అస్సాం: 29 ఏళ్ల కిందట నకిలీ ఎన్‌కౌంటర్, ఇప్పుడు పరిహారాల చెల్లింపు.. అసలేం జరిగిందంటే

ఫొటో సోర్స్, DILIP SHARMA/BBC
- రచయిత, దిలీప్ కుమార్ శర్మ
- హోదా, బీబీసీ హిందీ, గువాహటి
‘‘నేను ఎప్పటికీ 1994 ఫిబ్రవరి 17 ఉదయాన్ని మర్చిపోను. నా భర్త చనిపోయి 29 ఏళ్లు గడిచాయి. కానీ, ఆనాడు జరిగిన ప్రతి సన్నివేశం ఇంకా నా కళ్ల ముందు మెదులుతూనే ఉంది. ఆ రోజు రాత్రి, నామ్ కీర్తన్ వినేందుకు ఆయన ఇంటికొచ్చారు. ఆ తర్వాత నిద్రపోయారు. ’’
‘‘ఉదయం 7.30 అవుతుందనగా, ఐదుగురు ఆర్మీ సైనికులు మా ఇంట్లోకి వచ్చారు. వారిలో ఒకరు యూనిఫామ్ వేసుకోలేదు. వారితో పాటు నా భర్తను కూడా తీసుకెళ్లారు. సాయంత్రం నేను ఇంటికి వచ్చే సమయానికి కూడా నా భర్త ఇంటికి రాలేదు. నేను పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాను. నాలుగు రోజులు తర్వాత నా భర్త శరీరం తీవ్ర గాయాలతో, రక్తస్రావంతో కనిపించింది.’’ అని చెబుతూ 57 ఏళ్ల లీలేశ్వరి మోరన్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ కేసు అస్సాంలోని తిన్‌సుకియా జిల్లాకు చెందినది. ఈ జిల్లాలో 29 ఏళ్ల క్రితం ఐదుగురు యువకులను నకిలీ ఎన్‌కౌంటర్‌లో చంపేశారు.
తీన్‌సుకియాలో ఒక టీ గార్డెన్ మేనేజర్ హత్యకు గురికావడంతో, 1994 ఫిబ్రవరి 17, 18,19 తేదీల్లో తొమ్మిది మంది వ్యక్తులను ఆర్మీ సైనికులు వారి ఇళ్ల నుంచి తీసుకెళ్లారు.
దిబ్రు సైఖోవ రిజర్వు ఫారెస్ట్ నుంచి 1994 ఫిబ్రవరి 23న ప్రబిన్ సోనోవాల్, ప్రదీప్ దత్తా, దెబోజిత్ బిశ్వాస్, అఖిల్ సోనోవాల్, భుపెన్ మోరన్‌ల మృతదేహాలను వెలికితీశారు.
ఈ ఐదుగురు కూడా ఆల్ అస్సాం స్టూడెండ్స్ యూనియన్‌కి చెందిన వారు. ఇది అస్సాంలో ప్రభావంతమైన విద్యార్థి సంఘం. మిగిలిన నలుగుర్ని ఆర్మీ సైనికులు విడిచిపెట్టారు.
టీ గార్డెన్ మేనేజర్ హత్యలో తీవ్రవాద సంస్థ యూనిటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం(యూఎల్ఎఫ్ఏ) పేరు వెలుగులోకి వచ్చింది. ఈ నకిలీ ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత, ఈ ఐదుగురు వ్యక్తులు నిషేధిత సంస్థ యూఎల్ఎఫ్ఏకి చెందిన వారని ఆర్మీ ఆరోపించింది.

ఫొటో సోర్స్, DILIP SHARMA/BBC
‘నా భర్తను చంపిన వారికి కూడా శిక్ష పడాలి’
భుపెన్ మోరన్‌ను తన ఇంటి నుంచి ఆర్మీ సైనికులు తీసుకెళ్లినప్పుడు ఆయన భార్య లీలేశ్వరి మోరన్‌కి కేవలం 26 ఏళ్లే.
‘‘నా భర్త హత్యకు గురైనప్పుడు నాకు ఐదుగురు పిల్లలు. పెద్దబ్బాయి వయసు 13 ఏళ్లు. అప్పటికి చిన్నకూతురికి కేవలం రెండున్నరేళ్లే. ఈ 29 ఏళ్లలో నేను ఎంతో ఏడ్చాను. ఎన్నో కష్టాలు పడుతూ నా పిల్లల్ని పెంచాను. పేదరికం కారణంతో, నేను వారికి సరైన చదువులను ఇప్పించలేకపోయాను.
వరదలతో మా ఇళ్లు మునిగిపోయేది. కానీ, ఏ ప్రభుత్వం కూడా ముందుకొచ్చి సాయం చేసేది కాదు. నా భర్తను చంపిన వారికి కూడా కఠినతరంగా శిక్ష పడాలి. కానీ, కోర్టు ప్రస్తుతం మాకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి చెప్పింది. ఈ తీర్పు కాస్త ఊరటనిచ్చినా, నా భర్త, ఆ నలుగురు వ్యక్తులు అమాయకులు. వారిని చంపిన వారిని కూడా కఠినంగా శిక్షించాలి’’ అని లీలేశ్వరి మోరన్ కోరారు.
ఈ సంఘటన తర్వాత 1994 నాటి విద్యార్థి నేత, బాధిత కుటుంబ సభ్యుడు జగ్‌దీశ్ భూయన్ రాజకీయాల్లోకి వచ్చారు. ఈ యువతకు సంబంధించిన సమాచారం కోరుతూ గువాహటి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ దాఖలు చేయడంతో, కోర్టు ఆదేశాల మేరకు 1995లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) ఈ హత్యలపై విచారణ ప్రారంభించింది. కోర్టులో సమర్పించిన నివేదికలో ఈ హత్యలకు ఏడుగురు ఆర్మీ సైనికులు బాధ్యత వహించాల్సి ఉందని సీబీఐ పేర్కొంది.
ఈ హత్యలతో సంబంధం ఉన్నట్లు గుర్తించిన మేజర్ జనరల్‌తో సహా ఏడుగురు సైనికులకు కోర్టు 2018లో జీవితకాల శిక్ష విధించింది. అయితే, దీనిపై వారు అప్పీల్‌కు వెళ్లారు.
2019లో వారి అప్పీల్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ఆర్మీ నియమించిన ఒక ప్రత్యేక అధికారి (కాంపిటెంట్ అథారిటీ), ఈ హత్యలకు ఆర్మీ సైనికులు బాధ్యులు కారని పేర్కొన్నారు.
‘పున:విచారణకు బదులు కేసు క్లోజ్ చేస్తే మంచిది’
దీని తర్వాత, బాధితుల కుటుంబ సభ్యులు మరోసారి గువాహటి హైకోర్టును ఆశ్రయించారు.
గత గురువారం జరిగిన ఈ కేసు విచారణలో, 30 ఏళ్ల క్రితం నాటి ఈ హత్యల కేసును మరోసారి న్యాయ విచారణ చేపట్టడం కంటే, పరిహారాల చెల్లింపుతో ఈ కేసును క్లోజ్ చేయడం మంచిదని జస్టిస్ అచింత్య మల్ల భుజర్ బారువా అన్నారు.
జస్టిస్ భుజర్ బారువా తన ఆదేశాల్లో ఏం చెప్పారంటే.. చట్టానికి లోబడి కాకుండా మరే కారణాల చేతనైనా ఈ హత్యలు జరిగాయా అనే నిర్ధారణకు వచ్చేందుకు ప్రయత్నించడం కంటే కూడా, మిలటరీ ఆపరేషన్‌లో ఈ ఐదుగురు వ్యక్తులు మరణించినట్లు మనం అంగీకరించాలి. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా, ఆర్మీ అధికారుల చేత కేంద్ర ప్రభుత్వం ఈ ఐదుగురు వ్యక్తుల కుటుంబాలకు పరిహారాలు అందజేయాలని మేము ఆదేశిస్తున్నాం. రెండు నెలల వ్యవధిలో మృతుల కుటుంబ సభ్యులకు రూ.20 లక్షల రూపాయలను చెల్లించాలి’’ అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, DILIP SHARMA/BBC
‘మరోసారి ఈ కేసులో పోరాటే ఓపిక లేదు’
గత 29 ఏళ్లుగా సాగుతున్న ఈ కేసుపై స్పందించిన దీపక్ దత్తా.. ‘‘నా సోదరుడు ప్రదీప్‌ని ఆర్మీ తీసుకెళ్లినప్పుడు అప్పటికి అతనికి పెళ్లి అయి నెలనే అవుతుంది. ప్రదీప్ వయసు 31 ఏళ్లు. ఫిబ్రవరి 18, 1994న రాత్రి పూట ఆర్మీ సైనికులు మా ఇంట్లోకి వచ్చి ప్రదీప్‌ను తీసుకెళ్లారు. నా సోదరుడిని ఎక్కడున్నాడో కనుగొనాలని కోరుతూ నేను హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాను.
కానీ, ఫిబ్రవరి 22న నా సోదరుడు ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లు తెలిసింది. నా సోదరుడి మృతదేహాన్ని మాకు అప్పగించిన వారు ఏం చెప్పారంటే, ప్రదీప్ యూఎల్ఎఫ్ఏకి చెందిన వ్యక్తి అని, అందుకే ఎన్‌కౌంటర్‌కు గురయ్యాడని తెలిపారు. కానీ, ప్రదీప్ శరీరమంతా నల్లటి మార్కులున్నాయి. చేతివేళ్లు తొలగించారు. ఒక కన్ను పూర్తిగా దెబ్బతింది. మోకాళ్లు విరగొట్టారు. ఈ విషయాలన్ని పోస్ట్‌మార్టం రిపోర్టులో కూడా ఉన్నాయి. 29 ఏళ్లుగా మేము న్యాయం కోసం పోరాడాం. నా సోదరుడు అమాయకుడని నిరూపించాం. ఆర్మీ సైనికులను తప్పనిసరిగా శిక్షించాలి’’ అని కోరారు.
గత ఏడాది క్రితమే దీపక్ దత్తా బ్యాంకు ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందారు. 29 ఏళ్లుగా పోరాటం చేసిన తర్వాత, ఫలితం ఈ విధంగా వచ్చింది. ఇక ఈ విషయంలో పోరాడే ఓపిక మాకు లేదు అన్నారు.
ఆర్మీ సైనికుల ఎన్‌కౌంటర్‌లో మరణించిన దేబోజీత్ సోదరుడు దేబాసిస్ బిశ్వాస్ కూడా 29 ఏళ్ల ఈ సుదీర్ఘ న్యాయపోరాటాన్ని తన జీవితంలో అత్యంత బాధాకరమైన విషయంగా అభివర్ణించారు.
‘‘ఏ బాధిత కుటుంబమైనా, 29 ఏళ్ల పాటు న్యాయం కోసం పోరాడితే ఆ కుటుంబం నాశనమవుతుంది. నా సోదరుడు అమాయకుడని నిరూపించేందుకు ఈ కేసు కోసం నేను నా సమయమంతా కేటాయించాను. గువాహటి హైకోర్టు ఇచ్చిన ఈ నిర్ణయాన్ని మేము గౌరవించాలి. కోర్టు నిర్ణయించిన సమయం లోపల బాధిత కుటుంబాలన్నింటికి కేంద్ర ప్రభుత్వం పరిహారాలు అందించాలని నేను అభ్యర్థిస్తున్నా’’ అని అన్నారు.
‘‘29 ఏళ్ల తర్వాత చివరికి న్యాయం దక్కింది. కానీ, ఇన్నేళ్ల ఈ కాలంలో ఈ ఐదు బాధిత కుటుంబాలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాయి’’ అని అస్సాం జాతీయ పరిషత్ ప్రధాన కార్యదర్శి జగ్‌దీశ్ భూయన్ అన్నారు.
ఈ ఐదుగురు వ్యక్తులను తమ సంస్థ అమరులుగా ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ప్రకటించింది. వీరి పేర్లపై అమరుల స్మారకచిహ్నం నిర్మించింది.
ఇవి కూడా చదవండి:
- కత్తిపీటతో హత్య చేసేందుకు మా నాన్నే ప్రయత్నించారు – కులం, గౌరవం, ప్రేమ కథ
- ‘రంగమార్తాండ' రివ్యూ: గుండె లోతుల్లోని ఉద్వేగాన్ని బయటకు లాక్కొచ్చే సినిమా
- అదానీ గ్రూప్ బొగ్గు గనికి వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులు ఏడాదిగా ఎందుకు నిరసనలు చేస్తున్నారు?
- ఉగాది: మనం ఉన్నది 2023లో కాదు.. 1945 లేదా 2080
- వడగళ్ల వానలు ఎందుకు పడతాయి? అవి వేసవిలోనే ఎందుకు ఎక్కువ?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














