టాస్క్ ఫ్రాడ్: ‘ఇన్‌స్టా ప్రొఫైల్ లైక్ చేసి, ఫాలో అవండి, డబ్బు సంపాదించండి’ అంటూ దోచేస్తున్నారు... ఏమిటీ మోసం?

ఆన్‌లైన్ మోసాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం...

లాటరీ తగిలిందని చెప్పి మోసం చేయడం, గిఫ్ట్ వస్తుందనీ, ఓఎల్ఎక్స్ లాంటి సైట్లలో పెట్టిన మీ వస్తువు కొంటామంటూ లింకులు పంపి ఆన్‌లైన్‌ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు కొల్లగొట్టడం లాంటివి పాతబడిపోయాయి.

ఇప్పుడు కంప్లీట్ యువర్ టాస్క్ అంటూ కొత్త తరహా మోసం ప్రారంభించారు మోసగాళ్లు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి కేసులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో బాధితులకు మోసగాళ్లు కొన్ని టాస్క్‌లు ఇస్తారు. దానికి డబ్బులు కూడా చెల్లిస్తుంటారు.

డబ్బు సంపాదించడం ఇంత సులభమా అనుకోగానే, మోసగాళ్లు అసలు టాస్క్‌కు తెరతీస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి వాటిలో టాస్క్ ఫ్రాడ్ ఒకటి.

అసలు ఏంటీ కొత్త ఆన్‌లైన్ టాస్క్ ఫ్రాడ్? బాధితులు, పోలీసులు బీబీసీతో ఏం చెప్పారు?

ఆన్‌లైన్ మోసాలు

ఇలా మొదలవుతుంది టాస్క్ ఫ్రాడ్

ఇలాంటి ఒక టాస్క్ స్కామ్ వలలో పడి మోసపోయిన రాజు (పేరు మార్చాం) అనే బాధితుడితో బీబీసీ మాట్లాడింది. రాజుది చిత్తూరు జిల్లా.

‘‘మొదట మన ఫోన్‌కు ఒక ఇన్‌స్టాగ్రామ్ లింక్ పంపిస్తారు. అందులో వారు ఇచ్చిన ప్రొఫైల్‌ను లైక్ చేసి, ఫాలో చేసి ఆ స్క్రీన్ షాట్ వారికి పెడితే కొంత డబ్బు చెల్లించడంతో అసలు గేమ్ మొదలవుతుంది’’ అని రాజు చెప్పారు.

“ఎక్కువగా సెలబ్రిటీస్, స్పోర్ట్స్ పర్సన్స్, అడ్వెంచర్ గ్రూప్స్, పెట్ గ్రూప్స్...ఇలా వస్తుంటాయి. వీటిని లైక్ చేయడం, ఫాలో చేయడం ఆ స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్లకు షేర్ చేయడం అనే టాస్క్ ఇస్తారు. దానికి 25 నిమిషాలు టైమ్ ఇస్తారు. అది కంప్లీట్ చేస్తే రూ.50 నుంచి రూ.100 వరకూ ఇస్తారు. అలా ఒక రోజుకు నాకు రూ.650 వచ్చింది. ఒక రెండు టాస్కులు అయ్యాక, ప్రీ పెయిడ్ టాస్క్ అంటారు. మన నుంచి రూ.500, రూ.600 అలా కొంత అమౌంట్ తీసుకుంటారు. దానికి 30 శాతం కమిషన్ చెల్లిస్తామంటారు’’ అని రాజు వివరించారు.

మొదట 50, 100 రూపాయల ఆశ చూపించి మొదలయ్యే ఈ టాస్క్ గేమ్ చివరికి, క్రిప్టో కరెన్సీ వరకూ తీసుకెళ్తుందని రాజు చెప్పారు. వారి వెబ్‌సైట్‌లో అసెట్స్ అనే పేజ్‌లో మనం ఖర్చు చేసే డబ్బు, మనకు క్రెడిట్ అయ్యే కమిషన్ అంటూ చూపిస్తూ పూర్తిగా ముంచేస్తారని వివరించారు.

క్రిప్టో కరెన్సీ ఆశ

‘‘మొదట రిసెప్షనిస్ట్ అని చెప్పుకునే వ్యక్తి యూపీఐ అకౌంట్ షేర్ చేస్తారు. దానికి మన అకౌంట్ లేదా యూపీఐ ఐడీ నుంచి డబ్బులు సెండ్ చేస్తాం. ఆ రిసెప్షనిస్ట్ మర్చంట్‌కు రిఫర్ చేస్తారు. అతడు మన వివరాలు తీసుకుని, ఆ డబ్బును కాయిన్ స్విచ్ డాట్ కామ్ అనే క్రిప్టో కరెన్సీ వెబ్‌సైట్లో మన పేరుతో, వాళ్ల కంట్రోల్ లో ఉండే ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు.

క్రిప్టో కరెన్సీ కొనడం, అమ్మడం చేయిస్తాడు. అలా చేస్తే ఎక్కువ హిట్స్ వస్తాయి అంటారు. తర్వాత ఎంత డబ్బు పెట్టారు, ఎంత కమిషన్ క్రెడిట్ అయింది అంటూ అసెట్స్ అనే పేజ్‌లో మనకు లెక్కలు చూపించి నమ్మిస్తారు.

అదంతా మనకు వస్తుంది అనుకుని ఇంకా డబ్బులు పెడతాం. టాస్క్ కంప్లీట్ కాగానే ఆ డబ్బులు మన బ్యాంక్ అకౌంట్‌కు రావు. అది మన దగ్గర డబ్బులు లాగడానికి చేసే ఫేక్ అకౌంట్’’ అని రాజు తెలిపారు.

భారతీయ అకౌంట్లలా కనిపించే వాటిలో మనం చేసే టాస్కులకు ఎంత డబ్బు క్రెడిట్ అయ్యిందో చూపిస్తూ మనల్ని పూర్తిగా నమ్మిస్తారని రాజు చెప్పారు. 30 శాతం కమిషన్‌కు ఆశపడినందుకు తన దగ్గర ఉన్న డబ్బంతా దోచుకున్నారని రాజు చెప్పారు.

“పేమెంట్ కోడ్ ఇచ్చి ఒక గ్రూపులో యాడ్ చేస్తారు. కోడ్ ఇవ్వగానే డబ్బులు మన అకౌంట్‌లో పడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నమ్మిస్తారు. ఒకసారి నలుగురు ఉన్న ఒక గ్రూపులో నన్ను యాడ్ చేశారు. ట్యూటర్ అని చెప్పి ఒకరికి మనల్ని అప్పగిస్తారు. అతను టాస్కులు ఇవ్వడం, మనతో డబ్బులు పెట్టించడం చేస్తాడు. అది పెరుగుతూ పోతుంటుంది. నాకు అలా రూ.7 వేల నుంచి రూ.2 లక్షలు, ఒక దశలో రూ.7లక్షల వరకూ పెరిగినట్లు చూపించారు. అది ‘మీ అకౌంట్లో డబ్బు’ అని చెబుతారు. ఒక్కో టాస్క్‌కు ఎంత అమౌంట్ క్రెడిట్ అయ్యిందో అసెట్ పేజ్‌లో చూపిస్తుంటాడు. చిన్న అమౌంట్ అయితే మన అకౌంట్లో నేరుగా క్రెడిట్ చేస్తారు. పెద్ద అమౌంట్ అయితే, అందులో మాత్రమే కనిపిస్తుంది. అది మనకు తిరిగి రాదు. అలా మోసపోతున్నాం” రాజు అన్నారు.

ఆన్‌లైన్ మోసాలు

వచ్చింది రూ. 650, పోయింది రూ. 5 లక్షలు

బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న రాజుది చిత్తూరు దగ్గర ఒక గ్రామం. తనకు జరిగిన మోసంపై చిత్తూరు జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఇంకా వారి నుంచి స్పందన రాలేదని ఆయన చెబుతున్నారు. మోసపోయానని తెలుసుకున్నా, ఇప్పటికీ వాళ్లు మళ్లీ తనను నమ్మించాలని ప్రయత్నిస్తున్నారని చెప్పాడు.

“చివరికి నా డబ్బు అడిగితే.. ‘ఇంకా మీరు డబ్బులు పే చేయండి, ఇంకా టాస్క్‌లు కంప్లీట్ చేయండి ఆ డబ్బులు పంపుతాం’ అని చెబుతూనే ఉన్నారు. ఇంత టాస్క్ చేసారు ఇంకో రూ.10 లక్షలు పంపండి అంటాడు. డబ్బులు లేవంటే చైనీస్ యాప్ నుంచి లోన్ తీసుకోండి అని సలహా కూడా ఇస్తాడు.’’ అని రాజు వెల్లడించారు.

మొదటే బ్లాక్ చేయండి

ఆన్‌లైన్ మోసాలు

మొదటి రోజు డబ్బు వస్తే, మూడో రోజుకు తన దగ్గర ఉన్న మొత్తం డబ్బు పోయిందని రాజు వివరించారు. మూడేళ్లుగా దాచుకున్న డబ్బుతోపాటూ, పర్సనల్ లోన్ కూడా తీసుకున్నానని, మొత్తం పోగొట్టుకున్నానని చెప్పారు. తనలా ఈ మోసాల బారిన పడొద్దని ఆయన హెచ్చరించాడు.

‘‘ఇదంతా టెలిగ్రామ్‌లోనే జరుగుతుంది. మొదట ఫారిన్ నంబర్ నుంచి కాంటాక్ట్ అవుతారు. జీతం తక్కువైందని, డబ్బు మీద ఆశతో బుద్ధి తక్కువై ఇలాంటి తప్పు చేశాను. ఇలాంటి వాటి జోలికి వెళ్లకండి. ఇప్పుడు ఇదే టాస్క్ ఫ్రాడ్ యూట్యూబ్‌తో కూడా మొదలైంది. యూట్యూబ్‌లో ఈ లింక్స్ ఫాలో కండి, ఈ సెలబ్రిటీలను లైక్ చేయండి అని కూడా వస్తున్నాయి” అన్నారు.

ఆన్‌లైన్ మోసాలు

ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే.?

ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన పాపానికి రూ.83,000 పోయాయన్నారు గీత (పేరు మార్చాము) అనే బాధితురాలు చెప్పారు. కుప్పంకు చెందిన గీత, డిగ్రీ వరకు చదివి మెడికల్ షాపులో పనిచేస్తున్నారు. పార్ట్ టైం జాబ్ పేరుతో ఆశ పెట్టి టాస్క్ గేమ్ అంటూ టాస్క్‌లు ఇచ్చి తన దగ్గరున్న డబ్బంతా లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘ఫేస్‌బుక్‌లో పరిచయమై పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చని సలహా ఇచ్చారు. ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చారు. ఆ వాట్సాప్ నెంబర్ లో కాంటాక్ట్ అయితే ఈక్వల్ టు గేమింగ్ అంటూ ఒక ఫేక్ అకౌంటు ఇచ్చారు. అందులో ఐడి క్రియేట్ చేసుకోమని చెప్తారు. ఆ తర్వాత వాళ్లు ఒక ప్రోడక్ట్ అందులో పెడతారు. దాన్ని కొని మరొకరికి అమ్మాలని చెప్తారు. ఒక్కొక్క ప్రాడక్టు రూ.20,000, రూ 40,000 వరకు కూడా ఉంటాయి. దానికి మనకు 20% కమిషన్ ఇస్తారు. ఇదంతా మన అకౌంట్ లోనే ఉందని మనం అనుకుంటాం. కానీ ఆ అకౌంట్ పూర్తిగా వాళ్ల కంట్రోల్ లోనే ఉంటుంది. అక్కడ మీ అమౌంట్ ఇంత ఉంది, అంత ఉంది అని చూపిస్తుంది. కానీ దాన్ని మనం డ్రా చేయడానికి ఉండదు. వాళ్లే మన అకౌంట్ కు ట్రాన్స్‌ఫర్ చేయాలి. అలా రెండు నెలలు చేస్తే అందులో ఒక నెల బాగానే వచ్చింది. బాగానే ఇచ్చారు కాబట్టి తర్వాత కూడా ఇస్తారనుకుని రూ.83,000 ఇన్వెస్ట్ చేశాను. మొత్తం పోయింది’’ అన్నారు గీత.

రాళ్లబూదుగూరు ఎస్సై మునిస్వామి
ఫొటో క్యాప్షన్, రాళ్లబూదుగూరు ఎస్సై మునిస్వామి

ఆశ పడితే అంతే

పార్ట్ టైమ్ సంపాదన అనే ఉచ్చుతో ఈ మోసానికి తెరతీస్తున్నారని చిత్తూరు జిల్లా రాళ్లబూదుగూరు సబ్ ఇన్‌స్పెక్టర్ ముని స్వామి బీబీసీతో చెప్పారు. వాళ్లు పంపించిన లింక్ ఓపెన్ చేయగానే మోసగాళ్లు టాస్క్ గేమ్ మొదలుపెడతారని చెప్పారు. మునిస్వామి తన టీంతో కలిసి దిల్లీలో ఉన్న ఒక మోసగాణ్ని అరెస్టు చేసి తీసుకువచ్చారు.

‘‘ రాళ్లబూదుగూరుకు చెందిన ఒక అమ్మాయికి ‘పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ మొబైల్‌కి లింక్ పంపుతాం అందులో రిజిస్టర్ అవ్వండి’ అని చెప్పారు. అలాంటివి ఓపెన్ చేయగానే లింకు ద్వారా టాస్క్ గేమ్ అంటూ ఒక ప్రాజెక్ట్ పెడతారు. ఒక టాస్క్ ఇస్తారు కంప్లీట్ చేస్తే మీకు అమౌంట్ పంపిస్తామని చెబుతారు. అది కంప్లీట్ చేయడానికి ముందే ఒక అమౌంట్ పే చేయమంటారు. అలా రూ. 500 చెల్లిస్తే, రూ.100, రూ.200 కలిపి రూ.700 అలా చెల్లిస్తారు. వీళ్ళు దానికి ఒకసారి అలవాటు పడిన తర్వాత ఆ టాస్క్ లో ఎక్కువ మొత్తానికి గేమ్స్ పెడతారు. అవి కంప్లీట్ చేస్తే డబ్బులు వస్తాయంటారు. డబ్బులు చెల్లించి కంప్లీట్ చేసిన తర్వాత ఫోన్ చేస్తే స్పందించరు’’ అని ముని స్వామి చెప్పారు.

రాళ్లబూదుగూరులో మోసపోయిన అమ్మాయి పెట్టిన కేసులో బ్యాంక్ అకౌంట్ ఆధారంగా నిందితులను ఎలా గుర్తించారో కూడా పోలీసులు వివరించారు.

‘‘మేము స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ బ్యాంక్ అకౌంట్ ఎవరి పేరుతో ఉంది అనే వివరాలు సేకరిస్తాం. దాని ద్వారా వాళ్ళు ఎక్కడున్నారో గుర్తిస్తాం. ఈ కేసులో ఉన్న బ్యాంక్ అకౌంటుకు అమ్మాయి రూ.1.73 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఆ బ్యాంక్ అకౌంటును బట్టి నిందితుడు దిల్లీకి చెందిన మోనో అనే వ్యక్తి అని గుర్తించాం. లోకల్ పోలీసుల సాయంతో దిల్లీలో మోనోను గుర్తించాం. కుప్పం తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచాం’’ అని ఎస్.ఐ. ముని స్వామి వివరించారు.

ఇలాంటి మోసాలకు బలవకుండా ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. నేరస్థులకు ఇలాంటి వారి వివరాలు ఎలా అందుతున్నాయో కూడా చెప్పారు పోలీసులు.

‘‘ఆన్‌లైన్ సైట్లలో ఏవైనా వస్తువులు కొన్నప్పుడు, ఫోన్ నంబర్ లింక్ చేస్తాం. ఆ నంబర్ ఆధారంగా ఇలాంటి మోసాలకు తెరతీస్తున్నారు. కారు గిఫ్ట్ వచ్చింది, పార్ట్ టైం జాబ్స్ అని చెప్పి మోసం చేస్తున్నారు. ఫిజికల్‌గా వెరిఫై చేసే వరకు ఎవరినీ నమ్మొద్దు. వాళ్ళు ఇచ్చిన అడ్రస్‌కి వెళ్లి వెరిఫై చేసుకోవాలి. మన ఫోన్ నంబర్లకు చాలా వరకూ బ్యాంక్ అకౌంట్లు లింక్ అయి ఉండడంతో మోసగాళ్లు ఇలాంటి మోసాలకు తెరతీస్తున్నారు’’ అని పోలీసులు చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, ‘ఇన్‌స్టా ప్రొఫైల్ లైక్ చేసి, ఫాలో అవండి, డబ్బు సంపాదించండి’ అని దోచేస్తున్నారు

సైబర్ నేరాలపై ఎవరికి, ఎలా ఫిర్యాదు చేయాలి?

టాస్క్ గేమ్, ఓఎల్‌ఎక్స్ వంటి మోసాలతోపాటు.. ‘క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టలేదు, కరెంటు బిల్లు కట్టలేదు.. ఓటీపీ చెప్పండి అంటూ’ అనేక రూపాలలో మోసగాళ్లు చీటింగ్‌కు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైంకి ఫిర్యాదులు వస్తుంటాయని తిరుపతి సైబర్ క్రైం సీఐ రామచంద్రారెడ్డి బీబీసీతో చెప్పారు.

‘‘ఇలాంటి మోసాలపై 1930 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. లేదంటే నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్.సి.సి.ఆర్.పి)లో ఫిర్యాదు చేసిన తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వాలి. తెలియని వారు నేరుగా సైబర్ క్రైంకు వచ్చినా మేమే కంప్లయింట్ రైజ్ చేసి సంబందిత పోలీస్ స్టేషన్‌కు మెయిల్ చేస్తాం. పోలీసులు దానిని వెరిఫై చేసి కేసు నమోదు చేస్తారు’’ అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి: