సింగపూర్ చంగీ ఎయిర్‌పోర్ట్: ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ విమానాశ్రయమని ఎందుకు అంటున్నారు?

చంగీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2019లో చంగీలో 3,82,000 విమానాలు టేకాఫ్ లేదా ల్యాండింగ్ అయ్యాయి.
    • రచయిత, నికోలస్ యంగ్
    • హోదా, బీబీసీ న్యూస్

ప్రతి కొన్ని వారాలకూ సింగపూర్‌లోని చంగీ ఎయిర్‌పోర్ట్‌కు హిస్కందర్ జుల్కర్‌నయీన్ వెళ్తుంటారు. ఆయన వెంటే భార్య, ఇద్దరు పిల్లలు కూడా వస్తుంటారు.

వీరి తొలి గమ్యస్థానం టెర్మినల్-1‌ను అనుకుని ఉండే షాపింగ్ మాల్ ‘జ్యూవెల్’. దీన్ని ప్రముఖ కెనడియన్ ఆర్కిటెక్ట్ మోషె సాఫ్డీ, ఆయన బృందం ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

ఇక్కడ కనిపించే ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ వాటర్‌ఫాల్ ఏడంతస్తుల ‘‘రెయిన్ వోర్టెక్స్’’ అంటే హిస్కందర్ పిల్లలకు చాలా ఇష్టం. డిస్నీని తలపించే కాంతులు, సంగీతం కూడా వీరిని కట్టిపడేస్తుంటాయి.

అక్కడి నుంచి వీరు టెర్మినల్-3కు వెళ్తారు. ఇక్కడ పిల్లలను ఆహ్లాదపరిచే రైడ్లు, గేమ్స్‌తో కార్న్‌వాల్స్ ఉంటాయి.

‘‘గేమ్స్, షాపింగ్, డైనింగ్ ఇవన్నీ ప్రయాణికుల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మరో ఎయిర్‌పోర్టు నాకు కనిపించలేదు’’ అని హిస్కందర్ చెప్పారు.

చంగీతోపాటు అక్కడి నుంచి సింగపూర్‌లో ప్రపంచ ప్రఖ్యాత షాపింగ్ స్ట్రిప్ ఆర్చడ్ రోడ్‌కు వెళ్లడమంటే తనకెంతో ఇష్టమని ఆయన చెప్పారు.

ఎయిర్‌పోర్టులకు ర్యాంకులు ప్రకటించడంతోపాటు రివ్యూలు కూడా ఇచ్చే కన్సల్టెన్నీ స్కైట్రాక్స్ అంచనాల ప్రకారం, ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌పోర్టు చంగీ.

చంగీ ఎయిర్‌పోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఎయిర్‌పోర్టుల్లో సదుపాయాలపై ప్రజలు ఇచ్చే సమీక్షలతో ప్రపంచంలోనే అతిపెద్ద సర్వే చేపడుతున్నట్లు స్కైట్రాక్స్ చెబుతోంది. దీనిలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా 550కిపైగా ఎయిర్‌పోర్టుల్లోని సేవలు, సదుపాయాలను సంస్థ సమీక్షిస్తోంది.

ఈ స్కైట్రాక్స్ ర్యాంకింగ్స్‌లో గత దశాబ్ద కాలంలో ఎనిమిదిసార్లు చంగీ మొదటి స్థానంలో నిలిచింది.

అయితే, గత రెండేళ్లుగా దోహాలోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, టోక్యోలోని హనీడా ఎయిర్‌పోర్టు ఈ జాబితాలో ముందుకు వచ్చాయి.

మళ్లీ 2023 మార్చిలో తొలి స్థానాన్ని చంగీ దక్కించుకుంది. దీంతో అద్భుతమైన సేవలు అందిస్తోందని చంగీపై స్కైట్రాక్స్ ప్రశంసలు కురిపించింది.

 చంగీ విమానాశ్రయం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చంగీ విమానాశ్రయం

కరోనావైరస్ వ్యాప్తికి ముందు అంటే 2019లో చంగీలో 3,82,000 విమానాలు టేకాఫ్ లేదా ల్యాండింగ్ అయ్యాయి. 6.8 కోట్ల మందిని ఈ ఎయిర్‌పోర్టు గమ్యస్థానాలకు చేర్చింది.

ఇప్పుడు మళ్లీ ఆ స్థాయికి చేరుకునేందుకు చంగీ ప్రయత్నిస్తోంది.

ఇది ట్రావెల్ హబ్ మాత్రమే కాదు. సింగపూర్ ప్రజలు ఇక్కడకు సరదాగా గడిపేందుకు కూడా వస్తుంటారు.

చంగీ ఎయిర్‌పోర్టు

ఫొటో సోర్స్, Getty Images

34 ఏళ్ల రేచల్ టాన్ షాపింగ్‌కు తరచూ జ్యూవెల్‌కు వస్తుంటారు.

ఇక్కడి విశేషాలపై రేచల్ మాట్లాడుతూ.. ‘‘ఫౌంటెయిన్ కింద మీరు హాయిగా కూర్చోవచ్చు. ఇక్కడి ఆహ్లాద వాతావరణాన్ని మీరు ఆస్వాదించొచ్చు’’ అని చెప్పారు.

సబ్‌వే లేదా బస్సులలో ఇక్కడికి చేరుకోవడం చాలా తేలిక. కొంత మంది రోజంతా ఇక్కడే హాయిగా గడిపి వెళ్తుంటారు.

మీరు సినిమా చూడొచ్చు. ఏదైనా తినొచ్చు. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుక్కోవచ్చు. ప్రశాంతంగా ఉండేచోట కూర్చొని పరీక్షలకు కూడా చదువుకోవచ్చు. ఇటీవల కాలంలో వెడ్డింగ్ షూట్‌లు కూడా జరుగుతున్నాయి.

ఇక్కడ ఎయిర్ కండీషన్డ్ రెయిన్‌ఫారెస్ట్, మనల్ని తికమక పెట్టే పజిల్, 12 మీ. ఎత్తైన జారుడుబల్ల కూడా ఉన్నాయి. మీరు ఎయిర్‌పోర్టుకు కాస్త తొందరగా వచ్చారు అనుకోండి ఇక్కడ ‘స్పా’లో కూడా గడపొచ్చు. సినిమాలు వేసే థియేటర్లు, ఈత కొట్టేందుకు స్విమ్మింగ్ పూల్, మసాజ్ చైర్‌లు, బటర్‌ఫ్లై గార్డెన్ కూడా ఇక్కడ ఉన్నాయి.

చంగీ ఎయిర్‌పోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చంగీ ఎయిర్‌పోర్టు

ప్రత్యేక సువాసన

ఈ ఎయిర్‌పోర్టులో ప్రత్యేక సువాసన గుభాళిస్తుంది. పువ్వులతో ప్రత్యేకంగా చంగీ కోసమే ఆ పర్ఫ్యూమ్‌ను తయారుచేస్తారు.

టెర్మినల్-4 బయట మీకు ఒక మైలు పొడవునా భారీ డైనోసార్లు కనిపిస్తాయి.

సింగపూర్‌ ర్యాంకులకు ప్రాధాన్యమిస్తుంది. స్కూళ్లు, నటులు ఇలా అన్నిచోట్లా ఇది మనకు కనిపిస్తుంది. దీంతో చంగీని సింగపూర్ ప్రజలు గర్వకారణంగా భావిస్తుంటారు. అనవసరంగా చంగీ విషయంలో సింగపూర్ ప్రజలు గొప్పలు చెప్పుకుంటున్నారని ఒక విదేశీ జర్నలిస్టు ట్వీట్ చేసినప్పుడు ఆయనకు భారీగా నిరసన కూడా వ్యక్తమైంది.

ఎయిర్‌పోర్టు ర్యాంకింగ్స్‌ను సింగపూర్ అధికారులు జాగ్రత్తగా గమనిస్తుంటారని ఏవియేషన్ కన్సల్టెన్సీ ‘ఎండౌ అనలిటిక్స్‌’కు చెందిన షుకోర్ యూసోఫ్ అన్నారు.

‘‘కేవలం గొప్పలు చెప్పుకోవడానికే కాదు. వైమానిక సేవల్లో సింగపూర్ తొలి వరుసలో ఉంటుందనే వాదనకు ఇది బలం చేకూరుస్తోంది’’అని ఆయన చెప్పారు.

ఇక్కడి చెక్-ఇన్ కౌంటర్లు, డ్యూటీ-ఫ్రీ షాపులు కోవిడ్-19 వ్యాప్తి సమయంలో వెలవెలబోయినప్పటికీ, మళ్లీ ఇంటర్నేషనల్ హబ్‌గా చంగీ మారుతుందని ప్రభుత్వం నొక్కిచెప్పింది. వైమానిక రంగంలో బిలియన్ సింగపూర్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టింది.

చంగీ ఎయిర్‌పోర్టు

ఫొటో సోర్స్, ROSLAN RAHMAN

గ్లోబల్ ట్రేడింగ్, బిజినెస్ హబ్‌లలో సింగపూర్ స్థానాన్ని పదిలం చేయడంలో వైమానిక రంగం ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆనాడు సింగపూర్ రవాణా మంత్రి చెప్పారు.

‘‘ఏదైనా గమ్య స్థానానికి వేళ్లే క్రమంలో మధ్యలో మారే ఎయిర్‌పోర్టులలో చంగీ కూడా మొదటి వరుసలో ఉంటుంది’’ అని జ్యూరిచ్‌కు చెందిన అలెక్స్ చాన్ చెప్పారు.

ఏడాదిలో కనీసం నాలుగుసార్ల వరకు వేరే ప్రాంతాలకు వెళ్తూ చంగీలో ఆయన దిగుతుంటారు.

‘‘ఫ్రాంక్‌ఫట్ లేదా ఆమ్‌స్టర్‌డామ్‌ల కంటే చంగీ చాలా చక్కగా ఉంటుంది, మెరుగ్గా పనిచేస్తుంది’’అని ఆయన అన్నారు.

‘‘మేం దాదాపు 60 మంది కలిసి వస్తుంటాం. మిగతా ఎయిర్‌పోర్టులలో కనెక్టింగ్ ఫ్లైట్లు తప్పిపోయే ముప్పు ఎక్కువగా ఉంటుంది. కానీ, చంగీలో ఎప్పుడూ అలా జరగదు’’ అని ఆయన చెప్పారు.

ఇటీవల సాంకేతిక లోపం వల్ల ఇమ్మిగ్రేషన్ క్లియరెన్సులు కొన్ని గంటలపాటు ఆలస్యమయ్యాయి. అయినప్పటికీ, కనెక్టింగ్ ఫ్లైట్‌లలో వెళ్లే ఎక్కువ మంది చంగీనే ఎంచుకుంటారని షుకోర్ అన్నారు.

‘‘మీరు ఏదైనా ఎయిర్‌పోర్టులో పెట్టుబడులతోపాటు వెచ్చిస్తున్న సమయం, పెడుతున్న శ్రద్ధ చూడండి.. సింగపూర్ ఎప్పుడూ తొలి స్థానంలోనే ఉంటుంది’’ అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, ఘోస్ట్‌ఫ్లైట్స్ అంటే ఏమిటి? వీటిని ఎందుకు ఆపట్లేదు?

1990ల్లో సింగపూర్‌ టీవీల్లో కేవలం ప్రభుత్వ బ్రాడ్‌కాస్టర్ సీరియల్స్ మాత్రమే వచ్చేవి. వీటిలో చంగీ టవర్ ప్రధానంగా కనిపించేది. ఎన్నో ఏళ్ల నుంచి ఇంటికి దూరమైన ఓ వ్యక్తి నగరం ఎంత మారిపోయిందోనని ఆశ్చర్యం వ్యక్తంచేస్తూ ఇక్కడి నుంచి ట్యాక్సీ పట్టుకుని వెళ్తూ దీనిలో కనిపిస్తాడు. 1981లో చంగీ మొదలైనప్పుడు కేవలం ఒక టర్మినల్, ఒక రన్‌వే ఉండేవి.

నేడు చంగీ పూర్తిగా మారింది. 2019లో ప్రారంభించిన మొదటి ఆరు నెలల్లోనే జ్యువెల్‌ను 5 కోట్ల మంది పర్యటకులు సందర్శించారు. ప్రస్తుతం ఐదో టెర్మినల్ పనులు కూడా కొనసాగుతున్నాయి. 2030 మధ్యకల్లా ఇది కూడా మొదలుకావచ్చు.

‘‘కేవలం సరదా కోసమే స్థానికులు ఎక్కువగా వచ్చే ఇలాంటి ఎయిర్‌పోర్టు ఇంకొకటి ఉండదు’’అని న్యాయవాదిగా పనిచేస్తున్న ఆడ్రియన్ టాన్ అన్నారు.

‘‘సుదీర్ఘ ప్రయాణం తర్వాత చంగీలో దిగి మిగతా ఎయిర్‌పోర్టుల కంటే ఇది ఎంత మెరుగ్గా ఉందోనని ప్రశంసలు కురిపించడం, సునాయాసంగా కౌంటర్లను దాటి ముందుకు వెళ్లి సింగపూర్‌కు ప్రఖ్యాతిగాంచిన చికెన్ రైస్ తినడం.. లాంటివి మాకు ఒక సంప్రదాయంలా మారిపోయాయి’’అని ఆయన అన్నారు.

‘‘అందుకే చంగీ చాలా గొప్పది. సింగపూర్‌లో ప్రఖ్యాంతిగాంచిన అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అన్నింటిలోనూ సింగపూర్ ఫ్లేవర్ కనిపిస్తుంది’’అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, ‘ఇంత చిన్నమ్మాయి హెలీకాప్టర్ నడిపిస్తుందా అని అంతా ఆశ్చర్యపోయారు’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)