లెస్బియన్ జంట: ఒక హిందూ అమ్మాయి, ఒక ముస్లిం అమ్మాయి... వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సుశీలా సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
“ఆమె హిందువు, నేను ముస్లిం. కానీ, మా ఇద్దరికీ ఆ పట్టింపు లేదు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. జీవితంలో వచ్చే కష్టాలను కలిసి ఎదుర్కుంటాం. మాకు మతం ముఖ్యం కాదు."
ఇదీ మాలతి, రుబీనాల కథ. (పేర్లు మార్చాం.)
పశ్చిమ బెంగాల్‌లోని ఒక చిన్న గ్రామం నుంచి వీళ్లుద్దరూ కోల్‌కతా పారిపోయి వచ్చారు.
వీరి ప్రేమ కథ స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే ప్రారంభమైంది. ఇద్దరూ 11వ తరగతి కలిసి చదువుకున్నారు. అప్పుడే మాలతి, రుబీనా పట్ల ఆకర్షితులయ్యారు.
"నాకు ఎప్పుడూ అమ్మాయిలంటేనే ఇష్టంగా ఉండేది. కానీ, అమ్మాయిల పట్ల ఆకర్షణ కూడా ఉన్నదని తెలియలేదు. నేనే రుబీనాని అప్రోచ్ అయ్యాను. నాకు తను బాగా నచ్చింది. మా ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. రుబీనా ఎక్కువ మాట్లాడేది కాదు. ఎందుకులా ఉంటావని నేను అడుగుతూ ఉండేదాన్ని. మెల్ల మెల్లగా తను నాతో మాట్లాడడం మొదలెట్టింది" అని మాలతి చెప్పారు.
ఇంతలో రుబీనాకు ఒక అబ్బాయితో స్నేహం కుదిరింది. తనను ప్రేమించమని ఆ అబ్బాయి ఒత్తిడి తెచ్చాడు. అందుకు రుబీనా ఒప్పుకోలేదు. దాంతో, వాళ్లిద్దరి మధ్య స్నేహం చెడింది.
అయితే, రుబీనా ఒక అబ్బాయితో స్నేహం చేశారన్న విషయం వాళ్లింట్లో తెలిసిపోయింది. దాంతో, రుబీనా జీవితం అల్లకల్లోమైపోయింది.
"నన్ను బాగా తిట్టేవారు. బూతులు తిడుతూ, కొట్టేవారు. తిండి పెట్టేవారు కాదు. అలాంటి సమయంలో మాలతి నా జీవితంలోకి వచ్చింది. నేనందుకు మౌనంగా ఉంటున్నానో, నా బాధేమిటో నిజంగా తెలుసుకోవాలనుకున్న ఒకే ఒక్క వ్యక్తి మాలతి. తన దగ్గర నేను పెదవి విప్పాను. క్రమంగా మా ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది.
23 ఏళ్ల రుబీనా బీఏ, హిస్టరీ ఆనర్స్, 22 ఏళ్ల మాలతి బీఏ, బంగ్లా చదువుతున్నారు.
మాలతి ఎన్‌సీసీ శిక్షణ పొందారు. పోలీసు విభాగంలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. రుబీనా టీచర్ కావాలనుకుంటున్నారు.
స్నేహం తరువాత ప్రేమ
మాలతి తొలిచూపులోనే రుబీనాతో ప్రేమలో పడ్డారు. కానీ, రుబీనా మెల్ల మెల్లగా మాలతికి దగ్గరయ్యారు.
మాలతికి నిజంగా తనంటే ఇష్టమని, ఓపికగా తన మాటలు వింటుందని, తన దుఃఖాన్ని అర్థం చేసుకుంటుందని రుబీనాకు నమ్మకం కుదిరింది. క్రమంగా మనసు విప్పి తన కష్టాలు చెప్పుకున్నారు.
స్కూల్లో ఇద్దరూ తెగ మాట్లాడుకునేవారు. ఒకరింటికి ఒకరు వెళ్లడం మొదలుపెట్టారు. మెల్ల మెల్లగా ఇద్దరూ దగ్గరయ్యారు. స్నేహం ప్రేమగా మారింది.
"మొదట్లో మా వాళ్లు మాలతిని సందేహించారు. నన్ను వేరే అబ్బాయితో కలపడానికి సహకరిస్తోందని అనుకున్నారు. కొన్నాళ్లకు, మా ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందని గ్రహించారు. మళ్లీ నాపై దాడి మొదలెట్టారు. తిండి పెట్టేవారు కాదు. పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చారు. మాలో అమ్మాయికి 21 ఏళ్లు రాగానే పెళ్లి చేసేస్తారు.
మా నాన్న పెళ్లి ఊసు ఎత్తేవారు కాదు కానీ, బాగా కొట్టేవారు. మా అమ్మ నన్ను శారీరకంగా, మానసికంగా నరకయాతన పెట్టారు. మా తాత వైపు వారు కూడా ఒకటే తిట్లు, హింస. మీ ఇద్దరి మధ్య ఏముందని అడిగేవారు. నిజం చెప్తే ఇద్దరినీ కలిసి ఉండనిస్తామని కూడా చెప్పారు. కానీ, నేను నిజం చెప్తే అమ్మీ, అబ్బా నన్ను ఎక్కడికో దూరంగా పంపించేస్తారన్న సంగతి నాకు అర్థమైంది.
ఇంతలో, సోషల్ మీడియాలో మాలాంటి వారి కథలు విన్నాం, చూశాం. మేం కూడా ధైర్యంగా కలిసి జీవించాలనుకున్నాం. కానీ మా గ్రామంలో అది సాధ్యం కాదు. గ్రామస్థుల కళ్లబడకుండా, దాక్కుని తిరిగేసరికే మా జీవితం గడిచిపోతుంది. అందుకే పారిపోవాలనుకున్నాం" అని రుబీనా వివరించారు.

ఇంటి నుంచి పారిపోవాలని ప్లాన్
ఇద్దరూ తమ గ్రామం నుంచి నగరానికి పారిపోవాలని ప్లాన్ చేసుకున్నట్టు మాలతి చెప్పారు. అవసరమైన సర్టిఫికెట్లు అన్నీ సర్దుకున్నారు.
"2021లో మేం స్కాలర్‌షిప్ డబ్బులు దాచుకోవడం మొదలెట్టాం. ఒక ట్రాన్స్‌వ్యక్తి సహాయం కోరాం. ఆయన మమ్మల్ని 'సాఫో ఫర్ ఈక్వాలిటీ' అనే సంస్థకు పరిచయం చేశారు. మాకు సహాయం అందుతుందన్న భరోసా కలిగింది. కోల్‌కతాకు చేరే మార్గం దొరికింది" అని మాలతి చెప్పారు.
సాఫో ఫర్ ఈక్వాలిటీ అనే సంస్థ ఎల్జీబీటీక్యూ హక్కుల కోసం పనిచేస్తుంది.
ఇప్పుడు మాలతి, రుబీనా ఈ సంస్థ నీడలో ఉన్నారు. మంచి భవిష్యత్తును నిర్మించుకునేందుకు కృషిచేస్తున్నారు.

ఫొటో సోర్స్, SOPA IMAGES
ఇల్లు జ్ఞాపకం వస్తే...
మాలతి, తన కుటుంబంతో టచ్‌లోనే ఉన్నారు. ఇద్దరూ గ్రామం నుంచి పారిపోయాక రుబీనా కుటుంబం, మాలతి ఇంటికి వెళ్లింది.
"మా అమ్మ మా సంబంధాన్ని ఒప్పుకుంటారు. కానీ, మిగతావాళ్లు ఊరుకోరు. ఆమెను పీడిస్తారు. మా అమ్మతో మాట్లాడుతూ ఉంటాను. రుబీనా కుటుంబం కూడా మా సంబంధానికి అంగీకరిస్తేనే తిరిగి ఊరికి రమ్మని మా అమ్మ చెప్పారు. లేదంటే రుబీనాను నేనే ఎత్తుకెళ్లిపోయాననే నింద పడాల్సి వస్తుందని, అది రెండు వర్గాల మధ్య చిచ్చుపెడుతుందని అమ్మ భయపడుతున్నారు. కానీ, నేను మా అమ్మ చేతి వంట మిస్ అవుతున్నా. మా అమ్మతో, మిగతావాళ్లతో సరదాగా గడిపిన క్షణాలు గుర్తొస్తాయి. వాళ్లంతా నా కళ్లల్లో కదలాడుతూ ఉంటారు. కానీ, రుబీనా లేకుండా నేను ఇంటికి తిరిగివెళ్లను" అని మాలతి చెప్పారు.
"మా సంబంధం మా కుటుంబాలకు ఎప్పటికీ అర్థం కాదు. మేం ఇద్దరం కలిసి జీవించాలనుకుంటున్నాం అని చెప్తే 'ఎందుకు?' అని అడిగారు. ఇది వారికి అర్థం కాదు. వారికి వివరించి చెప్పేంత పరిజ్ఞానం మాకు లేదు" అన్నారామె.
రుబీనాకు ముందు నుంచీ కుటుంబంతో మంచి సంబంధాలు లేవు.
"నాకు, మా అబ్బూతో మంచి సంబంధాలు లేవు. కానీ, నేను ఇంటికి పెద్ద కూతుర్ని. మా నాన్న బయటికెళ్ళి ఇంటికి రాగానే ముందు నా ముఖాన్నే చూసేవారు. ఆయన నన్ను కొట్టేవారు. కానీ, నా మీద ఇష్టం కూడా ఉంది.
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మా చెల్లితో మాట్లాడాను. నా పాత ఫోన్ నంబర్‌కు మా నాన్న కాల్ చేస్తూనే ఉన్నారని చెప్పింది. నేను ఆ సిమ్ పారేశాను. రోజూ నమాజ్ చదువుతున్నప్పుడు మా నాన్న ఏడుస్తారని మా చెల్లి చెప్పింది" అని రుబీనా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం, స్వలింగ సంపర్కుల వివాహాన్ని గుర్తించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.
ఎల్జీబీటీ సముదాయానికి పెళ్లి చేసుకునే హక్కు లభిస్తే చాలా బాగుంటుందని మాలతి, రుబీనా అంటున్నారు. కానీ, వీరి పెళ్లికి కుటుంబ సభ్యుల అనుమతి ఉండాలి.
“మా పెళ్లికి మా కుటుంబమంతా రావాలి. మేం తప్పకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కానీ, వాళ్ల అంగీకారం లేకుండా ఎలా?" అన్నారు మాలతి.
మాలతి కుటుంబం అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటానని, తనకు మతం పట్టింపు లేదని రుబీనా అన్నారు.
"మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం ఇదే ముఖ్యం" అని ఇద్దరూ ముక్తకంఠంతో చెబుతున్నారు.
ప్రస్తుతం మాలతి, రుబీనా సాఫో ఫర్ ఈక్వాలిటీ సంస్థకు చెందిన షెల్టర్ హోమ్‌లో ఉంటున్నారు. వారి కలలు, లక్ష్యాలను నెరవేర్చుకునే దిశలో ఆ సంస్థ వారికి సహాయం అందిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- తలసేమియా డే: ఈ వ్యాధి ఎలా వస్తుంది? లక్షణాలు ఏమిటి? రోగులకు రక్తం ఎక్కిస్తూనే ఉండాలా?
- మణిపుర్లో హింసకు తెగల మధ్య కొట్లాటే కారణమా?
- విమానం నుంచి పడిపోతున్న పైలట్‌ను కాళ్లు పట్టుకుని ఆపారు, ఆ తర్వాత ఏమైందంటే?
- ఏపీ-తెలంగాణ వర్షాలు: ఈసారి ఎండాకాలం లేదా అని ఎందుకు చర్చ జరుగుతోంది?
- ఆనంద్ మహీంద్రా - రాజమౌళి: సింధు నాగరికతపై సినిమాను పాకిస్తాన్ ఎలా అడ్డుకుందంటే....
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















