మణిపుర్ ఎందుకు రగులుతోంది? ముఖ్యమైన 7 ప్రశ్నలు, సమాధానాలు

ఫొటో సోర్స్, Getty Images
మణిపుర్ హింసాత్మక ఘటనలతో అట్టుడికింది. ఇప్పటికీ అక్కడ పరిస్థితులు అదుపులోకి రాలేదు.
అసలు మణిపుర్‌లో హింస చెలరేగడానికి కారణం ఏంటో తెలుసుకుందాం.
మైతేయీ తెగకు ఎస్టీ హోదాను కల్పించే అంశాన్ని కారణంగా చూపిస్తూ మణిపుర్‌లో హింసాకాండ చెలరేగింది.

ఫొటో సోర్స్, Getty Images
1. మణిపుర్ భౌగోళిక, సామాజిక స్వరూపం ఎలా ఉంటుంది?
మణిపుర్ జనాభా ప్రస్తుతం దాదాపు 30-35 లక్షలు ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా మైతేయీ, నాగా, కుకీ అనే మూడు తెగల జనాభా నివసిస్తారు.
మైతేయీ సముదాయంలో ప్రధానంగా హిందువులు ఉంటారు. అలాగే కొందరు ముస్లింలు కూడా ఉన్నారు. అక్కడి జనాభాలో మైతేయీ తెగ వారి సంఖ్యే ఎక్కువ.
నాగా, కుకీ తెగవారు ప్రధానంగా క్రిస్టియన్లు.
రాజకీయ ముఖచిత్రం చూస్తే, ఇక్కడి 60 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది మైతేయీ తెగకు చెందినవారే. మిగిలిన 20 మందిలో నాగా, కుకీ తెగల వారు ఉంటారు.
మణిపుర్‌కు ఇప్పటివరకు 12 మంది ముఖ్యమంత్రులుగా వ్యవహరించగా, అందులో ఇద్దరు మాత్రమే షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు.
భౌగోళిక నిర్మాణం విషయానికొస్తే, మణిపుర్ ఒక ఫుట్‌బాల్ స్టేడియంలా ఉంటుందనుకుంటే అందులో మధ్యలో ఉండే ప్లేఫీల్డ్ స్థానంలో ఇంఫాల్ లోయ ప్రాంతం ఉంటుంది.
స్టేడియంలో నాలుగు వైపులా గ్యాలరీలను పర్వతాలతో కూడుకున్న ప్రాంతాలుగా భావించవచ్చు.
మణిపుర్‌లోని 10 శాతం భూభాగంలో మైతేయీ తెగ ఆధిపత్యం ఉంది.
ఇంఫాల్ లోయలో ప్రధానంగా మైతేయీ తెగ వారు ఉంటారు. మిగిలిన 90 శాతం ప్రాంతంలో గిరిజన సముదాయాలు నివసిస్తాయి.

ఫొటో సోర్స్, AVIK
2. నిరసనలు, హింసకు అసలు కారణం ఏంటి?
మణిపుర్‌లో 34 షెడ్యూల్డ్ తెగలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా నాగా, కుకీ సముదాయాలకు చెందినవే. మణిపుర్ జనాభాలో 64 శాతంగా ఉన్న మైతేయీ కమ్యూనిటీ, తమకు ఎస్టీ హోదా ఇవ్వాలని అడుగుతోంది. మైతేయీ కమ్యూనిటీ వారు చేస్తోన్న డిమాండ్ పాతదే. కానీ, హైకోర్టు తీసుకున్న ఒక కొత్త నిర్ణయం వల్ల అక్కడ రిజర్వేషన్ల అంశం మరోసారి చర్చల్లోకి వచ్చింది.
నాలుగు వారాల్లోగా మైతేయీ తెగ వారికి ఎస్టీ హోదాను ఇచ్చే అంశాన్ని పరిగణించాలని ఏప్రిల్ 19న ఇచ్చిన తీర్పులో మణిపుర్ హైకోర్టు, ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కేంద్రానికి కూడా సిఫారసు చేయాలని మణిపుర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఈ తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం రోజు రాజధాని ఇంఫాల్‌కు 65 కి.మీ దూరంలో ఉన్న చురాచంద్‌పుర్ జిల్లా టోర్బాంగ్‌లో ‘‘ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపుర్’’ సంస్థ ఒక ర్యాలీని నిర్వహించింది.
‘ఆదివాసీ ఏక్‌తా మార్చ్’ పేరిట ఈ ర్యాలీని చేపట్టారు. వేలాది మంది ఇందులో పాల్గొన్నారు. ఈ ర్యాలీ సమయంలోనే హింస ప్రారంభమైనట్లు చెబుతున్నారు.
చురాచంద్‌పుర్‌తో పాటు సెనాపతి, ఉఖ్రుల్, కంగ్‌పోక్పి వంటి కొండ ప్రాంతాల్లో ఇలాంటి ర్యాలీలు, సమావేశాలు జరిగాయి.
టోర్బాంగ్‌లో ర్యాలీ సందర్భంగా వేలాది మంది గిరిజనులు గుమిగూడినప్పుడు గిరిజనులకు, గిరిజనేతరులకు మధ్య హింస చెలరేగిందని ఒక సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు.
విష్ణుపుర్, చురాచంద్‌పుర్ జిల్లాల్లో ఎక్కువగా హింసాత్మక ఘటనలు జరిగాయి.
మణిపుర్ రాజధాని ఇంఫాల్‌లో గురువారం హింస చెలరేగింది.
‘‘ఇప్పుడు పరిస్థితులు అదుపులో ఉన్నాయి. గురువారం ఉదయమే హింసాత్మక ఘటనలు అదుపులోకి వచ్చాయి. ప్రభావిత ప్రాంతాలకు చెందిన 4 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం’’ అని బీబీసీతో మాట్లాడుతూ ఆర్మీ పీఆర్‌ఓ లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
3. మైతేయీ కమ్యూనిటీ, కొండ ప్రాంత తెగల మధ్య వివాదం ఏంటి?
2011 సెన్సస్ ప్రకారం, మణిపుర్ జనాభా 28 లక్షలు. ఇందులో మైతేయీ కమ్యూనిటీ 53 శాతం ఉంటుంది. ఇంఫాల్ లోయలో మైతీ కమ్యూనిటీ నివసిస్తుంది.
మైతేయీ కమ్యూనిటీకి ఎస్టీ హోదాను వ్యతిరేకిస్తున్న తెగల్లో కుకీ తెగ కూడా ఉంది. కుకీ సముదాయంలో కూదా అనేక తెగలు ఉన్నాయి.
రాష్ట్ర జనాభాలో కొండ ప్రాంతాల్లో నివసించే కుకీ తెగ జనాభా 30 శాతంగా ఉంటుంది.
ఒకవేళ మైతేయీ కమ్యూనిటీకి రిజర్వేషన్ ఇస్తే తమకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో అవకాశాలు తగ్గిపోతాయని కుకీ తెగ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మణిపుర్‌లో జరిగిన తాజా హింసాత్మక ఘటనలు కొండ ప్రాంతాల్లో నివసించే తెగలకు, మైదాన ప్రాంతాల్లో ఉండే మైతేయీ కమ్యూనిటీకి మధ్య ఉన్న పాత వివాదాలను కూడా తట్టి లేపాయి.

ఫొటో సోర్స్, Getty Images
4. మైతేయీ కమ్యూనిటీకి ఎస్టీ హోదా ఇవ్వడంపై వివాదం ఎందుకు?
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఒక సూచన చేసింది. ఎందుకంటే మణిపుర్‌లో మైతేయీ కమ్యూనిటీకి చెందిన ఒక వర్గం చాలా కాలంగా తమకు ఎస్టీ హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తోంది.
ఈ డిమాండ్‌కు మైతేయీ కమ్యూనిటీలో కొంతమంది మద్దతు ఇస్తుండగా, మరికొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారని సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్ పంజోబామ్ అన్నారు.
‘‘షెడ్యూల్డ్ ట్రైబ్ డిమాండ్ కమిటీ గత 10 ఏళ్లుగా ఈ డిమాండ్ చేస్తోంది. కానీ, ఏ ప్రభుత్వం కూడా ఈ డిమాండ్ విషయంలో ఏమీ చేయలేదు. అందుకే వీరు కోర్టును ఆశ్రయించారు’’ అని ప్రదీప్ చెప్పారు.
ఈ డిమాండ్‌ను కేంద్రానికి సిఫారసు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
దీని కారణంగానే ‘‘ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపుర్’’ నిరసనలకు దిగింది.
ఎస్సీ, ఓబీసీలతో పాటుగా ఈబీసీ కోటాలో మైతేయీ కమ్యూనిటీ ఇప్పటికే రిజర్వేషన్లను పొందిందని నిరసనకారులు చెబుతున్నారు. అన్ని రిజర్వేషన్లు మైతీ కమ్యూనిటీకే ఇస్తామంటే కదరదు అని వారు అంటున్నారు. వారు గిరిజనులు కాదు, వారంతా ఎస్సీలు, ఓబీసీలు, బ్రాహ్మణులు అని చెబుతున్నారు.
మైతేయీ కమ్యూనిటీకి ఎస్టీ హోదా కల్పించడం వల్ల తమ భూభాగాలకు ఎలాంటి భద్రత ఉండదని గిరిజనులు అంటున్నారు.
మైతేయీ కమ్యూనిటీకి చెందిన ప్రజలు కొండ ప్రాంతాలకు వెళ్లడానికి వీల్లేదని కానీ, కుకీ తెగతో పాటు ఎస్టీ హోదా కలిగిన గిరిజనులు ఇంఫాల్‌కు వచ్చి నివసించవచ్చని మైతేయీకమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తి చెప్పారు. ఆయన తన గుర్తింపును బహిరంగపరచలేదు.

ఫొటో సోర్స్, Getty Images
5. తప్పుడు సమాచారం, పుకార్ల వల్ల హింస జరిగిందా?
‘‘మణిపుర్‌లో ప్రస్తుతం ఉన్న వ్యవస్థను చూస్తుంటే మైతేయీ కమ్యూనిటీ వారు ఇప్పుడు వెళ్లి కొండ ప్రాంతాల్లో నివసించలేరు’’ అని సీనియర్ జర్నలిస్ట్ యుమ్నం రూప్‌చంద్ర సింగ్ అన్నారు.
విద్య, ఉద్యోగాలు లేదా పన్నుల నుంచి మినహాయింపు కోసం తాము ఎస్టీ హోదాను డిమాండ్ చేయట్లేదని తమ పూర్వీకుల భూభాగం, సంస్కృతి, గుర్తింపులను రక్షించుకోవడం కోసం డిమాండ్ చేస్తున్నామని మైతీ వర్గీయులు అంటున్నారు.
‘‘ఎస్టీ హోదాపై హైకోర్టు ఇచ్చిన సూచనను తప్పుగా అర్థం చేసుకున్నారు. మైతేయీ కమ్యూనిటీకి ఎస్టీ హోదాను ఇవ్వాలని హైకోర్టు ఆదేశించలేదు. నిజానికి కొండ, లోయ ప్రాంతాల ప్రజల మధ్య వివాదం చాలా పాతది. సున్నితమైనది. తప్పుడు సమాచారం, పుకార్ల కారణంగా హింస చెలరేగింది’’ అని రూప్‌చంద్ర అన్నారు.
6. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌ను ఎందుకు విమర్శిస్తున్నారు?
ఈ హింసకు వేరే కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
బీరెన్ సింగ్ ప్రభుత్వం, రాష్ట్రంలో ఓపియమ్ సాగుకు స్వస్తి పలికేందుకు ప్రయత్నిస్తోంది. ఇది మయన్మార్ నుంచి వచ్చే అక్రమ వలసలపై కూడా ప్రభావం చూపుతుంది.
7. ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారు?
రిజర్వేషన్ల అంశంపై మొదలైన ఘర్షణల్లో ఇప్పటివరకు 52 మంది పౌరులు చనిపోయారు.
అధికారికంగా మృతుల సంఖ్యను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు.
ఇవి కూడా చదవండి:
- జనగణమన: జాతీయగీతానికి మదనపల్లెకూ సంబంధం ఏమిటి?
- ఐశ్వర్య తాటికొండ: టెక్సస్ కాల్పుల్లో చనిపోయిన హైదరాబాదీ, ఆమె ఫ్రెండ్‌కూ బుల్లెట్ గాయాలు
- పాకిస్తాన్: ఉచిత ఆహారం కోసం క్యూ కడుతున్న ప్రజలు... రాజకీయ కలహాలే ఆ దేశాన్ని చిందరవందర చేస్తున్నాయా?
- కర్ణాటక ఎన్నికలు: బీజేపీ మళ్లీ వస్తుందా, కాంగ్రెస్ జెండా ఎగరేస్తుందా? గ్రాఫిక్స్‌లో రాజకీయ ముఖచిత్రం
- తెలంగాణ: రబీ సాగును ముందుకు జరపాలని కేసీఆర్ ఎందుకు అంటున్నారు? ఇది రైతులకు ప్రయోజనకరమేనా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















