విమానంలో పైలెట్ పక్కనే తాచు పాము... ఆ తరువాత ఏం జరిగిందంటే..?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సీసీలియా మైకాలె
- హోదా, బీబీసీ న్యూస్
దక్షిణాఫ్రికా పైలట్ రుడాల్ఫ్ ఎరాస్మస్ ఎప్పటిలాగే విమానం కాక్‌పిట్‌లో పైలట్‌గా తన పనిలో నిమగ్నమయ్యారు.
అప్పటివరకు అంతా బాగానే ఉంది. కానీ, విమానంలో తనతో పాటు మరొకరు కూడా ఉన్నట్లు గుర్తించిన ఆయన ఒక్కసారిగా అదిరిపడ్డారు.
ఆ మరో ప్రయాణికుడు మనిషి కాదు. అది ఒక కోబ్రా. తన సీటు కింద కోబ్రా ఉన్నట్లు ఆయన గుర్తించినప్పుడు విమానం 11,000 అడుగుల ఎత్తులో ఎగురుతోంది.
ఈ ఘటన గురించి బీబీసీతో రుడాల్ఫ్ మాట్లాడారు.
‘‘నిజం చెప్పాలంటే, మొదట నాకేం అర్థం కాలేదు. అదొక భయంకరమైన క్షణం’’ అని ఆయన చెప్పారు.
తన వీపుపై చల్లగా ఏదో తాకినట్లు అనిపించినప్పుడు తొలుత అది వాటర్ బాటిల్ అనుకున్నానని ఆయన తెలిపారు.
‘‘నాకు చల్లగా ఏదో తగిలింది. ఏదో పాకుతున్నట్లుగా అనిపించింది’’ అని చెప్పారు.
వాటర్ బాటిల్ మూతను సరిగ్గా పెట్టలేదేమో, అందుకే షర్ట్ మీద నీళ్లు పడి ఉంటాయని అనుకున్నానని చెప్పారు.
‘‘నేను ఎడమవైపుకు తిరిగి సీటు కింద చూడగా అక్కడ ఒక కోబ్రా కనిపించింది. అది దాని తలను సీటులో పెట్టడానికి ప్రయత్నిస్తోంది’’ అని ఆ ఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు.
బ్లూమ్‌ఫోంటైన్ నుంచి ప్రిటోరియాకు విమానాన్ని నడుపుతుండగా రుడాల్ఫ్‌కు ఈ ఘటన ఎదురైంది. అప్పుడు ఆ విమానంలో మరో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. కోబ్రా కారణంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
పైలట్ రుడాల్ఫ్ ఎరాస్మస్ మాట్లాడుతూ, ‘‘ఒకవేళ నాగుపాము కాటు వేస్తే 30 నిమిషాల్లో మరణిస్తారు. విమానంలో భయానక వాతావరణం సృష్టించకూడదని నేను అనుకున్నా’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, RUDOLPH ERASMUS
అత్యవసర ల్యాండింగ్
ముందుగా తాను ప్రశాంతంగా ఆలోచించి, ప్రయాణికులు భయపడకుండా సింపుల్‌గా విషయాన్ని వారికి వెల్లడించినట్లు రుడాల్ఫ్ చెప్పారు.
విమానంలో మనతో పాటు మరో అదనపు ప్రయాణికుడు ఉన్నారంటూ పాము గురించి ప్రయాణికులకు సమాచారం చేరవేసినట్లు తెలిపారు.
ఒకవేళ పాము వెనక్కి క్యాబిన్ వైపు వెళ్లిపోతే, విమానంలో ప్రజలు భయాందోళనకు గురి అవుతారనే ఆలోచన తనను భయపెట్టినట్లు రుడాల్ఫ్ చెప్పారు.
దీంతో, చివరకు ప్రయాణికులకు సమాచారం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
‘‘నా మాట వినండి. విమానం లోపల పాము ఉంది. అది నా సీటు కింద ఉంది. కాబట్టి, వీలైనంత త్వరగా విమానాన్ని ల్యాండ్ చేసే ప్రయత్నం చేద్దాం" అని ప్రయాణీకులతో చెప్పినట్లు ఆయన వెల్లడించారు.
తాను ఈ ప్రకటన చేసిన తర్వాత విమానంలో నిశ్శబ్ధం ఆవరించిందని ఆయన గుర్తు చేసుకున్నారు.
‘‘చిన్న సూది కింద పడేసినా, ఆ శబ్ధం మీకు వినబడుతుంది. అంత నిశ్శబ్ధం ఆవరించింది. అందరూ ఒకట్రెండు నిమిషాలు స్తంభించిపోయారని అనుకున్నా.
అనేక రకాల ప్రమాదకర పరిస్థితులలో విమానాన్ని ఎలా నడపాలో పైలట్‌లకు శిక్షణ ఇస్తారు. అయితే, వాటిలో కాక్‌పిట్‌లో పాము ఎదురయితే ఎలా వ్యవహరించాలో అనే అంశం లేదు.
నేను భయపడినట్లు ప్రయాణికులకు తెలిసి ఉంటే, పరిస్థితి మరింత దారుణంగా ఉండేది’’ అని ఆయన వివరించారు.
పాము కారణంగా వెల్‌కోమ్ నగరంలో ఆయన విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
పాము దొరకలేదు
ఈ విమానం ముందుగా వోర్సెస్టర్ ఫ్లయింగ్ క్లబ్ నుంచి బయలుదేరింది. విమానం కింద పాము కనిపించిందని అక్కడ పనిచేసే ఇద్దరు వ్యక్తులు చెప్పారు. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించి వారు విఫలం అయ్యారు.
విమానం ఎక్కే ముందు పామును వెదికినట్లు పైలట్ రుడాల్ఫ్ తెలిపారు.
‘‘దురదృష్టవశాత్తూ అది కనిపించలేదు. అది వెళ్లిపోయి ఉంటుందని అనుకున్నా. కానీ, అది విమానంలో ఉన్నట్లు ఎవరికీ తెలియదు. విమానాన్ని పరిశీలించిన ఇంజినీర్లు కూడా పామును కనుక్కోలేకపోయారు’’ అని ఆయన చెప్పారు.
పైలట్ రుడాల్ఫ్‌ను దక్షిణాఫ్రికా పౌర విమానయాన శాఖ కమిషనర్ పాపీ ఖోసా ప్రశంసించారు.
న్యూస్ 24 వెబ్‌సైట్ ప్రకారం, ఖోసా మాట్లాడుతూ, ‘‘ఆయన చాలా ధైర్యంతో గొప్ప పని చేశారు. విమానంలో ఉన్న ప్రజలందరి ప్రాణాలను రక్షించారు" అని అన్నారు.
తాను ప్రత్యేకంగా ఏమీ చేయలేదని, ఆందోళన సమయంలో కూడా ప్రశాంతంగా ఉన్న ప్రయాణికులను అభినందిస్తున్నట్లు రుడాల్ఫ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్ 2023: టోర్నీని రసవత్తరంగా మార్చబోతున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఏంటి?
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్‌కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















