భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఏం చెబుతోంది?

స్మార్ట్ ఫోన్

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌ తమకు మరో అతిపెద్ద మార్కెట్ అని యాపిల్ కంపెనీ చెబుతోంది.

మరోవైపు భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

2019 నుంచి దేశంలో మొబైల్ అమ్మకాలు కనిష్టానికి పడిపోయాయని పరిశ్రమ గణాంకాలు చూపిస్తున్నాయి.

మధ్యతరగతి ప్రజల్లోకి తమ వ్యాపార విస్తరణలో భారత్ తమకు కీలకమని యాపిల్ కంపెనీ బాస్ అన్నారు.

యాపిల్ కంపెనీ గత నెలలో భారత్‌లో రెండు స్టోర్లను ప్రారంభించింది. భారత్‌లో యాపిల్ కంపెనీ మార్కెట్ షేర్ పెరగగా, మిగతా మొబైల్ కంపెనీలు తమ ఫోన్లను అమ్మడానికి కష్టపడుతున్నాయి.

ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో 3.1 కోట్ల స్మార్ట్‌ఫోన్లు భారత్‌కు వచ్చాయని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) చేసిన పరిశోధన తెలిపింది.

2022 తొలి మూడు నెలల్లో భారత్‌లోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే ఇది 16 శాతం తక్కువ. గత నాలుగు సంవత్సరాల్లో ఇదే అత్యల్పం.

వరుసగా మూడు క్వార్టర్లలలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు పడిపోవడంతో ఈ ఏడాది మొత్తంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ స్తబ్దుగా ఉంటుందని ఐడీసీ చెప్పింది.

మొబైల్ ఫోన్

ఫొటో సోర్స్, MICROMAX

అదే సమయంలో కొంతమంది విశ్లేషకులు ఇటీవల పెరుగుతున్న ‘‘ప్రీమియమైజేషన్’’ అనే ట్రెండ్ గురించి మాట్లాడుతున్నారు.

ప్రీమియమైజేషన్ అంటే తగినంత డబ్బు ఉన్న వినియోగదారులు అత్యంత ఖరీదైన ఉత్పత్తుల వైపు మొగ్గుచూపడం.

‘‘నిరుడి కంటే ఈ ఏడాది తొలి మూడు నెలల్లో ప్రీమియం సెగ్మెంట్ వాటా రెట్టింపు అయింది’’ అని కౌంటర్‌పాయింట్ అనే టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ సంస్థకు చెందిన ప్రాచిర్ సింగ్ అన్నారు.

ఈ ట్రెండ్ కారణంగా యాపిల్, సామ్‌సంగ్ వంటి బ్రాండ్లు లాభపడుతున్నాయి.

షయోమి, రియల్‌మీ బ్రాండ్లకు చెందిన చౌకగా లభించే ఫోన్లు డిమాండ్ తగ్గిపోవడంతో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.

తమ ఫోన్లను అప్‌గ్రేడ్ చేయడానికి కస్టమర్లు ఎక్కువ సమయం తీసుకుంటున్నందున మార్కెట్లు ఇబ్బంది పడుతున్నాయని నిపుణులు అంటున్నాయి.

యాపిల్ మార్కెట్ వృద్ధి, చౌక స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ క్షీణతల మధ్య వ్యత్యాసం కోవిడ్-19 తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని కళ్లకు కడుతుంది.

స్మార్ట్ ఫోన్

ఫొటో సోర్స్, Getty Images

‘‘కోవిడ్-19 తర్వాత మార్కెట్‌లో కనిపిస్తున్న హెచ్చుతగ్గులు ఇటు అల్పాదాయ వర్గాల జీతాల పెరుగుదల, అటు వినియోగదారుల కొనుగోలు శక్తి... రెండూ పెరగడానికి అవకాశం ఇవ్వడం లేదు’’ అని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తెలిపింది.

‘‘ఫలితంగా విలువైన ఆటోమొబైల్, మొబైల్ ఫోన్, ఇతర విలాసవంతమైన వస్తువులకు డిమాండ్ ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, కొనుగోళ్లు ఆ స్థాయిలో జరగడం లేదు’’ అని ఇండియా రేటింగ్స్ పేర్కొంది.

ఉదాహరణకు, 2019తో పోల్చినప్పుడు ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభ స్థాయి స్కూటర్ల అమ్మకాలు దాదాపు 20 శాతం పడిపోయాయి.

అంటే, అల్పాదాయ వర్గాలు తమ స్థాయికి మించి కొనుగోళ్లు చేసేందుకు మొగ్గుచూపడం లేదని ఆటోమొబైల్ డీలర్ల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు మనీష్ రాజ్ సింఘానియా అన్నారు.

మరోవైపు, గ్రామీణ భారత ఎకానమీ ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఇది చూపిస్తుంది.

స్నాక్స్, కూల్‌డ్రింక్స్ లాంటి ఉత్పత్తులకు గ్రామాల్లో డిమాండ్ తగ్గిపోయింది. ఇది వరకు రెండంకెలుగా ఉన్న వృద్ధి రేటు ఇప్పుడు సింగిల్ డిజిట్‌కు పడిపోయింది.

మార్చి 2022 వరకు ఏటా 20 శాతం చొప్పున పెరుగుతూ వచ్చిన వస్తు సేవలపై వినియోగదారుల వ్యయం ఈ ఏడాది బాగా పడిపోయింది.

వడ్డీరేట్లు, ధరల పెరుగుదల వల్ల వినియోగదారులు ఒత్తిడికి గురవుతున్నారు.

మొత్తంగా 2023 తొలి త్రైమాసికంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 4.1 శాతానికి పడిపోయింది. ఏడాది కాలంలో ఇదే అత్యల్పమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)