి కేసు కోర్టులో విచారణ ఆలస్యం కావడానికీ, ప్రస్తుత రాజకీయాలకు సంబంధమూ ఉండవచ్చు.

అయితే, ఆయన దగ్గరకు వచ్చే జనమంతా నమ్మకస్తులైన కార్యకర్తలు అనుకోవడానికి కూడా వీలులేదు. ‘‘జనార్ధన రెడ్డి కార్పొరేట్ స్టైల్లో ప్రతీ ఏరియాలో కొందర్ని తన దగ్గర పెట్టుకున్నారు. వాళ్ల ద్వారా ఆ ఏరియాలలో జనాల పనులు చేసేవారు. ఇప్పుడు అన్ని పార్టీల వారూ అక్కడకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బు సాయం చేయగలరని వెళ్తున్నారు’’ అన్నారు సత్యంబాబు.

గాలి జనార్ధ రెడ్డి

ఫొటో సోర్స్, KASHIF MASOOD/BBC

ఫొటో క్యాప్షన్, తన కూతురి పెళ్లిలో జనార్దన్ రెడ్డి

ఈ రాజకీయాలతో సంబంధం లేకుండా సగటు బళ్లారి జీవి ఎన్నో సమస్యల్లో ఉన్నాడు. ముఖ్యంగా నీరు, ఉపాధి, కాలుష్యం వంటి చాలా సమస్యలు ఉన్నాయి.

మైనింగ్ జరిగినప్పుడు రవాణా రంగం బాగా ఉపాధి కల్పించింది. ఇనుము తరలిపోయింది తప్ప, ఇనుము ఆధారిత పెద్ద పరిశ్రమలు ఇక్కడకు రాలేదు.

బళ్లారి చుట్టుపక్కల చట్టపరమైన మైనింగ్ జరిగితే ఉపాధి దొరుకుతుందని స్థానికులు ఆశిస్తున్నారు. కాలుష్యం నియమాలు పాటిస్తూ పెద్ద ఫ్యాక్టరీలు కావాలని కోరుతున్నారు. మరోవైపు స్థానికంగా ఉండే స్పాంజ్ ఐరన్ ఫాక్టరీలు పెద్ద తలనొప్పిగా మారాయి.

‘‘ఈ చుట్టు పక్కల 25-30 స్పాంజ్ ఐరన్ ఫాక్టరీలు ఉన్నాయి. వాటి నుంచి దుమ్ము ఎక్కువ వస్తుంది. 10 కి.మీ వరకూ వెళ్తుంది దుమ్ము. 60 ఏళ్ల వయసులో రావాల్సిన సమస్యలు 10 ఏళ్లకే వస్తున్నాయి. తాగునీటి చెరువుల్లో దుమ్ము పడినా అవే తాగుతున్నాం.

దుమ్ము వల్ల పంటలు పండడం లేదు. నష్టపోతున్నాం అని అడిగితే ఎకరాకు 500-1000 రూపాయల పరిహారం ఇస్తారు. చెట్లే బతకని కాలుష్యంలో పంటలెలా పండుతాయి.

ఐదు వందల పరిహారం ఏం చేసుకోవాలి?’’ అంటూ ప్రశ్నించారు బళ్లారి గ్రామీణ ప్రాంతానికి చెందిన అశోక్. స్థానికులు ఇక్కడ మైనింగ్ జరగాలి అని కోరకుంటున్నారు. కానీ అది చట్టబద్ధంగా జరగాలి అని ఆశిస్తున్నారు.

ఒకప్పుడు బళ్లారి అంటే జనార్ధన రెడ్డి అనేవారు. అప్పట్లో ఆయన అంత పాపులర్. అంతేకాదు, బళ్లారి అంటే ఇనుప ఖనిజం అక్రమ మైనింగ్ అన్న మాట కూడా అంతే పాపులర్.

అయితే ఆ మాట అంటే మిగతా నాయకులు ఒప్పుకోరు. ‘‘బళ్లారి అక్రమ మైనింగ్‌కి ఫేమస్ కాదు. బళ్లారి అంటే హంపి. ఇంకా చాలా ఉన్నాయి.

ఎవరో కొందరు చేసింది బళ్లారికి ఆపాదించవద్దు. వాళ్ల గూండాగిరి వల్ల బళ్లారికి పరిశ్రమలు రాలేదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు భరత్ రెడ్డి.

మరి గాలి ఇప్పుడు బళ్లారిలో పట్టు నిలుపుకుంటారా లేక బళ్లారి అంటే ఇల్లీగల్ మైనింగ్ ముద్ర చెరిగి కొత్త శకం మొదలు అవుతుందా అనేది ఈ ఎన్నికల్లో తేలుతుంది.

ఈ కథనంలో గాలి జనార్ధన రెడ్డిపై ఆరోపణలకు సమాధానం కోసం బీబీసీ ఆయన్ను, ఆయన కార్యాలయాన్ని సంప్రదించింది. అయితే గాలి జనార్ధన రెడ్డి బీబీసీతో మాట్లాడలేదు. ఆయన కార్యాలయం బీబీసీకి స్పందించలేదు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)