కరీంనగర్ - ఆశ: ఒకప్పుడు భిక్షాటనతో బతికిన హిజ్రా.. ఇప్పుడు ఫొటోగ్రాఫర్ ఎలా అయ్యారు?

- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘’పనిచేసుకుని బతుకొచ్చు కదా అని ఈ సమాజం పదేపదే సూదుల్లాంటి మాటలతో గుండెల్లో గుచ్చి చంపేది. ఇప్పుడు పనిచేద్దామని ముందుకొచ్చాను.’’
తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన ‘ఆశ’ మాటలు ఇవి. ఆమె ఒక ట్రాన్స్‌వుమన్.
ప్రస్తుతం ఆశ కరీంనగర్‌లో పోట్రెయిట్ ఫోటోగ్రఫీ షాప్ నడుపుతున్నారు.
ఇంతకుముందు బతుకు తెరువు కోసం ఆమె భిక్షాటన చేసేవారు. ఆ తర్వాత తెలంగాణలో ప్రభుత్వ రుణం పొంది జీవనోపాధి చూసుకున్న తొలి ట్రాన్స్‌జెండర్‌గా నిలిచారు.
ఆశ తన శరీరంలోని వేరే జెండర్ లక్షణాలతో ఇమడలేక, టీనేజీ ఆరంభ దశలోనే కుటుంబ సభ్యులకు తెలియకుండా లింగ మార్పిడి చికిత్స చేయించుకున్నారు.
ఆపరేషన్ తర్వాత ఆశ శరీరంలో వస్తున్న మార్పులను కుటుంబ సభ్యులు గమనించడంతో ఆమె ఒక హిజ్రా అన్న విషయం బయటపడింది.
ఆ సమయంలో ఆశ ఎంత మథనపడ్డారు? ఎంత వేదన అనుభవించారు? కుటుంబ సభ్యులు ఎలా స్పందించారు? ఇలాంటి విషయాలన్నీ ఆమె బీబీసీతో పంచుకున్నారు.
‘‘సాధారణంగా, సమాజానికి భయపడి కుటుంబం హిజ్రాలను వెలివేస్తుంది. అయితే, మా నాన్న అందుకు భిన్నంగా స్పందించారు. నాబిడ్డ.. కొడుకైనా, కూతురైనా, హిజ్రా అయినా పర్వాలేదు. తనకు ఇష్టం వచ్చినట్టు బతకనివ్వండని కుటుంబ సభ్యులకు, బంధువులకు చెప్పారాయన.’’
ఆ తర్వాత, తండ్రి ప్రోద్బలంతో ఆశ హోటల్ మేనేజ్మెంట్‌లో డిగ్రీ పూర్తి చేశారు.

దిల్లీలో ఏం జరిగింది?
ఆశ ఎల్జీబీటీ సమూహంతో కలిసి జీవించాలని కోరుకున్నారు. అందుకు దిల్లీ వెళ్లారు. కానీ, అక్కడ ఆమెకు అనుకోని ఇబ్బందులు ఎదురయ్యాయి.
‘‘కుటుంబం ఆదరించినా నేను మాత్రం ‘హిజ్రా’ సమాజంతోనే కలిసి బతకాలని నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలో జీవనోపాధి కోసం అందరు హిజ్రాల మాదిరే భిక్షాటన చేశాను. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాదిన హిజ్రాలకు భిక్షాటనలో సంపాదన ఎక్కువ. అందుకే దిల్లీ వెళ్లాను.
మొదట్లో ఏదైనా పనిచేద్దామని అనుకున్నాను. నాకు చదువు ఉంది. హోటల్ మేనేజ్మెంట్ చేశాను. డిగ్రీ వరకు చదివాను. స్కిల్స్ ఉన్నాయి. కానీ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఎక్కడా ఉద్యోగ అవకాశాలు రాలేదు. ప్రభుత్వానికే మాపైన అవగాహన లేనప్పుడు, సమాజంలో మాలాంటి వాళ్ల మీద వేరే అభిప్రాయం ఉన్నప్పుడు మరి ఇంక ఏ పని చేస్తాం?
అలాంటి పరిస్థితుల్లో కనీస అవసరాలు తీర్చుకోవడానికి భిక్షాటనే మార్గం అయింది. ఈ పని ఒక దగ్గర స్థిరంగా చేసేది కాదు. వివిధ రాష్ట్రాలు తిరగాల్సి వస్తుంది. దిల్లీలో సుందర్ నగర్ ప్రాంతంలో భిక్షాటన చేసేదాణ్ని. అక్కడ రౌడీ మూకలు, పోలీసులతో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. రౌడీ గ్యాంగ్‌ల నుంచి ర్యాగింగ్ ఎదుర్కున్నాను. భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బుల్లో కొంత భాగం వారికి ఇవ్వకపోతే కర్రలతో విచక్షణరహితంగా కొట్టేవారు.
పోలీసులు భిక్షాటన చేయనివ్వకుండా తరిమేసేవారు. వారికి దొరికితే దెబ్బలు, అరెస్ట్‌లు తప్పవని పరుగులు పెట్టేవాళ్లం. భాష తెలియని ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేస్తే జమానత్ ఇచ్చి విడిపించే వారు కరువే.
అలా పరుగెత్తుతూ ఒకసారి ఎదురుగా వేగంగా వస్తున్న కారుకు గుద్దుకోబోయాను. ఆ కారు డ్రైవర్ వెంట్రుకవాసిలో ప్రమాదం నుంచి తప్పించారు. ఆ తర్వాత నేను ఆయనకు పాదాభివందనం చేశాను. నిజానికి నేను ఆ రోజు కారు కింద పడి చనిపోవాల్సింది. హిజ్రా బతుకు అంటే ప్రాణాలతో చెలగాటమా అని అప్పుడు అనిపించింది’’ అని ఆశ అప్పటి కష్టాలను వివరించారు.
దారి చూపిన ఫొటోగ్రఫీ
ఆ తర్వాత దిల్లీ నుంచి ఆశ సొంతూరుకు వచ్చేశారు.
‘‘ఆ రోజు ప్రమాదం నుంచి బయటపడ్డాక నా కంటికి నా జీవితం ఒకసారి కనిపించింది. నా జీవితం ఏంటీ, నా బతుకేంటీ, భిక్షాటన చేసుకుని బతికితేనే జీవితమా? ఏదైనా గౌరవప్రదమైన పనిచేసుకుని బతకాలని నిర్ణయించుకున్నాను. అయితే ఇందులో ఒక సమస్య ఉంది. అదేంటంటే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మాకు అవకాశాలు లేవు. రెండు వైపుల నుంచి మాకు ఎలాంటి ఆధారమూ లేదు.
మా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో చాలా రకాల ఈవెంట్స్ జరుగుతుంటాయి. అప్పుడప్పుడు నేను మొబైల్‌తో తీసిన ఫోటోలు చూసి బాగున్నాయని మావాళ్లు చెప్పేవారు. మొదట్లో పట్టించుకునేదాణ్ని కాదు. కానీ, చాలా సార్లు వాళ్లు అదే మాట చెప్పడంతో, నాలో ఫొటోగ్రఫీపై అభిరుచి పెరిగింది’’ అని ఆమె వివరించారు.
ఆశ తన ఫొటోగ్రఫీ నైపుణ్యాలను మెరుగుపరుకునేందుకు వరంగల్‌లో ఒక ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. మొత్తం 20 మంది బ్యాచ్‌లో ఆమె ఒక్కరే ట్రాన్స్‌జెండర్.
‘‘నేను ఒక ట్రాన్స్‌గర్ల్ లాగే ఫొటోగ్రఫీ, గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకునేందుకు ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లేదాణ్ని. అందరూ నన్ను తేడాగా చూసేవారు. ఈమెకెందుకు ఫొటోగ్రఫీ, అవసరమా అన్నది వారి అభిప్రాయం కావొచ్చు. నేను వారి మాటలు, చూపులను పట్టించుకోలేదు. నేనెందుకు నేర్చుకోకూడదు అనే ధోరణిలో ఉండేదాణ్ని’’ అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, AASA
తెలంగాణలో ప్రభుత్వ రుణం పొందిన తొలి హిజ్రా
కరీంనగర్ కేంద్రంగా హిజ్రాల సమస్యలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థలో ఆశ కొన్నాళ్లు పనిచేశారు.
ఆ సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమం కోసం ఆశ డిజైన్ చేసిన పోస్టర్ జిల్లా అధికారుల దృష్టిలో పడింది.
‘‘ఆ పోస్టర్ డిజైన్ చేసింది ఒక హిజ్రా అని తెలిసి జాయింట్ కలెక్టర్ ఆశ్చర్యపోయారు. ‘ఫొటోగ్రఫీ తెలుసు అంటున్నావు, షాప్ పెట్టుకోవచ్చుగా’ అని అడిగారు. ఆ క్రమంలో, బ్యాంకు రుణం అందించేందుకు వారు ముందుకు వచ్చారు’’ అని ఆశ వివరించారు.
అప్పటికి తెలంగాణలో హిజ్రాల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ రుణం అందించే ఏర్పాట్లు ఏవీ లేకపోవడంతో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం) కింద రుణానికి దరఖాస్తు చేసుకునేందుకు ఆశను కరీంనగర్ జిల్లా యంత్రాంగం ప్రోత్సహించి, సహకారం అందించింది.
అలా ఆమెకు ఫొటోగ్రఫీ షాప్ తెరిచేందుకు ఐదు లక్షల రుపాయల బ్యాంకు రుణం మంజూరయ్యింది.
‘‘మాకు కూడా రుణాలు ఇస్తారన్న సంగతే తెలియదు. మా వరకు ఆ రుణాలు వస్తాయని అనుకోలేదు. అటువైపు ఆలోచించలేదు’’ అని ఆశ అన్నారు.
పరిశ్రమల శాఖ ద్వారా ఒక ట్రాన్స్‌జెండర్‌కు తెలంగాణలో ప్రభుత్వ రుణం ఇవ్వడం ఇదే మొదటిసారి అని కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ అధికారి(డీబ్ల్యూవో) సబిత బీబీసీతో చెప్పారు.
"బహుశా, దేశంలోనే పీఎంఈజీపీ కింద బ్యాంకు రుణం పొందిన మొదటి ట్రాన్స్‌జెండర్ కూడా ఆశనే కావొచ్చు" అన్నారు సబిత.
"ట్రాన్స్‌జెండర్లతో వ్యక్తిగతంగా సమయం గడిపితే వారిపై సమాజంలో ఉన్న అభిప్రాయాలు కచ్చితంగా మారుతాయి. భిక్షాటన స్థానంలో గౌరవంగా బతకాలని, తమ సామర్థ్యం నిరూపించుకోవాలని వారిలో చాలా మంది కోరుకుంటున్నారు’’ అని సబిత తెలిపారు.
నిరుడు తెలంగాణలో ట్రాన్స్‌జెండర్స్ వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటయింది. ఇందులో భాగంగా ట్రాన్స్‌జెండర్లకు బ్యాంకు రుణాలు ఇవ్వాలన్న ఆలోచన చేస్తోంది ప్రభుత్వం.
వారు గౌరవప్రదమైన బతుకు తెరువు పొందేందుకు మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో తిరిగి చెల్లించక్కర్లేని, 100 శాతం సబ్సిడీతో కూడిన రూ.50 వేల రుణాన్ని అందించే కార్యక్రమం ప్రారంభ దశలో ఉంది.

ఫొటో సోర్స్, AASA
'తప్పు మాదో, సమాజానిదో ఇప్పుడు బయటపడుతుంది'
‘‘ఈ సమాజం కోరుకుంటున్నట్టుగానే నేను పనిచేసుకుని బతికేందుకు ముందుకు వచ్చాను. సమాజం అంగీకారం కోసం ఎదురుచూస్తున్నాను. గతంలో నేను కేవలం హిజ్రా కమ్యూనిటీ ఈవెంట్స్‌లో మాత్రమే ఫొటోగ్రఫీ చేశాను. బయటి వ్యక్తుల నుంచి ఇప్పటివరకు ఆర్డర్స్ రాలేదు. తప్పు మాదా, లేదా మమ్మల్ని అంగీకరించని ఈ సమాజానిదా అనేది ఇప్పుడు బయటపడుతుంది’’ అని ఆశ అంటున్నారు.
ట్రాన్స్‌జెండర్‌ల కోసం పనిచేస్తున్న ఓ స్వచ్చంద సంస్థ వేములవాడలో ఓ హోటల్ తెరవబోతోంది. దాని ప్రారంభోత్సవం ఫొటోగ్రఫీ చేయాలని తనకు పిలుపు వచ్చినట్లు చెప్పారు ఆశ.
ఫొటోగ్రఫీతో పాటు కరీంనగర్ జిల్లాలో హిజ్రా కమ్యూనిటీ అభ్యున్నతి కోసం కూడా ఆశ పనిచేస్తున్నారు.
‘‘మావాళ్లు పోలీసుల నుంచి ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే పోలీస్, కలెక్టరేట్ ఉన్నతాధికారులను కలిసి, కమ్యూనిటీతో సమావేశాలు ఏర్పాటు చేసి మా సమస్యలను వారి దృష్టికి తెచ్చాం. దీని ఫలితంగానే, ఇటీవల పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళాలో మావాళ్లు కొంత మంది పాల్గొనే అవకాశం కలిగింది. నిరంతర ప్రయత్నం ఫలితంగా, మాలో ఒకరికి తెలుగు టీవీ షో లో, మరొకరికి ఇండిగో ఎయిర్ లైన్స్‌లో గ్రౌండ్ స్టాఫ్‌గా అవకాశం వచ్చింది. మరికొందరు ఆస్పత్రుల్లో ల్యాబ్‌లు, నర్సింగ్ విభాగాల్లో పనిచేస్తున్నారు’’ అని ఆమె వివరించారు.

'మా నాన్నది పెద్ద మనసు'
తన తండ్రి తన గురించి ఎన్నో కలలు కన్నారని, కానీ, అవి నెరవేర్చలేకపోయినందుకు ఆయనకు క్షమాణలు చెప్పాలని ఆశ అన్నారు.
‘‘మా నాన్న నా గురించి ఎన్నో కలలు కని ఉంటారు. నేను వాటిని నెరవేర్చలేకపోయాను. ఆయన నుంచి దూరంగా వెళ్లిపోయాను. హిజ్రాగా ఉంటున్నా ఆయనకు చెడ్డపేరు రానివ్వలేదు. కానీ మా చుట్టుపక్కల వారే 'మీ కొడుకు కనబడడం లేదు, ఎక్కడికి వెళ్లాడు, ఎక్కడో భిక్షాటన చేస్తున్నాడంట కదా' అని సూటిపోటి మాటలతో ఆయన్ను వేధించారు. అందుకే మా నాన్న నన్ను క్షమించాలి అని కోరుకుంటున్నా.
ఇలా ఉండడం నా తప్పు కాదు కదా. అందులో నా ప్రమేయం లేదు. దాన్ని, మా నాన్న పెద్ద మనసుతో అంగీకరించారు. నా జీవితంలో ఇంతకంటే గొప్ప విషయం ఏదీ లేదు. కుటుంబాలు వెలివేసిన ఎంతో మంది ట్రాన్స్‌జెండర్లను చూస్తుంటాను. అయినవారికి దూరమై వారు ఎంతగానో బాధపడతారు’’ అని ఆశ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్లో ‘డర్టీ హ్యారీ’ ఎవరు, ఇమ్రాన్ ఖాన్ పదే పదే ఆ పేరెందుకు చెబుతున్నారు?
- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఎలా నిర్వహిస్తారు? కచ్చితత్వం ఎంత?
- మహిళా రెజ్లర్లు: ప్రభుత్వ అధికారాన్ని, రాజకీయ పలుకుబడిని సవాల్ చేస్తున్న ఈ నిరసన ఏం చెబుతోంది?
- డోనల్డ్ ట్రంప్: అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ బరిలోకి దిగాలనే ఆయన ఆశలకు లైంగిక వేధింపుల కేసు తీర్పు గండి కొడుతుందా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















