‘కస్టడీ’ రివ్యూ: నాగచైతన్య సినిమా ఎలా ఉందంటే..
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
‘రేసీ స్క్రీన్ ప్లే’- ఈ మధ్య తరచూ ఈ మాట వినిపిస్తోంది. తెరపై ఏం జరుగుతోంది? ఎలా జరుగుతోంది? ఎందుకు జరుగుతోంది? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో తలెత్తేలోగా వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసేంత వేగంగా సన్నివేశాలు నడిచిపోతాయి.
లాజిక్కులు, సమాధానాలు వెతుక్కొనేలోగా సినిమా అయిపోతుంది. అంతే! ఈ మ్యాజిక్‌కే చాలా మంది పడిపోతున్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు శైలి కూడా ఇంతే.
`మానాడు` చూస్తే రేసీ స్క్రీన్ ప్లేకు అర్థం ఏమిటో తెలుస్తుంది. ఆయన నుంచి మరో సినిమా వస్తోందంటే ఆసక్తి ఎక్కువగా ఉండటం సహజమే. పైగా, తొలిసారి ఓ తెలుగు సినిమా, ఓ తెలుగు హీరోతో చేస్తుండటంతో `కస్టడీ`పై అంచనాలు పెరిగాయి.
ఈ సినిమాతోనే నాగచైతన్య తమిళ ప్రేక్షకులకు పరిచయం అవుతుండడంతో మరింత దృష్టి పెట్టారు. మరి `కస్టడీ` ఎలా ఉంది? ప్రేక్షకుల్ని చైతూ, వెంకట్ ప్రభు మెప్పించారా, లేదా?

ఫొటో సోర్స్, facebook/Srinivasaa Silver Screen
ఓ కానిస్టేబుల్ జీవితంలో...
శివ (నాగచైతన్య) ఓ సాధారణ పోలీసు కానిస్టేబుల్. నిజాయతీపరుడు. అంబులెన్స్‌కు దారి ఇవ్వడానికి ముఖ్యమంత్రి దాక్షాయిణి (ప్రియమణి) కాన్వాయ్‌నే ఆపేసేంత నిబద్ధతగల పోలీసు. అలాంటి కానిస్టేబుల్ జీవితంలోకి రాజు (అరవింద్ స్వామి) అనే క్రిమినల్ ప్రవేశిస్తాడు.
ఓ రోజు అనుకోకుండా రాజును అరెస్ట్ చేస్తాడు శివ. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాకే రాజు పెద్ద క్రిమినల్ అని తెలుస్తుంది. అక్కడి నుంచి అసలు ఆట మొదలవుతుంది.
రాజును చంపడానికి ఓ ముఠా ప్రయత్నిస్తుంటుంది. వాళ్ల నుంచి రాజును కాపాడడానికి శివ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తుంటారు. ఓ క్రిమినల్‌ను కాపాడాల్సిన అవసరం శివకు ఏం వచ్చింది? శివ ప్రేమించిన అమ్మాయి రేవతి (కృతి శెట్టి) కథేమిటి? ఇవన్నీ తెరపై చూసి, తెలుసుకోవాల్సిన విషయాలు.
ఓ సాధారణమైన వ్యక్తి.. అసాధారణమైన పరిస్థితుల్ని ఎదుర్కొని, ఎలా నిలవగలిగాడు అనేది ఎప్పటికీ ఆసక్తికరమైన అంశమే. `కస్టడీ` కథ రాసుకొన్నప్పుడు వెంకట్ ప్రభు కూడా ఇలానే భావించి ఉంటారు.
శివ ఓ సాధారణమైన వ్యక్తి. తను వ్యవస్థలోని పెద్ద మనుషులకూ, అధికారులకూ ఎలా ఎదురొడ్డి పోరాడాడనేది చెప్పాలనుకొన్నారు. అందుకే ఇలాంటి కథ, ఇలాంటి హీరో క్యారెక్టరైజేషన్ రాసుకొన్నారు. తన కస్టడీలోకి ఒక పెద్ద క్రిమినల్ వస్తే, అతడిని చంపడానికి శక్తిమంతమైన ఒక ముఠా యత్నిస్తుంటే, నిజాన్ని కాపాడడానికి హీరో ఏం చేశాడనేది ‘కస్టడీ’ కథాంశం.
ఇలాంటి కథలు ఎవరినైనా ఎగ్జయిట్ చేస్తాయి. బహుశా, నాగచైతన్య కూడా అందుకోసమే ఈ సినిమా ఒప్పుకొని ఉంటారు.

ఫొటో సోర్స్, facebook/Srinivasaa Silver Screen
ఖైదీ లాంటి కథే కానీ..
కస్టడీ సినిమా చూస్తున్నప్పుడు కార్తి కథనాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన `ఖైదీ`లాంటి చిత్రాలు గుర్తుకురావడం సహజం.
అక్కడా అంతే. జైలు నుంచి అప్పుడే విడుదలైన ఓ సాధారణమైన వ్యక్తి.. అసాధారణమైన పరిస్థితుల్లో తనది కాని బాధ్యతను భుజాన వేసుకొని, పోరాడతాడు. ఖైదీ, కస్టడీ.. ఇవి రెండూ ఓ రాత్రి ముగిసిపోయే కథలే.
రేసీ స్క్రీన్ ప్లే, ఊహకందని మలుపులు, హీరోయిజం, హీరో పాత్రలో ఉండే నిజాయతీ ఇవన్నీ... ఖైదీకి ఘన విజయాన్ని కట్టబెట్టాయి.
వెంకట్ ప్రభు కూడా అదే దారిలోకి వెళ్లాలనుకొన్నారేమో. కాకపోతే ఖైదీకీ, కస్టడీకీ ఒక్కటే తేడా. ఖైదీలో లోకేష్ కనగరాజ్ కథకు అక్కర్లేనివి నిర్మొహమాటంగా పక్కన పెట్టగలిగారు.
హీరోయిన్‌నీ, లవ్ ట్రాకుల్నీ, కామెడీనీ, పాటల్నీ కట్ చేసేశారు. ఇక్కడ మాత్రం వెంకట్ ప్రభు వాటన్నింటినీ కథలోకి లాక్కు రావాలని ప్రయత్నించి, అవసరం లేని భారాన్ని భుజాలపై వేసుకొని, ఆ బరువు మోయలేక, చివరి వరకూ ఆపసోపాలు పడ్డారు.

ఫొటో సోర్స్, facebook/Srinivasaa Silver Screen
లవ్ ట్రాక్‌తో మొదలు
కస్టడీ ‘లవ్ ట్రాక్’తో మొదలవుతుంది. శివ - రేవతి మధ్య ప్రేమకథ చాలా నిదానంగా, ఏ మాత్రం ఆసక్తి కలిగించకుండా సాగుతుంది. రెండు పాటలూ ఈ లవ్ ట్రాక్‌లోనే ఇమడ్చాల్సి వచ్చింది.
సినిమా మొదలైన 35 నిమిషాల తరవాత, రాజు పాత్ర కథలోకి వస్తుంది. అప్పటి వరకూ కథపై ప్రేక్షకులకు ఎలాంటి ఆసక్తీ కలగదు. రాజు వచ్చాక విరామం వరకూ కథ పరుగెడుతూనే ఉంటుంది.
నిజానికి ఈ కథను నేరుగా రాజు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మొదలు పెట్టినా బాగానే ఉండేది. హీరో కోసం పాట, లవ్ ట్రాక్... ఇలా ఫక్తు సూత్రాలకు కట్టుబడడం వల్ల కథకు ఉపయోగం లేని ట్రాక్ రాసుకోవాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, facebook/Srinivasaa Silver Screen
ఫ్లాష్ బ్యాక్‌తో కాలయాపన
ద్వితీయార్థంలో కూడా దర్శకుడు తన తప్పును సరిద్దుకోలేదు. కథలోకి హీరోయిన్ పాత్రను బలవంతంగా లొక్కొచ్చి, మార్చురీ వ్యాన్ (రాజును కాపాడడానికి హీరో ఇదే వ్యాన్ ఉపయోగిస్తాడు) ఎక్కించాడు. దాంతో చివరి వరకూ హీరోయిన్ పాత్రను భరించాల్సి వస్తుంది.
ఈ కథలోని మరో లోపం రాజు పాత్రను తీర్చిదిద్దిన తీరు. రాజును అత్యంత క్రూరమైన వ్యక్తిగా దర్శకుడు చూపించారు. ఓ సాధారణమైన కానిస్టేబుల్ ఓ కిరాతకుడ్ని కస్టడీలోకి తీసుకోవాల్సివస్తే అనేది ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తుంది.
కానీ ఆ కిరాతకుడు కాస్త మెల్లమెల్లగా మంచివాడిగా రూపాంతరం చెందుతాడు. దాంతో ఆ కిరాతకుడి చేతిలో హీరో ఏమైపోతాడో అనే భయం ప్రేక్షకుల్లో కలగదు. అందుకే ఇంట్రవెల్ కార్డు పడగానే క్లైమాక్స్ ఏమిటో కూడా దాదాపు అందరికీ అర్థమైపోతుంది.
కథను చివరి వరకూ లాగడానికి హీరోకు ఓ ఫ్లాష్ బ్యాక్ పెట్టి, ఆ ఫ్లాష్ బ్యాక్‌లో జరిగిన నష్టానికి రాజు పాత్ర కారణమంటూ చూపించారు. పోనీ ఆ ఫ్లాష్ బ్యాక్ అయినా ఆసక్తికరంగా ఉందా అంటే అది కూడా ఇప్పటికే కొన్ని వందల సినిమాల్లో చూసేసిన బ్రదర్ సెంటిమెంట్ ట్రాకు.
దాక్షాయిణి (ప్రియమణి) అంటూ ఓ పవర్ ఫుల్ సీఎం పాత్రను సినిమా ప్రారంభంలోనే పరిచయం చేసి, ఆ పాత్రను డమ్మీగా మార్చేశారు. ప్రియమణి పాత్ర రెండు మూడు సన్నివేశాలకే పరిమితమైంది. ఆ పాత్రను సరిగా వాడుకోలేదు.
సీబీఐ వ్యవస్థ మరీ ఇంత నీరసంగా, నిస్తేజంగా పనిచేస్తుందా అనే అనుమానాన్ని ఈ సినిమా కలిగిస్తుంది. రాంకీ పాత్రను డిజైన్ చేసిన విధానం కూడా నవ్వు తెప్పిస్తుంది. ఇక్కడా ఖైదీతో పోలికలు కనిపిస్తాయి. ఓ పెద్ద మిషన్ గన్ తీసుకొచ్చి, విచ్చలవిడిగా కాల్పులు జరపడానికి తప్ప రాంకీ పాత్ర ఈ కథకు ఏ విధంగానూ ఉపయోగపడలేదు

ఫొటో సోర్స్, facebook/Srinivasaa Silver Screen
తారాబలం ఘనం
నాగచైతన్య, అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి, రాంకీ, కృతి శెట్టి.. ఇలా ఈ సినిమాలో ఘనమైన తారాబలం ఉంది. చైతూ తన వంతుగా కష్టపడ్డారు. సినిమాలో తనను చూస్తే నిజంగానే అనవసర భారాన్ని మోస్తున్న కానిస్టేబుల్ లానే ఉంటారు. ఎమోషనల్ సీన్స్‌లో సహజంగా నటించారు. యాక్షన్ సన్నివేశాలూ బాగా చేశారు.
కృతి శెట్టి డీ గ్లామర్ పాత్రలో కనిపించారు. ఆమె పాత్రను కథలోకి బలంగా లాక్కురావడం వల్ల ప్రతి సీన్‌లోనూ ఉన్నట్టు కనిపిస్తారు. వాస్తవానికి ఆ పాత్ర లేకపోయినా పెద్ద నష్టమేమీ లేదు.
అరవింద్ స్వామి గెటప్ కృత్రిమంగా అనిపిస్తుంది. ఆ పాత్రను నెగిటివ్ కోణంలోంచి పాజిటివ్ కోణంలోకి మార్చాలని చూడడం పెద్ద లోపం.
శరత్ కుమార్ మాత్రం ఓకే అనిపిస్తారు.
అటు ఇళయరాజా, ఇటు యువన్ శంకర్ రాజా.. ఇద్దరు ఉద్దండులు ఉండగా పాటలకు ఏం లోటు అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో అలాంటి పాటలే కరువయ్యాయి.
పాటలకు స్కోప్ లేని ఈ కథలో వాటిని తీసుకొచ్చినా, ఒక్క పాట కూడా గుర్తుండిపోయే స్థాయిలో లేదు. ‘జగడజగడజగడం’ పాటను రీమిక్స్ చేసి, ఎండ్ టైటిల్స్ లో వాడుకొన్నారంటే ఈ సినిమాలో పాటలకు సరైన ప్లేస్‌మెంట్స్ లేవన్న విషయం స్పష్టంగా అర్థమైపోతోంది.
ఇది 1980 ప్రాంతంలో జరిగే కథ. సంగీతంలో ఆ నాటి సౌండింగ్ వినిపించాలని దర్శకుడు తాపత్రయపడి ఉంటారు. అందుకే ఇళయరాజాను నేపథ్య సంగీతానికి వాడుకొన్నారు. ఇందులో దిట్టగా పేరొందిన ఇళయరాజా కూడా తన స్థాయిలో పనితనం చూపించలేకపోయారు.
రేసీ స్క్రీన్ ప్లేకి మారు పేరైన వెంకట్ ప్రభు తన మ్యాజిక్‌ను ఈ సినిమాలో చూపించలేకపోయారు. అనవసరమైన ట్రాకులతో కథను పక్కదారి పట్టించడం ప్రధానమైన లోపం.
ఖైదీ లాంటి సినిమాల్ని చూసి, ఆ స్ఫూర్తితో కథలు రాసుకొంటే, అందులో తప్పేం లేదు. కానీ అడుగడుగునా ప్రేక్షకులు కొత్తదనమే కోరుకొంటున్న ఈ రోజుల్లో పాత కథనైనా, కొత్తగా ప్యాక్ చేసి ఇవ్వడం, ఉద్వేగాన్నీ, నాటకీయతనూ మిస్ కాకుండా చూసుకోవడం కీలకమైన విషయాలు. ఈ పాయింట్ దగ్గరే `కస్టడీ` మిస్ ఫైర్ అయ్యింది.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్లో ‘డర్టీ హ్యారీ’ ఎవరు, ఇమ్రాన్ ఖాన్ పదే పదే ఆ పేరెందుకు చెబుతున్నారు?
- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఎలా నిర్వహిస్తారు? కచ్చితత్వం ఎంత?
- మహిళా రెజ్లర్లు: ప్రభుత్వ అధికారాన్ని, రాజకీయ పలుకుబడిని సవాల్ చేస్తున్న ఈ నిరసన ఏం చెబుతోంది?
- డోనల్డ్ ట్రంప్: అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ బరిలోకి దిగాలనే ఆయన ఆశలకు లైంగిక వేధింపుల కేసు తీర్పు గండి కొడుతుందా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













