పంజాబ్: అమృత్‌పాల్ సింగ్ విడుదల చేసిన వీడియోలో ఏముందంటే?

అమృత్‌పాల్

ఫొటో సోర్స్, VIRAL VIDEO / SCREEN SHOT

ఫొటో క్యాప్షన్, అమృత్‌పాల్ సింగ్ పోలీసులు నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు.

'వారిస్ పంజాబ్ దే' చీఫ్, ఖలిస్తాన్ మద్దతుదారఅమృత్‌పాల్ సింగ్‌ను ఒక కేసులో అరెస్టు చేయడానికి మార్చి 18 నుంచి పంజాబ్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

ఇదే సమయంలో అమృత్‌పాల్ సింగ్ ఒక వీడియో విడుదల చేశారు.

ఆ వీడియోలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, అకాల్ తఖ్త్ (సిక్కు మత సంస్థ అత్యున్నత విభాగం)కి చెందిన జతేదార్ మధ్య సంభాషణలను అమృత్‌పాల్ ప్రస్తావించారు.

2023 ఏప్రిల్ 13న బైసాఖి (వైశాఖ మొదటి రోజు వేడుక) వేళ సిక్కుల సమస్యలను టేకప్ చేయడానికి సర్బత్ ఖాల్సా (సిక్కులందరి సమావేశం)ని పిలవమని అకల్ తఖ్త్‌లోని జతేదార్‌ని అమృత్‌పాల్ కోరారు.

18, 19వ శతాబ్దాలలో సిక్కులకు సంబంధించిన ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి సర్బత్ ఖల్సాను నిర్వహించేవారు.

అమృత్‌పాల్ పిలుపునకు జతేదార్ స్పందిస్తారో లేదో చూడాలి.

అమృత్‌పాల్‌ నెల రోజుల క్రితం అమృత్‌సర్‌లోని అజ్నాలాలో తన మద్దతుదారులతో కలిసి అక్కడి పోలీస్టేషన్‌ను ముట్టడించారు.

తన సహచరుడిని అరెస్టు చేశారని, అతన్ని వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై అమృత్‌పాల్‌ మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

మార్చి 18న దక్షిణ పంజాబ్‌లో 'మతపరమైన అవగాహన మార్చ్‌'ను ప్రారంభించేందుకు అమృత్‌పాల్‌ వెళుతున్న సమయంలో అరెస్టు చేయాలని పంజాబ్ పోలీసులు భావించారు.

ఈ ప్రణాళికలో భాగంగా ముందస్తుగా అమృత్‌పాల్‌ సహచరులను అరెస్టు చేశారు. విషయం పసిగట్టిన అమృత్‌పాల్‌ పోలీసులకు చిక్కలేదు. గత 12 రోజుల నుంచి అమృత్‌పాల్‌ తప్పించుకొని తిరుగుతున్నారు.

ఈ నేపథ్యంలో కొన్ని గంటల క్రితం అమృత్‌పాల్‌ వీడియో ఒకటి విడుదల అయింది. వివిధ పంజాబీ డిజిటల్, టీవీ ఛానెల్‌లు బుధవారం ఈ వీడియోను ప్రసారం చేశాయి.

అమృత్‌పాల్ ఎక్కడి నుంచి ఆ వీడియో తీశారనే దానిపై పంజాబ్ పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. అయితే, ఈ వీడియో ద్వారా అమృత్‌పాల్‌ సింగ్ పోలీసుల కస్టడీలో లేరని తెలుస్తోంది.

అమృత్‌పాల్, ఆయన సహచరులు

ఫొటో సోర్స్, Getty Images

వీడియోలో అమృత్‌పాల్ ఏం చెప్పారు?

అమృత్‌పాల్ సింగ్ విడుదల చేసిన వీడియోలో రికార్డింగ్ సమయం, తేదీ గురించి వివరాలు ధృవీకరించడం లేదు. వీడియోలో అకల్ తఖ్త్ జతేదార్ హర్‌ప్రీత్ సింగ్ ఏర్పాటు చేసిన సమావేశాన్ని అమృత్‌పాల్ ప్రస్తావించారు.

మార్చి 27న అకల్ తఖ్త్‌లో ఈ పంథక్ (సిక్కు మత) సమావేశం జరిగింది. పంజాబ్‌లో అరెస్టైన అమాయక యువకులను విడుదల చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి హర్‌ప్రీత్ సింగ్ 24 గంటల అల్టిమేటం ఇచ్చారు.

వీడియోలో అమృత్‌పాల్ సింగ్ మార్చి 18 నాటి సంఘటనలను ప్రస్తావిస్తూ “ప్రభుత్వం మమ్మల్ని ఇంటి వద్ద అరెస్టు చేయాలనుకుంటే, అరెస్టు చేసుకోమని చెప్పా.

పెద్ద సంఖ్యలో బలగాలతో మమ్మల్ని చుట్టుముట్టి అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. కానీ సర్వశక్తిమంతుడు నన్ను రక్షించాడు.

మేం మాల్వాకు వెళ్లడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. అలా అయితే మేం ‘ఖల్సా వాహిర్’ని మొదలుపెట్టలేం.

మాల్వాకు వెళ్లి ఖల్సా వాహిర్‌ను ప్రారంభించాలనుకున్నా. దాని కోసం సాధ్యమైనంతగా ప్రయత్నించాలని భావించాం" అని వీడియోలో తెలిపారు.

ఖల్సా వాహిర్ అనేది పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల్లో అమృత్‌పాల్ సింగ్ ప్లాన్ చేసిన మార్చ్. మాల్వా ప్రాంతంలోని ముక్త్‌సర్‌లో మార్చి 19న రెండో దశ ఖల్సా వాహిర్ ప్రారంభం కావాల్సి ఉంది.

“ఇంటర్నెట్‌పై పరిమితులు విధించినప్పుడు, మాకు ఎటువంటి కమ్యునికేషన్ లేదు, ఏం జరుగుతుందో తెలియదు.

ఇప్పుడు నేను ప్రసంగిస్తుండగా పంజాబ్‌లో జరుగుతున్న దాని గురించి కొన్ని వార్తలు చదివాను" అని వీడియోలో అమృత్‌పాల్ వ్యాఖ్యానించారు.

అకల్ తఖ్త్ జతేదార్‌ 'సర్బత్ ఖల్సా'ను పిలవాలంటూ అమృత్‌పాల్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

ఆ వీడియోలో “జాతేదార్ సాహిబ్ దీనిపై బలమైన స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నా. తఖ్త్ శ్రీ దామ్‌దామా సాహిబ్‌‌లో జరిగే వైశాఖ ఉత్సవానికి సర్బత్ ఖాల్సాను జతేదార్ సాహిబ్ తప్పకుండా పిలవాలి'' అని అమృత్‌పాల్ కోరారు.

పంజాబ్ పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

వీడియోపై పోలీసులు ఏం చెబుతున్నారు?

బీబీసీ జర్నలిస్ట్ అరవింద్ ఛాబ్రా పంజాబ్ డీఐజీ నరేంద్ర భార్గవను ఈ వీడియో గురించి ఫోన్‌లో సంప్రదించారు. అయితే ఇప్పుడే ఆ వీడియోను ధ్రువీకరించలేమని భార్గవ చెప్పారు.

''ఒకవేళ అమృత్‌పాల్ ఆ వీడియో విడుదల చేస్తే తమ అదుపులో ఆయన లేడన్న పంజాబ్ పోలీసుల స్టాండ్‌ను అమృత్‌పాల్ ధృవీకరించినట్లే'' అని అన్నారు. అమృత్‌పాల్ కోసం పోలీసులు నిరంతరం గాలిస్తున్నారని డీఐజీ స్పష్టంచేశారు.

కాగా, అమృత్‌పాల్ సింగ్ లొంగిపోతారనే మీడియా ఊహాగానాల మధ్య ఈ వీడియో విడుదలయింది.

అంతకుముందు అమృత్‌సర్ పోలీస్ కమిషనర్ నౌనిహాల్ సింగ్ బీబీసీతో మాట్లాడుతూ "ఎవరైనా ఇక్కడికి (దర్బార్ సాహిబ్) వచ్చి లొంగిపోవాలనుకుంటే వారి పట్ల చట్ట ప్రకారమే నడుచుకుంటామని హామీ ఇస్తున్నా.

ఆ వ్యక్తిపై ఏ విధంగానూ వివక్ష ఉండదు. ఊహాగానాలను నేను ధృవీకరించలేను. కానీ మేం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉన్నాం" అని అన్నారు.

అమృత్‌పాల్

ఫొటో సోర్స్, Getty Images

అమృత్‌పాల్‌పై నమోదైన కేసులేంటి?

పోలీసులు అరెస్టు చేసిన తన సహచరుడిని విడుదల చేయాలంటూ ఫిబ్రవరి 23న అమృత్‌పాల్ సింగ్ తన మద్దతుదారులతో కలిసి పంజాబ్‌లోని అజ్నాలా పోలీస్‌స్టేషన్ ముందు నిరసన తెలిపారు.

ఈ నిరసన ఘర్షణలకు దారి తీసింది. దీంతో అమృత్‌పాల్‌పై పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మార్చి 18న జలంధర్‌లోని షాకోట్-మల్సియన్ రహదారిపై అమృత్‌పాల్ సింగ్, ఆయన సహచరులను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే వారు తప్పించుకున్నారు.

అప్పటి నుంచి పంజాబ్ పోలీసులు అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకోలేకపోయారు. మరోవైపు అరెస్టైన 353 మందిలో ఆదివారం వరకు 197 మందిని విడుదల చేశామని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ప్రకటించారు.

అమృత్‌పాల్ సింగ్, అతని సహచరులపై శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, హత్యాయత్నం చేయడం, పోలీసు సిబ్బందిని గాయపరచడం, పోలీసులు తమ విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడం వంటి అభియోగాల కింద పోలీసులు దాదాపు 16 కేసులు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)