క్రైస్తవంలోకి మారితే గిరిజనులకు రిజర్వేషన్లు ఉండవా? చత్తీస్‌గఢ్‌లో వివాదం ఏంటి?

చత్తీస్‌గఢ్ గిరిజనులు
    • రచయిత, అలోక్ ప్రకాష్ పుతుల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చత్తీస్‌గఢ్‌లో క్రైస్తవ గిరిజనులను షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) విభాగం నుంచి తొలగించాలనే డిమాండ్ పెరుగుతోంది.

మరో ఆరు నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో డి-లిస్టింగ్ డిమాండ్ వినిపిస్తోంది.

గత కొన్నినెలలుగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కి అనుబంధంగా ఉన్న హిందూ సంస్థలు బస్తర్ నుంచి సుర్గుజా వరకు అనేక ర్యాలీలు నిర్వహించి, క్రైస్తవ గిరిజనులను రిజర్వేషన్ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. దీనికి బదులుగా క్రైస్తవ సంస్థలు కూడా పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టాయి.

బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన గిరిజన నాయకుడు గణేష్‌రామ్ భగత్ డి-లిస్టింగ్ అంశంపై చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఆయన గిరిజన భద్రతా ఫోరం జాతీయ కన్వీనర్‌గా ఉన్నారు.

"మా డిమాండ్ చాలా స్పష్టంగా ఉంది. గిరిజనులు క్రైస్తవం లేదా ఇస్లాం మతాన్ని స్వీకరించి గిరిజన ఆచారాన్ని విడిచిపెట్టి, సంప్రదాయ పూజలను నిలిపివేస్తున్నారు. ఆచారాలను నిలిపివేస్తే వారిని గిరిజనులుగా పరిగణించకూడదు. రిజర్వేషన్లను నిలిపివేయాలి'' అని గణేష్‌రామ్ భగత్ డిమాండ్ చేస్తున్నారు.

రిజర్వేషన్లు

ఫొటో సోర్స్, ALOK PUTUL

అరవింద్ నేతమ్

ఫొటో సోర్స్, ALOK PUTU

డి- లిస్టింగ్‌ను ఎవరు వ్యతిరేకిస్తున్నారు?

మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్‌ అనేది మతపరమైన ఉద్రిక్తతలను పెంచి ఓట్లను చీల్చే ప్రయత్నంగా క్రైస్తవ సంస్థలు ఆరోపిస్తున్నాయి.

''గత కొన్నేళ్లుగా గిరిజన సంప్రదాయాన్ని వదిలి హిందూమతాన్ని స్వీకరించిన గిరిజనులనూ రిజర్వేషన్ల పరిధి నుంచి మినహాయించాలని డిమాండ్‌ చేస్తారా?'' అని ఛత్తీస్‌గఢ్‌ క్రిస్టియన్‌ ఫోరం అధ్యక్షుడు అరుణ్‌ పన్నాలాల్‌ ప్రశ్నించారు.

ఛత్తీస్‌గఢ్ సర్వ ఆదివాసీ సమాజ్ కూడా డి-లిస్టింగ్ డిమాండ్‌తో ఏకీభవించడం లేదు.

అయితే డి-లిస్టింగ్ గిరిజనులను బలహీనులను చేస్తుందని సర్వ్ ఆదివాసీ సమాజ్ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి అరవింద్ నేతమ్ అభిప్రాయం వ్యక్తంచేశారు.

అరవింద్ నేతమ్ బీబీసీతో మాట్లాడుతూ "గిరిజనుల సంఖ్యను తక్కువ చేయడం ద్వారా రిజర్వేషన్లు, అటవీ హక్కులు, ఐదు-ఆరో జాబితా ప్రాంతం, దానికి సంబంధించిన హక్కులు, షెడ్యూల్ ఏరియాల్లో పంచాయతీల పొడిగింపు వంటి హక్కులు గిరిజనులకు దక్కవు. దీన్ని రద్దు చేయడం ద్వారా గిరిజనులు అట్టడుగుకు వెళతారు'' అని అన్నారు.

క్రైస్తవులు

ఫొటో సోర్స్, VIMAL MINJ

గిరిజనులు, క్రైస్తవులు, ఎన్నికలు..

దాదాపు మూడు కోట్ల జనాభా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనుల జనాభా దాదాపు 32 శాతం ఉంది.

2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ముస్లిం జనాభా 2.02 శాతం కాగా క్రైస్తవ జనాభా 1.92 శాతం,సిక్కు జనాభా 0.27 శాతం, బౌద్ధులు 0.28, జైనులు 0.24 శాతం ఉన్నారు.

అయితే క్రైస్తవ మతాన్ని విశ్వసించే, చర్చికి వెళ్లే, ప్రార్థనలు చేసే వారి సంఖ్య దీని కంటే చాలా రెట్లు ఎక్కువని క్రైస్తవ సంస్థలు చెబుతున్నాయి.

రాష్ట్ర అసెంబ్లీలోని 90 సీట్లలో కనీసం 30 సీట్లలో వారి ఓటు ముఖ్యమైనదని ఆ సంస్థలు అంటున్నాయి.

ఉదాహరణకు జష్పూర్ జిల్లాలోని గిరిజన జనాభాలో 35 శాతానికి పైగా గిరిజన క్రైస్తవులు ఉండగా, సుర్గుజా జిల్లాలో ఈ సంఖ్య దాదాపు 7 శాతంగా ఉంది.

సామాజిక కార్యకర్త బ్రిజేంద్ర మాట్లాడుతూ.. గత 70 ఏళ్లుగా గిరిజన సంఘం గణనలో తప్పులు జరుగుతున్నాయని, అందుకే వారి మత, సాంస్కృతిక గుర్తింపు విషయంలో గందరగోళం నెలకొందని అన్నారు.

‘‘1891లో జనాభా గణన జరిగినప్పుడు గిరిజనులను 'అటవీ తెగ' కేటగిరీలో ఉంచారు.

1901లో దీన్ని 'అనిమిస్ట్', 1911లో 'ట్రైబల్ అనిమిస్ట్', 1921లో 'కొండ , అటవీ తెగ', 1931లో 'ప్రిమిటివ్ ట్రైబ్' 1941లో 'ట్రైబ్స్'గా మార్చారు.

1951లో జనాభా గణన జరిగినప్పుడు ట్రైబ్స్ కాలమ్ తొలగించారు.

ఆ సమయంలో కొంతమంది గిరిజనులు హిందువులు, మరికొందరు క్రైస్తవులు, మరికొందరు ప్రకృతివాదుల వర్గంలోకి వచ్చారు’’ అని బ్రిజేంద్ర అన్నారు.

డి లిస్టింగ్ నిరసనలు

ఫొటో సోర్స్, CGABAR KH

డి-లిస్టింగ్ డిమాండ్ ఎప్పటి నుంచి ఉంది?

గిరిజన క్రైస్తవులు లేదా ముస్లింలను రిజర్వేషన్, ఇతర సౌకర్యాల పరిధి నుంచి మినహాయించాలనే డిమాండ్ కొత్తది కాదు.

ఉమ్మడి బిహార్‌లోని లోహర్దగా ఎంపీ కార్తీక్ ఓరాన్ ఈ డిమాండ్‌ను చాలాసార్లు లేవనెత్తారు.

అదేవిధంగా షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ తెగలలో ఏదైనా నిర్దిష్ట కులాన్ని చేర్చడం లేదా మినహాయించడం, వాటిలో సవరణ అనే అంశాలపై లోకూర్ కమిటీ నివేదిక తర్వాత 1967 ఆగస్టు 21న లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టారు.

1968 మార్చి1న 'షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ఆర్డర్ (సవరణ) బిల్లు' చర్చ కోసం లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త కమిటీకి పంపారు.

అనిల్ కుమార్ చందా ఈ సంయుక్త కమిటీ నివేదికను 1969 నవంబర్ 17న సమర్పించారు.

ఏడాది తర్వాత 1970 నవంబర్ 11న అప్పటి న్యాయ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కె.హనుమంతయ్య లోక్‌సభలో ఈ బిల్లును ప్రతిపాదించారు.

1961 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్‌లో దాదాపు 2,125 కులాలు, ఉపకులాలు, 622 సంఘాలు ఉన్నాయని హనుమంతయ్య తన ప్రతిపాదనలో తెలిపారు.

కె హనుమంతయ్య మాట్లాడుతూ.. ‘‘మతాన్ని త్యజించి క్రైస్తవం లేదా ఇస్లాం మతాన్ని స్వీకరించే వ్యక్తిని షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ)కు చెందిన వ్యక్తిగా పరిగణించరాదని జాయింట్ కమిటీ సిఫార్సు చేసింది.

ఈ సవరణ ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే ఇది క్రైస్తవ, ఇస్లాం, ఇతర మతాల వ్యక్తుల మధ్య వివక్ష చూపుతుంది" అని ఆయన అన్నారు.

డి లిస్టింగ్

ఫొటో సోర్స్, ALOK PUTU

రాజ్యాంగం ఏం చెబుతోంది?

డి-లిస్టింగ్ డిమాండ్ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు మాజీ అడ్వొకేట్ జనరల్, రాజ్యాంగ నిపుణుడు కనక్ తివారీ అన్నారు.

కనక్ తివారీ మాట్లాడుతూ "ఆదివాసీలు ఏ మతంలోకి మారినా వారు గిరిజనులుగానే ఉంటారు. అంటే రాజ్యాంగం ప్రకారం వారి రిజర్వేషన్లు వారికి అందుబాటులో ఉంటాయి'' అన్నారు.

"ఆదివాసీలు హిందువులు కాదు, ఇది చాలా స్పష్టంగా ఉంది. మన సంప్రదాయం, సంస్కృతి, విశ్వాసాలు ప్రపంచంలోనే పురాతనమైనవి.

గిరిజనులకు మత ప్రాతిపదికన రిజర్వేషన్ల ప్రయోజనం లేదు. కొంతమంది క్రైస్తవం లేదా హిందూమతాన్ని విశ్వసిస్తే, వారి రిజర్వేషన్ హక్కును తీసివేయలేరు'' అని అరవింద్ నేతమ్ అన్నారు.

డి-లిస్ట్ డిమాండ్ బీజేపీ, సంఘ్‌ల తప్పుదారి పట్టించే ఎత్తుగడగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఆరోపించారు.

మరోవైపు ఎన్నికల ఏడాదిలో బస్తర్ నుంచి సర్గుజా వరకు మతమార్పిడి, డి-లిస్టింగ్‌ అంశాలను భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం గట్టిగా చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)