డోనల్డ్ ట్రంప్: అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ బరిలోకి దిగాలనే ఆయన ఆశలకు లైంగిక వేధింపుల కేసు తీర్పు గండి కొడుతుందా?

డోనల్డ్ ట్రంప్
    • రచయిత, ఆంథోనీ జర్చెర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జీన్ కెరల్ అనే మహిళను లైంగికంగా వేధించారన్న ఆరోపణలలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ దోషిగా నిర్ధరిస్తూ న్యూయార్క్ జ్యూరీ నిర్ణయం ప్రకటించింది.

అయితే, ఈ తీర్పు పరిణామాలు ట్రంప్ ‌పై కేవలం లైంగిక వేధింపులు, పరువు నష్టం అంశాలకే కాకుండా, ఇంకా అనేక రూపాలలో ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయంగా.

ఈ తీర్పు రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ స్థానానికి మార్చే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన మద్ధతుదారులు అమెరికా న్యాయవ్యవస్థలోనే లోపం ఉన్నట్లు భావిస్తుంటారు.

గతంలో ఆయనకు ఇబ్బందులు ఎదురైనప్పుడు వారంతా ఆయన వెనకే నిలబడ్డారు.

అయితే, ఈ విషయంలో ఇద్దరు రిపబ్లికన్ సెనెటర్ల్ స్పందన, 2024లో అమెరికా అధ్యక్ష పదవి కోసం బరిలో ఉన్న ఆయనకు ఎదురుకాబోయే ప్రమాదాన్ని సూచిస్తోంది.

‘‘దీని ప్రభావం కచ్చితంగా ఉంటుంది’’ అని సౌత్ డకోటా సెనెటర్ జాన్ థునే అన్నారు. ‘‘మనకు ఈ డ్రామాలన్నీ అవసరమా అని ప్రజలు భావించే అవకాశం ఉంది’’ అని అన్నారాయన.

టెక్సస్‌కు చెందిన జాన్ కార్నిన్ కూడా దాదాపు ఇలాంటి హెచ్చరికే చేశారు. ‘‘ఆయన మళ్లీ ఎన్నికవుతారని నేను అనుకోను. కేవలం తన బలంతోనే ఆయన ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

మొత్తానికి ట్రంప్ తనకు తానే శత్రువుగా మారుతున్నారు.

కోర్టు నుంచి బయటకు వస్తున్న జీన్ కెరల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోర్టు నుంచి బయటకు వస్తున్న జీన్ కెరల్

జీన్ కెరల్ వేసిన పిటిషన్‌లో ప్రధానమైన అంశం ఏంటంటే, ఈ అమెరికా మాజీ అధ్యక్షుడు తనపై వచ్చిన ఆరోపణలను ఎదుర్కొనే క్రమంలో పిటిషనర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఆడవాళ్ల జననాంగాలను తాకడం గురించి గతంలో యాక్సెస్ హాలీవుడ్ అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సెలబ్రిటీలు ఏం చేసినా ఎవరూ ఏమీ అనరని, అది సెలబ్రిటీలకున్న పవర్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

‘‘అదృష్టమో, దురదృష్టమో, సెలబ్రిటీలకు అలాంటి పవర్ మరో మిలియన్ సంవత్సరాల వరకైనా ఉంటుంది’’ అని ఆయన విచారణ సందర్భంగా అన్నారు.

కెరల్‌తోపాటు లైంగిక ఆరోపణలు చేసిన మరో మహిళ కూడా గొప్ప ఆకర్షణీయమైన వ్యక్తులు కారని ట్రంప్ తనను విచారించిన మహిళా అటార్నీతో అన్నారు.

ఈ కేసు విచారణ సందర్భంగా జ్యూరీ...అసలు ట్రంప్ అలాంటి చర్యలు పాల్పడి ఉంటాడా అన్న కోణంలోనే కాకుండా కనీసం ఆయన తనపై ఆరోపణలు చేసిన వ్యక్తులకన్నా నమ్మదగినా వ్యక్తా కాదా అన్నది కూడా అంచనా వేసింది.

సెలబ్రిటీలు ఆడవారిని ఎక్కడైనా తాకే అవకాశం ఉందని విచారణలో ట్రంప్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, సెలబ్రిటీలు ఆడవారిని ఎక్కడైనా తాకే అవకాశం ఉందని విచారణలో ట్రంప్ అన్నారు.

గతంలో ఏం జరిగింది?

2020 అధ్యక్ష ఎన్నికలలో, సబర్బన్ ఓటర్లు, ముఖ్యంగా మహిళలు, ట్రంప్ వైఖరిపట్ల విముఖత వ్యక్తం చేశారు. ఈ కేసులో జ్యూరీ తీర్పు అటువంటి ఓటర్లను ఆయనకు ఇంకా దూరం చేయవచ్చు.

జ్యూరీ తీర్పును చాలా అవమానకరమైన తీర్పుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్రంప్ విమర్శించారు. ఆ మహిళ ఎవరో తనకు తెలియదని స్పష్టం చేశారు. ఈ తీర్పుపై అప్పీలుకు వెళతానని కోర్టు వెలుపల ట్రంప్ లాయర్ ప్రకటించారు.

2024లో తిరిగి వైట్‌హౌస్‌లో అడుగుపెట్టడానికి ట్రంప్ ఎంతో పట్టుదలగా పని చేసుకుపోతున్నారు. ప్రచారం చేస్తున్నారు. ఆయన టీమ్ అనేక రాష్ట్రాల్లో ఆయనకు మద్దతు కూడగట్టే పనిలో ఉంది.

తన ప్రత్యర్ధి రాన్ డి సాంటిస్‌పై ఆయన నిర్దాక్షిణ్యంగా రాజకీయ ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. జ్యూరీ తీర్పు విషయంలో కూడా ఆయన తన అనుకూలుర నుంచి మద్ధతు సంపాదించారు.

అయితే, లైంగిక వేధింపులు, పరువు నష్టం తీర్పు వ్యవహారం రిపబ్లికన్ పార్టీలో ఆయన ప్రత్యర్ధులకు మంచి అవకాశంగా మారుతుంది. కెరల్ లాయర్ మాదిరిగా వారు కూడా గట్టి ఆరోపణలు చేయగలితే, అది పార్టీపై పట్టు కొనసాగించేందుకు ఆయన మరిన్ని పొరపాట్లకు పాల్పడేలా చేయగలదు.

ఇప్పటికే క్రిమినల్ కేసులు ఎదుర్కొన్న ఆయన, సివిల్ కేసులో కూడా నేరారోపణలు ఎదుర్కొన్న మొట్ట మొదటి అమెరికా అధ్యక్షుడవుతారు.

అయితే, ఇప్పటి వరకు ఇలాంటి చట్టపరమైన ఇబ్బందులను పెద్దగా ఖాతరు చేయకపోయినా, న్యూయార్క్ జ్యూరీ తీర్పు మాత్రం ట్రంప్‌కు ఆందోళన కలిగించేదే. ఎందుకంటే ఈ కేసులో విచారణలో బయటపడ్డ విషయాలు చిన్నవి కాదు. సాక్ష్యాధారాలను బలంగా నమ్మే అమెరికన్లకు ఆయన తప్పు చేసినట్లు స్పష్టం చేశారనేందుకు అనేక ఆధారాలు ఇందులో కనిపించాయి.

అమెరికా క్యాపిటల్ బిల్డింగ్‌పై దాడిలో ఆయన ప్రమేయం, పదవి నుంచి దిగిపోయిన తర్వాత రహస్య పత్రాల నిర్వహణలో పొరపాట్లు, 2020 ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే ప్రయత్నాల్లాంటి కేసులు ఇంకా ఆయన మీద ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్: అమెరికా చరిత్రలోనే ఎన్నడూ ఇలా జరగలేదు

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)