మణిపుర్‌లో హింసకు తెగల మధ్య కొట్లాటే కారణమా?

మణిపుర్ హింస

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సర్వప్రియ సాంగ్వాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మణిపుర్‌లో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. మణిపుర్‌ హింస‌పై ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒలింపిక్ మెడల్ విజేత మేరీకోమ్ తమ రాష్ట్రం తగలబడిపోతోందని, తమకు సాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ట్విటర్‌లో విజ్ఞప్తి చేశారు.

మణిపుర్‌లో ఈ ఉద్రిక్తతలకు కారణమేంటి? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే... ముందుగా మణిపుర్‌ సామాజిక పరిస్థితుల గురించి అర్థం చేసుకోవాలి.

మణిపుర్‌ జనాభా 30 లక్షల నుంచి 35 లక్షలు ఉంటుంది.

ఈ రాష్ట్రంలో మెయితెయ్, నాగా, కుకి అనే మూడు ప్రధాన తెగలు ఉన్నాయి. మెయితెయ్ సముదాయంలో ప్రధానంగా హిందువులు ఉంటారు. మెయితెయ్‌లలో కొందరు ముస్లింలు కూడా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మెయితెయ్‌ల సంఖ్యే ఎక్కువ.

ఇక నాగాలు, కుకీలు ప్రధానంగా క్రిస్టియన్లు. నాగా, కుకీలను రాష్ట్రంలో షెడ్యూల్డ్ ట్రైబ్స్‌గా గుర్తించారు.

ఇక్కడ రాజకీయ ముఖచిత్రం గురించి మాట్లాడుకుంటే- మణిపుర్‌లో మొత్తం 60 మంది ఎమ్మెల్యేలు ఉంటే వారిలో 40 మంది ఎమ్మెల్యేలు మెయితెయ్ వర్గానికే చెందినవారు. మిగిలిన 20 మంది ఎమ్మెల్యేలు నాగా, కుకీ సముదాయాలవారు. ఇప్పటివరకు మణిపుర్‌‌కు ముఖ్యమంత్రులుగా చేసిన 12 మందిలో ఇద్దరు మాత్రమే ఎస్టీ వర్గానికి చెందినవారు.

వీడియో క్యాప్షన్, మణిపుర్‌: ఇంటికి తెగల పేర్లతో బోర్డులు ఎందుకు పెట్టుకుంటున్నారు?

ఎస్టీ హోదా కావాలంటున్న మెయితెయ్‌లు

ఒక్కసారి మణిపుర్‌ భౌగోళిక పరిస్థితులను కూడా చూద్దాం. మణిపుర్‌ ఒక ఫుట్‌బాల్ స్టేడియంలా ఉంటుందనుకుంటే- అందులో మధ్యలో ప్లేఫీల్డ్ స్థానంలో ఇంఫాల్ లోయ ప్రాంతం ఉంటుంది. స్టేడియంలో నాలుగు వైపులా ఉన్న గ్యాలరీ లాంటి వన్నీ పర్వతాలతో కూడుకున్న ప్రాంతాలుగా అనుకోవచ్చు.

మెయితెయ్ వర్గం ప్రజలు ఎక్కువగా ఇంఫాల్ లోయలో స్థిరపడ్డారు. వీళ్లు మణిపుర్‌లో పది శాతం భూభాగాన్ని శాసిస్తున్నారు. పర్వతాలతో కూడుకున్న మిగతా 90 శాతం ప్రాంతంలో ఎక్కువగా అక్కడ గుర్తింపు పొందిన గిరిజన సముదాయాలు నివసిస్తాయి.

ఈ పర్వత ప్రాంతాలు, లోయ ప్రాంతాలు, అక్కడి ప్రజల మధ్య వివాదం చాలా సున్నితమైనదే కాదు,సుదీర్ఘమైనది కూడా.

మెయితెయ్ వర్గం తమను కూడా షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. ఇదే అభ్యర్థనతో మణిపుర్‌ హైకోర్టులో మెయితెయ్ వర్గం ఒక పిటిషన్ కూడా వేసింది. 1949 కన్నా ముందు, అంటే మణిపుర్‌ భారత్‌లో కలవక ముందు తమకు షెడ్యూల్ ట్రైబ్ గుర్తింపు ఉండేదని చెబుతోంది.

చౌర్చాంద్ పూర్ ప్రాంతంలో నిరసనకారులు

ఫొటో సోర్స్, AVIK

ఫొటో క్యాప్షన్, మణిపుర్: హింస చెలరేగడానికి ముందు చురాచాంద్‌పూర్ ప్రాంతంలో నిరసనకారులు

మెయితెయ్‌లకు ఎస్టీ హోదాను వ్యతిరేకించేవారి వాదన ఏమిటి?

తమ పూర్వీకుల నుంచి వస్తున్న భూభాగం, సంస్కృతి, సంప్రదాయాలు, భాషలను పరిరక్షించుకోడానికి తమకు షెడ్యూల్డ్ ట్రైబ్ గుర్తింపు కావాలని మెయితెయ్ ప్రజలు అడుగుతున్నారు. తమ డిమాండ్‌ను నెరవేర్చుకునే కార్యాచరణలో భాగంగా 2012లో వీరు షెడ్యూల్డ్ ట్రైబ్ డిమాండ్ కమిటీ ఆఫ్ మణిపుర్ పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. తమను ఇతర వర్గాలు దోచుకొంటున్నాయని, ఈ దోపిడీని అడ్డుకోవడానికి రాజ్యాంగబద్ధమైన రక్షణ అవసరమని ఈ కమిటీ చెబుతోంది.

పర్వత ప్రాంతాల నుంచి తమను తరిమేస్తున్నారని మెయితెయ్‌లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కుంచించుకుపోతున్న ఇంఫాల్ లోయ ప్రాంతంలో కూడా షెడ్యూల్ స్టేటస్ ఉన్న తెగలకు మాత్రమే భూములు కొనే హక్కులున్నాయని చెబుతున్నారు.

మెయితెయ్ వర్గానికి ఎస్టీ హోదా కల్పించాలన్న అంశంపై ఇప్పటికే ఎస్టీలుగా గుర్తింపు పొందిన తెగల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వస్తోంది.

మెయితెయ్‌ల జనాభాతో పాటు రాజకీయాల్లో వారి ప్రాబల్యం కూడా ఎక్కువని ఎస్టీలు వాదిస్తున్నారు. మెయితెయ్ వర్గపు ప్రజలు గిరిజనులు కాదని వాదిస్తున్నారు. వాళ్లు ఇప్పటికే ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారని, వాటితో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లు కూడా పొందారని, ఈ స్టేటస్‌ల నుంచి వాళ్లు చాలా ప్రయోజనాలు పొందారని అంటున్నారు.

వారి భాష కూడా రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో ఉందని, అలా దానికి రక్షణ లభిస్తోందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మెయితాయ్ వర్గం తాము డిమాండ్ చేస్తున్నట్లుగా అన్నీ దక్కించుకోడానికి వీలులేదని చెబుతున్నారు.

ఒకవేళ వారికి మరిన్ని రిజర్వేషన్లు కల్పిస్తే, అప్పుడు మిగిలిన ఎస్టీ వర్గాల ప్రజలకు ఉద్యోగాలు దక్కించుకునే అవకాశాలు, విద్యా సంస్థల్లో సీట్లు పొందే అవకాశాలు తగ్గిపోతాయని అంటున్నారు. ఎస్టీ స్టేటస్ దక్కితే మెయితెయ్ ప్రజలకు పర్వత ప్రాంతాల్లో భూములు కొనుక్కునే హక్కు లభిస్తుందని, దీని వల్ల పర్వత ప్రాంతాల్లో గిరిజనుల నివాసం మరింత కష్టమవుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

మణిపుర్ హింస

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పుడు హింస ఎందుకు చెలరేగింది?

ఇటీవల మణిపుర్‌ హైకోర్టు మెయితెయ్ ట్రైబ్ యూనియన్ దాఖలు చేసిన ఒక పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. మెయితెయ్ వర్గానికి ట్రైబల్ స్టేటస్ ఇవ్వడాన్ని పరిశీలించాలంటూ మణిపుర్‌ ప్రభుత్వానికి విచార సందర్భంగా సూచించింది.

వారి డిమాండ్ పదేళ్లుగా పెండింగ్‌లోనే ఉందని, ఇప్పటివరకూ దానిపై సంతృప్తికర సమాధానం రాలేదని, నాలుగు వారాల్లో దీనిపై జవాబు ఇవ్వాలని న్యాయస్థానం చెప్పింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కూడా కోరింది.

అయితే మెయితెయ్ వర్గానికి ట్రైబల్ స్టేటస్ ఇవ్వాలని కోర్టు ఎక్కడా ఆదేశాలు ఇవ్వలేదు. కేవలం విచారణ సమయంలో ఇలాంటి అభిప్రాయాలు మాత్రమే వ్యక్తంచేసింది. కానీ కోర్టు పరిశీలించాలని చెప్పిన అంశాలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. దానికి సదరు వర్గాలు తీవ్రంగా ప్రతిస్పందించాయి.

ఆ మర్నాడు మణిపుర్‌ అసెంబ్లీలోని హిల్ ఏరియాస్ కమిటీ- కోర్టు ఆదేశాలతో తాము తీవ్రంగా విబేధిస్తున్నామంటూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. హిల్ ఏరియాస్ కమిటీ అన్నది ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థ అని, కోర్టు కనీసం తమను సంప్రదించలేదని వ్యాఖ్యానించింది.

మణిపుర్ పర్వత ప్రాంతాల్లో ఎన్నికైన ప్రతి ఎమ్మెల్యే కూడా వారు గెలిచిన పార్టీలకు అతీతంగా ఈ హిల్ ఏరియాస్ కమిటీలో సభ్యులే. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే డీ.గెంగమాయి ఈ కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నారు.

మణిపుర్ హింస

ఫొటో సోర్స్, Getty Images

ఇతర కారణాలు ఉన్నాయా?

మే 3వ తేదీన, ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపుర్ ఒక ర్యాలీ నిర్వహించింది. ఈ గిరిజన సంఘీభావ ర్యాలీని మణిపుర్ రాజధాని ఇంఫాల్‌కు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న చురాచాంద్‌పూర్ జిల్లాలోని తోర్ బాంగ్‌లో నిర్వహించింది.

ఇందులో వేల మంది పాల్గొన్నారు. ఒక సీనియర్ పోలీసు అధికారి చెప్పిన వివరాల ప్రకారం, ర్యాలీ జరుగుతున్నప్పుడు అక్కడ ట్రైబల్ గ్రూప్స్‌‌, ఇతర గ్రూప్స్‌ మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఆ తర్వాత మిగిలిన ప్రాంతాలకు కూడా హింస విస్తరించింది.

ఈ హింస ఇంతలా పెరగడానికి మరికొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు మణిపుర్‌లో ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్న వారు తమ వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. బైరేన్ సింగ్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతున్నారు.

బైరేన్ సింగ్ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో డ్రగ్స్ ఉత్పత్తిపై ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలో నల్లమందు పండిస్తున్న క్షేత్రాలను నాశనం చేస్తున్నారు. ఇలా డ్రగ్స్‌‌‌కు వ్యతిరేకంగా చేపడుతున్న చర్యలు, మియన్మార్ నుంచి ఇక్కడికి అక్రమంగా వచ్చిన శరణార్థుల మీద ప్రభావం చూపుతాయని అంటున్నారు. ఇలా మియన్మార్ నుంచి మణిపుర్ వచ్చిన వలసదారులంతా అక్కడి కుకి, జోమి తెగల వారన్న విమర్శలూ ఉన్నాయి.

మణిపుర్ హింస

ఫొటో సోర్స్, Getty Images

మే 2న ముఖ్యమంత్రి బైరేన్ సింగ్ నల్లమందు క్షేత్రాలపై దాడుల గురించి ఒక ట్వీట్ చేశారు. పోలీసులు చురాచాంద్‌పూర్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల నుంచి 16 కేజీల నల్లమందు స్వాధీనం చేసుకున్నారని ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్ ‌లో సదరు వ్యక్తులు ఇక్కడి అటవీ భూభాగాన్ని నాశనం చేస్తున్నారని, వారు తమ డ్రగ్స్ వ్యాపారం కోసం రాష్ట్రంలో మతపరమైన విద్వేషాలను రగులుస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇలా ముఖ్యమంత్రి కూడా రాష్ట్రంలో ఉన్న మరో మతపరమైన సమస్య గురించి ప్రస్తావించినట్లయింది.

సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్ ఫంజోభమ్ చెప్పిన వివరాల ప్రకారం- రాష్ట్రంలో చెలరేగిన ఈ హింస ఒక్క రోజులోనే తలెత్తింది కాదు. ఇక్కడి గిరిజనుల్లో చాలా అంశాలపై ఎప్పటి నుంచో అసంతృప్తి రగులుతోంది. గిరిజనులు ఉంటున్న భూముల్ని ఖాళీ చేయిస్తున్నారు. ఇది ఎక్కువగా కుకీ వర్గ ప్రజలపై ప్రభావం చూపింది. ఇటీవల హింస చెలరేగిన చురాచాంద్ పూర్ ప్రాంతంలో ఎక్కువగా కుకీ వర్గ ప్రజలే నివసిస్తారు. ఈ అన్ని కారణాల వల్లా అక్కడ హింసాత్మక ఘటనలు చెలరేగాయి.

ఇప్పటివరకూ ఈ హింసాత్మక ఘటనల కారణంగా తొమ్మిది వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

చాలా మంది ప్రజలు మణిపుర్ రాష్ట్రాన్ని వదిలి అస్సాం సరిహద్దుల్లో తలదాచుకుంటున్నారు.

ప్రస్తుతం మణిపుర్‌లో పోలీసులు, సైనికులు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, మణిపుర్‌లో ఘర్షణలకు కారణాలేమిటి?

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)