సుప్రీంకోర్టు: స్వలింగ సంపర్కుల వివాహాల కేసు జడ్జిలకు పరీక్షగా మారిందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతున్న పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.
ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 27 మధ్య ఆరు రోజుల విచారణ జరిగింది. పిటిషనర్ల తరపున వాదన పూర్తయింది. కేంద్రం తన వాదనను వినిపించాల్సి ఉంది.
విచారణ ముందుకు వెళుతూ ఉంటే, ఈ సమస్య ఎంత క్లిష్టమైందో స్పష్టమవుతోంది.
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల కలయిక అని, కేవలం ఆడ, మగ మధ్య సంబంధం కాదని, రోజులు మారుతున్నకొద్దీ వివాహం నిర్వచనం మారుతూ వస్తోందని, స్వలింగ సంపర్కులు వివాహం చేసుకునే హక్కును నిరాకరించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని పిటిషనర్ల తరుపు లాయర్లు వాదించారు.
కోర్టులో ఆరవ రోజు విచారణను "ప్రజా ప్రయోజనాల కోసం ప్రత్యక్ష ప్రసారం" చేశారు. ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు.
ఎల్జీబీటీ కమ్యూనిటీ వివాహాలకు చట్టబద్దత కల్పించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ప్రభుత్వం మొదటి నుంచీ ఒకటే మాట చెబుతోంది.. వివాహాలకు సంబంధించిన సామాజిక, చట్టపరమైన అంశాలను పార్లమెంటులో మాత్రమే చర్చించి నిర్ణయం తీసుకోవాలని, వాటిని విచారించే హక్కు కోర్టుకు లేదని వాదిస్తోంది.
అయితే, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రభుత్వ అభ్యంతరాలను పక్కనపెడుతూ, "మతపరమైన వ్యక్తిగత చట్టాల జోలికి వెళ్లం కానీ, 1954 ప్రత్యేక వివాహ చట్టంలో మార్పులు చేసి, అందులో ఎల్జీబీటీ కమ్యూనిటీని చేర్చవచ్చో, లేదో పరిశీలిస్తామని" చెప్పారు.
ప్రత్యేక వివాహ చట్టం (స్పెషల్ మ్యారేజ్ యాక్ట్) వేర్వేరు మతాలకు, కులాలకు చెందిన వ్యక్తుల వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తుంది. అలాగే విదేశాలలో జరిగే పెళ్లిళ్లకూ చట్టబద్ధతనిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, విచారణ ముందుకు వెళుతున్నకొద్దీ, ఒక్క చట్టాన్ని మార్చడం వల్ల ప్రయోజనం ఉండదని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం భావిస్తోంది.
ఎందుకంటే, మరో 35 చట్టాలు దానితో ముడిపడి ఉన్నాయి. విడాకులు, దత్తత, వారసత్వం, నిర్వహణ మొదలైన చట్టాలన్నీ పరిశీలించాల్సి ఉంటుంది.
సమస్య ఏమిటంటే, వీటిలో చాలా చట్టాలు మతపరమైన వ్యక్తిగత చట్టాలతో ముడిపడి ఉంటాయి. ఇదంతా సంక్లిష్టంగా మారుతోంది.
ఇది కాకుండా, ఏప్రిల్ 27, గురువారం విచారణ సందర్భంగా, స్వలింగ వివాహానికి చట్టపరమైన అనుమతిని మంజూరు చేయడం పార్లమెంటు పరిధిలో విషయమని ప్రభుత్వ వాదనతో సుప్రీంకోర్టు అంగీకరించినట్లు కనిపించింది.
"మీ వాదనతో అంగీకరిస్తున్నాం. మేం ఇందులోకి వస్తే, శాసనసభ పరిధిలోకి వచ్చినట్టు అవుతుంది. ఇది పార్లమెంటుకు సంబంధించిన విషయం అంటూ మీరు బలమైన వాదన వినిపించారు" అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు.
అయితే, కోర్టు "ఒక సంధానకర్తగా" వ్యవహరిస్తూ స్వలింగ సంపర్కుల సహజీవనానికి సంబంధించిన సమస్యలకు నిజమైన పరిష్కార మార్గాలు కనుగొనే దిశలో ప్రభుత్వాన్ని ప్రేరేపించగలదని ధర్మాసనం పేర్కొంది.
స్వలింగ సంపర్క జంటలకు భద్రత అందించడానికి, ప్రాథమిక సాంఘిక హక్కులు.. ఉమ్మడి బ్యాంకు ఖాతాలను తెరవడం, బీమా పాలసీలలో భాగస్వామిని నామినేట్ చేయడం లేదా వారి పిల్లలకు పాఠశాలలో ప్రవేశం కల్పించడానికి, సమాజంలో వారికి తిరస్కారం ఎదురుకాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ధర్మాసనం లాయర్ మెహతాను అడిగింది.
దీనిపై ప్రభుత్వంతో చర్చించి మే 3న కోర్టుకు తెలియజేస్తానని మెహతా చెప్పారు. స్వలింగ సంపర్క జంటలకు చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వకుండానే, వారు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం పూనుకోవచ్చని తెలిపారు.
ప్రేమించుకునే హక్కు, కలిసి జీవించే హక్కు ప్రాథమిక హక్కులే కానీ, వివాహం దానికదే "పూర్తి హక్కు" కాదు, భిన్న లింగ జంటల మధ్య కూడా వివాహం హక్కు కాదని సొలిసిటర్ జనరల్ మెహతా వాదించారు.
కొన్ని రకాల సంబంధాలపై నిషేధం ఉందని, ఉదాహరణకు వావివరుసలు చూడని సంబంధాల వంటివి, ఒక అయిదేళ్ల తరువాత ఎవరైనా వచ్చి తన తోబుట్టువును వివాహం చేసుకునేందుకు అనుమతి ఇమ్మని కోర్టుకు వస్తే పరిస్థితి ఏంటని లాయర్ మెహతా ప్రశ్నించారు.
"వావివరుసలు చూడని సంబంధాలు ప్రపంచానికి కొత్త కాదు. కానీ, అన్నిచోట్లా వీటిపై నిషేధం ఉంది" అని ఆయన అన్నారు.
స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పిస్తే, భవిష్యత్తులో వావివరుసలు లేని సంబంధాలను సమర్థించుకునేందుకు ఈ చట్టాన్ని ఉదహరించే అవకాశం ఉందని మెహతా వాదించారు.
మెహతా వాదనను "మరీ దూరం లాగుతున్నారని, లైంగిక ధోరణి, స్వయం ప్రతిపత్తి వివాహానికి సంబంధించిన అన్ని అంశాలలొ సాధ్యం కాదని" జడ్జిలు సమాధానం ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
కోర్టు విచారణను దేశంలోని లక్షలాది ఎల్జీబీటీ వ్యక్తులు, వారి మద్దతుదాతుదారులు జాగ్రత్తగా గమనిస్తున్నారు.
భారతదేశంలో ఎల్జీబీటీ జనాభా 25 లక్షలు ఉంటుందని 2012లో ప్రభుత్వం అంచనా వేసింది. అయితే, అంతర్జాతీయ అంచనాలను పరిగణిస్తే, 13.5 కోట్లు అంటే మొత్తం జనాభాలో 10 శాతం కంటే ఎక్కువే ఉంటారని అంచనా.
గత కొన్నేళ్లుగా దేశంలో ఎల్జీబీటీ సమూహానికి ఆమోదం పెరుగుతోంది. ముఖ్యంగా, 2018 సెప్టెంబర్‌లో స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తరువాత వారి పట్ల అంగీకారం మరింత పెరిగింది.
కానీ, సెక్స్, లైంగిక ధోరణికి సంబంధించి ప్రజల్లో ఇంకా సంప్రదాయ భావాలే ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల చాలామంది ఎల్జీబీటీ వ్యక్తులు తమ లైంగిక ధోరణి గురించి బయటకు చెప్పుకోవడానికి జంకుతున్నారని యాక్టివిస్టులు అంటున్నారు.
కుటుంబానికి, స్నేహితులకు చెప్పుకోవడానికి కూడా వెనుకాడుతున్నారని, స్వలింగ సంపర్కులపై దాడులు వార్తల్లోకి వస్తూనే ఉన్నాయని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ నాసిరకం ఆయుధాలు అమ్మిందా, యుక్రెయిన్ ఏం చెప్పింది?
- స్పైడర్ వెయిన్స్: కాళ్లపై కనిపించే ఈ నరాలు చిట్లిపోతాయా... వీటికి చికిత్స ఏమిటి?
- తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ ఎందుకు అంటోంది?
- మహిళా రెజ్లర్ల నిరసన: WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు
- టూత్‌పేస్ట్ ట్యూబ్లలో డ్రగ్స్ స్మగ్లింగ్... 65 మంది అరెస్ట్
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














