పాకిస్తాన్‌‌లో ‘డర్టీ హ్యారీ’ ఎవరు, ఇమ్రాన్ ఖాన్ పదే పదే ఆ పేరెందుకు చెబుతున్నారు?

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, షుమైలా జాఫ్రీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇమ్రాన్‌ఖాన్ అరెస్టుతో అట్టుడికిపోతున్న పాకిస్తాన్‌లో ఇప్పుడు ఒక మాట మీద ఎక్కువగా చర్చ జరుగుతోంది. అదే ‘డర్టీ హ్యారీ’

గతంలో తన సన్నిహితులను అరెస్టు చేసినప్పుడు కూడా ఇమ్రాన్ ఖాన్ ఈ పదాన్ని వాడారు.

పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌ను అడ్డుకునేందుకు ఇస్లామాబాద్‌లో 'డర్టీ హ్యారీ'ని మోహరించారని ఇమ్రాన్ ఖాన్ ఓ ర్యాలీలో అన్నారు.

గత ఏడాది ఏప్రిల్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ను ప్రభుత్వం పడిపోయినప్పటి నుంచి ఆయన పార్టీ ‘డర్టీ హ్యారీ’ పేరును మరింత విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చింది.

పాకిస్తాన్‌లోని ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం, సైన్యం, అమెరికా కలిసి కుట్రపన్ని తనను ప్రధాని పదవి నుంచి దింపేశాయని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు.

తెరపై డర్టీ హ్యారీగా నటించిన క్లింట్ ఈస్ట్‌వుడ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తెరపై డర్టీ హ్యారీగా నటించిన క్లింట్ ఈస్ట్‌వుడ్

ఎవరీ డర్టీ హ్యారీ ?

‘డర్టీ హ్యారీ’ అనేది ఒక హాలీవుడ్ సినిమా. నటుడు క్లింట్ ఈస్ట్‌వుడ్ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాకు నాలుగు సీక్వెల్స్ కూడా వచ్చాయి. ఈ చిత్రంలో ఇన్‌స్పెక్టర్ హెరాల్డ్ ఫ్రాన్సిస్ షాలన్ అని పేరుతో నడిచే ఈ పాత్రను ముద్దుగా డర్టీ హ్యారీ అని పిలుస్తుంటారు.

డర్టీ హ్యారీ చిత్రంలో హీరో చాలా కఠినాత్ముడైన పోలీస్ ఆఫీసర్. నేరస్తులను పట్టుకునే క్రమంలో అతను వృత్తిపరమైన, చట్టపరమైన పరిమితులను దాటడానికి వెనుకాడడు.

డర్టీ హ్యారీ పాత్ర అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందింది. ఆ దేశంలో ఇదొక ట్రెండ్‌గా, కల్చరల్ ఐకాన్‌గా మారింది. తర్వాతి రోజుల్లో అమెరికాలో నిర్దాక్షిణ్యంగా, స్ట్రిక్ట్‌గా వ్యవహరించే పోలీస్ ఆఫీసర్లను డర్టీహ్యారీగా పిలవడం కూడా మొదలైంది.

అయితే, ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుత ఐఎస్ఐ జనరల్‌ను డర్టీ హ్యారీ పేరుతో సంబోధిస్తున్నారు. ఐఎస్ఐ మేజర్ జనరల్ ఫైసల్ నసీర్ తన హత్యకు కుట్ర పన్నారని ఇమ్రాన్ ఖాన్ పదే పదే ఆరోపిస్తున్నారు.

తనకు ఏదైనా జరిగితే మేజర్ జనరల్ ఫైసల్ నసీర్ మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇమ్రాన్ తన మద్దతుదారులతో అన్నారు.

తన పార్టీకి చెందిన జర్నలిస్ట్ అర్షద్ షరీఫ్‌ను కూడా మేజర్ జనరల్ ఫైసల్ నసీరే హత్య చేశారని ఇమ్రాన్ ఆరోపించారు. తన అనుచరులను అదుపులోకి తీసుకోవడం, విచారణ పేరుతో అపహరించడం, అరెస్టు చేయడం, నగ్నంగా మార్చి చిత్రహింసలకు గురి చేయడంలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు.

మంగళవారం ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్తూ విడుదల చేసిన వీడియోలో కూడా ఇమ్రాన్ ఖాన్ ఈ ‘డర్టీ హ్యారీ’ అనే పదాన్ని వాడారు.

తన కారులో కూర్చొని ఓ వీడియోను రికార్డ్ చేసిన ఇమ్రాన్ ఖాన్, ‘‘నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ డర్టీ హ్యారీ, ఇంకా అతని ఫ్రెండ్స్ నన్ను చంపడానికి ప్లాన్ వేశారు. నా జీవితం అతని చేతుల్లో అంతమపై పోవడం అల్లా కోరిక అయితే, నేను దానికి సిద్ధంగా ఉన్నాను. కానీ, మీరందరూ దానికి సిద్ధంగా ఉన్నారా?" అని ఆయన ఆ వీడియోలో ప్రశ్నించారు.

"అధికారంలో ఉన్నవారు నిజాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? నా అరెస్టు తర్వాత ప్రజలు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి రాకపోవచ్చు. కానీ, రాబోయే రోజుల్లో పాకిస్తాన్, శ్రీలంకకన్నా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది’’ అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.

ఇన్‌స్పెక్టర్ డర్టీ హ్యారీగా క్లింట్ ఈస్ట్‌వుడ్

ఫొటో సోర్స్, SILVER SCREEN COLLECTION/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఇన్‌స్పెక్టర్ డర్టీ హ్యారీగా క్లింట్ ఈస్ట్‌వుడ్

పాకిస్తాన్ సైన్యం ఏం చెప్పింది?

ఇమ్రాన్ అరెస్టుకు ముందు పాకిస్తాన్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ (ఐఎస్‌పీఆర్) పరోక్షంగా ఆయన్ను ఉద్దేశిస్తూ ఒక ప్రకటన చేసింది. సర్వసాధారణంగా పాకిస్తాన్ సైన్యం లేదా ఐఎస్‌పీఆర్ ఒక రాజకీయ నాయకుడి గురించి ప్రకటనలు విడుదల చేయడం చాలా అరుదు.

ఐఎస్‌పీఆర్ ఈ ప్రకటనలో మేజర్ జనరల్ ఫైసల్ నసీర్‌పై ఇమ్రాన్ ఖాన్ చేసిన ఆరోపణలను ఖండించింది. ఆయన ఆరోపణలు నిరాధారమని, బాధ్యతారాహిత్యమని పేర్కొంది.

గత ఏడాదిగా రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు, రెచ్చగొట్టే, సంచలనాత్మక ఆరోపణలతో ఆర్మీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను టార్గెట్ చేయడం ట్రెండ్‌గా మారిందని ఐఎస్‌పీఆర్ విమర్శించింది.

తప్పుడు ఆరోపణలు చేసే బదులు, ఆధారాలతో, చట్టపరమైన మార్గంలో వెళ్లాలని, లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకునే హక్కు సైన్యానికి ఉంటుందని కూడా ఆ ప్రకటనలో పేర్కొంది.

డర్టీహ్యారీ సినిమా సిరీస్ 1971లో వచ్చింది

ఫొటో సోర్స్, SILVER SCREEN COLLECTION/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, డర్టీహ్యారీ సినిమా సిరీస్ 1971లో వచ్చింది

ఐఎస్‌పీఆర్ ప్రకటనను సమర్ధించిన ప్రధాని షాబాజ్ షరీఫ్

'ఏ ఆధారాలు లేకుండా' మేజర్ జనరల్ ఫైసల్ నసీర్‌పై ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు చేస్తున్నారని ప్రధాని షాబాజ్ తన ట్వీట్‌లో విమర్శించారు. ఇమ్రాన్ ఖాన్ నిరంతరం సైన్యాన్ని అవమానిస్తూ, బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇలాంటి వాటిని సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

అయితే, ఇమ్రాన్ విమర్శలు ఒక అపూర్వమైన వ్యవహారమని, గతంలో ఎప్పుడూ సైన్యంపై ఇంత తీవ్రమైన ఆరోపణలు రాలేదని పాకిస్తాన్‌లో రాజకీయ విశ్లేషకుడు ముసరత్ అమీన్ అన్నారు.

గత ఏడాది కాలంగా సైన్యంపై ఆరోపణలు, దాడులు, ట్విటర్‌లో వాదోపవాదాలు కనిపిస్తున్నాయని, వీటిని ఆపేవారే లేరని ఆయన అన్నారు.

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇమ్రాన్ ఖాన్

ఇమ్రాన్ లక్ష్మణ రేఖను దాటారా?

ఇమ్రాన్ ఖాన్ నుంచి నిత్యం విమర్శలు ఎదురుకావడంతో సైన్యంలో అసహనం, కోపం పెరుగుతోందని, ఐఎస్‌పీఆర్ ప్రకటనే దీనికి రుజువని ముసరత్ అమీన్ అభిప్రాయపడ్డారు.

"పరిస్థితి ఇంత స్థాయికి చేరుకోవడం దురదృష్టకరం. ఇంకా ఆలస్యం కాకముందే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవడం ఇందులో భాగస్వాములందరి బాధ్యత అనుకుంటున్నా’’ అని ఆయన అన్నారు.

గత ఏడాది నవంబర్‌లో తనపై దాడి జరిగిన తర్వాత, ఇమ్రాన్ ఖాన్, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఈ దాడికి ప్రస్తుత ప్రధాని షాబాజ్ షరీఫ్, హోంమంత్రి రాణ సనావుల్లా, మేజర్ జనరల్ ఫైసల్ నసీర్‌లు బాధ్యులని పేర్కొన్నారు. అయితే, ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారు.

ప్రభుత్వం కూడా తమ అధినేతపై నిరాధార ఆరోపణలు చేస్తోందని ఇమ్రాన్ మద్దతుదారులు అంటున్నారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉంటే, తన ఆరోపణలకు ఇమ్రాన్ ఆధారాలు ఇచ్చేవారని, కానీ ఆయనకు ఆ అవకాశం ఇవ్వలేదని వారు అంటున్నారు.

పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా, ఇతర అధికారులతో ఇమ్రాన్ ఖాన్ (ఫైల్ ఫొటో)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా, ఇతర అధికారులతో ఇమ్రాన్ ఖాన్ (ఫైల్ ఫొటో)

ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్‌లో సైన్యంతో చెలగాటమాడిన తొలి రాజకీయ నాయకుడేమీ కాదని రాజకీయ విశ్లేషకుడు ఇంతియాజ్ గుల్ అన్నారు.

గతంలో, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియం నవాజ్ షరీఫ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు, ఇంకా అనేకమంది రాజకీయ నాయకులు కూడా సైన్యంపై బహిరంగంగానే ఆరోపణలు చేశారు.

సైన్యంలో కూడా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చాలా మద్దతు ఉందని, ఇది సైన్యాధిపతుల్లో ప్రమాద ఘంటికలు మోగించిందని ఇంతియాజ్ గుల్ అభిప్రాయపడ్డారు.

మంగళవారం ఉదయం ఇమ్రాన్ ఖాన్ వీడియోను విడుదల చేసిన తర్వాత డర్టీ హ్యారీ వ్యవహారం ఇన్ని నాటకీయ మలుపులు తిరుగుతుందని ఎవరూ ఊహించలేదు.

ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్ట్‌పై ఆయన మద్దతుదారులు చాలామంది సైన్యంపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. డర్టీ హ్యారీ పేరుతో ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటనలతో వాతావరణం తీవ్రంగా మారింది. ఆయన మద్దతుదారులకు ఆయనపై పూర్తి విశ్వాసం ఉందని ఇది రుజువు చేస్తోంది.

వీడియో క్యాప్షన్, ప్రతి దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించిన బెంజామిన్ నెతన్యాహు

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)