విమానం నుంచి పడిపోతున్న పైలట్‌ను కాళ్లు పట్టుకుని ఆపారు, ఆ తర్వాత ఏమైందంటే?

ఫొటో సోర్స్, CAPTURA DE PANTALLA.
- రచయిత, సెసిలియా బరియా
- హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్
బ్రిటిష్ ఎయిర్‌వేస్ సంస్థకు చెందిన బీఏ5390 విమానం 1990 జూన్ 10వ తేదీన బర్మింగ్‌హామ్ నుంచి స్పెయిన్‌లోని మలాగాకు బయల్దేరింది.
మూడు గంటల ప్రయాణానికి సిద్ధమైన విమాన కెప్టెన్ టిమ్ లాంకస్టర్, కో పైలట్ అలెస్టర్ ఆట్చిసన్ ఇద్దరూ కాక్‌పిట్‌లో మాట్లాడుకుంటున్నారు. అప్పటికే విమానం తగు వేగాన్ని పుంజుకొని దూసుకువెళ్తోంది.
ప్రయాణం అంతా అనుకున్నట్లే జరుగుతోంది. విమాన సిబ్బంది, ప్రయాణీకులకు ఆహారం ఇవ్వడం మొదలుపెట్టారు.
విమానం టేకాఫ్ అయిన 13 నిమిషాలకు క్యాబిన్‌లో పెద్ద శబ్ధం వినిపించింది.
ఈ శబ్ధం రావడానికి కొన్ని క్షణాల ముందు క్యాబిన్‌లో పైలట్లకు టీ ఇచ్చిన విమాన సిబ్బంది నిజెల్ ఒగ్డెన్, అది బాంబు శబ్ధమని అనుకున్నారు.
‘‘పేలుడు వల్ల క్యాబిన్‌లో మొత్తం పొగమంచు పేరుకుపోయింది. తర్వాత విమానం ఊగడం మొదలైంది’’ అని ద సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రికకు ఒగ్డెన్ చెప్పారు.

ఫొటో సోర్స్, MEAN PA
దాని తర్వాత అసలు అక్కడ ఏం జరుగుతుందో తాను గ్రహించానని ఒగ్డెన్ తెలిపారు.
ప్లేన్ క్యాబిన్‌లో ఉన్న ఒక రంధ్రం నుంచి కెప్టెన్ టిమ్ లాంకస్టర్ బయటకు పడిపోతుండటాన్ని ఆయన చూశారు. అంతకు ముందు అక్కడ కిటికీ ఉండేది.
‘‘నాకు కేవలం ఆయన కాళ్లు మాత్రమే కనిపించాయి. నేను వెంటనే కంట్రోల్ కాలమ్ మీదుగా దూకి ఆయన కాళ్లను అందుకున్నాను. ఆయన పూర్తిగా బయటకు పడిపోకుండా ఆయన నడుమును గట్టిగా పట్టుకున్నా.
విమానంలో ఉన్న ప్రతీదీ బయటకు వెళ్లిపోతోంది. క్యాబిన్‌లో బిగించి ఉన్న ఆక్సీజన్ బాటిల్ కూడా గాలి ఒత్తిడికి ఊడిపోయింది. ఎగురుతూ నా తలకు తగిలినంత పనైంది’’ అని ఒగ్డెన్ చెప్పారు.
మరో ఇద్దరు సిబ్బంది సిమోన్ రోజర్స్, జాన్ హీవర్డ్ అప్పుడే క్యాబిన్‌లోకి వచ్చారు.
అప్పటికే ఒగ్డెన్ తన పట్టును కోల్పోతున్నారు. ఆయన చేతుల్లోంచి పైలట్ బయటకు జారిపోతున్నారు.
‘‘నా చేతులు బలహీనంగా మారుతున్నాయి. ఆయన నా చేతుల్లోంచి జారిపోతున్నారు. పూర్తిగా బయటకు జారిపోతారేమో అనుకున్నా. కానీ, ఆయన కిటికీ చుట్టూ యూ ఆకారంలో అతుక్కుపోయారు. బయటివైపు గాలికి ఆయన ముఖం, విమానం అంచులకు కొట్టుకుంటోంది. ముక్కు నుంచి, తల నుంచి రక్తం కారుతోంది.
‘‘ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఆయన కళ్లు తేలేశారు. నేనెప్పటికీ ఆ దృశ్యాన్ని మర్చిపోలేను’’ అని ఒగ్డెన్ గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, SCREENSHOT
విమానానికి కొట్టుకున్న పైలట్ శరీరం
కెనడియన్ డాక్యుమెంటరీ సిరీస్ ‘మే డే’లో విమానం కిటికీ నుంచి బయటకు వచ్చిన ఘటనను పైలట్ గుర్తు చేసుకున్నారు.
‘‘విమానం నుంచి విండ్‌షీల్డ్ ఊడిపోయి బుల్లెట్ తరహాలో అదృశ్యం కావడం నాకు గుర్తుంది.
విమానంలో నుంచి బయటకు పడిపోతున్నానని నాకు అర్ధమైంది. ఒక్కక్షణం నాకు ఏమీ తోచలేదు. నా శరీరం విమానం బయటకు వెళ్లిపోవడం నాకు గుర్తుంది. అది పెద్దగా బాధించలేదు. కానీ, బయటి గాలి ఒత్తిడి కారణంగా నేను శ్వాస తీసుకోలేకపోయాను. అది నరకంగా అనిపించింది.
నాకు విమానం తోక, ఇంజిన్ కనిపించాయి. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. అ క్షణంలో అంతా స్తబ్ధుగా మారిపోయింది’’ అని లాంకస్టర్ చెప్పారు.
విమాన సిబ్బందిలో ఒకరైన రోజర్స్ తనను తాను సీటుకు కట్టేసుకున్నారు. కెప్టెన్ పాదాలను కూడా కట్టేసి, చీలమండ దగ్గర గట్టిగా పట్టుకున్నారు. అప్పటికే ఆయన చనిపోయి ఉంటారని వారు అనుకున్నారు.
గంటకు 400 మైళ్ల వేగంతో వచ్చే గాలులకు ఆయన శరీరం విమానానికి పదేపదే కొట్టుకోవడంతో ఆయన చనిపోయి ఉంటారని వారు భావించారు. ఒకవేళ ఆయన శరీరం బయటకు వెళ్లిపోతే ఏదో ఒక విమాన ఇంజిన్‌కు కొట్టుకొని ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు భయపడ్డారు.

ఫొటో సోర్స్, MEAN PA
కాక్‌పిట్‌లో ఇంతటి భయానక పరిస్థితుల్లోనూ కో పైలట్ అట్చిన్‌సన్ విమానాన్ని తిరిగి నియంత్రణలోకి తీసుకొచ్చారు.
అక్కడి పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి ఆయన చాలా ప్రయత్నించారు. విమానంలోని మిగతా సిబ్బంది, 81 మంది ప్రయాణీకులకు కంగారు పడొద్దని చెప్పే పనిలో పడ్డారు.
‘‘కిటికీ నుంచి ఒక శరీరం వేలాడుతుండటాన్ని నేను చూశాను’’ అని బ్రిటిష్ ప్రెస్ అసోసియేషన్ ఏజెన్సీతో ఒక ప్రయాణీకుడు చెప్పారు.
‘‘విమానంలో మా వెనుక నిల్చున్న సిబ్బంది ఒకరు ఏడవటం ప్రారంభించారు. విమానం కూలిపోతుందని అనుకున్నాం. దేవుడికి మొక్కుకున్నాం’’ అని మరో ప్రయాణీకుడు అన్నారు.
విమానం విండ్‌షీల్డ్ ఊడిపోయిందని, అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్నట్లు లౌడ్ స్పీకర్‌లో కో పైలట్ ప్రకటించాడు.
కంట్రోల్ టవర్‌ను సంప్రదించడంలోనూ ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే, అనేక అవాంతరాల నడుమ అట్చిన్‌సన్ విమానాన్ని సురక్షితంగా సౌతాంప్టన్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు.
విమానం ఉదయం 7:55 గంటలకు నేలపై దిగింది. అందులోని ప్రయాణీకులు, సిబ్బంది షాక్‌లో ఉన్నారు. కానీ, ఎవరికీ గాయాలు కాలేదు.
అత్యవసర సేవల సిబ్బంది వెంటనే విమానం క్యాబిన్‌లోకి పరుగెత్తారు. టిమ్ లాంకస్టర్ ఇంకా బతికే ఉన్నారని వారు గుర్తించారు.
గాయాలతో, అపస్మారక స్థితిలో ఉన్న పైలట్ శ్వాస తీసుకోవడం వారు గమనించారు.
20 నిమిషాల పాటు హరికేన్ గాలులు, గడ్డకట్టే చలి బారిన పడిన కూడా ఒక వ్యక్తి ఎలా జీవించి ఉండగలరని వైద్యులు ఆశ్చర్యపోయారు.
ఆయనకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. కొన్ని నెలల పాటు చికిత్స జరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
విండ్‌షీల్డ్ పడిపోవడానికి కారణం ఏంటి?
విమానం టేకాఫ్ కావడానికి 27 గంటల ముందు నిర్వహించిన విండ్‌స్క్రీన్ మెయింటెన్స్ లోపభూయిష్టంగా ఉండటం వల్లే ప్రయాణం మధ్యలో విండ్‌షీల్డ్ ఊడిపోయిందని బ్రిటిష్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ తమ తుది నివేదికలో పేర్కొంది.
విండ్‌షీల్డ్‌ను బిగించడానికి పెద్ద స్క్రూలకు బదులుగా చిన్న స్క్రూలను వాడినట్లు అందులో పేర్కొన్నారు.
పైలట్ టిమ్ లాంకస్టర్, సౌతాంప్టన్ ఆసుపత్రిలో కోలుకున్నారు.
చావు అంచుల్లోకి వెళ్లిన టిమ్ లాంకస్టర్ ఐదు నెలల తర్వాత మళ్లీ పైలట్‌గా తన విధుల్లోకి వెళ్లారు.
ఇవి కూడా చదవండి:
- స్లీప్ పెరాలసిస్: నిద్రలో గుండెపై దెయ్యం కూర్చున్నట్లు ఎందుకు అనిపిస్తుంది?
- ‘ది కేరళ స్టోరీ’: ఇస్లాంలోకి మారిన అమ్మాయిల కథతో తీసిన ఈ సినిమాపై వివాదం ఎందుకు?
- అరికొంబన్: ఈ కిల్లర్ ఎలిఫెంట్ చేసిన పనికి తీసుకెళ్లి టైగర్ రిజర్వ్‌లో వదిలేశారు
- జైశంకర్: భారత్ తరఫున బలమైన గొంతుకా, లేక దూకుడుతో వచ్చిన పాపులారిటీనా?
- వరల్డ్ ఆస్తమా డే: ఉబ్బసం ఎందుకు వస్తుంది? నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














