ఉత్తరాంధ్ర - గంగమ్మ: జీడితోట యజమాని కూలీగా ఎందుకు మారారు? ఆమె జీడితోట షావుకారు చేతుల్లోకి ఎలా వెళ్లింది?
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
“చిన్న కమ్మల గుడిసెలో ఉండేవాళ్లం. ప్రభుత్వం ద్వారా ఇళ్ల స్కీం వచ్చింది. ఇల్లు పూర్తి చేసేందుకు షావుకారు వద్ద 2019లో రూ.2 లక్షలు అప్పు తీసుకున్నా. నిరుడు అప్పు, వడ్డీ కలిపి రూ. 7.5 లక్షలైందంటూ మా జీడితోట పట్టాను పట్టుకుపోయాడు.’’ అని గిరిజన మహిళ గంగమ్మ వాపోయారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా రావికమతం మండంలోని రొచ్చుపనుకుల అనే గిరిజన గ్రామంలో భర్త, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె నివసిస్తున్నారు.
పిల్లలు పెద్దోళ్లు అవుతుండడంతో ఇప్పుడుంటున్న గుడిసె తీసేసి స్లాబు ఇల్లు కట్టుకోవాలని గంగమ్మ ఆశ.
ఎస్టీ కొండదొర జాతికి చెందిన గంగమ్మ కుటుంబం మైదాన ప్రాంతం నుంచి వచ్చే షావుకార్లకు జీడి పిక్కలు అమ్మి దానిపై వచ్చే ఆదాయంతోనే బతుకుతారు.
అటవీ హక్కుల చట్టం ప్రకారం, ప్రభుత్వం ఇచ్చిన రెండెకరాల్లో జీడితోటలను సాగు చేసుకుంటూ బతుకుతున్నారు. ఆ భూమే వారికి ఆధారం. కానీ ఇప్పుడది వారి చేతుల్లో లేదు.
ఇంటి నిర్మాణం కోసం షావుకారు వద్ద తీసుకున్న రెండు లక్షల రూపాయల అప్పు వారి జీడితోటను వారికి కాకుండా చేసింది.

అసలేం జరిగింది?
రొచ్చుపనుకులు గ్రామం మొదట్లోనే గంగమ్మ ఇల్లు. 2018లో ప్రభుత్వ పథకం కింద గంగమ్మకు ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణానికి లక్షన్నర రూపాయలు ఆర్థిక సహాయం అందింది.
అయితే, అది ఇంటి నిర్మాణానికి సరిపోలేదు. దాంతో పిక్కలు అమ్మే షావుకారు వద్దే 2 లక్షల రూపాయలు అప్పు చేశారు.
“పిల్లలు పెద్దోళ్లు అవుతున్నారు, ఆ గుడిసెలో ఉండటం ఇబ్బందిగా మారింది. అప్పుడే ప్రభుత్వం ద్వారా ఇళ్ల స్కీం వచ్చింది. ఇల్లు పూర్తి చేసేందుకు షావుకారు వద్ద 2019లో 2 లక్షల రూపాయల అప్పు చేశాను.’’
‘’అప్పు, వడ్డీ కలిపి 7.5 లక్షలైందంటూ కిందటి ఏడాది మా జీడితోట పట్టాను పట్టుకుపోయాడు. పట్టా అడిగితే భూమి మీది కాదు, తోట మీది కాదు అని చెప్తున్నాడు. ఈ సంవత్సరం తోట పిక్కలు కూడా షావుకారే ఏరుకున్నాడు.’’
‘’మమ్మల్ని తోటలోకి రానివ్వకుండా, మరొకరిని తోట పనులకు పెట్టుకున్నాడు. కనీసం మా తోటను చూసే అవకాశం కూడా మాకు లేకుండా పోయింది” అంటూ గంగమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు.
సొంత తోటలోకి రానివ్వకపోవడంతో గంగమ్మ కుటుంబమంతా వేరే వాళ్ల తోటల్లో కూలీలుగా పని చేస్తున్నారు.

జీడిపిక్కల మాటున వడ్డీ వ్యాపారం
జీడిపిక్కలు కొనడానికి వచ్చే షావుకార్ల ప్రధాన వ్యాపారం జీడిపిక్కలు కాదు, వడ్డీ వ్యాపారమే అని రొచ్చుపనుకులు గ్రామంలో పర్యటించినప్పుడు తెలిసింది.
వారానికి ఒకసారి వచ్చి వడ్డీలు వసూలు చేసుకోవడం, సీజన్లో జీడిపిక్కలు కొనుక్కుపోవడం చేస్తుంటారు. జీడిపిక్కలు కొనుక్కుపోయే సందర్భంలోనే గిరిజనులు తమ అవసరాల కోసం వీరి వద్ద అప్పులు తీసుకుంటారు.
ఇలా తీసుకునే అప్పులకు స్టాంపు పేపర్లపై సంతకాలు పెట్టించుకుంటారని, కానీ, తమకు ఎలాంటి పేపర్లు ఇవ్వరని గిరిజనులు చెప్పారు. అలాగే గంగవ్వకు కూడా ఎటువంటి కాగితాలు ఇవ్వలేదు.

ఇల్లు పూర్తి కాలేదు, తోట కూడా పోయింది
ఇంటి నిర్మాణం కోసం అప్పు చేశామని, కానీ ఆ ఇల్లు కూడా పూర్తి కాలేదని గంగమ్మ చెప్పారు.
“మేం ఇంటి నిర్మాణానికి తీసుకున్న 2 లక్షలు గుర్తుంది. ఇప్పుడు వడ్డీతో కలిపి 7.5 లక్షలంటున్నారు. మా జీడితోట పట్టా కూడా పట్టుకుపోయారు. ఇల్లు కూడా పూర్తి కాలేదు. జీడితోట కూడా పోయింది.’’ అని గంగమ్మ వాపోయారు.
ఇక ఇల్లు పూర్తి చేయడం మా వల్ల కాదు. సగం సగం పూర్తైన ఇంట్లోనే ఉంటున్నామని చెప్పారు.
‘’మా పట్టా ఇవ్వాలని అడిగితే ఇవ్వడం లేదు. 99 ఏళ్లకు రాయించుకున్నామని చెప్తున్నారు. మా ఆయన, కొడుకు, కూతురుతో పాటు నా సంతకాలు ఏవో పేపర్ల మీద పెట్టించుకున్నారు” అని గంగమ్మ చెబుతున్నారు.
‘‘వాళ్లు ఏ పేపర్లు మీద సంతకాలు పెట్టించుకున్నారో మాకు తెలియదు. ప్రస్తుతం మా వద్ద ఎప్పుడో తీయించుకున్న పట్టా జిరాక్స్ కాపీ ఒక్కటే ఉంది. ఒరిజినల్ పట్టా అడిగితే షావుకారు చాలా అవమానకరంగా మాట్లాడారు’’ అని గంగమ్మ పిల్లలు తెలిపారు.

అవమానకరంగా మాట్లాడారు: గంగమ్మ కుమారుడు
తమ పట్టాను పట్టుకెళ్లిపోయిన షావుకారును కలిసేందుకు గంగమ్మ, తన భర్త కన్నయ్య, కుమారుడు చినరాజబాబు, కుమార్తె రాజ్యలక్ష్మిలతో కలిసి నర్సీపట్నం వెళ్లారు.
అప్పు ఎలాగైనా తీరుస్తాం, మా పట్టా ఇవ్వండని అడిగితే చాలా అవమానకరంగా మాట్లాడారని చినరాజబాబు బీబీసీతో చెప్పారు.
“మీరంతా కాగితాలపై సంతకాలు చేశారు. ఇక మీ భూమి మాదే. నువ్వు మగాడివైతే మొత్తం రూ. 7.5 లక్షలు డబ్బు కట్టి పట్టా తీసుకెళ్లు అన్నారు’’
‘’రోడ్డు మీద అంతా చూస్తుండగా అన్నారు. దాంతో ఆ మాటలకు బాగా కష్టం అనిపించింది” అని చినరాజబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు.
“డబ్బులు కట్టకపోతే పోలీసు కేసు పెడతాం, పోలీస్ స్టేషన్‌కు పద అని బెదిరించారు. ఏం చేయలేక ముఖం దించుకుని రోడ్డు దగ్గర ఏడ్చుకుని నిలబడిపోయాం. పోనీ వారి మీద కేసు పెడదామంటే అంత ఆర్థిక స్థోమత మాకు లేదు. వాళ్లు డబ్బుతో ఏదైనా చేయగలరు” అని రాజ్యలక్ష్మి ఏడుస్తూ చెప్పారు.
‘‘ డీ-ఫారం, ఆర్వోఎఫ్ఆర్ పట్టా భూములను కొనడం, అమ్మడం నేరమని చట్టం చెబుతోంది. అందుకే 99 ఏళ్ల లీజు పేరుతో గిరిజనుల భూములను షావుకార్లు సొంతం చేసుకుంటారు.’’ అని అఖిల భారత వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి పీఎస్ అజయ్ కుమార్ బీబీసీతో చెప్పారు.
పేపర్లపై సంతకాలు పెట్టించుకుని ప్రభుత్వం ఇచ్చిన ఆర్వోఎఫ్ఆర్, డీ-పట్టాలను షావుకార్లు తీసుకుంటారని ఆయన ఆరోపించారు. "వాటిని అడిగితే మీ తోటలను మాకు 99 ఏళ్లకు లీజుకు రాశారు. ఇక అవి మావే అని గిరిజనులను తోటలకు దూరం చేస్తారు" అని అజయ్ కుమార్ అన్నారు.

అసలెవరీ షావుకార్లు?
రొచ్చుపనుకులు గ్రామంతో పాటు చుట్టు పక్కలున్న తాటిపర్తి, రాయిపాడు, పెద్దగరువు ఇలా అనేక గ్రామాల్లో జీడిపిక్కలను కొనేందుకు మైదాన ప్రాంతాల నుంచి వ్యాపారులు వస్తుంటారు. వాళ్లంతా గిరిజనేతరులే.
వారికి ఆర్థిక బలంతో పాటు రాజకీయ అండదండలు ఉండడంతో గిరిజనులు షావుకార్లు అని పిలుస్తుంటారు. వాళ్లు వడ్డీలకు అప్పులు కూడా ఇస్తుంటారు. స్టాంపు పేపర్లపై సంతకాలు పెట్టించుకుంటారు.
కొన్నాళ్ల తర్వాత అసలు ఎంత? వడ్డీ ఎంతైంది? మొత్తం బకాయి ఎంత ఉందని ప్రత్యేకంగా అడిగితే చిన్న తెల్లకాగితంపై రాసిస్తారు.
అది ఎన్ని లక్షల అప్పైనా కూడా అరటావు కూడా లేని తెల్లకాగితంపైనే రాసిస్తారని ఆ కాగితాలను చూపించారు గిరిజనులు.
ఆ కాగితం ఎందుకూ పనికి రాదనే విషయం వారికి తెలియదు. అయితే, ఆ పేపరునే గిరిజనులు షావుకారు ఇచ్చిన కాగితం అంటూ దాచుకుంటున్నారు.
తమను వడ్డీల పేరుతో మోసం చేస్తున్నారని ఎవరికీ ఫిర్యాదు చేయడం లేదు. పైగా వడ్డీ కింద జీడిపిక్కల బస్తాలను షావుకార్లకే ఇచ్చేస్తున్నారు. ఆ పిక్కలకు షావుకారు కట్టిందే ధర, మార్కెట్ రేటుతో సంబంధం ఉండదు.

గిరిజనుల నైతికత, భయమే పెట్టుబడి
షావుకారు వద్ద అప్పు తీసుకున్నాం కదా! తిరిగి ఇవ్వాలి కదా! అనే నైతికతను గిరిజనులు పాటిస్తున్నారు.
మైదాన ప్రాంతంలో భూమి పట్టాలు తనఖా పెట్టి, లేదా లీజుకి ఇచ్చి అప్పు తీసుకున్న వారికి పక్కాగా కాగితాలపై రాసిచ్చే ఈ షావుకార్లు, గిరిజన ప్రాంతాలకు వచ్చేసరికి అప్పులు తీసుకునే గిరిజనులకు ఏ కాగితం ఇవ్వడం లేదు.
సంతకాలు పెట్టించుకున్న స్టాంపు పేపర్లు షావుకార్లు తమ వద్దే ఉంచుకుంటారని గిరిజనులు చెప్పారు.
ఒరిజినల్ పట్టా అతడి వద్దే ఉంది, దాని ద్వారా ఏదైనా చేయగలడనే భయం కూడా గిరిజనుల్లో కనిపిస్తోంది.

వేలిముద్రలు వేశామనే భయం
గిరిజనులకు న్యాయపరమైన సాయం అందించేందుకు అఖిల భారత వ్యవసాయ గ్రామీణ సంఘం తరఫున న్యాయవాది అనూహ్య రొచ్చుపనుకులు గ్రామంలో పర్యటించారు.
గిరిజనులకు వడ్డీ వ్యాపారుల తప్పుడు లెక్కలపై అవగాహన కల్పించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు.
“షావుకారు తెచ్చిన కాగితాల మీద వేలిముద్రలు వేశాం అనే భయం గిరిజనుల్లో కనిపిస్తోంది’’ అని అనూహ్య అన్నారు.
‘‘షావుకారుతో గొడవపడితే మా జీడిపిక్కలు ఎవరు కొంటారు? అప్పు తీర్చలేదని మా మీద కేసు పెడితే మాకు ఎవరు తోడున్నారు? కోర్టులో కేసులు వేస్తే హైదరాబాద్, దిల్లీ అంటూ కోర్టుల చుట్టూ ఎక్కడ తిరుగుతాం’’ అని గిరిజనులు భయపడుతున్నారని ఆమె చెప్పారు.
ఆ భయాలనే ఆసరాగా చేసుకుని, షావుకార్లు వీరి జీవితాలతో ఆడుకుంటున్నారని అనూహ్య బీబీసీతో అన్నారు.

అనకాపల్లి జిల్లాలోని నాన్ షెడ్యూల్ ఏరియాలో ఆర్వోఎఫ్ఆర్, డీ-పట్టా భూములలో, జిల్లా ఉద్యానశాఖ లెక్కల ప్రకారం సుమారు 27 వేల 632 ఎకరాల్లో జీడితోటలు ఉన్నాయి. ఇందులో ఎక్కువ భాగం అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన భూములే.
అప్పుల పేరుతో తెల్లకాగితాలపై వేలిముద్రలు తీసుకుని, గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన భూములను వడ్డీవ్యాపారులు లాక్కుంటున్నారని, వీరిపై అధికారులు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
“అవి డీఫారం పట్టాలు, ఆర్వోఎఫ్ ల్యాండ్స్. వాళ్లు ఎలా తీసుకుంటారు? అలాంటి వారికి నోటీసులు ఇచ్చి రెవెన్యూ అధికారులు ఆ పట్టాలను తిరిగి గిరిజనులకు ఇప్పించాలి.” అని అఖిల భారత వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి పీఎస్ అజయ్ కుమార్ బీబీసీతో చెప్పారు.
ఆర్వోఎఫ్ఆర్ పట్టా, డీ-ఫారం పట్టా భూములను హక్కుదారుల నుంచి వేరొకరు తీసుకోవడం ఆంధ్రప్రదేశ్ అసైన్‌మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం ప్రకారం నేరం.
ఈ నేరానికి ఆరు నెలలు జైలు, రెండు వేల జరిమానా విధించవచ్చు.
‘‘అప్పుల పేరుతో షావుకార్లు తెల్ల కాగితాలపై గిరిజనుల వేలిముద్రలు వేయించుకుంటారు. వడ్డీలపై వడ్డీలు వేసి బాకీ తీసుకున్న వారి భూములను లాక్కుంటారు. ఇది చట్టరీత్యా నేరం. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి’’ అని అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.

‘ఊర్లో అందరికీ అప్పిచ్చాను’
రొచ్చుపనుకులు గ్రామంలో కిరాణా కొట్టు నిర్వహిస్తున్న గాలి సంజీవరావు జీడిపిక్కలు కొనడంతో పాటు వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నారు. ఈయన గిరిజనేతరుడు. గ్రామంలో చాలా మంది భూమి పట్టాలు ఈయన వద్దే ఉన్నాయని చెప్తున్నారు.
తాను గ్రామంలో అందరికీ అప్పులు ఇచ్చానని, కానీ అందరి దగ్గర పట్టాలు తీసుకోలేదని, కొందరివి మాత్రమే తీసుకున్నానని బీబీసీతో సంజీవరావు చెప్పారు.
తానేమీ దొంగ లెక్కలు వేయడం లేదని, కేవలం 2 రూపాయల వడ్డీకే అప్పులు ఇస్తున్నానన్నారు.
వడ్డీ వ్యాపారానికి లైసెన్స్ ఉందా అని అడిగితే, అటువంటిదేమీ లేదని సమాధానం చెప్పారు.
వడ్డీ వ్యాపారి సంజీవరావు, బీబీసీ ప్రతినిధి మధ్య జరిగిన సంభాషణ:
రిపోర్టర్: మీ దగ్గర ఎంత మంది అప్పు తీసుకున్నారు?
సంజీవరావు: ఊర్లో అందరూ నా దగ్గర అప్పులు తీసుకున్నారు.
రిపోర్టర్: మరి వాళ్లందరి భూమి పట్టాలు మీ దగ్గర ఉన్నాయా?
సంజీవరావు: అందరివీ నేను తీసుకోలేదండీ. మాములుగా ప్రామిసరీ నోట్లు రాయించుకుని డబ్బులు ఇచ్చానండీ.
రిపోర్టర్: ప్రామిసరీ నోటులో ఏం రాసుకున్నారు?
సంజీవరావు: వాళ్లకు ఎంతిస్తే అంతకే రాసిచ్చారండీ.
రిపోర్టర్: మరి ఆ నోట్లు చూపించగలరా?
సంజీవరావు: ఇప్పుడైతే ఇక్కడ రెడీగా లేవు. తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను.
సంజీవరావు వద్ద వడ్డీ వ్యాపారానికి సంబంధించి ఎటువంటి లైసెన్స్ లేదు. కనీసం గిరిజనులకు ఇచ్చిన అప్పులకు సరైన పత్రాలు వాళ్లకు ఇవ్వలేదు.
ప్రామిసరీ నోట్లు, స్టాంప్ పేపర్లు, వాళ్లు పెట్టిన సంతకాలు, వేలిముద్రలంటే గిరిజనులకు ఉన్న భయాన్ని ఆసరాగా చేసుకుని సంజీవరావు లాంటి వాళ్లు ఎటువంటి లైసెన్స్ లేకుండా వడ్డీ వ్యాపారం చేస్తున్నారు.
పోలీస్ కేసులు పెడితే స్పందిస్తాం: తహశీల్దార్

రొచ్చుపనుకులు గ్రామంలో గంగమ్మ ఎదుర్కొంటున్న పరిస్థితి చాలా మంది అనుభవిస్తున్నారు. షావుకార్ల వద్ద అప్పులు తీసుకుని చిక్కుకుపోయిన వారే ఎక్కువగా కనిపిస్తున్నారు.
ఈ విషయాలను రావికమతం మండలం తహశీల్దార్ ఉమామహేశ్వరరావు దృష్టికి బీబీసీ తీసుకెళ్లింది.
షావుకార్లు, వడ్డీ వ్యాపారులు వంటి అంశాలపై తమకు ఎటువంటి సమచారం లేదని ఆయన అన్నారు.
వడ్డీ వ్యాపారులు, షావుకార్లపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, దాని ఆధారంగా తాము చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ ఉమామహేశ్వరావు బీబీసీతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- 2023లో మానవ జీవితాల్ని మార్చబోయే 5 శాస్త్రీయ పరిశోధనలు
- ప్రేమ-సెక్స్: 2022లో వచ్చిన కొత్త మార్పులు ఏంటి?
- ఆనాటి కారు యాక్సిడెంట్లో ఓ క్రికెటర్ చనిపోయాడు, ప్రాణాలతో బయటపడ్డవారు ప్రపంచ ప్రఖ్యాత ఆల్‌రౌండర్స్ అయ్యారు
- న్యూయార్క్ మహా నగరం ‘ఖాళీ’ అయిపోతోంది... ఎందుకు?
- క్యాథలిక్: చర్చిలో మతాధికారి హోదా కోసం మహిళల పోరాటం... ససేమిరా అంటున్న వాటికన్ వర్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















