ఆంధ్రప్రదేశ్: వ్యవసాయంలో డ్రోన్ పైలట్లకు ఉచిత శిక్షణ
వ్యవసాయ పనుల కోసం కొందరు రైతులు ఇప్పటికే డ్రోన్లు వాడుతున్నారు. వ్యవసాయంలో డ్రోన్ల వాడకం మరింత పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా భావిస్తోంది. అందుకోసం ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీలో రిమోట్ పైలట్ కోర్సు ప్రారంభించింది. తొలి బ్యాచ్ ట్రైనింగ్ కూడా పూర్తయ్యింది. వ్యవసాయ డ్రోన్ల తయారీ, నిర్వహణపై ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు.
‘‘మంచి శిక్షణ ఇస్తున్నారు. నాకు బాగా అర్థమయ్యింది. డ్రోన్ బాగా ఆపరేట్ చేశాము. స్టార్టప్ కంపెనీ పెడతాము. వ్యవసాయంలో ఆధునికతను అందరికీ అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాము’’ అని విజయనగరానికి చెందిన సర్టిఫైడ్ డ్రోన్ పైలట్ ఐ. త్రిపుర తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ద్వారా ఎంపికైన వారికి 12 రోజుల పాటు గుంటూరు జిల్లా లామ్‌లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉచిత శిక్షణ ఉంటుంది.

‘‘వ్యవసాయంలో డ్రోన్లు ఎలా వాడాలి, రూల్స్ ఏమిటీ, ఎక్కడ అనుమతి తీసుకోవాలి, గ్రీన్, రెడ్, ఎల్లో జోన్ అంటే ఏమిటీ, డ్రోన్ ఎలా ఫ్లై చేయాలి, ఫీల్డ్ ట్రైనింగ్‌కి ముందు కంప్యూటర్‌లో జాయ్ స్టిక్స్ బాగా చేసేలా థియరీ, ప్రాక్టికల్ ఉంటుంది. డ్రోన్ అసెంబ్లింగ్ కూడా నేర్పుతాం. డ్రోన్ తయారీ, ఆపరేట్, రిపేర్ సహా అన్నింటినీ నేర్పుతాం’’ అని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఎ.సాంబయ్య వివరించారు.
పది పంటల్లో డ్రోన్ల వినియోగానికి ప్రయోగాలు చేసి ఫలితాలు సాధించామని శాస్త్రవేత్తలు అంటున్నారు. సెంటర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ సెన్సర్ అండ్ స్మార్ట్ అప్లికేషన్స్ రీసర్చ్ ఇన్ అగ్రికల్చర్ ఆధ్వర్యంలో అప్సరా పేరుతో ఏర్పాటు చేసిన సంస్థ నేతృత్వంలో అగ్రికల్చర్ డ్రోన్ ఇంక్యుబేషన్ అండ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ద్వారా శిక్షణ ఇస్తున్నారు. దీనికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులున్నాయని ఎన్జీ రంగా యూనివర్సిటీ తెలిపింది.
‘‘వ్యవసాయంలో డ్రోన్లు 22 రకాలుగా ఉపయోగపడతాయి. పురుగుమందులు, కలుపు మందులు, విత్తనాలు జల్లడం పరిశోధన చేశాము. ఫలించాము. మినుము, వరి విత్తనాలు జల్లాము . సక్సెస్ అయ్యాము. సమానంగా విత్తనాలు, ఎరువులు జల్లవచ్చు. బస్తాలు బస్తాలు మోయాల్సిన అవసరం లేకుండా చేయగలం’’ డాక్టర్ ఎ.సాంబయ్య తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగంలో 40 వేల డ్రోన్ల అవసరం ఉందని, అందుకోసం 80 వేల మంది పైలట్లు అవసరమవుతారని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. రెండు లక్షల మంది వరకూ డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఉపాధి పొందే వీలుంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో జిల్లాకు ఒకరు చొప్పున ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. త్వరలో శిక్షణ మరింత విస్తృతమవుతుందని, ఇంటర్మీడియట్ లేదా పాలిటెక్నిక్ చేసిన వారు శిక్షణకు అర్హులని వారు వివరించారు.
ఇవి కూడా చదవండి:
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- మసాయి ఒలింపిక్స్: సింహాలను వేటాడే వీరులు ఆడే ఆటలు
- గుండెపోటు వచ్చే అరగంట ముందు శరీరంలో ఏం జరుగుతుంది, ఏ లక్షణాలు కనిపిస్తాయి?
- మహిళల్లో హార్మోన్లు ఎందుకు గతి తప్పుతాయి, ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా?
- హోప్ ఐలాండ్: ఏపీలోని ఏకైక సముద్ర దీవిని చూశారా? అక్కడ 118 కుటుంబాలు ఎలా బతుకుతున్నాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









