గోరక్షకుల దాడిలోనే వారిస్‌ చనిపోయారా... బీబీసీ సేకరించిన సీసీటీవీ ఫుటేజిలో ఏముంది?

వారిస్
ఫొటో క్యాప్షన్, గోరక్షకులు చేసిన దాడిలో వారిస్ చనిపోయారని ఆయన స్నేహితుడు షౌకీన్ ఆరోపిస్తున్నారు

హరియాణాలోని తావ్రు పట్టణంలో ఒక కారు, వ్యాన్‌ను ఢీకొట్టింది. జనవరిలో ఈ ఘటన జరిగింది. ఆ కారులో ముగ్గురు ముస్లిం యువకులు వారిస్, నఫీజ్, షౌకీన్ ఉన్నారు.

వారిస్ ఇప్పుడు లేరు. ఆయన చనిపోయారు. నఫీజ్ జైల్లో ఉన్నారు. షౌకీన్ ఆ రోజు జరిగిన సంఘటన నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు.

కారులో ఆవును తీసుకెళ్లడం చూసి కొందరు హిందువులు తమపై దాడి చేశారని, ఆ దాడిలో తమ స్నేహితుడు వారిస్ ప్రాణాలు కోల్పోయాడని 26 ఏళ్ల షౌకీన్ ఆరోపిస్తున్నారు.

ఆ ఆవు నఫీజ్‌దని, రాజస్థాన్‌లోని భివండి ప్రాంతం నుంచి హరియాణాలోని తన ఇంటికి నఫీజ్ ఆ ఆవును తీసుకొస్తున్నాడని షౌకీన్ చెబుతున్నారు. తమ స్నేహితుడు నఫీజ్‌కి సాయంగా తాను, వారిస్ వెళ్లినట్లు చెప్పారు.

కారులో ఆవుని కట్టేసి తీసుకురావడం చూసి గోరక్షకులు వెంటపడ్డారు. వాళ్లు హిందువులు. వాళ్ల చేతుల్లో కర్రలు, ఇతర ఆయుధాలున్నాయని షౌకీన్ తెలిపారు.

అయితే, వారిస్ శరీరంపై ఎక్కడా గాయాలైన గుర్తులు లేవని పోలీసులు చెబుతున్నారు.

''ప్రమాదం జరిగిందని ట్రక్కు డ్రైవర్, కొందరు గోరక్షకులు మాకు సమాచారం ఇచ్చారు. మేం అక్కడికి వెళ్లేప్పటికి కారులో ముగ్గురు ఉన్నారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాం. గాయాలవడంతో వారిలో ఒకరు మరణించారు'' అని నుహ్ జిల్లా ఎస్పీ వరుణ్ సింగ్లా తెలిపారు.

ఈ ప్రమాదంలో కూరగాయలు తీసుకెళ్తున్న వ్యాను ధ్వంసమైందన్నారు. ‘‘వ్యాన్ డ్రైవర్ సురక్షితంగానే బయటపడ్డారని, సీట్లో కూర్చుని ఉన్న ఆయన కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి'' అని సింగ్లా చెప్పారు.

''కారులో ఆవుని గుర్తించాం. గోవుల అక్రమ రవాణా కేసులో నఫీజ్, షౌకీన్‌ను అరెస్టు చేశాం'' అని సింగ్లా తెలిపారు.

షౌకీన్
ఫొటో క్యాప్షన్, తన స్నేహితుని మరణాన్ని మర్చిపోలేకపోతున్నట్లు షౌకీన్ చెప్పారు

‘‘ప్రమాదంలో చిన్నగాయం కూడా కాలేదు’’

గోరక్షకులు వెంబడించడం వల్లే తాము వ్యాన్‌ను ఢీకొట్టామని షౌకీన్ చెబుతున్నారు. ఆయన ఇప్పుడు బెయిల్‌ మీద బయటికొచ్చారు.

తావ్రులో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను బీబీసీ సేకరించింది. అందులో ప్రమాదం జరిగిన కొద్ది క్షణాల తర్వాత టాప్ మీద సైరన్ ఉన్న ఒక వాహనం రావడం కనిపించింది.

అదే కాకుండా, తుపాకులు, ఆయుధాలతో వచ్చిన కొందరు వ్యక్తులు ఆవుని కారులో నుంచి బయటకు తీసి, కారులోని ముగ్గురు ముస్లిం యువకులను కట్టేసి తమ కారులో తీసుకెళ్లిన దృశ్యాలు సంఘటన జరిగిన ప్రదేశంలో ఒక స్థానికుడు తీసిన వీడియోలో రికార్డయ్యాయి.

తనను, తన స్నేహితులను వాళ్లు తీవ్రంగా కొట్టారని, ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్తుండగా వారిస్ చనిపోయాడని షౌకీన్ ఆరోపిస్తున్నారు.

''వారిస్ ప్రమాదం వల్ల చనిపోలేదు. కారు, వ్యాన్‌ని ఢీకొట్టినప్పుడు చిన్న గాయం కూడా కాలేదు'' అని చెప్పారు.

ముస్లిం అనే ''ఉద్దేశపూర్వకంగానే కొట్టి చంపేశారు'' అని షౌకీన్ ఆరోపించారు.

భారత్‌లో కోట్లాది మంది హిందువులు ఆవును పూజిస్తారు. గోవధ ఒక సున్నితమైన అంశంగా ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో గోవధపై నిషేధం కూడా అమల్లో ఉంది. 2014లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోవధ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు గోవధపై కఠినంగా వ్యవహరిస్తున్నాయి. దేశంలోని 28 రాష్ట్రాల్లో సగానికి పైగా రాష్ట్రాల్లో గోమాంసం విక్రయించడం, వినియోగించడం చట్టవిరుద్ధం. హర్యానాతో సహా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయి.

గోరక్షక బృందాలు హింసతో ఈ నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఇవి మాంసం, పశువుల వ్యాపారం నిర్వహించే ముస్లింలపై దాడులకు, హత్యలకు కూడా దారితీశాయి.

ఈ గోరక్షక దళాలపై ప్రధాని మోదీ గతంలో విమర్శలు కూడా చేశారు. కానీ, ఆ తర్వాత కూడా పెద్ద స్థాయిలో ఈ దాడులు జరిగాయి.

నుహ్‌లో నివాసముంటున్న వారిస్ కుటుంబం, ఇప్పటికీ ఈ దారుణ ఘటన నుంచి బయటపడేందుకు పోరాడుతోంది.

''చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు గోరక్షకులకు ఎవరిచ్చారు'' అని వారు ప్రశ్నిస్తున్నారు.

కానీ, కారు ప్రమాదం కారణంగానే వారిస్ చనిపోయాడని పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలిందని ఇన్‌స్పెక్టర్ జనరల్ రవి కిరణ్ బీబీసీకి చెప్పారు. ఇంకా మరేదైనా కొత్త సమాచారం లభిస్తే ఆ దిశగా విచారణ చేపడతామని ఆయన తెలిపారు.

ఆవులు
ఫొటో క్యాప్షన్, ఆవులును హిందువులు పూజిస్తారు

‘‘వీడియో డిలీట్ చేశారు’’

అయితే, గోరక్షకుల దాడిలోనే వారిస్ చనిపోయినట్లు షౌకీన్ చెబుతున్నారు. గోరక్షక దళాలకు నేతృత్వం వహిస్తున్న మోను మనేసర్‌పై ఆరోపణలు చేశారు. తమపై దాడి చేసిన బృందానికి మనేసరే నాయకుడని, పశువులను తరలిస్తున్న వారిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఆయన వీడియోలు కూడా అప్‌లోడ్ చేస్తారని చెబుతున్నారు.

ఆ రోజు తమని ప్రశ్నిస్తున్నప్పుడు కూడా ఫేస్‌బుక్ లైవ్ వీడియో తీశారని, ఆ తర్వాత మనేసర్ ఫేస్‌బుక్ ఖాతా నుంచి ఆ వీడియోని డిలీట్ చేశారని షౌకీన్ ఆరోపిస్తున్నారు.

''వాళ్లని కొట్టండి అని మోను చెప్పడంతో అందరూ కలిసి మాపై దాడి చేశారు. అదంతా మోను డైరెక్షన్‌లోనే జరిగింది'' అని షౌకిన్ ఆరోపించారు.

అయితే, బీబీసీ మోను మనేసర్‌ను సంప్రదించలేదు. జనవరిలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం వారిస్ మరణంలో తనపై వచ్చిన ఆరోపణలను మనేసర్ కొట్టిపారేశారు.

కారులో ఆవును తీసుకెళ్తున్నారని మావాళ్లు చెప్పడంతో అక్కడికి వెళ్లామని ఆయన చెప్పారు.

'' ప్రమాదం జరిగిన 35 నిమిషాల తర్వాత మేం అక్కడికి వెళ్లాం. అప్పటికే రెండు పోలీస్ కార్లు ఉన్నాయి. కారులో ఉన్నవారికి స్వల్ప గాయాలయ్యాయి. వాళ్లకి నీళ్లు ఇవ్వాలని నేనే చెప్పాను. ఆ తర్వాత పోలీసులు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు'' అని మనేసర్ చెప్పారు. కొద్దిగంటల తర్వాత వారిస్ చనిపోయాడని తెలిసిందన్నారు.

జునైద్ భార్య సాజిదా
ఫొటో క్యాప్షన్, జునైద్ భార్య సాజిదా

ఆ హింసలో ఇదొక భాగం

వారిస్ మరణం గోరక్షక దళాలు సాగిస్తున్న హింసాకాండలో భాగమని అతని సోదరుడు ఇమ్రాన్ ఆరోపించారు.

కొన్ని వారాల తర్వాత జరిగిన ఇద్దరు ముస్లింలు జునైద్, నజీర్ హత్య కేసు కూడా ఇలాంటిదేనని ఆయన చెప్పారు. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

హరియాణాలోని భివాని జిల్లాలో దహనం చేసిన ఒక కారులో జునైద్, నజీర్ మృతదేహాలు కాలిపోయిన స్థితిలో కనిపించాయి. ఫిబ్రవరిలో ఈ ఘటన జరిగింది. హిందూ సంస్థలకు చెందిన కొందరు వ్యక్తులే ఈ హత్యలకు కారణమని మృతుల బంధువులు ఆరోపించారు. గోవుల అక్రమ రవాణా కారణంగానే ఈ ఘటన జరిగినట్లు మీడియాలో కథనాలొచ్చాయి.

ఈ కేసులో మనేసర్ సహా ఐదుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ముగ్గురు మాత్రమే అరెస్టయ్యారు.

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన జునైద్, నజీర్ కుటుంబాలను బీబీసీ కలిసింది.

''ఆయన శవాన్ని ఒక బ్యాగులో తెచ్చారు. బూడిద రాలుతోంది. కొన్ని ఎముకలు, బూడిద మినహా అక్కడ ఏమీ లేవు'' అని జునైద్ భార్య సాజిదా కన్నీటిపర్యంతమయ్యారు.

తమ ఆరుగురు పిల్లలను ఒంటరిగా ఎలా చూసుకోవాలని ఆమె బాధపడుతున్నారు.

ఈ మరణాలతో భరత్‌పూర్‌‌లో ముస్లింలు ఆందోళనకు దిగారు. తమను టార్గెట్ చేసేందుకే గో రక్షక చట్టాలను తెచ్చారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

''అందరూ భయపడుతున్నారు. వాళ్లు ఎత్తుకెళ్లిపోతారనే భయం. వాళ్లు ఎవరినైనా ఎత్తుకెళ్తారు. కొడతారు. గోవుల అక్రమ రవాణా లాంటి ఆరోపణలు చేస్తారు'' అని నజీర్ అన్నయ్య మహమూర్ చెప్పారు.

హరియాణాలోని మనేసర్ పట్టణంలో గోరక్షకులుగా చెప్పుకుంటున్న చాలా మంది సమావేశమయ్యారు. వారిలో చాలా మందితో బీబీసీ మాట్లాడింది.

తాము పోలీసులతో కలిసి, చట్టాలకు లోబడి పనిచేస్తున్నామని చెప్పారు. కొన్నిసార్లు తమపై కూడా దాడులు జరిగాయని వారు చెప్పారు.

''మార్కెట్‌లో ఎవరో ఒకరు మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ కనిపిస్తారు. అప్పుడు పోలీసులు వచ్చే వరకూ ఎదురుచూడాలా?'' అని ధర్మేంద్ర యాదవ్ ప్రశ్నించారు. మనేసర్‌కి ముందు గోరక్షక దళాలకు నాయకుడిగా ధర్మేంద్ర వ్యవహరించారు.

ముస్లింలను టార్గెట్ చేశారనే వాదనలను ధర్మేంద్ర కొట్టిపారేశారు. ''గోవులను సంరక్షించాలని చట్టం చెబుతోంది, చట్టం ఏం చెబితే దానిని పాటించడం మన విధి. గోవులను అక్రమ రవాణా చేసే వారెవరైనా మాకు శత్రువులే. ముస్లింలు కాదు.'' అని ధర్మేంద్ర చెప్పారు.

ఇప్పటికి కూడా ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటే భయమేస్తోందని షౌకీన్ చెప్పారు.

''వారిస్ చనిపోయాడు. నేను కూడా అతనిలా చనిపోవాలని అనుకోవడం లేదు'' అని అన్నారు.

వీడియో క్యాప్షన్, వైరల్: శవాన్ని రేప్ చేయకుండా సమాధిపై ఇనుప తలుపు పెట్టారనే వార్తల్లో నిజమెంత?

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)