అమెరికా-సీఐఏ: అణు శాస్త్రవేత్త హోమీ భాభా, ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రిల హత్యకు కుట్ర పన్నిందా?

ఫొటో సోర్స్, TIFR
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హోమీ భాభా, 1966 జనవరి 23వ తేదీన రోజంతా తీరిక లేకుండా పనిచేశారు.
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్) సెంటర్‌లోని నాలుగో అంతస్తులో ఉన్న తన కార్యాలయంలో ఆరోజంతా ఆయన పని చేస్తూనే ఉన్నారు.
హోమీ భాభా సహచరుడు ఎంజీకే మీనన్ నాటి రోజును గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పారు.
‘‘ఆరోజు భాభా నాతో దాదాపు రెండు గంటల పాటు మాట్లాడారు. అంతకు నాలుగు రోజుల ముందే ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ నుంచి తనకు ఫోన్ వచ్చినట్లు నాతో భాభా చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రతీ అంశంలో నాకు మీ సహాయం కావాలి అని ఇందిరా గాంధీ ఫోన్‌లో తనను అడిగినట్లు భాభా తెలిపారు. భాభా ఒకవేళ ఇందిరా గాంధీ ప్రతిపాదనను స్వీకరించితే ముంబై నుంచి దిల్లీకి మారాల్సి ఉంటుంది. అయితే, ఇందిరాగాంధీ ప్రతిపాదనను అంగీకరించినట్లు భాభా నాతో చెప్పారు. వియన్నా నుంచి తిరిగొచ్చాక మిమ్మల్ని టీఐఎఫ్‌ఆర్ డైరెక్టర్‌గా చేయాలని కౌన్సిల్‌కు ప్రతిపాదిస్తాను అని భాభా అన్నారు’’ అని ఎంజీకే మీనన్ చెప్పారు.
హోమీ భాభాకు ఇందిరా గాంధీ చేసిన ప్రతిపాదన గురించి ఆయన సోదరుడు జంషెద్, తల్లి మెహర్‌బాయి, జేఆర్డీ టాటా, మిత్రురాలు పిప్సీ వాడియా, ఆయన దంతవైద్యుడు ఫాలీ మెహతాలకు కూడా తెలుసు.
హోమీ భాభా ఆత్మకథ ‘‘హోమీ భాభా ఎ లైఫ్’’ పుస్తకాన్ని రాసిన భఖ్తియార్ కె. దాదాభాయ్ కూడా ఆయన గురించి బీబీసీతో మాట్లాడారు.
‘‘ఇందిరాగాంధీ ఏం ప్రతిపాదించారో ఉన్నదున్నట్లుగా మీనన్‌కు భాభా చెప్పలేదు. కానీ, క్యాబినెట్‌లో భాభాకు మంత్రి పదవి ఇస్తానని ఇందిరా గాంధీ ప్రతిపాదించి ఉండొచ్చని మీనన్ అనుకున్నారు’’ అని దాదాభాయ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పర్వతాన్ని ఢీకొట్టిన భాభా ప్రయాణిస్తున్న విమానం
మరుసటి రోజు, అంటే 1966 జనవరి 24న వియన్నాకు వెళ్లేందుకు హోమీ భాభా, ఎయిరిండియా విమానం 101 ఎక్కారు.
ఆరోజుల్లో ముంబై నుంచి నేరుగా వియన్నాకు ప్రయాణించే విమానాలు లేవు. వియన్నా వెళ్లాలంటే జెనీవాలో దిగి మరో విమానాన్ని ఎక్కాల్సి ఉంటుంది.
భాభా ప్రయాణిస్తున్న ‘కాంచెన్‌జంగా’ అనే ఎయిరిండియా విమానం జనవరి 24వ తేదీ ఉదయం 7:02 గంటలకు ప్రమాదానికి గురైంది.
4,807 మీటర్ల ఎత్తులో మోబ్లా పర్వతాలను ఢీకొని కూలిపోయింది.
ఈ విమానం దిల్లీ నుంచి బీరూట్, జెనీవాల మీదుగా లండన్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ప్రమాదంలో విమానంలో 106 మంది ప్రయాణీలకులతో పాటు 11 మంది సిబ్బంది చనిపోయారు.
1950 నవంబర్‌లో ఎయిరిండియాకే చెందిన ‘మలబార్ ప్రిన్సెస్’ విమానం నేలకూలిన ప్రాంతానికి అతి దగ్గర్లోనే కాంజెన్‌జంగా కూడా ప్రమాదానికి గురైంది.
మలబార్ ప్రిన్సెస్, కాంజన్‌జంగా విమాన శకలాలతో పాటు అందులో చనిపోయిన వారి శవాలు ఇప్పటికీ దొరకలేదు. ఆ విమానాల బ్లాక్ బాక్స్‌లు కూడా లభ్యం కాలేదు. ప్రతికూల వాతావరణం కారణంగా విమాన శకలాల గుర్తింపు చర్యలను నిలిపేయాల్సి వచ్చింది.
ఫ్రెంచ్ విచారణ కమిటీ ఈ ఘటనపై 1966 సెప్టెంబర్‌లో దర్యాప్తును చేపట్టింది. 1967 మార్చిలో దీనిపై నివేదికను సమర్పించింది.
‘‘పర్వతంపై భారీ హిమపాతంతో పాటు ఏటీసీకి, పైలట్‌కు మధ్య జరిగిన సంభాషణలో లోపం కారణంగా ప్రమాదం జరిగింది. మోబ్లాన్ పర్వతం నుంచి దూరాన్ని కమాండర్ తప్పుగా అంచనా వేశారు. విమానంలోని రిసీవర్లలో ఒకటి సరిగా పని చేయలేదు’’ అని నివేదికలో పేర్కొంది.
ఫ్రెంచ్ విచారణ కమిటీ సమర్పించిన నివేదికను భారత ప్రభుత్వం ఆమోదించింది.

ఫొటో సోర్స్, TIFR
భారత అణు కార్యక్రమ పితామహుడు
ఈ ప్రమాదం కారణంగా 56 ఏళ్ల వయస్సులోనే హోమీ భాభా మరణించారు.
కాస్మిక్ కిరణాలపై చేసిన పరిశోధనలు ఆయనకు బాగా గుర్తింపు తెచ్చి పెట్టాయి. ఈ పరిశోధనలకు గానూ నోబెల్ అవార్డుకు ఆయన పేరును ప్రతిపాదించారు కూడా.
కానీ, భారత అణు కార్యక్రమంతో పాటు టాటా ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటులో ఆయన సేవలు ఎంతో కీలకమైనవి.
భాభా ఆకస్మిక మరణం, యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
జేఆర్డీ టాటాకు ఇది మరింత విషాదకరమైన విషయం. భాభా ప్రయాణిస్తోన్న విమానంలోనే టాటా బావ మరిది, ఎయిరిండియా యూరప్ డైరెక్టర్ గణేశ్ భర్తోలీ కూడా ఉన్నారు.
ఈ ప్రమాదానికి రెండు రోజుల ముందు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సంతాప సభకు భాభా అధ్యక్షత వహించారు.

ఫొటో సోర్స్, TIFR
భాభా మరణంలో సీఐఏ హస్తం?
2017లో స్విస్ పర్వతారోహకుడు డేనియల్ రోష్, ఆల్ఫ్స్ పర్వతాల్లో విమాన శకలాలను గుర్తించారు. అవి హోమీ భాభా ప్రయాణించిన విమాన శకలాలు అని అంతా అనుకున్నారు.
ఈ ప్రమాదంలో అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘సీఐఏ’ కుట్ర ఉన్నట్లు ఊహాగానాలు వచ్చాయి.
2008లో వచ్చిన ‘‘కన్వర్జేషన్స్ విత్ ద క్రో’’ అనే పుస్తకంలో సీఐఏ మాజీ అధికారి రాబర్ట్ క్రాలీ, ఒక జర్నలిస్ట్ గ్రెగరీ డగ్లస్‌ల మధ్య జరిగిన సంభాషణను ప్రచురించారు.
ఈ ప్రమాదంలో సీఐఏ హస్తమున్నట్లు ఈ సంభాషణ ద్వారా ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చారు.
సీఐఏలో క్రాలీని ‘క్రో’ అనే పేరుతో పిలిచేవారు. సీఐఏలో తన కెరీర్ మొత్తాన్ని ఆయన ప్లానింగ్ డైరెక్టరేట్‌లోనే గడిపారు. దీన్నే ‘‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ డర్టీ ట్రిక్స్’’ అని పిలుస్తారు.

ఫొటో సోర్స్, BASILISK PRESS
2000 అక్టోబర్‌లో క్రాలీ చనిపోయారు. అంతకుముందు ఆయన చాలాసార్లు డగ్లస్‌తో చర్చల్లో పాల్గొన్నారు. డగ్లస్‌కు రెండు పెట్టెల నిండా పత్రాలను పంపించిన ఆయన తన మరణానంతరం వాటిని తెరిచి చూడాలని సూచించారు.
1996 జూలై 5న జరిగిన ఒక చర్చలో క్రాలీ మాటలను డగ్లస్ ప్రస్తావించారు.
‘‘1960లలో మాకు భారత్ నుంచి సమస్యలు ఎదురయ్యాయి. అప్పటికి వారు అణు బాంబుపై పనిచేయడం మొదలుపెట్టారు. వారు ఎంత తెలివైనవారో, చాలా త్వరలో ప్రపంచశక్తిగా అవతరించనున్నామని చూపించడానికి ప్రయత్నించారు. మరొక విషయం ఏంటంటే వారు సోవియట్ యూనియన్‌కు దగ్గర అవుతున్నారు’’ అని క్రాలీ వ్యాఖ్యానించినట్లు డగ్లస్ తన పుస్తకంలో పేర్కొన్నారు.
అదే పుస్తకంలో హోమీ భాభా గురించి క్రో మాట్లాడిన మాటల్ని కూడా డగ్లస్ ప్రస్తావించారు.
‘‘ఆయన భారత అణు కార్యక్రమ పితామహుడు. అణు బాంబును తయారు చేయగల పూర్తి సామర్థ్యం ఆయనకు ఉంది. దీని గురించి భాభాకు చాలసార్లు హెచ్చరికలు వచ్చాయి. కానీ, ఆయన వాటిని పట్టించుకోలేదు. ప్రపంచంలోని ఏ శక్తి కూడా తనను, అణు సామర్థ్యం కలిగిన రెండో దేశంగా ఎదగడంలో భారత్‌ను అడ్డుకోలేదని ఆయన స్పష్టం చేశారు. మాకు ఆయన ముప్పుగా మారారు. ఆయన ఒక విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం కార్గోలో ఉంచిన ఒక బాంబు పేలడంతో విమాన ప్రమాదం జరిగింది’’ అని క్రో వ్యాఖ్యానించినట్లు డగ్లస్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, TIFR
భాభాతో పాటు 116 మంది మృతి
ఆ పుస్తకం ప్రకారం, వియన్నా ఆకాశతలంలో విమానాన్ని పేల్చాలని అనుకున్నామని కానీ, పర్వతాల మీద ఆ పని చేయాలని నిర్ణయించినట్లు క్రో బడాయిలు చెప్పుకున్నారు.
ఒక పెద్ద పట్టణంలో విమానం కూలినప్పటి కంటే, పర్వతాల్లో కూలిపోతే నష్టం తక్కువగా జరుగుతుందని మాకు తెలుసు అని అన్నారు.
‘‘నిజానికి, భారత అణు కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని తొలుత లాల్ బహదూర్ శాస్త్రి అనుకున్నారు. అందుకే ఆయనను మేం వదిలించుకున్నాం. భాభా ఒక మేధావి. ఆయనకు బాంబును తయారు చేసే సామర్థ్యం ఉంది. అందుకే మేం ఇద్దరి అడ్డు తొలగించుకున్నాం. భాభా వెళ్లిపోయాక భారత్ నెమ్మదించింది’’ అని ఆ పుస్తకంలో పేర్కొన్నారు.
భాభా ఆత్మకథలో దాదాభాయ్ ఇలా రాశారు.
‘‘భాభా మరణం, ఇటలీ చమురు వ్యాపారి మైటీ మరణం తరహాలోనే జరిగింది. ఆయన ఇటలీలో మొదటి అణు రియాక్టర్ పనిని మొదలుపెట్టారు. అప్పుడే సీఐఏ, ఆయన ప్రైవేట్ విమానాన్ని ధ్వంసం చేసి ఆయనను చంపింది. సీఐఏపై ఉన్న ఈ షాకింగ్ ఆరోపణలను ఎవరూ ధ్రువీకరించలేకపోయారు. ఈ నిజాలు ఎప్పటికీ బహిర్గతం కాకపోవచ్చు. గ్రెగరీ డగ్లస్ వాదనలు 100 శాతం విశ్వసనీయమైనవిగా పరిగణించలేం. భారత్ అణుబాంబు తయారు చేయకూడదని అమెరికన్లు అనుకొని ఉండొచ్చు. కానీ, ఒక వ్యక్తి కోసం 116 మందిని చంపడం అనేది విజ్ఞతకు చాలా దూరంగా ఉంది’’ అని రాసుకొచ్చారు.

ఫొటో సోర్స్, RUPA
శాస్త్రి, హోమీ భాభా మధ్య అభిప్రాయబేధాలు
1964 అక్టోబర్ 24న అణు నిరాయుధీకరణపై ఆలిండియా రేడియోలో హోమీ భాభా మాట్లాడారు.
‘’50 అణు బాంబులు తయారీకి రూ. 10 కోట్లు మాత్రమే ఖర్చు అవుతాయి. అదే అలాంటివి రెండు సెట్లను సిద్ధం చేసుకుంటే రూ. 15 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కాదు. చాలా దేశాల సైనిక బడ్జెట్‌ను చూస్తే వీటికయ్యే ఖర్చు చాలా తక్కువే’’ అని హోమీ భాభా అన్నారు.
లాల్ బహదూర్ శాస్త్రి పక్కా గాంధేయవాది. పరమాణు ఆయుధాల విషయంలో ఆయనకున్న వ్యతిరేకత అందరికీ తెలిసిందే. నెహ్రూతో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా అణు విధానంలో భాభా మాటే చెల్లుకుంటూ వచ్చింది. కానీ, నెహ్రూ తర్వాత శాస్త్రి రాగానే పరిస్థితులు మారిపోయాయి.
‘‘ఇకపై అపాయింట్‌మెంట్ లేకుండా ప్రధాని కార్యాలయంలోకి వెళ్లే పరిస్థితులు లేకపోవడం భాభాను కలవరపెట్టింది. భాభా తనకు ఏం చెప్పాలనుకున్నాడో అర్థం చేసుకోవడంలో శాస్త్రి ఇబ్బంది పడ్డారు. చైనా అణు పరీక్షలు నిర్వహించడానికి ముందు, 1964 అక్టోబర్ 8వ తేదీన లండన్‌లో హోమీ భాభా మాట్లాడుతూ, అణు పరీక్షపై భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న 18 నెలల్లోగా భారత్, అణుపరీక్ష చేయగలదని ప్రకటించారు.
హోమీ భాభా ప్రకటనపై లాల్ బహదూర్ శాస్త్రి స్పందిస్తూ ఇలా అన్నారు. ‘‘న్యూక్లియర్ మేనేజ్‌మెంట్‌పై కఠిన ఆంక్షలు ఉన్నాయి. శాంతిపూర్వక ప్రయోజనాలకు వ్యతిరేకంగా అణు శక్తికి సంబంధించిన ఎలాంటి ప్రయోగాలు జరుపకూడదు’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, DRDO
శాస్త్రిని ఒప్పించిన భాభా
ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే అణుశక్తిని, శాంతియుతంగా ఉపయోగించుకునే దిశగా శాస్త్రిని భాభా ఒప్పించారు.
భారత శాస్త్రవేత్తలుగా, మేం కూడా ఏదైనా తయారు చేయగలమని పశ్చిమ దేశాలకు చూపించాలనుకున్నామని ప్రముఖ అణు శాస్త్రవేత్త రాజా రామన్న ఒక ఇంటర్వ్యూలో ఇందిరా చౌధరీకి చెప్పారు.
అణు బాంబు తయారీలో అమెరికా నుంచి ఎలాంటి సహాయం అందదని తెలిసి భాభా ఒక చిన్న గ్రూపును తయారు చేశారు.
1956 ఏప్రిల్‌లో ‘న్యూక్లియర్ ఎక్స్‌ఫ్లోజన్ ఫర్ పీస్‌ఫుల్ పర్పస్’ పేరిట ఏర్పాటు చేసిన ఈ గ్రూప్‌కు రాజా రామన్న అధ్యక్షునిగా వ్యవహరించారు.
‘‘1965 డిసెంబర్‌లో లాల్ బహదూర్ శాస్త్రి శాంతిపూర్వక ప్రయోజనాల కోసం అణు ప్రయోగాలను వేగవంతం చేయాలని భాభాను కోరారు. ఆ దిశగా పని జరుగుతోందని హోమీ భాభా చెప్పారు. మీరు మీ పనిని కొనసాగించండి కానీ, క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎలాంటి ప్రయోగాలు చేపట్టవద్దని భాభాకు శాస్త్రి నిర్దేశించారు’’ అని దాదాభాయ్ తన పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, THE STATESMAN
15 రోజుల వ్యవధిలోనే శాస్త్రి, హోమీ భాభా మృతి
1966 జనవరి 11న తాష్కెంట్‌లో లాల్ బహదూర్ శాస్త్రి ఆకస్మికంగా చనిపోయారు. ఆ తర్వాత జనవరి 24వ తేదీన విమాన ప్రమాదంలో హోమీ భాభా మృతిచెందారు. దీంతో ఇందిరాగాంధీ ఆయన సేవలను వినియోగించుకోలేకపోయారు.
15 రోజుల వ్యవధిలోనే శాస్త్రి, భాభా చనిపోయారు. శాస్త్రి, భాభా మధ్య అణుబాంబు గురించి జరుగుతున్న చర్చలు పత్రాల రూపంలో లేకపోవడంతో వీటి గురించి ప్రభుత్వంలోని ఎవరికీ తెలియలేదు. భాభా మరణం తర్వాత భారత అణు విధానంలో భారీ శూన్యత ఏర్పడింది.
‘‘ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే, విమాన ప్రమాదంలో హోమీ భాభా మరణించారు. ప్రధాని పదవీ స్వీకారం కంటే కూడా వార్తాపత్రికలన్నీ హోమీ భాభా మరణాన్నే ప్రముఖ వార్తగా ప్రచురించాయి. ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం కంటే ఒక శాస్త్రవేత్తకు ఎక్కువ ప్రాధాన్యత దక్కడం అనేది కేవలం హోమీ భాభా విషయంలోనే జరిగింది’’ అని దాదాభాయ్ తన పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, TIFR
యువ శాస్త్రవేత్తల బృందం
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో ఆగస్టు 25న హోమీ భాభా గౌరవార్థం సంతాప సమావేశాన్ని నిర్వహించారు.
ఎవరైనా ప్రముఖులు చనిపోతే పనికి సెలవు ఇచ్చే పద్ధతికి హోమీ భాభా వ్యతిరేకం. ప్రముఖులు చనిపోయినప్పుడు వారి సంస్మరణార్థం పనిని వదిలేయకుండా ఆరోజు ఇంకా ఎక్కువ పనిచేయడమే వారికి ఇచ్చే నిజమైన నివాళి అని హోమీభాభా నమ్మేవారు.
భాభా మరణించిన తర్వాత ఆయన పెంపుడు కుక్క క్యూపిడ్ ఆహారం తినడం మానేసింది. యజమాని మరణంతో దిగులు చెందిన క్యూపిడ్ కొన్ని రోజుల్లోనే చనిపోయింది.
కెరీర్‌లో ఉన్నత స్థాయిలో ఉన్న సమయంలో హోమీభాభా మరణించారని ఎంజీకే మీనన్ అన్నారు.
ఇందిరా గాంధీ తన సంతాప సందేశంలో ఇలా అన్నారు. ‘‘అణు శక్తి ప్రాజెక్టు కీలక దశలో ఉన్నప్పుడు హోమీ భాభాను కోల్పోవడం దేశానికి తీరని లోటు. దేశానికి ఆయన చేసిన సేవలు మరిచిపోలేనివి’’ అని ఇందిరాగాంధీ అన్నారు.
ప్రపంచంలోనే నాకు తెలిసిన ముగ్గురు గొప్ప వ్యక్తుల్లో హోమీభాభా ఒకరని జేఆర్డీ టాటా అన్నారు. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ కంటే కూడా హోమీభాభాను ‘కంప్లీట్ మ్యాన్’ అని పిలవొచ్చు అని టాటా వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, DAE
భాభా కల నిజమైనప్పుడు..
భాభా మరణం తర్వాత అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్‌గా విక్రమ్ సారాభాయిని నియమించారు.
తొలుత ఈ పదవిని ప్రముఖ శాస్త్రవేత్త ఎస్. చంద్రశేఖర్‌కు ఇవ్వాలని ప్రధాని ఇందిరా గాంధీ భావించారు. అయితే, ఆమెకు చంద్రశేఖర్ ఒక అమెరికా పౌరుడనే సంగతి తెలియదు.
అయితే, తాను అమెరికా పౌరుడిని అని చంద్రశేఖర్ చెప్పడంతో ఇందిరాగాంధీ ఈ పదవికి విక్రమ్ సారాభాయిని ఎంచుకున్నారు.
అణ్వాయుధాలు, శాంతిపూర్వక అణు పరీక్షలకు విక్రమ్ సారాభాయి పూర్తిగా వ్యతిరేకం. అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడంలోని నైతికత, ప్రయోజనాలను ఆయన ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, WWW.NUCLEARWEAPONARCHIVE.ORG
అప్పటి క్యాబినెట్ సెక్రటరీ ధర్మవీరాతో సారాభాయి ఇలా అన్నారు. ‘‘భాభా వారసుడు కావడం అంత సులభం కాదు. వారసుడు అంటే ఆయన పదవిని తీసుకోవడం మాత్రమే కాదు ఆయన భావజాలాన్ని కూడా అనుసరించడం’’ అని అన్నారు.
విక్రమ్ సారాభాయి కూడా తక్కువ వయస్సులోనే చనిపోయారు. చివరకు హోమీ భాభా కలలు గన్న అణు కార్యక్రమం రాజా రామన్న, హోమీ సెఠ్నా ఆధ్వర్యంలో 1974 మే నెలలో నెరవేరింది.
ఇవి కూడా చదవండి:
- చార్ధామ్: ఎత్తైన ప్రాంతాలలో ఊపిరి ఆడనప్పుడు ఏం చేయాలి?
- ది కేరళ స్టోరీ: ఇది వాస్తవాల ఆధారంగా తీసిన సినిమానా, లేక ప్రచారాస్త్రమా?
- పోఖ్రాన్ II: అమెరికా కళ్లుగప్పి వాజ్‌పేయి అణు పరీక్షలు ఎలా నిర్వహించారు?
- మైసూర్ శాండల్ సబ్బు చరిత్ర ఏంటి? దాని పుట్టుకకు మొదటి ప్రపంచయుద్ధం ఎలా కారణమైంది?
- ‘కస్టడీ’ రివ్యూ: నాగచైతన్య సినిమా ఎలా ఉందంటే..
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














