మనుషులు చేరుకోలేని ఉత్తర ధ్రువాన్ని ఎలా కనిపెట్టారు? చావు అంచుల వరకు వెళ్లి ఎలా బయటపడ్డారు?

మాథ్యూ అలెగ్జాండర్ హెన్సన్

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, మాథ్యూ అలెగ్జాండర్ హెన్సన్ (1866-1955)
    • రచయిత, రాబర్ట్ ఐజన్‌బర్గ్
    • హోదా, బీబీసీ ట్రావెల్

భూమికి ఉండే రెండు ధ్రువాల్లో ఉత్తర ధ్రువం ఒకటి.

ఆర్కిటిక్ సముద్రంలో ఉండే ఉత్తర ధ్రువం ఏ దేశానికి చెందింది కాదు.

ఈ ఉత్తర ధ్రువాన్ని కనిపెట్టడంలో అమెరికాకు చెందిన నల్లజాతీయుడు మాథ్యూ హెన్సన్ చాలా కీలక పాత్ర పోషించారు.

కౌలుకు వ్యవసాయం చేసే రైతు కుటుంబంలో పుట్టిన హెన్సన్, బతకడానికి ఎన్నో పనులు చేశారు. చివరకు ఇతర ఖండాలు, సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వ్యాపార నౌకల్లో పని చేసే ఉద్యోగం దొరికింది. హెన్సన్‌కు చదవడం నేర్పించారు కెప్టెన్ చిల్డ్స్. సముద్రం మీద ఎలా జీవించాలో కూడా నేర్పించారు.

1883లో కెప్టెన్ చిల్డ్స్ చనిపోవడంతో హెన్సన్‌కు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. 1887లో అమెరికా నేవిలో పని చేస్తూ ఉండే కమాండర్ రాబర్ట్ పియరీని హెన్సన్ కలిశారు. హెన్సన్ తీరు నచ్చిన రాబర్ట్ పియరీ, నికరాగువా వెళ్లేటప్పుడు తనకు అసిస్టెంట్‌గా తీసుకెళ్లారు.

వీరిద్దరి కలయిక ఆ తరువాత ఉత్తర ధ్రువం అన్వేషణకు దారి తీసింది.

ధ్రువపు ఎలుగుబంటి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఆర్కిటిక్ ప్రాంతంలో వేట తెలిసి ఉండటం చాలా ముఖ్యం

కొన్ని వందల సంవత్సరాల పాటు దాన్ని చేరుకునేందుకు ఎందరో అన్వేషకులు ప్రయత్నించారు. ఉత్తర ధ్రువాన్ని చేరుకుని భూమి అంచుల మీద నిలబడాలని కలలు కన్నవారు ఉన్నారు.

కానీ ఆర్కిటిక్ ప్రాంతంలోని ఎముకలు కొరికే చలి, నౌకలను సైతం ముక్కలు చేయగల మంచు ఫలకాలు వంటివి ఆ కలలకు అడ్డుగా నిలుస్తూ వచ్చాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో నివసించే ఆదివాసీ తెగ ఇన్యూట్ ప్రజలు సైతం ఉత్తర ధ్రువాన్ని చేరుకోలేక పోయారు.

రాబర్ట్ పియరీ రూపంలో మరొక అన్వేషకుడు ఉత్తర ధ్రువాన్ని చేరుకునేందుకు ప్రయాణం మొదలుపెట్టాడు. తన ప్రయాణానికి కావాల్సిన డబ్బును, అవసరమైన సిబ్బందిని సమీకరించాడు.

రాబర్ట్ పియరీ చేసిన ప్రతి ప్రయాణంలోనూ హెన్సన్ ఆయన వెంటనే ఉన్నారు. గ్రీన్‌ల్యాండ్‌లోని ఆదివాసీ తెగలతో అనుబంధం పెంచుకున్నారు హెన్సన్. ఇగ్లూలు నిర్మించడం, మంచుగడ్డల మీద ప్రయాణించే స్లెడ్జెస్‌ను నడపడం వంటివి ఆయన నేర్చుకున్నారు. అక్కడి ఆదివాసీల భాష ఇనక్టున్ కూడా ఆయనకు వచ్చేది. ధ్రువపు ఎలుగుబంట్లను ఎలా వేటాడాలో కూడా తెలుసుకున్నాడు.

ఆర్కిటిక్ ప్రాంతంలో మనుగడ సాగించాలంటే రెండు ప్రధానంగా తెలిసి ఉండాలి. ఒకటి ఆహారం కోసం వేట, రెండు కుక్కలు లాగే స్లెడ్జెస్ బండ్లను నడపగల నైపుణ్యం.

‘‘అతను(హెన్సన్) కుక్కలను చాలా బాగా తోలేవాడు. ఇన్యూట్ తెగకు చెందిన కొందరు వేటగాళ్లు తప్ప అతనిలా స్లెడ్జెస్‌ను నడపగలిగినవారు ఈ భూమి మీద లేరు’’ అని హెన్సన్ గురించి రాబర్ట్ పియరీ రాశారు.

అన్వేషకుల బృందంతో హెన్సన్

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, ఉత్తర ధ్రువం అన్వేషణకు బయలుదేరిన బృందం
బృందంతో హెన్సన్

ఫొటో సోర్స్, Alamy

1891 నుంచి 1909 మధ్య ఏడు సార్లకు పైగా ఉత్తర ధ్రువాన్ని చేరుకునేందుకు రాబర్ట్ పియరీ బృందం ప్రయత్నించింది. ప్రతి సారీ ఆయనతో హెన్సన్ ఉన్నారు. కానీ వారిద్దరినీ ఆర్కిటిక్ కఠిన వాతావరణం ఎంతగానో పరీక్షించింది.

కొన్నిసార్లు చలికి గడ్డకట్టి చావు దగ్గరకు వెళ్లి వచ్చారు. చాలా సార్లు తిండితిప్పలు లేక అలమటించిపోయారు. గడ్డకట్టించే చలి వల్ల కాళ్లలోని చాలా వేళ్లను పియరీ పోగొట్టుకున్నారు. ఒకసారి మంచు ఫలకలు విరిగి హెన్సన్ నీటిలో పడిపోయారు. అతని స్నేహితుడు ఊతా వెంటనే లాగకుంటే గడ్డ కట్టించే చల్లని నీటిలో అతను చనిపోయి ఉండే వాడు.

వారు ఆరుసార్లు ఏదో ఒక సమస్యతో ముందుకు వెళ్లలేక వెనక్కి తిరగాల్సి వచ్చింది. కానీ ప్రతి సారీ చేసిన తప్పులను మళ్లీ చేయకుండా మరింత జాగ్రత్తగా ముందుకు సాగారు. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నారు.

1909లో రాబర్ట్ పియరీ, హెన్సన్ బృందం మరొకసారి ఉత్తర ధ్రువం అన్వేషణకు బయలుదేరింది. ఉత్తర ధ్రువానికి సుమారు 215 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు వారి దగ్గర తిండి నిల్వలు అడుగంటాయి. అప్పటికి వారి బృందంలో 50 మంది ఉన్నారు. నలుగురు ఇన్యూట్ జాతి వ్యక్తులు, హెన్సన్ మాత్రమే ఉండమని మిగతా వారందరిని తిరిగి నౌక వద్దకు వెళ్లమని రాబర్ట్ పియరీ ఆదేశించారు.

అక్కడి నుంచి కొద్ది రోజుల ప్రయాణం తరువాత 1909, ఏప్రిల్ 6న ‘‘మనం ఉత్తర ధ్రువం వద్ద ఉన్నట్లుగా అనిపిస్తోంది’’ అని హెన్సన్ పియరీతో అన్నట్లుగా స్మిత్సోనియన్‌లో వచ్చిన ఒక వ్యాసంలో రాశారు.

అప్పుడు పియరీ తన కోటులోని అమెరికా జెండాను తీసి అక్కడి ఇగ్లూ మీద నాటారు. ఆ జెండాను ఆయన భార్య తయారు చేసింది. ఆ మరుసటి రోజు తమ లొకేషన్‌ను రికార్డు చేసి, అక్కడ ఒక నోట్ ఉంచారు. అమెరికా జెండాను ఒక టిన్‌లో ఉంచి దాన్ని మంచులో పాతిపెట్టారు. తిరిగి వారు షిప్ దగ్గరకు బయలుదేరారు.

‘‘మరొక ప్రపంచ ఘనతను సాధించాం. చరిత్ర ప్రారంభం నుంచి ప్రపంచంలో తెల్లవాళ్లు ఏం సాధించినా వారికి సహాయంగా నల్లజాతీయులున్నారు’’ అని 1912లో ‘‘ఏ నీగ్రో ఎక్స్‌ప్లోరర్ ఎట్ ది నార్త్ పోల్’’ అనే పుస్తకంలో హెన్సన్ రాసుకున్నారు.

ఉత్తర ధ్రువం వద్ద హెన్సన్ బృందం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర ధ్రువం వద్ద పియరీ, హెన్సన్‌, ఇన్యూట్ తెగ వ్యక్తులు

ఉత్తర ధ్రువాన్ని కనుగొన్నందుకు రాబర్ట్ పియరీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కానీ హెన్సన్ పేరు మాత్రం మరుగున పడిపోయింది. ఎన్నో వాదనల తరువాత హెన్సన్ సాయం లేకుండా పియరీ ఉత్తర ధ్రువానికి చేరుకోలేక పోయేవాడు అని మెజారిటీ చరిత్రకారులు అంగీకరించారు.

చివరకు 1937లో ఎక్స్‌ప్లోరర్స్ క్లబ్‌లో హెన్సన్‌కు సభ్యత్వం ఇచ్చారు. నాటి అమెరికా అధ్యక్షుడు హారీ ఎస్ ట్రూమన్, డ్వైట్ డీ ఐజన్‌హోవర్‌ల నుంచి ఆయనకు గౌరవ పురస్కారాలు లభించాయి. కానీ అప్పటికే హెన్సన్ జీవితం చివరి రోజుల్లోకి చేరుకుంది.

నేడు అమెరికాలో ఆయన పేరు మీద పార్కులు, స్కూళ్లు ఉన్నాయి. సముద్రంలో అన్వేషణలు చేపట్టే నౌకకు హెన్సన్ పేరు మీద యూఎస్‌ఎన్‌ఎస్ హెన్సన్ అని పేరు పెట్టారు.

హెన్సన్ జీవితం గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ఆయన అభిమానులు కొన్ని దశబ్దాల పాటు ప్రయత్నించారు.

హెన్సన్ మీద నార్త్ పోల్ లెగసీ పేరుతో ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు ఎక్స్‌ప్లోరర్స్ క్లబ్‌కు చెందిన డాక్టర్ ఎస్ అలెన్ కౌంటర్.

ఆ తరువాత ఎక్స్‌ప్లోరర్స్ క్లబ్‌లో డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ కమిటీని ప్రారంభించారు. నాడు రాబర్ట్ పియరీ, హెన్సన్‌లతో పాటు ఉత్తర ధ్రువానికి చేరుకున్న నలుగురు ఇన్యూట్ తెగ వ్యక్తులకు 2022లో సభ్యత్వం ఇచ్చారు. చనిపోయిన తరువాత సీగ్లూ, ఎగింగ్వా, ఊక్వేహా, ఉతాహాలకు చనిపోయిన తరువాత ఇన్నాళ్లకు సభ్యత్వం లభించింది.

ఇవి కూడా చూడండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)